నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

Showing posts with label పోతనభాగవతము-దశమస్కంధము. Show all posts
Showing posts with label పోతనభాగవతము-దశమస్కంధము. Show all posts

Jan 15, 2009

మా మా వలువలు ముట్టకు, మామా కొనిపోకు పోకు మన్నింపు తగన్

గోపికా వస్త్రాపహరణం
క.
మా మా వలువలు ముట్టకు, మామా కొనిపోకు పోకు మన్నింపు తగన్
మా మానమేల కొనియెదు, మా మానసహరణ మేల మానుము కృష్ణా!


మా మా అనే అక్షరాలను నాలుగు పాదాల్లోనూ ఉపయోగించిన తీరు బాగుంది.
శా.
రామల్ రాజులతోడ నీ పనికి నారంభింతురే మీ క్రియన్
మోమా టేమియు లేక దూఱెదరు మీ మోసంబు చింతింప రం
భోమధ్యంబున నుండి వెల్వడి వెసన్ బూర్ణేందుబింబాననల్
మీ మీ చీరలు వచ్చి పుచ్చుకొనుఁడీ మీ కిచ్చెదం జెచ్చెరన్.

క.
ఉల్లములు నొవ్వనాడినఁ, గల్లలు చేసినను నగినఁ గలఁచిన నైనన్
వల్లభులు సేయు కృత్యము, వల్లభలకు నెగ్గుగాదు వల్లభ మధిపా!

ఇంద్రయాగము సేయుట
ఆ.
మఖము సేయ వజ్రి మది సంతసించును
వజ్రి సంతసింప వాన గురియు
వాన గురియఁ గసవు వసుమతిఁ బెరఁగును
గసవు మేసి ధేనుగణము బ్రతుకు.

కసవు=గడ్డి
క.
ధేనువులు బ్రతికెనేనియు, మానదు ఘన మైన పాఁడి మందలఁ గలుగున్
మానుగను బాఁడి గలిగిన, మానవులును సురలుఁ దనిసి మనుదురు పుత్రా!

అని నందుడు కృష్ణునితో అంటే ఇంద్రునికి కోపము తెప్పించేలా కృష్ణుడు కొండకు,పశువులకు,బ్రాహ్మణులకు పూజ సేయుట మంచిదని ఇంద్రునికోసం యజ్ఞం చెయ్యక్కరలేదని అంటాఢు.అప్పడు వారందరి మీదా కోపించి ఇంద్రుడు పెద్ద వాన కురిపిస్తాడు.
క.
వారి బరువయ్యె మందల, వారికి నిదె పరులు లేరు వారింపంగా
వారిదపటల భయంబును, వారిరుహదళాక్ష! నేఁడు వారింపఁగదే.

వారి అనే రెండక్షరాలనీ వివిధ అర్ధాలలోఎంత ముచ్చట గొలిపేలా ప్రయోగించారో చూడండి.
అంతలో ఇంద్రుడు రాళ్ళవర్షం కురిపించ సాగాడు.అప్పుడు బాల కృష్ణుడు వారందరినీ రక్షింప దలచిన వాడై
చ.
కలఁగకుఁడీ వధూజనులు కంపము నొందకుఁడీ వ్రజేశ్వరుల్
తలఁగకుఁడీ కుమారకులు తక్కినవారలు రాలవానచే
నలయకుఁడీ పశువ్రజము నక్కడ నక్కడ నిల్వనీకుఁడీ
మెలపున మీకు నీశ్వరుఁడు మే లొసఁగుం గరుణార్ద్రచిత్తుఁడై.

గోవర్ధనోద్ధారణము
క.
కిరి యై ధర యెత్తిన హరి, కరి సరసిజముకుళ మెత్తుగతిఁ ద్రిభువన శం
కరకరుఁడై గోవర్ధన, గిరి యెత్తెం జక్క నొక్క కేలన్ లీలన్.

హరి గిరిని యెత్తాడట.యెత్తి అందరినీ ఆ కొండ క్రిందకు రమ్మన్నాడు.పైగా--
శా.
బాలుం డీఁతడు కొండ దొడ్డది మహాభారంబు సైరింపఁగా
జాలండో యని దీనిక్రింద నిలువన్ శంకింపఁగాఁ బోల దీ
శైలాంభోనిధి జంతు సంయుత ధరాచక్రంబు పైఁ బడ్డ నా
కే లల్లాడదు బంధులార! నిలుఁడీ క్రిందన్ బ్రమోదంబునన్.

0 comments

Jan 14, 2009

శ్రీమహాభాగవతము-దశమస్కంధము

కాళియమర్దనము
ఉ.
ఘోర విషానల ప్రభలు గొబ్బునఁ గ్రమ్మఁగ సర్పసైన్య వి
స్ఫారుఁడు కాళియోరగుఁడు పాఱి వడిన్ గఱచెన్ బయోధరా
కారుఁ బయోవిహారు భయకంప విదూరు మహాగభీరు నా
భీరకుమారు వీరు నవపీత శుభాంబరధారు ధీరునిన్.


చివరలో 'ధీరు' అనే పదం వాడదామని ఆ పదం అందం సంతరించుకోవడం కోసమని అలా అలా రు కారాల్ని తగిలించుకుంటూ పోయా రాయన.అదీ పోతన గారంటే.
క.
విషకుచయుగ యగు రక్కసి
విషకుచ దుగ్ధంబు ద్రావి విషవిజయుఁడ వై
విషరుహలోచన!యద్భుత
విషయుం డగు నీకు సర్పవిషమెక్కెఁ గదా.


ఇది వరలో పోతన చనుఁ బాలు త్రాగే ఘట్టం మరోసారి జ్ఞాపకం చేస్తున్నా రాయన మనకు.
క.
కట్టా! క్రూరభుజంగము, కట్టలుకన్ నిన్నుఁ గఱవఁ గంపించితివో
తిట్టితివో పాపపువిధిఁ,బట్టీ! మముఁ దలచి కాఁక బలవించితివో.

క.
పన్నగము మమ్ముఁ గఱవక, ని న్న్మేటికిఁ గఱచెఁ గుఱ్ఱ! నెమ్మి గలిగి నీ
వున్నను మము రక్షింతువు, నిన్నున్ రక్షింప నేము నేరము తండ్రీ!


సీ.
ఘన యమునానదీ కల్లోల ఘోషంబు సరస మృదంగ ఘోషంబు గాఁ గ
సాధు బృందావన చర చంచరీక గానంబు గాయక సుగానంబు గాఁ గఁ
గలహంస సారస కమనీయ మంజు శబ్దంబులు తాళశబ్దములు గాఁ గఁ
దివినుండి వీక్షించు దివిజ గంధర్వాది జనులు సభాసీన జనులు గాఁ గఁ

తే.
బద్మరాగాది రత్న ప్రభాసమాన
మహిత కాళియఫణి ఫణామంటపమున
నళినలోచన విఖ్యాత నర్తకుండు
నిత్య నైపుణ్యమునఁ బేర్చి నృత్యమాడె.


నాగకాంతలు స్వామిని స్తుతించే ఘట్టంలో--
ఉ.
ఒల్లరు నిర్జరేంద్రపద మొల్లరు బ్రహ్మపదంబు నొందఁగా
నొల్లరు చక్రవర్తి పద మొల్లరు సర్వరసాధిపత్యము
న్నొల్లరు యోగసిద్ధి మఱి యొండు భవంబుల నొంద నీని నీ
సల్లలి తాంఘ్రిరేణువుల సంగతి నొందిన ధన్యు లెప్పుడున్.

ఉ.
నేరము లెన్న నెక్కడివి నేము దలంచు తలంపులందు లో
నేరుపు లున్నవే సుతుల నేరమిఁ దండ్రులు ద్రోచిపుచ్చ రే
నేరము సేయువారి ధరణీపతు లొక్కొకమాటు గావరే
నేరమి గల్గు మద్విభుని నేఁ డిటు గావఁగదే కృపానిధీ!

ఆ.
మమ్ముఁ బెండ్లిసేయు మా ప్రాణవల్లభు
ప్రాణమిచ్చి కావు భక్తవరద!
నీవు సేయు పెండ్లి నిత్యంబు భద్రంబు
పిన్ననాఁటి పెండ్లి పెండ్లి గాదు.

ఇంద్రవజ్రము.
నీ యాన! యెవ్వారిని నిగ్రహింపం
డా యుగ్ర పాపాకృతి నందఁ డింకన్
నీ యాజ్ఞలో నుండెడు నేఁటినుండిన్
మా యీశు ప్రాణంబులు మాకు నీవే.

అని ప్రార్ధించగా కృష్ణుడు కాళీయుని విడిచి పెడతాడు.

0 comments

రా పూర్ణచంద్రిక! రా గౌతమీగంగ! రమ్ము భగీరథరాజ తనయ!

గోవులను పిలుచు ఘట్టము
సీ.
రా పూర్ణచంద్రిక! రా గౌతమీగంగ! రమ్ము భగీరథరాజ తనయ!
రా సుధాజలరాశి! రా మేఘమాలికా! రమ్ము చింతామణీ! రమ్ము సురభి!
రా మనోహారిణి! రా సర్వమంగళ! రా భారతీదేవి! రా ధరిత్రి!
రా శ్రీమహాలక్ష్మి! రా మందమారుతి! రమ్ము మందాకిని! రా శుభాంగి!


ఆ.
యనుచు మఱియుఁ గలుగు నాఖ్యలు గల గోవు
లడవిలోన దూర మందుమేయ
ఘన గభీరభాషఁ గడు నొప్పఁ జీరు నా
భీరజనులు బొగడఁ బెంపు నెగడ.

0 comments

Jan 13, 2009

వంచింపం బనిలేదు బ్రహ్మ కిచటన్ వత్సంబులన్ బాలురన్

బ్రహ్మదేవుడు గోవులను,గోవత్సములను,గోపాలురను మాయముచేయుట
బ్రహ్మదేవుడు గో,గోపాలురను అడవిలో మాయముచేసి కృష్ణుడు ఏమి చేస్తాడో చూద్దామని అనుకుంటాడు.అప్పుడు కృష్ణుడు--
శా.
వంచింపం బనిలేదు బ్రహ్మ కిచటన్ వత్సంబులన్ బాలురన్
వంచించెన్ గనుఁబ్రామి తన్ను మరలన్ వంచించు టాశ్చర్యమే
వంచింపన్ దన కేల తెచ్చుటకు నై వల్దంచు బ్రహ్మాండముల్
వంచింపన్ మరలింప నేర్చు హరి లీలన్ మందహాసాస్యుఁ డై.


అని తలచినవాడై తానే గోవులుగను,గోవత్సములుగను,గోపాలురుగను రూపు దాల్చి అంతా కలసి ఇళ్ళకు వెళతారు.
ఆ సందర్భంలో--
క.
ఏ తల్లుల కే బాలకు, లే తెఱఁగునఁ దిరిగి ప్రీతి యెసగింతురు ము
న్నా తల్లుల కా బాలకు,లా తెఱఁగునఁ బ్రీతి సేసి రవనీనాథా.


ఇలా కృష్ణుడు అన్ని రూపాలూ తానే ఐ ఒక సంవత్సరం పాటు నిర్వహిస్తాడు.అది చూచి బ్రహ్మదేవుడిలా అనుకుంటాడు.

క.
పుట్టితి బుద్ధి యెఱింగితిఁ, బుట్టించితి జగము సగము పోయెను ప్రాయం
బిట్టివి నూతన సృష్టులు, పుట్టుటలే దౌర యిట్టి బూమెలు భూమిన్.


అని తలచి కృష్ణుడు ప్రత్యక్షమైన తరువాత--

సీ.
శంపాలతికతోడి జలదంబు కైవడి మెఱుఁగు టొల్లి యతోడి మేనివాఁనిఁ
గమనీయ మృదులాన్నకబళ వేత్ర విషాణ వేణుచిహ్నంబుల వెలయువానిఁ
గుండావినిర్మిత కుండలంబులవాని శిఖిపంఛ వేష్టిత శిరమువానిఁ
వనపుష్ప మాలికావ్రాత కంఠమువాని నళినకోమల చరణములవానిఁ

ఆ.
గరుణ గడలుకొనిన కడకంటివాని గో
పాలబాలు భంగిఁ బరఁగువాని
నగు మొగంబువాని ననుఁ గన్నతండ్రిని
నిను భజింతు మ్రొక్కి నీరజాక్ష!


ఉ.
మాయలు గల్గువారలను మాయలఁ బెట్టెడి ప్రోడ! నిన్ను నా
మాయఁ గలంచి నీ మహిమమానముఁ జూచెద నంచు నేరమిన్
జేయఁగ బూనితిన్ గరుణ సేయుము కావుము యోగిరాజ వా
గ్గేయ!దవాగ్నిఁ దజ్జనితకీలము గెల్చి వెలుంగ నేర్చునే.


తరల.
కడుపులోపల నున్న పాపఁడు కాలఁ దన్నినఁ గిన్కతో
నడువఁ బోలునె కాఁగి తల్లికి నాథ! సన్నము దొడ్డు నై
యడఁగి కారణకార్య రూపము నైన యీ సకలంబు నీ
కడుపులోనిది గాదె పాపఁడఁ గాక నే మఱి యెవ్వఁడన్.


తరల.
క్రతుశతంబునఁ బూర్ణకుక్షివి గాని నీ విటు క్రేపులన్
సుతులు నై చనుఁబ్రాలుఁ ద్రావుచుఁ జొక్కి యాడుచుఁ గౌతుక
స్థితిఁ దరింపఁగఁ దల్లు లై విలసిల్లు గోవుల గోపికా
సతుల ధన్యత లెట్లు చెప్పఁగఁ జాలువాఁడఁ గృపానిధీ!

1 comments

శ్రీమహాభాగవతము-దశమ స్కంధము

నలకూబర మణిగ్రీవులు చేసిన కృష్ణ స్తుతి
శా.
నీ పద్యావళు లాలకించు చెవులున్ ని న్నాడు వాక్యంబులున్
నీపేరం బనిసేయు హస్తయుగమున్ నీ మూర్తిపైఁ జూపులున్
నీ పాదంబులపొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపైఁ జిత్తముల్
నీపై బుద్ధులు మాకు నిమ్ము నీరేజపత్రేక్షణా!


గోపికలతో శ్రీకృష్ణుడు బంతి చల్దులు గుడుచుట

ఉ.
ఎన్నఁడు నైన యోగివిభు లెవ్వని పాదపరాగ మింతయున్
గన్నులఁ గాన రట్టిహరిఁ గౌఁగిటఁ జేర్చుచుఁ జెట్ట బట్టుచున్
దన్నుచు గ్రుద్దుచు న్నగుచుఁ దద్దయుఁ బై పడి కూడి యాడుచున్
మన్నన సేయు వల్లవ కుమారుల భాగ్యము లింత యొప్పునే.


క.
ప్రియురాలివలని వార్తలు, ప్రియజనులకు నెల్ల ప్రొద్దుఁ బ్రియ మగు భంగిన్
బ్రియుఁ డగు హరిచరితంబులు, ప్రియభక్తుల కెల్ల యెడలఁ బ్రియములు గావే.

మళ్ళీ వృత్యనుప్రాసే.

మ.
కనియెం గృష్ణుఁడు సాధునీరము మహా గంభీరముం బద్మ కో
కనద స్వాదు వినోద మోద మద భృంగ ద్వంద్వ ఝంకారమున్
ఘన కల్లోల లతావితాన విహర త్కాదంబ కోలాహల
స్వన విస్ఫారము మందవాయుజ కణాసారంబుఁ గాసారమున్.


ఎక్కడ ఎప్పుడు ఏ కాసారాన్ని వర్ణించ వలసొచ్చినా పోతన గారికి ఈ విధమైన వృత్యను ప్రాసాలంకారము గబగబా అలా అలా దొర్లుకుంటూ వచ్చేస్తుంటుంది.ఆయన గారికదంటే అంత ఇష్టమనుకుంటా.

గోపాలురతో చల్దులారగించుట
సీ.
మాటిమాటికి వ్రేలు మడిచి యూరించుచు నూరుఁగాయలు దినుచుండు నొక్కఁ
డొకని కంచములోని దొడిసి చయ్యన మ్రింగు చూడు లేదని నోరు సూపు నొక్కఁ
డేగు రార్గుర చల్దు లెలమిఁ బన్నిదమాడి కూర్కొని కూర్కొని కుడుచు నొక్కఁ
డిన్నియుఁ దగఁ బంచి యిడుట నెచ్చలితన మనుచు బంతెనగుండు లాడు నొకడు

ఆ.
కృష్ణుఁ జూడు మనుచుఁ గికురించి పరు మ్రోలి
మేలి భక్ష్యరాశి మెసఁగు నొకఁడు
నవ్వు నొకఁడు సఖుల నవ్వించు నొక్కఁడు
ముచ్చటాడు నొకఁడు మురియు నొకఁడు.

పిల్లల సరదా సరదా ఆటలు ఎంత బాగా వర్ణించారో కదా.
వ.అయ్యవసరంబున.
సీ.
కడుపున దిండుగాఁ గట్టిన వలువలో లాలిత వంశనాళంబుఁ జొనిపి
విమల శృంగంబును వేత్రదండంబును జాఱి రానీక డాచంక నిఱికి
మీఁగడపెరుఁగుతో మేళవించిన చల్దిముద్ద డాపలిచేత మొనయ నునిచి
చెలరేఁగి కొసరి తెచ్చిన యూరుఁగాయలు వ్రేళ్ళసందులను దా వెలయ నిఱికి
ఆ.
సంగడీల నడుమఁ జక్కనఁ గూర్చుండి
నర్మభాషణములు నగవు నెఱపి
యాగభోక్త కృష్ణుఁ డమరులు వెఱఁగంద
శైశవంబు మెఱసి చల్ది గుడిచె.

ఆ కృష్ణుని రూపాన్ని మన కళ్ళకు కట్టేలా చేస్తారాయన.
పోతన గారు వ్రాసిన యీ ఘట్టం కరుణశ్రీగారి చేత కూడా అందమైన పద్యాలను వ్రాయించింది.

3 comments

Jan 11, 2009

శ్రీమహాభాగవతము-దశమస్కంధము

దధిభాండ వికలనాదులు - యశోద కృష్ణుని వెంట పరిగెత్తడం.
మ.
కని చేతన్ సెలగోల వట్టికొనుచున్ గానిమ్ము కానిమ్ము రా
తనయా! యెవ్వరియందుఁ జిక్కువడ నే దండంబునుం గాన నే
వినివారంబును బొంద నే వెఱపు నే విభ్రాంతియుం జెంద ము
న్ననియో నీ విటు నన్నుఁ గై కెనవు నే డారీతి సిద్ధించునే.


ఏవినివారంబును=?

అని అదలిస్తూ కొడుకు నడవడిని తలచి యశోద తనలో తాను--

సీ.
బాలుఁ డీతం డని భావింతు నందునా యే పెద్దలును నేర రీ క్రమంబు
వెఱ పెఱుంగుటకు నై వెఱపింతు నందునా కలిగి లే కొక్కఁడు గాని లేఁడు
వెఱపుతో నాబుద్ధి వినిపింతు నందునా తనుదాన యై బుద్ధి తప్పకుండు
నొం డెఱుంగక యింట నుండెడి నందునా చొచ్చి చూడని దొకచోటు లేదు

ఆ.
తన్ను నెవ్వరైనఁ దలపోయఁ బాఱెడు
నోజ లేదు భీతి యొక టెఱుంగఁ
డెలమి నూరకుండఁ డెకసెక్కెముల నాడుఁ
బట్టి శాస్తి చేయు భంగి యెట్లు?

వ.అని వితర్కించి,
క.
లాలనమున బహుదోషము, లోలిం బ్రాపించుఁ దాడనోపాయములం
జాల గుణంబులు గలుగును, బాలుర కును దాడనంబ పథ్యం బరయన్.


పిల్లలను అతిగా గారాబం చేస్తే చెడిపోతారు.అప్పుడపుడూ ఓటి రెండిచ్చుకుంటుంటేనే దారిలో పడతారు.బాలురకు తాడనమే(ఓ రెండిచ్చుకోవడం)పథ్యమైం దనుకుందటా యిల్లాలు మనందరిలాగానే.అలా అనుకుని చేతనున్న కోలతో జళిపించి నిలు నిలు అంటూ
వెంటబడితే ఱోలు మీదనుంచి కిందకుఱికి
క.
గజ్జెలు ఘల్లని మ్రోయఁగ,నజ్జలు ద్రొక్కుటలు మాని యతి జవమున యో
షిజ్జనములు నగఁ దల్లియుఁ, బజ్జం జనుదేర నతఁడు పరువిడె నధిపా!

అజ్జలు= పాదములు
యోషిజ్జనములు=స్త్రీసమూహము
పజ్జ=దగ్గఱ
మ.
స్తనభారంబున డస్సి క్రుస్సి యస దై జవ్వాడు మధ్యంబుతో
జనిత స్వేదముతోఁ జలత్కబరితో స్రస్తోత్తరీయంబుతో
వనజాతేక్షణ కూడఁ బాఱి తిరిగెన్ వారించుచున్ వాకిటన్
ఘన యోగీంద్రమనంబులన్ వెనుకొనంగా లేని లీలారతున్.


స్తనముల బరువుతో అలసి కృశించి సన్ననై జవ్వాడే నడుముతో, పట్టిన చెమటతో,ఊడిపోతున్న కొప్పుతో,చెదరిన వల్లెవాటుతో- పద్మాల్లాంటి కనులు గలిగిన యశోద వాకిట్లో కృష్ణుని వారిస్తూ కూడా పరిగెట్టిందట- ఘనయోగీంద్రుల మనస్సులలో కూడా చిక్కని లీలారతుని పట్టుకోవాలనే ప్రయత్నంలో.
వ.ఇట్లు కూడం జని,
సీ.
స్తంభాదికంబులు దనకు నడ్డం బైన నిట్టటు చని పట్టనీనివాని
నీ తప్పు సైరింపు మింక దొంగిలఁబోవ నేనని మునుముట్ట నేడ్చువానిఁ
గాటుక నెఱయంగఁ గన్నులు నులుముచు వెడలు కన్నీటితో వెగచువాని
నేదెస వచ్చునో యిది యని పలుమాఱు నురుఁగుచుఁ గ్రేఁగంటఁ జూచువాని

ఆ.
గూడఁబాఱి పట్టుకొని వెఱపించుచుఁ
జిన్ని వెన్నదొంగ చిక్కె ననుచు
నలిగి కొట్టఁ జేతు లాడక పూఁబోణి
కరుణతోడ బాలుఁ గట్టఁ దలచి.


మన పిల్లలందరితోనూ ప్రతి తల్లికీ కలిగే అనుభవమే ఎంత అందంగానూ హృద్యం గానూ వర్ణించారో చూడండి పోతన గారు.

క.
వీ రెవ్వరు శ్రీకృష్ణులు, గారా ! యెన్నఁడును వెన్న గానరఁట కదా
చోరత్వం బించుకయును, నేరరఁట,ధరిత్రి నిట్టి నియతులుఁ గలరే.

క.
పట్టినఁ బట్టుపడని నినుఁ, బట్టెద మని చలము కొనినఁ బట్టుట బెట్టే
పట్టువడ వండ్రు పట్టీ, పట్టుకొనన్ నాకుఁ గాక పరులకు వశమే.


క.
ఆ లలన గట్టె ఱోలన్, లీలన్ నవనీత చౌర్యలీలుం బ్రియవా
గ్జాలున్ బరివిస్మిత గో, పాలున్ ముక్తాలలామ ఫాలున్ బాలున్.

క.
చిక్కఁడు సిరి కౌఁగిటిలోఁ,జిక్కఁడు సనకాది యోగి చిత్తాబ్జములన్
జిక్కఁడు శ్రుతిలతికావళిఁ, జిక్కె నతఁడు లీలఁ దల్లి చేతన్ ఱోలన్.

0 comments

Jan 10, 2009

శ్రీమహాభాగవతము-దశమస్కంధము

మృద్భక్షణ-విశ్వరూప ప్రదర్శన

ఓసారి బలరాముడు అతని స్నేహితులు కలసి యశోదతో కృష్ణుడు మన్ను తిన్నాడని పితూరీ చేస్తారు. అప్పుడు యశోద కృష్ణుని పట్టుకుని నిలదీసి అడుగుతుంది 'మన్ను తిన్నావటా'ని. అప్పుడు కృష్ణుడు యశోదతో--

శా.
అమ్మా! మన్ను దినంగ నే శిశువునో యాఁ కొంటినో వెఱ్ఱినో
నమ్మంజూడకు వీరి మాటలు మది న్న న్నీవు కొట్టంగ వీ
రిమ్మాగ్గమ్ము ఘటించి చెప్పెదరు కాదేనిన్ మదీ యాస్య గం
ధ మ్మాఘ్రాణము సేసి నా వచనముల్ దప్పైన దండింపవే.


అని పలికి కృష్ణు డమ్మకు నోరు తెఱచి చూపిస్తాడు.ఆమె అతని నోటిలో 'జలధి పర్వత వన భూగోళ శిఖి దిక్పాలాది కరండమైన బ్రహ్మాండా'న్నంతా చూచి ఇలా అనుకొందట.

పై పద్యంలోని మాటలన్నీ మన చిన్నపిల్లలు మనతో మనం నిలదీసినప్పుడు చెప్పే మాటలే! ఎంత సహజసిద్ధమైన ధారాశుద్ది! చిన్నపిల్లల్ని- వాళ్ళుచేసే చెడ్డ పనులను గురించి వాళ్ళను దండించాలని చూసే ప్రతి తల్లి తోనూ ప్రతిపిల్లవాడు తనను తాను సమర్ధించుకుంటూ పలికే ముద్దు ముద్దు పలుకులే కిట్టయ్య నోటినుంచి కూడా అలవోకగా జాలువారేలా చేసారు పోతన గారు.
వీటినానందించటం కోసమైనా మనం భాగవతం తప్పక చదవాలి.
అప్పుడా యశోద తనలో తను --
మ.
కలయో! వైష్ణవ మాయయో! యితర సంకల్పార్థమో! సత్యమో!
తలప న్నేరక యున్నదాననొ! యశోదాదేవిఁ గానో! పర
స్థలమో! బాలకుఁ డెంత! యీతని ముఖస్థం బై యజాండంబు ప్ర
జ్వల మై యుండుట కేమి హేతువొ! మహాశ్చర్యంబు చింతింపఁగన్!


మా చిన్నప్పటి రోజుల్లో ఈ రెండు పద్యాలు దాదాపు అందరికీ కంఠస్థంగానే ఉండేవి.

0 comments

Jan 9, 2009

శ్రీమహాభాగవతము-దశమస్కంధము

గోపికలు యశోదతో శ్రీకృష్ణుని దుడుకుచేతలను గురించి చెప్పేఘట్టంలోనివి.
క.
ఆడం జని మీఁగడ పెరుఁ, గోడక మీ సుతుఁడు త్రావి యొకయించుక తాఁ
గోడలి మూఁతిం జరిమినఁ,గోడలు మ్రుచ్చనుచు నత్త కొట్టె లతాంగీ!

క.
వా రిల్లు సొచ్చి కడవలఁ, దోరంబుగ నెయ్యి త్రావి తుది నా కడవల్
వీ రింటను నీ సుతుఁ డిడ, వారికి వీరికిని దొడ్డ వా దయ్యె సతీ!


క.
వెన్నఁ దినఁగ బొడగని మా, పిన్నది యడ్డంబు వచ్చి పిఱిఁదికిఁ దీయన్
జ న్నొడిసి పట్టి చీరెను, జిన్నికుమారుండె యితఁను శీతాంశుముఖీ!


క.
చేబంతి తప్పిపడెనని, ప్రాబల్యముతోడ వచ్చి భవనము వెనుకన్
మా బిడ్డ జలకమాడఁగ, నీ బిడ్డఁడు వలువఁ దెచ్చె నెలఁతుక తగునే!

క.
కొడుకులు లేరని యొకసతి, కడు వగవగఁ దన్ను మగనిఁగాఁ గై కొనిన్
గొడుకులు గలిగెద రని పైఁ, బడినాఁ డిది వినుము శిశువు పనులే తల్లీ!


క.
తలఁగినదానం దల మనఁ, దలఁగక నే దలఁగ నంచుఁ దగఁ బల్కుచు నీ
తలఁగినచో టెయ్యది యని, తల యూఁచెన్ నీ సుతుండు తగవె మృగాక్షీ!

తలఁగినదానం=బహిస్టుగా వున్నదానను
క.
వ్రాలఁగ వచ్చిన నీ సతి, చూలాలం దలఁగు మనిన, జూ లగుటకు నే
మూలంబు చెప్పు మనె నీ, బాలుఁడు చెప్పుదురె సతులు పర్వేందుముఖీ!

క.
మగువా నీ కొమరుడు మా, మగవా రటు వోవఁ జూచి మంతనమునకున్
దగఁ జీరి పొందు నడిగెను, జగముల ము న్నిట్టి శిశువు చదువంబడెనే!

క.
నా కొడుకును నా కోడలు, నేకతమునఁ బెనఁగఁ బాము నీతఁడు వై వం
గోక లెఱుంగక పాఱినఁ, గూఁక లిడె న్నీ సుతుండు గుణమె గుణాఢ్యా!


క.
కడు లచ్చి గలిగెనేనియుఁ, గుడుతురు గట్టుదురు గాక కొడుకుల నగుచున్
బడుగుల వాడలపైఁ బడ, విడుతురె రాకాంత లెందు విమలేందుముఖీ!

క.
ఓ యమ్మ! నీ కుమారుఁడు, మా యిండ్లను పాలు పెరుఁగు మననీఁ డమ్మా!
పోయెద మెక్కడి కైనను, మా యన్నల సురభు లాన మంజులవాణీ!

క.
చన్ను విడిచి చనఁ డిట్టటు, నెన్నఁడు బొరుగిండ్ల త్రోవ లెఱుఁగడు నేఁడుం
గన్నులు తెఱవని మా యీ, చిన్ని కుమారకుని ఱవ్వసేయం దగునే.

తే.
అన్య మెఱుఁగడు తనయంత నాడుచుండు
మంచివాఁ డితఁ డెగ్గులు మానరమ్మ!
రామలార! త్రిలోకాభిరామలార!
తల్లులార! గుణవతీమతల్లులార!

0 comments

Jan 8, 2009

ఏమి నోముఫలమొ యింత ప్రొ ద్దొకవార్త

మనం ఇప్పుడు నంద గోకులానికి వెళ్ళి అక్కడేం జరుగుతుందో చూద్దాం.కృష్ణుని జననం గురించి విన్న గోపికలు--
ఆ.
ఏమి నోముఫలమొ యింత ప్రొ ద్దొకవార్త
వింటి మబలలార! వీను లలర
మన యశోద చిన్ని మగవానిఁ గనెనఁట
చూచి వత్తమమ్మ! సుదతులార!
అని ఒకరితో నొకరు చెప్పుకుంటూ అందరూ కలసి కృష్ణుని చూడబోతారు
.
ఉ.
వేడుకతోడఁ గ్రొమ్ముడులు వీడఁ గుచోపరిహారరేఖ ల
ల్లాడఁ గపోలపాలికల హాటకపత్ర రుచుల్ వినోదనం
బాడఁ బటాంచలంబు లసియాడఁగ జేరి యశోదయింటికిన్
జేడియ లేగి చూచి రొగి జిష్ణుని విష్ణునిఁ జిన్ని కృష్ణునిన్.


అప్పుడు గోపికలు కృష్ణుని తొట్టిలో ఉంచి ఇలా పాడారట.

క.
జోజో కమలదళేక్షణ! జోజో మృగరాజమధ్య! జోజో కృష్ణా!
జోజో పల్లవకరపద! జోజో పూర్ణేందు వదన! జోజో యనుచున్.


క.
పలు తోయంబుల జగములఁ, బలు తోయములందు ముంచి భాసిల్లెడి యా
పలుతోయగాడు వల్లవ, లలనా కరతోయములఁ జెలంగుచుఁ దడియున్.


తోయగాఁడు=(తోయము+కాడు) విధముగలవాడు. తోయము అనేమాట 4సార్లు వాడేడాయన.

తరువాత పూతన అనే రాక్షసి ఓ సుందరి వేషంలో కృష్ణునికి చన్నుకుడుపవచ్చినదై--

క.
చను నీకుఁ గుడుపఁజాలెడి, చనువారలు లేరు నీవు చనవలె ననుచున్
చనుగుడిపి మీఁద నిలుకడఁ, జనుదాన ననంగ వేడ్కఁ జనుఁ జను గుడుపన్.


పూతన చనుబాలతో పాటు ప్రాణాన్నీ హరిస్తాడు బాలకృష్ణుడు. అప్పుడు పోతన గారంటారు.
క.
విషధరరిపు గమనునికిని, విషగళ సఖునికిని విమల విష శయనునికిన్
విషభవభవ జనకునికిని, విషకుచ చనువిషముఁ గొనుట విషమే తలపన్.


విషధరరిపుడు=విషాన్ని ధరించిన పాములకు శత్రువు-గరుత్మంతుడు (వాహనముగాగలవాడు విష్ణుమూర్తి )
విషగళ సఖుడు=విషాన్ని గళమందు ధరించిన శివునికి సఖుడు(అయిన విష్ణుమూర్తి)
విష శయనుడు=పాముపై నిద్రించే వాడు(విష్ణుమూర్తి)
విషభవభవ జనకుడు=
విషకుచ చనువిషము=పూతన యొక్క కుచములయందలి విషము

ఈ అధ్యాయం చివరలో పోతన గారంటారు--
క.
ఉరు సంసారపయోనిధి, తరణంబులు పాపపుంజ దళనంబులు శ్రీ
కరణంబులు ముక్తి సమా, చరణంబులు బాలకృష్ణు సంస్మరణంబుల్.


ఎన్ని 'రణంబు'లో---
శకటాసుర భంజనం తర్వాత--బాలుని రోదనంబు విని యశోద పఱతెంచి.
ఆ.
అలసితివి గదన్న! యాఁకొంటివి గదన్న!
మంచి యన్న! యేడ్పు మానుమన్న!
చన్నుగుడువుమన్న! సంతసపడు మన్న!
యనుచుఁ జన్ను గుడిపె నర్భకునకు.

2 comments

Jan 5, 2009

అన్న! శమింపు మన్న! తగ దల్లుఁడు గాఁ డిది! మేనగోడ లౌ

శ్రీ కృష్ణ జననం తర్వాత వసుదేవుడు శ్రీకృష్ణుని రేపల్లెలో యశోద వద్దకు చేర్చి ఆమె వద్దవున్న యోగమాయను దేవకివద్దకు మార్చిన తరువాత,కావలివారి వలన దేవకి ప్రసవమైన విషయం తెలిసి కంసుడు
తే.
వెండ్రుకలు వీడఁ బై చీర వ్రేలి యాడ
తాల్మి కీలూడ రోషాగ్ని దర్పమాడ
భూరి వైరంబుతోఁ గూడ పురిటియింటి
జాడఁ జనుదెంచి యా పాపఁ జంపఁ గదియ.

అంత దేవకి యడ్డంబు వచ్చి యిట్లనియె.
ఉ.
అన్న! శమింపు మన్న! తగ దల్లుఁడు గాఁ డిది! మేనగోడ లౌ
మన్నన సేయు మన్న! విను మానినిఁ జంపుట రాచపాడి గా
దన్న! సుకీర్తివై మనఁగ దన్న! మహాత్ములు వోవు త్రోవఁ బో
వన్న! భవత్సహోదరిఁ గదన్న! నినున్ శరణంబు వేఁడెదన్.

క.
కట్టా యార్గురు కొడుకులఁ, బట్టి వధించితివి యాఁడుఁబడు చిది కోడల్
నెట్టన చంపఁగవలెనే, కట్టిఁడివి గ దన్న! యన్న! కరుణింపఁగదే.

అని ప్రార్థిస్తుంది.--అనుప్రాసంటే పోతన గారి కెంతిష్టమో భాగవతంలో అడుగడుగునా దర్శన మిస్తుంటుంది.
ఈ ఘట్టంలోని కొన్ని ఇతర పద్యాలు.. కంసుడు దేవకీ వసుదేవతలతో..
క.
పగతురఁ జెఱిచితి ననియును, బగతురచేఁ జెడితి ననియు బాలుఁడు తలచున్
బగ చెలుములు లే వాత్మకుఁ, బగచెలుములు కీలు కర్మబంధము సుండీ.

అని అంటాడు.ఇదే సందర్భంలో పోతన గారింకా..
ఆ.
యశము సిరియు ధర్మ మాయువు భద్రంబు
నార్యహింస సేయ నణగుఁ గాదె!
అనికూడా అంటారు.

0 comments

Dec 31, 2008

గురు పాఠీనమ వై జలగ్రహమకోలంబ వై వై శ్రీనృకే

అప్పుడు ఆనకదుందుభి(వసుదేవుని ఇంకో పేరు)బిడ్డను తీసుకొని వెళ్ళినా కంసునిపై నమ్మకం లేకుండా ఉంటున్నాడు.
సీ.
ఒకనాడు నారదుం డొయ్యన కంసుని యింటికిఁ జనుదెంచి యేకతమున
'మందలోపల నున్న నందాదులును,వారి భార్యలుఁ బుత్రులు బాంధవులును
దేవకి మొదలగు తెఱవలు వసుదేవుఁడాదిగా గల సర్వ యాదవులును,
సురలు గాని, నిజంబు నరులు గారని చెప్పి 'కంసుండ!వీవు రక్కసుండ వనియు
ఆ.వె.
దేవమయుఁడు చక్రి దేవకీదేవికిఁ, బుత్త్రుఁడై జనించి భూతలంబు
సెఱుపఁ బుట్టినట్టి చెనఁటి దైత్యుల నెల్లఁ, జంపు'ననుచుఁ జెప్పి చనియె దివికి.


ఇలా నారదుడు చెప్పేసరికి కంసుడు కలతచెంది దేవకీవసుదేవులను కారాగారంలో బంధించి వారికి పుట్టిన పిల్లల నందరినీ వరుసగా వధింపసాగాడు.తన తండ్రి శూరసేనుని కూడా కారాగారంలో బంధించి తానే రాజై పరిపాలించ సాగాడు.అప్పుడు పోతన గారంటారు--
ఆ.వె.
తల్లిఁ దండ్రి నైనఁ దమ్ముల నన్నల, సఖుల నైన బంధుజనుల నైన
రాజ్యకాంక్షఁజేసి రాజులు సంపుదు, రవనిఁ దఱచు జీవితార్థు లగుచు.


అలా వరుసగా 6గురు శిశువులను వధించిన తరువాత ఏడవసారి గర్భం ధరించగా శ్రీహరి యోగమాయ ద్వారా ఆ కడుపును వసుదేవుని ఇంకో భార్య(నందగోకులంలో ఉన్న)రోహిణి గర్భం లోనికి మార్పిస్తాడు.దేవకికి గర్భం పోయినదని అందరూ అనుకుంటారు. తరువాత తాను దేవకికి అష్టమ గర్భంగా పుడతానని యోగమాయను యశోదకు కూతురుగా జన్మించమని నియోగిస్తాడు.
ఆ.
బలము మిగులఁ గలుగ బలభద్రుఁ డన లోక
దమణుఁ డగుటఁ జేసి రాముఁ డనఁగ
సతికిఁ బుట్టె గర్భసంకర్షణమున సం
కర్షణుం డనంగ ఘనుఁడు సుతుఁడు.


అలా బలరాముడు పుట్టిన పిదప వసుదేవునివలన దేవకి శ్రీకృష్ణుని తన గర్భంలో ధరిస్తుంది.దేవకికి నెలలు నిండుతున్నపుడు--
సీ.
విమతుల మొగములు వెలవెలఁబాఱంగ విమలాస్య మోము వెల్వెలుకఁ బాఱె
మలయు వైరులకీర్తి మాసి నల్లన గాఁగ నాతి చూచుకములు నల్లనయ్యె
దుష్టాలయంబుల ధూమరేఖలు వుట్ట లేమ యూరున రోమరేఖ మెఱసె
నరిమానసముల నాహారవాంఛలు దప్ప వనజాక్షి కాహారవాంఛ దప్పె

తే.
శ్రమము సంధిల్లె రిపులకు శ్రమము గదుర
జడత వాటిల్లె శత్రులు జడను పడఁగ
మన్ను రుచి యయ్యెఁ బగతురు మన్ను చొరఁగ
వెలఁది యుదరంబులో హరి వృద్ధిఁ బొంద.


అప్పుడు బ్రహ్మాదిదేవతలు దేవకీ గర్భస్థుండైన స్వామిని ఈ విధంగా స్తుతిస్తారు.

మ.
గురు పాఠీనమ వై జలగ్రహమకోలంబ వై వై శ్రీనృకే
సరి వై భిక్షుఁడ వై హయాననుఁడ వై క్ష్మాదేవతా భర్త వై
ధరణీనాథుఁడ వై దయాగుణ గణోదారుండ వై లోకముల్
పరిరక్షించిన నీకు మ్రొక్కెద మిలాభారంబు వారింపవే.

క.
ముచ్చిరి యున్నది లోకము, నిచ్చలుఁ గంసాదిఖలులు నిర్దయు లేచన్
మచ్చికఁ గాఁవగవలయును, విచ్చేయము తల్లి కడుపు వెడలి ముకుందా!

క.
పంకజముఖి నీళ్ళాడను,సంకటపడ ఖలుల మానసంబుల నెల్లన్
సంకటము దోఁచె మెల్లనఁ,సంకటములు లేమి దోచె సత్పురుషులకున్.

దేవతలు పూలవానలు కురిపించు చుండగా దేవదేవుని దేవకీదేవి ప్రసవంచినది.
అప్పుడు--
సీ.
జలధరదేహు నాజాను చతుర్బాహు సరసీరుహాక్షు విశాలవక్షుఁ
జారు గదా శంఖ చక్ర పద్మ విలాసుఁ గంఠ కౌస్తుభమణి కాంతిభాసుఁ
గమనీయ కటిసూత్ర కంకణ కేయూరు శ్రీవత్సలాంఛ నాంచితవిహారు
నురుకుండల ప్రభాయుత కుంతల లలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు

తే.
బాలుఁ బూర్ణేందు రుచిజాలు భక్తలోక
పాలు సుగుణాలవాలుఁ గృపావిశాలుఁ
జూచి తిలకించి పులకించి చోద్యమంది
యుబ్బి చెలరేఁగి వసుదేవుఁ డుత్సహించె.


దేవకీదేవి కూడా స్వామిని గురించి ఈ విధంగా ప్రార్థన చెసింది.
సీ.
అట్టిట్టి దనరాని దై మొద లై నిండుకున్న దై వెలుఁగుచు గుణము లేని
దై యొక్కచందంబు దై కల దై నిర్విశేష మై క్రియ లేక చెప్పరాని
దీ రూప మని శ్రుతు లెప్పుడు నొడివెడి యా రూప మగుచు నధ్యాత్మదీప
మై బ్రహ్మ రెండవ యర్ధంబు తుది జగంబులు నశింపఁగఁ బెద్ద భూతగణము

ఆ.
సూక్ష్మభూతమందుఁ జొరఁగఁ నా భూతంబు
ప్రకృతిలోనఁ జొరఁగఁ బ్రకృతి వోయి
వ్యక్తమందుఁ జొరఁగ వ్యక్త మణంగను
శేషసంజ్ఞ నీవు చెలువ మగుదు.

ఉ.
విశ్వము లీలఁ ద్రిప్పుచు నవిద్యకు జుట్టమ వైన నీకు నా
శాశ్వత మైన కాల మిది సర్వము వేడబ మందు రట్టి వి
శ్వేశ్వర! మేలుకుప్ప! నిను నెప్పుడుఁ గోరి భజించువాఁడె పో
శాశ్వత లక్ష్మి మృత్యుజయ సౌఖ్యయుతుం డభయుండు మాధవా!

మత్తకోకిల.
ఒంటి నిల్చి పురాణయోగులు యోగమార్గ నిరూఢు లై
కంటి మందురు గాని నిక్కము గాన రీ భవదాకృతిన్
గంటి భద్రముఁ గంటి మాంసపుఁ గన్నులం గనఁబోలదీ
తొంటి రూపుఁ దొలంగఁ బెట్టుము తోయజేక్షణ మ్రొక్కెదన్.

ఆ.
విలయకాలమందు విశ్వంబు నీ పెద్ద
కడుపులోనఁ దాఁచు కడిమి మేటి
నటుఁడ వీవు నేఁడు నా గర్భజుఁడ వౌట
పరమపురుష! వేడబంబు గాదె.

తరల.
నళినలోచన! నీవు నిక్కము నాకుఁ బుట్టెద వంచు నీ
ఖలుఁడు కంసుడు పెద్దకాలము కారయింట నడంచె దు
ర్మలినచిత్తుని నాజ్ఞ సేయుము మమ్ముఁ గావుము భీతులన్
నులుసు లేక ఫలించె నోచిన నోము లెల్లను నీవయై.

0 comments

Dec 30, 2008

శ్రీకైవల్యపదంబుఁ జేరుటకునై చింతించెదన్, లోక ర

బ్లాగ్మిత్రులందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు


భారతీయులకు భారత రామాయణాలు రెండూ రెండు కళ్ళవంటివి.భాగవతం వారి హృదయం,భగవద్గీత వారి ఆత్మ.

హృదయం వంటి భాగవతం లో ప్రత్యేకించి దశమ స్కంధం ఒక్కటీ ఒక ఎత్తు.ఎందుకంటే దేవాదిదేవుడైన శ్రీకృష్ణభగవానుని దివ్యమంగళ లీలా విలాసాలన్నీ సమగ్రంగా సర్వాంగ సుందరంగా ఈ దశమస్కంధంలోనే అభివర్ణితములై ఉన్నాయి.దైవప్రేరణచేతనే అనుకుంటా- దశమస్కంధాన్ని ఓసారి తిరిగి చదవాలనిపించింది.చదువుతూ ఉంటే అందులోని మందార మకరంద మాధుర్యాల్ని మన బ్లాగు మిత్రులతో కలసి పంచుకోవాలని ఆ ఆనందాన్ని పెంచుకోవాలనిన్నీ అనిపించింది.ఆ ప్రేరణే ఈ పోస్టువ్రాయడానికి కారణం.
మన పెద్దలలో చాలా మందికి భాగవతం లోని చాలా పద్యాలు కంఠస్థంగా ఉండేవి.నా చిన్నప్పుడు మా తాతగారు "అలవైకుంఠ పురంబులో", "సిరికిం జెప్పడు", వగైరా పద్యాల్ని అప్పజెపుతుంటే నోరెళ్ళబెట్టుకుని వినటం నాకు ఇప్పటికీ బాగా జ్ఞాపకం. అటువంటి ధారణ కనువైన పద్యాల్ని ఎత్తి వ్రాయాలని,నా బ్లాగు సందర్శకులలో ఏ ఒక్కరైనా అవి చూచి చదివి ప్రేరేపితులై భాగవతం పఠించే కార్యక్రమాన్నిచేపట్టొచ్చునన్న అశతో ఆశయంతో ఇది ప్రారంభిస్తున్నాను.నా కృషి వృధా కాదని నాకు గట్టి నమ్మకం.

శ్రీకైవల్యపదంబుఁ జేరుటకునై చింతించెదన్, లోక ర
క్షైకారంభకు, భక్త పాలన కళా సంరంభకున్, దానవో
ద్రేక స్తంభకుఁ, గేళిలోల విలసుద్దృగ్జాల సంభూత నా
నా కంజాత భవాండ కుంభకు, మహానందాంగనా డింభకున్.


శ్రీమహాభాగవత ప్రారంభంలో పోతన 'మహా నందాంగనా డింభకు'డైన శ్రీకృష్ణుని చరిత్రను "శ్రీకైవల్యపదంబు చేరుటకునై చింతించెదన్" అని చెప్పుకొన్నాడు.మనం కూడా ఆ ప్రయత్నాన్నే కొనసాగిద్దాం.

ఉ.
క్షోణితలంబునన్ నుదురు సోఁకఁగ మ్రొక్కి నుతింతు సైకత
శ్రోణికిఁ జంచరీక చయ సుందరవేణికి రక్షితామర
శ్రేణికిఁ దోయజాతభవ చిత్త వశీకరణైక వాణికిన్
వాణికి నక్షదామ శుక వారిజ పుస్తక రమ్య పాణికిన్.


సరస్వతీ ప్రార్థన చేసి ముందుకు సాగుతూ

ఉ.
అమ్మల గన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ,చాలఁ బె
ద్దమ్మ,సురారులమ్మ కడు పాఱడి వుచ్చిన యమ్మ, దన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ, మా
యమ్మ, కృపాబ్ది యిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్.


ఆదుర్గాదేవిని ప్రసన్నం గావించుకుని--

క.
పలికెడిది భాగవతమఁట!,పలికించు విభుండు రామభద్రుండఁట! నేఁ
బలికిన భవహరమగునఁట!,పలికెద వేరొండు గాథ పలుకఁగ నేలా?


అని సంకల్పించుకొన్నవాడై

ఆ.
భాగవతము దెలిసి పలుకుట చిత్రంబు!, శూలికైనఁ దమ్మి చూలికైన!
విభుదజనుల వలన విన్నంత కన్నంత, దెలియ వచ్చినంత దేటపఱతు.


అని వినయంగా విన్నవించుకొని-

క.
కొందఱకుఁ దెనుఁగు గుణమగుఁ, గొందఱకును సంస్కృతంబు గుణమగు, రెండుం
గొందఱికి గుణములగు నే, నందఱ మెప్పింతుఁ గృతుల నయ్యైయెడలన్.


అని తన భాగవత రచన ఏ విధంగా చేయదలచినదీ ముందుగానే మనకు తెలియపరస్తూ--

మ.
ఒనరన్ నన్నయ తిక్కనాది కవు లీయుర్విం బురాణావళుల్
తెనుఁగుం జేయుచు మత్పురాకృత శుభాధిక్యంబు దా నెట్టిదో
తెనుఁగుం జేయరు మున్ను భాగవతమున్ దీనిం దెనింగించి నా
జననంబున్ సఫలంబుఁ జేసేదఁ బునర్జన్మంబు లేకుండఁగన్.


అని నిశ్చయించి పోతన గారు భాగవత రచనకు ఉపక్రమించారు.

ఈ భాగవతం సాక్షాత్తూ ఓ కల్పవృక్షమే.


లలిత స్కంధము, కృష్ణమూలము, శుకాలాపాభిరామంబు, మం
జులతాశోభితమున్,సువర్ణ సుమన స్సుజ్ఞేయమున్, సుందరో
జ్జ్వలవృత్తంబు, మహాఫలంబు, విమల వ్యాసాలవాలంబునై
వెలయున్ భాగవతాఖ్య తరు వుర్విన్ సద్ద్విజ శ్రేయమై.


ఇటువంటి భాగవతాఖ్య తరువున పండిన తీయని పండ్లు మనం చెప్పుకోబోయే దశమస్కంధం లో మనకి ఎన్నో ఎన్నెన్నో లభిస్తాయి.

పరీక్షితుడు శుకయోగీంద్రుని శ్రీకృష్ణుని చరిత్ర నంతటినీ చెప్పమని కోరతాడు.ఆ విష్ణుకథలెలాటివంటే--


విష్ణు కథా రతుఁ డగు నరు, విష్ణుకథల్ చెప్పు మనుచు వినుచుండు నరున్
విష్ణుకథా సంప్రశ్నము, విష్ణుపదీ జలముభంగి విమలులఁ జేయున్.


ఒకప్పుడు వేలకొలది రాక్షసులతో భూభారము అధికమై ఆ భారాన్ని తగ్గించమని ప్రార్థిస్తూ భూదేవి గోరూపం లో బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళింది.ఆయన భూదేవీ సహితంగా విష్ణువుని చేరి ప్రార్థిస్తాడు.విష్ణువు యాదవకులం లో శ్రీకృష్ణునిగా రాక్షస సంహారం నిమిత్తం తా నవతరిస్తానని చెప్పి వివిధ దేవతలను వారి వారి అంశములతో హరి పూజార్థం భూమిపై పుట్టమని నియోగిస్తాడు.

శూరసేనుడనే యాదవరాజు మథురానగరం రాజధానిగా మథుర,శూరసేన రాజ్యాల్ని పరిపాలిస్తుంటాడు.అతని కొడుకు వసుదేవుడు.ఇతడు దేవకిని పెండ్లియాడి దేవకి అన్న కంసుడు(ఉగ్రసేనరాజు కొడుకు)రథం నడుపుతుండగా తన పట్టణానికి దేవకితో ప్రయాణమై వస్తూ ఉండగా అశరీరవాణి కంసుడి నుద్దేశించి 'దేవకి అష్టమ గర్భజనితుని వలన కంసునికి చావు కలుగుతుం'దని హెచ్చరిస్తుంది.అది విని కంసుడు తన చెల్లెలు దేవకిని కొప్పుపట్టుకుని క్రిందకు ఈడ్చి చంపబోతాడు.అప్పుడు వసుదేవుడు కంసునికి అడ్డుపడి శాంతింపజేస్తూ--

ఉ.
అన్నవు నీవు చెల్లెలికి నక్కట!మాడలు చీరలిచ్చుటో
మన్నన సేయుటో మధుర మంజుల భాషల నాదరించుటో
మిన్నుల మ్రోఁతలే మే లని చంపకుమన్న!మాని రా
వన్న!సహింపు మన్న!తగ దన్న!వధింపకు మన్న! వేఁడెదన్.


అనుప్రాస అలంకారం పోతనగారికెంతో ఇష్టమయినది.

మత్తకోకిల.
వావిఁ జెల్లెలు గాని కూఁతురువంటి దుత్తమురాలు సం
భావనీయచరిత్ర భీరువు బాల నూత్నవివాహ సు
శ్రీవిలాసిని దీన కంపితచిత్త నీ కిదె మ్రోక్కెదన్
గావవే కరుణామయాత్మక! కంస! మానవ వల్లభా!


అని ఎన్నో విధములుగా ప్రార్థించి,

క.
లలనకుఁ బుట్టిన కొమరుని, వలనం దెగె దనుచు గగనవాణి వలికె నం
చలిగెదవేని మృగాక్షికిఁ,గల కొడుకులఁ జంప నిత్తుఁ గ్రమమున నీకున్.


అని వొడబరుస్తాడు.అలా అనటమే కాకుండా మొట్టమొదట కలిగిన బిడ్డని తీసుకువచ్చి కంసునికి ఇస్తాడు.కంసుడు దానికి మెచ్చి తనకు అష్టమ గర్భం వల్లనేకదా మృత్యువు అని వసుదేవుని సత్యసంధతకు మెచ్చి ఆ కొడుకును తిరిగి ఇచ్చివేస్తాడు.

సశేషం

0 comments

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks