నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

Showing posts with label కరుణశ్రీ. Show all posts
Showing posts with label కరుణశ్రీ. Show all posts

Mar 18, 2010

కరుణశ్రీ గారి మందార మకరందాలు - చుక్కగుర్తు పద్యాలు

 -కరుణశ్రీ గారి చుక్కగుర్తు పద్యాలు 
విశ్వప్రేమ 
సీ. 
ఏ ప్రేమ మహిమచే నీ ధారుణీచక్ర 
మిరుసు లేకుండనే తిరుగుచుండు 
ఏ ప్రేమమహిమచే నెల్ల నక్షత్రాలు 
నేల రాలక మింట నిలిచియుండు 
ఏ ప్రేమమహిమచే పృథివిపై బడకుండ 
కడలిరాయుడు కాళ్ళు ముడుచుకొనును 
ఏ ప్రేమమహిమచే నీ రేడు భువనాల 
గాలిదేవుడు సురటీలు విసరు 
గీ. 
ఆ మహాప్రేమ - శాశ్వతమైన ప్రేమ - 
అద్భుత మఖండ మవ్యక్తమైన ప్రేమ - 
నిండియున్నది బ్రహ్మాండభాండమెల్ల 
ప్రేయసీ ! సృష్టియంతయు ప్రేమ మయము ! !
 
తపోభంగము
ఉ.
అందము చిందిపోవ చెవియందలి చెందొవ జారుచుండ "పూ
లందుకొనుం " డటంచు సుమనోంజలి ముందుకు చాచి శైలరా
ణ్ణందన వంగె - చెంగున ననంగుని చాపము వంగె - వంగె బా
లేందుధరుండు కాన్కలు గ్రహింపగ ఉన్నమితోర్ధ్వకాయుడై.
 
పుష్పవిలాపము.
ఉ.
నేనొక పూలమొక్కకడ నిల్చి చివాలున కొమ్మవంచి గో
రానెడు నంతలోన విరులన్నియు జాలిగ నోళ్ళువిప్పి "మా
ప్రాణము తీతువా" యనుచు బావురుమన్నవి - క్రుంగిపోతి - నా
మానసమం దెదో తళుకుమన్నది పుష్పవిలాప కావ్యమై.
ఉ.
ఆయువు గల్గు నాల్గు గడియల్ కనిపెంచిన తీవతల్లి జా
తీయత దిద్ది తీర్తుము - తదీయ కరమ్ములలోన స్వేచ్ఛమై
నూయల లూగుచున్ మురియుచుందుము - ఆయువు దీరినంతనే
హాయిగ కన్ను మూసెదము - ఆయమ చల్లని కాలివ్రేళ్ళపై.
ఉ.
గాలిని గౌరవింతుము సుగంధము పూసి; సమాశ్రయించు భృం
గాలకు విందు సేసెదము కమ్మని తేనెలు; మిమ్ముబోంట్ల నే
త్రాలకు హాయి గూర్తుము; స్వతంత్రుల మమ్ముల స్వార్థబుద్ధితో
తాళుము త్రుంపబోవకుము ! తల్లికి బిడ్డకు వేఱు సేతువే !
ఉ.
ఊలుదారాలతో గొంతు కురి బిగించి
గుండెలోనుండి సూదులు గ్రుచ్చి కూర్చి
ముడుచుకొందురు ముచ్చటముడుల మమ్ము
అకట ! దయలేనివారు మీ యాడువారు.
 
కుంతీ కుమారి
చ.
అది రమణీయ పుష్పవన - మా వనమం దొక మేడ - మేడపై
నది యొక మాఱుమూలగది - ఆ గదితల్పులు తీసి మెల్లగా
పదునయిదేండ్ల యీడుగల బాలిక - పోలిక రాచపిల్ల - జం
కొదవెడి కాళ్ళతోడ దిగుచున్నది క్రిందికి మెట్లమీదుగన్ !
ఉ.
కన్ని యలాగె వాలకము కన్పడుచున్నది - కాదు కాదు - ఆ
చిన్ని గులాబి లేత అరచేతులలో - పసిబిడ్డ డున్నయ
ట్లున్నది - ఏమి కావలయునోగద ఆమెకు - అచ్చుగ్రుద్దిన
ట్లున్నవి - రూపురేక - లెవరో యనరా దత డామెబిడ్డయే ! 
మ.
" ముని మంత్రమ్ము నొసంగనేల ? ఇడెబో మున్ముందు మార్తాండు ర
మ్మని నే కోరగనేల ! కోరితినిబో ఆతండు రానేల ? వ
చ్చెనుబో కన్నియనంచు నెంచక ననున్ జేపట్టగానేల ? ప
ట్టెనుబో పట్టి నోసంగనేల ? అడుగంటెన్ కుంతి సౌభాగ్యముల్ ".
గీ.
"ఈ విషాదాశ్రువులతోడ నింక నెంత
కాల మీ మేను మోతు ? గంగాభవాని
కలుషహారిణి - ఈ తల్లి కడుపులోన
కలిసిపోయెద నా కన్న కడుపుతోడ."
ఉ.
నన్నతి పేర్మిమై గనెడి నా తలిదండ్రుల ప్రేమ యర్థమౌ
చున్నది; నేడు బిడ్డ నిట నొంటరిగా విడిపోవ కాళ్ళు రా
కున్నవి: యేమి సేతు; కనియున్ గనలేని యభాగ్యురాల నే
నన్ని విధాల - కన్న కడుపన్నది కాంతల కింత తీపియే ! 
ఉ.
పెట్టియలోన నొత్తిగిలబెట్టి నినున్ నడిగంగలోనికిన్
నెట్టుచునుంటి తండ్రి ! యిక నీకును నాకు ఋణంబుదీరె, మీ
దెట్టుల నున్నదో మన యదృష్టము ! ఘోరము చేసినాను నా
పుట్టుక మాసిపోను ! నినుబోలిన రత్నము నాకు దక్కునే !
 
ఊర్మిళా కుమారి
చ.
రమణుడు చెంతనుండిన నరణ్యములే యపరంజి మేడలౌ
రమణుడు లేక మేడలె యరణ్యములౌ - ఇకనేమి జానకీ
రమణికి రాణివాసమె అరణ్యనివాసము - నీవు నీ మనో
రమణుని బాసి ఘోరపుటరణ్యములో బడిపోతి విచ్చటన్. 
ఉ.
అత్తరి "పోయి వత్తును ప్రియా ! యిక నే" నను భర్తకెట్టి ప్ర
త్యుత్తర మీయలేక యెటులో తలయెత్తి యెలుంగురాని డ
గ్గుత్తికతోడ నీలి కనుగొల్కుల బాష్పకణమ్ము లాపుచున్ 
"చిత్త" మటన్న నిన్ను గన చిత్తము నీరగునమ్మ ఊర్మిళా !
ఉ.
పైటచెఱంగుతో పుడమిపై బడకుండగ నద్దుకొమ్ము నీ
కాటుక కన్నుదామరల కాలువలై ప్రవహించు వేడి క
న్నీటి కణాలు - క్రిందపడనీయకు ! ముత్తమసాధ్వి వైన నీ
బోటి వధూటి బాష్పములు భూమి భరింపగలేదు సోదరీ !
శా.
చెల్లెం డ్రిర్వురు ప్రాణ వల్లభుల సంసేవించుచున్నారు; తా
నుల్లాసమ్మునమ సీత వల్లభునితో నుండెన్ వనిన్ ! నీ వెటుల్
తల్లీ ! భర్తృ వియోగ దుఃఖమున నుల్లం బల్ల కల్లోలమై
యల్లాడన్ కడత్రోతువమ్మ : పదునా ల్గబ్దమ్ము లేకాకృతిన్. 
ఉ.
కమ్మని జవ్వన మ్మడవిగాచిన వెన్నెలజేసి, భర్తృవా
క్యమ్ముల కడ్డుచెప్పక మహత్తరమౌ పతిభక్తిలోన సీ
తమ్మను మించిపోయితివి - తావక దివ్య యశోలతా వితా
నమ్ములు ప్రాకిపోయె భువనమ్ముల; పుణ్యవతీవతంసమా !
 
అనసూయాదేవి
గర్భములేదు - కష్టపడి కన్నది లే - దిక బారసాల సం
దర్భము లే - దహో ! పురిటిస్నానముల్ నడికట్లులేవు - ఏ
స్వర్భువనాలనుండి దిగివచ్చిరి నీ ప్రణయాంక పీఠి కీ
యర్భకు ? లంతులేని జననాంతర పుణ్యతపఃఫలమ్ములై. 
 
మహాకవి పోతన
ఉ.
గంటమొ చేతిలోది ములుగఱ్ఱయొ ? నిల్కడ యింటిలోననో
పంటపొలానొ ? చేయునది పద్యమొ సేద్యమొ ? మంచమందు గూ
ర్చుంటివొ మంచెయందొ ? కవివో గడిదేరిన కర్షకుండవో ?
రెంటికి చాలియుంటివి సరే ! కలమా హలమా ప్రియం బగున్ ?
ఉ.
కాయలు గాచిపోయినవిగా యరచేతులు ! వ్రాతగంటపున్
రాయిడిచేతనా ? మొరటు నాగలిమేడి ధరించి సేద్యమున్
జేయుటచేతనా ? కవికృషీవల ! నీ వ్యవసాయదీక్ష " కా
హా " యని యంతలేసి కనులార్పక చూచిరిలే దివౌకసుల్ !
ఉ.
"నమ్ముము తల్లి నాదు వచనమ్ము ; ధనమ్మునకై బజారులో
అమ్మనుజేశ్వరాధముల కమ్మను ని " న్నని బుజ్జగించి నీ
గుమ్మములోన నేడ్చు పలుకుం జెలి కాటుకకంటి వేడి బా
ష్పమ్ములు చేతితో తుడిచివైచెడి భాగ్యము నీకె యబ్బెరా ! !
ఉ.
కమ్మని తేటతెల్గు నుడికారము లేరిచి కూర్చి చాకచ
క్యమ్ముగ కైత లల్లు మొనగాండ్రు కవీశ్వరు లెంతమంది లో
కమ్మున లేరు - నీవలె నొకండును భక్తి రసామృత ప్రవా
హమ్ముల కేతమెత్తిన మహాకవి యేడి తెలుంగు గడ్డపై ?
సీ.
భీష్ముని పైకి కుప్పించి లంఘించు గో
పాలకృష్ణుని కుండలాల కాంతి
కరిరాజు మొఱపెట్ట పరువెత్తు కఱివేల్పు
ముడివీడి మూపుపై బడిన జుట్టు
సమరమ్ము గావించు సత్య కన్నులనుండి
వెడలు ప్రేమక్రోధ వీక్షణములు
కొసరి చల్దులు మెక్కు గొల్ల పిల్లల వ్రేళ్ళ
సందు మాగాయి పచ్చడి పసందు
గీ.
ఎటుల కనుగొంటివయ్య ! నీ కెవరు చెప్పి
రయ్య ! ఏరాత్రి కలగంటివయ్య ! రంగు
కుంచెతో దిద్దితీర్చి చిత్రించినావు !
సహజపాండితి కిది నిదర్శనమటయ్య ! ! 
ఉ.
ముద్దులుగార భాగవతమున్ రచియించుచు, పంచదారలో
నద్దితివేమొ గంటము మహాకవిశేఖర ! మధ్య మధ్య అ
ట్లద్దక - వట్టిగంటమున నట్టిటు గీచిన తాటియాకులో
పద్దెములందు - ఈ మధుర భావము లెచ్చటనుండి వచ్చురా ?
ఉ.
ఖ్యాతి గడించుకొన్న కవు లందరు లేరె ! అదేమి చిత్రమో
పోతన యన్నచో కరిగిపోవు నెడంద, జోహారు సేతకై
చేతులు లేచు ; ఈ జనవశీకరణాద్భుతశక్తి చూడగా
నాతని పేరులో గలదొ ; ఆయన గంటములోన నున్నదో !
 
ఆంధ్ర విద్యార్థి
సీ.
ఒకమాటు కనుమోడ్చుచుందు బమ్మెరవారి
మందార మకరంద మధురవృష్టి
ఒకమాటు మూర్కొనుచుందు తిమ్మనగారి
పారిజాత వినూత్న పరిమళమ్ము
ఒకమాటు చవిచూచుచుందు పెద్దనగారి
ద్రాక్షాగుళుచ్ఛ సుధా సుధార
ఒకమాటు విహరించుచుందు పింగళివారి
వరకళాపూర్ణ సౌవర్ణ శిఖరి
గీ.
ఒకట కవితా కుమారితో నూగుచుందు
గగన గంగా తరంగ శృంగారడోల ;
ఆంధ్ర సాహిత్య నందనోద్యానసీమ
నర్థి విహరించు " ఆంధ్ర విద్యార్థి " నేను.
సీ.
కాళిదాస కవీంద్ర కావ్యకళావీథి
పరుగులెత్తెడి రాచబాట నాకు
భట్టబాణుని ముద్దుపట్టి కాదంబరి
కథలు చెప్పెడి చెల్మికత్తె నాకు
భవభూతి స్నేహార్ద్ర భావవైభవ గీతి
కరుణారసాభిషేకమ్ము నాకు
వాల్మీకి కవిచక్రవర్తి భావస్ఫూర్తి
ఆటలాడెడి పూలతోట నాకు
గీ.
భారతీదేవి మృదులాంక భద్రపీఠి
ముద్దులొలికెడి రతనాల గద్దె నాకు ;
తెనుగుతోటల సంస్కృత వనలతాళి
నంటుత్రొక్కెడు " ఆంధ్ర విద్యార్థి " నేను.
 
తెనుగు తల్లి
సీ.
గంటాన కవితను కదను త్రొక్కించిన
"నన్నయభట్టు" లీనాడు లేరు
కలహాన కంచుఢక్కల నుగ్గు నుగ్గు గా
వించు "శ్రీనాథు" లీవేళ లేరు
అంకాన వాణి నోదార్చి జోలలు వాడు
"పోతనామాత్యు" లీప్రొద్దు లేరు
పంతాన ప్రభువుతో పల్లకీ నెత్తించు 
కొను "పెద్దనార్యు" లీ దినము లేరు
గీ.
"వాణి నా రాణి" యంచు సవాలుకొట్టి
మాట నెగ్గించు "వీరు" లీపూట లేరు !
తిరిగి యొకమాటు వెనుకకు తిరిగిచూచి
దిద్దుకోవమ్మ ! బిడ్డల, తెనుగు తల్లి !
సీ.
కవులకు బంగారు కడియాలు తొడిగిన 
రాయలగన్న వరాల కడుపు
సీసాలతో కవితాసార మిచ్చు శ్రీ
నాథుని గన్న రత్నాల కడుపు
భద్రాద్రిలో రామభద్రు స్థాపించు గో
పన్నను గన్న పుణ్యంపు కడుపు
జగ మగంటిమి నల్దెసల్ వెలార్చిన పాప
రాయని గన్న వజ్రాల కడుపు
గీ.
పిసినిగొట్టు రాజులకును - పిలకబట్టు
కుకవులకును - పిచ్చిపిచ్చి భక్తులకు -పిఱికి
పందలకు - తావు గాకుండ ముందు ముందు 
దిద్దుకోవమ్మ ! బిడ్డల, తెనుగుతల్లి !
 
కల్యాణగీతి
శ్రీకరమ్ములు మీకు నాట్యైకలోల
శివజటాజూట గాంగేయ శీకరములు;
రంజితమ్ములు మీకు శర్వామి చరణ
కంజ మంజుల మంజీర శింజితములు ! !
 
కవితా కుమారి
జడయల్లి జడకుచ్చు లిడ "రాయప్రోలు" "త
ల్లావజ్ఝల" కిరీట లక్ష్మినింప
"పింగళి" "కాటూరి" ముంగురుల్ సవరింప
దేవులపల్లి శ్రీ తిలక ముంప
"విశ్వనాథ" వినూత్న వీథుల కిన్నెర మీట
"తుమ్మల" రాష్ట్రగాన మ్మొనర్ప
"వేదుల" "నాయని" వింజామరలు వేయ
"బసవరాజు" "కొడాలి" పదములొత్త
గీ.
"అడవి" "నండూరి" భరతనాట్యములు సలుప
"జాషువా" "ఏటుకూరి" హెచ్చరిక లిడగ
నవ్యసాహిత్య సింహాసనమున నీకు
ఆంధ్ర కవితాకుమారి "దీర్ఘాయురస్తు ! "  
 
కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి గారి ఉదయశ్రీ మొదటి భాగమునుండి ఏర్చి కూర్చిన 
మందార మకరందాలు.
 

1 comments

Sep 2, 2008

ఆదిభట్ల నారాయణ దాసు

ఎవరీ ముగ్ధమనోజ్ఞ దర్శనుఁ ! డెవం డీ శారదామూర్తి ! యీ
నవశృంగార రసావతారుఁ డెవరన్నా! శ్రీమదజ్జాడయే
యవునా ! ఆ దరహాస ! మా నడకతీ ! రా ఠీవి ! యా దర్ప ! మా
కవితాదీప్తి ! యనన్యసాధ్యములురా ! కై మోడ్పు లందింపరా!

పండించె నీకాలి గండపెండెరము రం
గారు ముంగారు బంగారు పంట
నర్తించె నీకీర్తి నవనవస్ఫూర్తి యా
సేతు శీతాచల క్ష్మాతలాన
జోహారులందె నీ సాహిత్యనందిని
కదిలించి సహృదయహృదయములను
గంభీరమయ్యె నీ "శంభో" నినాదంబు
దిగ్దిగంతాలఁ బ్రతిధ్వనించి

కాంతులీనెను రాజ సభాంతరాల
నీ జయశ్రీ దృగంత నీరాజనాలు;
యక్షగానకళా మహాధ్యక్షపదవి
అక్షరంబయ్యె నీ పట్ల "నాదిభట్ల!"

చిఱుతాళముల జత చే ధరించినఁ జాలు
లయతాళములు శుభోదయము పలుకు
కాలిగజ్జె లొకింత ఘల్లు మన్నం జాలు
భరతమ్ము నీ ముందు శిరసు వంచు
వీణతంత్రుల మునివ్రేళ్ళు సోకినఁ జాలు
సంగీతవాహిని పొంగిపొరలు
గంటంబుఁ బూని క్రీగంటఁ గాంచినఁ జాలు
కవిత నీ యెదుట సాక్షాత్కరించు

నేఁటి కథకులందు నీ పేరు చెప్పక
గజ్జె గట్టువాఁడు కానరాఁడు;
తెలుగువెలుఁగు దేశదేశాల నింపిన
హరికథా పితామహా ! నమోస్తు!!

కల్యాణి రుక్మిణీ కన్య మెల్లఁగ నల్ల
నయ్య భుజమ్ముపై చెయ్యి వైచె
జనని జానకి మహాశపథమ్మురో సుప
థమ్ము చూపెను సతీధర్మమునకు
వరగాత్రి సావిత్రి వైవస్వతుని నిల్పి
మగని ప్రాణాలకై తగవులాడె
చిన్ని మార్కండేయు శివభక్తి పదమెత్తి
మృత్యుదేవత గుండె మీఁదఁ దన్నె

"మ్రొక్కుబడిఁ" జిక్కువడి వేదరుక్కు లెల్ల
నచ్చపుం దెల్గు కలకండ లచ్చువోసె;
నీదు ప్రతిభకు లోనుకానిది మఱేది ?
స్వర సురత్రాణ ! అష్టభాషా ప్రవీణ !

చల్లపల్లి నృపాలు సంతోష మెంతయో
గండ పెండర మిచ్చి గౌరవించె
ఆనందగజపతి మేనెంత పొంగెనో
రమణీయ రత్నహారము లొసంగె
మైసూర్ మహారాజు మదిముద మ్మది యెంతొ
కనకాంబరమ్ములు కట్టఁబెట్టె
సరస విద్వన్మహాసమితి మే లెట్టిదో
ఘంటా సువర్ణ కంకణము లిచ్చె

లలిత సంగీత సాహిత్య కలిత యగుచు
భరతభారతి హారతి పట్టె నీకు;
హరికథావ్యాసునకును- స్నేహార్ధ్ర మధుర
హాసునకును - నారాయణ దాసునకును -

"నేతి" సౌవర్ణ మాణిక్య పీఠము వెట్ట
"కుప్పా" జగా వెల్ల గొడుగుఁ బట్ట
"నౌడూరి" శిల్ప సుందర కిరీటముఁ గూర్ప
"అమ్ముల" శ్రీ తిలకమ్ము తీర్ప
"చీరాల" నవరత్న హారాలు కై సేయ
"చిట్యాల" మంజు మంజీరము లిడ
"కూచిభట్ల" మనోజ్ఞ కుండలా లర్పింప
"ములుకుట్ల" పన్నీరు చిలుకరింప

"వాణి" యును "వేణి" "రాణి" పారాణి దిద్ద
కొలువు దీరెను హరికథా కువలయాక్షి;
మ్రొక్కె నీకు సుగాత్రి నీముద్దుపుత్రి
నెట్లు దీవింతువో ఆదిభట్ల బాబు !

"బాలాజి" సరిక్రొత్త పారిజాతము లివ్వి
"భోగలింగము" జాజి పువ్వు లివ్వి
"పరిమి సుబ్రహ్మణ్యు" సరసీరుహము లివ్వి
"పాతూరి" వకుళ పుష్పమ్ము లివ్వి
"పెద్దింటి" మేల్ గులాబి ప్రసూనము లివ్వి
"ములుకుట్ల" సంపెంగ మొగ్గ లివ్వి
"బాలబ్రహ్మానందు" నీలోత్పలా లివ్వి
"తెల్లాకుల" వి మంచి మల్లె లివ్వి

కమ్మని సుగంధములు విరజిమ్ము నేఁడు
హరికథోద్యాన వనమందు; నందుకొనుము
నీవు నాటిన తోటలో పూవులొసఁగు
శ్రీ సపర్య ! నారాయణదాసవర్య !

"ఎవడురా ! యచట తెం డింకొక్క గ్లా" సంచు
అమృత రక్షకులకు నాజ్ఞ యొసఁగి
"సుధకంటె మా హరికథ లెస్స" యని బృహ
స్పతితోడ నర్మ భాషణము నెఱపి
"ఏమమ్మ వాణి ! యేదీ వీణ ! సరిక్రొత్త
తీవలా" యని 'గిరాందేవి' నడిగి
"ఆగవే రంభ ! ఆ హస్త మట్టులు గాదు
త్రిప్పిపట్టు" మటంచు తప్పుదిద్ది
"ఏమయా ! క్రొత్త సంగతు లే" మటంచు
బ్రహ్మమానసపుత్రుని పలుకరించి:
ఆదిభట్ల నారాయణాఖ్యము మహస్సు
తిరుగు నిందందు స్వర్గ మందిరములందు! !

సంగీత సాహిత్య జగదంగణము ధగ
ద్ధగిత మ్మొనర్చు గంధర్వతార
వాసిఁగాంచిన మహావాగ్గేయకారుఁడై
భారతి నర్చించు భక్త మౌళి
అమరుఁడౌ "ఉమరు ఖయ్యాం" రుబాయతు లాంధ్ర
సంస్కృతమ్ముల కెత్తు సవ్యసాచి
హరికథారాజ్య మూర్ధభిషిక్తుండయ్యు
స్వార్థం బెఱుంగని పార్థివుండు

వాలు మెలి మీసకట్టు, జుల్పాల జుట్టు,
నొసట కుంకుమబొట్టు, మేల్పసిడిగట్టు,
విద్దెలకు పట్టు ! నడయాడు వేల్పుచెట్టు!
హరికథా శిల్పసమ్రాట్టు! "ఆదిభట్టు".

ఆదిభట్ల వారి జన్మదిన సందర్భంగా గురువుగారు భైరవభట్ల కామేశ్వరరావు గారు వ్రాసిన "కళల నెలవుకో నూలుపోగు" కు అదనంగా "కరుణశ్రీ" గారి ఈ "నూలుపోగు"ను కూడా చేర్చితే మరింత అందగిస్తుందనే ఆశతో------

3 comments

Jun 1, 2008

"కవితా వైజయంతి"

ఈ రోజు మధ్యాహ్నం సంస్కృతి టి.వి. లో శ్రీ మేడసాని మోహన్ గారి -అతిథి దేవో భవ- కర్యక్రమంలో ఆయన కరుణశ్రీ గారి
"కవితా వైజయంతి" గానం చేసారు. దాన్నిక్కడ మన బ్లాగు మిత్రులందరి కోసం పొందు పరుస్తున్నాను.

కవితా వైజయంతి

ఉత్పల మాలిక
దోసెడు పారిజాతములతో హృదయేశ్వరి మెల్లమెల్లగా
డాసిన భంగి, మేలిమి కడాని వరాల కరాలు వచ్చి క
న్మూసిన భంగి, కన్నె నగుమోము పయిన్ నునుసిగ్గుమొగ్గ కై
సేసినభంగి, అందములు చిందెడి నందనవాటి వెన్నెలల్
కాసిన భంగి, జానపదకాంతలు రాట్నము మీద దారముల్
తీసిన భంగి, క్రొవ్వలపు లేఖ శకుంతల తామరాకుపై
వ్రాసిన భంగి, పెండ్లి తలఁబ్రాల్ జవరాలు రవంత నిక్కి పై
బోసిన భంగి, గుండె వడబోసిన భంగి, కళావిపంచికల్
మ్రోసిన భంగి, పొంగు వలపుల్ తలపుల్ సొలపుల్ ప్రసన్నతల్
భాసురతల్ మనోజ్ఞతలు ప్రౌఢిమముల్ రసభావముల్ గడున్
భాసిల తెల్గుకైత నవభంగుల సంగతమై, యొకింతయున్
దోసములేని శబ్దములతో, నటనం బొనరించు పాద వి
న్యాసముతో, సమంచిత గుణంబులతో, సహజమ్ములౌ యతి
ప్రాసలతో, మనోజ్ఞమగు పాకముతో, మృదుశయ్యతో, అనా
యాస సమాసయుక్తి కలశాంబుధి తీర పురోనిషణ్ణ దే
వాసుర మండలాంతర విహార వికస్వర విశ్వమోహినీ
హాసవిలాస విభ్రమకరాంచల చంచల హేమకుంభ సం
భాసి సుధాఝురీ మధురిమమ్ములు గ్రమ్ము కొనన్ వలెన్; శర
న్మాస శుచిప్రసన్న యమునాతట సైకత సాంద్రచంద్రికా
రాస కలా కలాప మధుర వ్రజ యౌవత మధ్య మాధవ
శ్రీసుషమా ప్రపూర్ణ తులసీదళ సౌరభ సారసంపదల్
రాసులు రాసులై పొరలి రావలె; పొంపిరి పోవలెన్ నవో
ల్లాస వసంత రాగ రస లాలిత బాలరసాల పల్లవ
గ్రాస కషాయకంఠ కలకంఠ వధూకల కాకలీధ్వనుల్!

నాకు అర్ధం కాని పదబంధాలు:


కడాని
కళావిపంచికల్
పురోనిషణ్ణ
కషాయకంఠ
కలకంఠ
వధూకల
కాకలీ
చివరలో వచ్చిన పెద్ద సమాసాలు

4 comments

May 29, 2008

" సీత " సంగీత రూపకం

తాళ్ళపాక పెదతిరుమలాచార్యుల వారి రామాయణ సంకీర్తన వ్రాస్తుండంగనే
"కరుణ శ్రీ" పాపయ్య శాస్త్రి గారి "సీత" మదిలో మెదిలింది.రాయకుండా ఉండలేక పోతున్నాను.
చిత్తగించండి.

సీత

(గోమతీ తీరంలో శ్రీరాముడు అశ్వమేధదీక్షితుడై ఉన్నాడు.
కుశలవులు ప్రతిదినమూ యజ్ఞశాలకు వచ్చి రామాయణ గానం
చేస్తున్నారు.ఒకనాడు మహర్షులూ, పౌరజానపదులూ కూడి
యున్న మహాసభలో నిర్దోషురాలైన జానకిని శ్రీరామునకు
సమర్పించుటకు నాల్మీకులవారు సీతతో వస్తున్న దృశ్యం-)

బృందగీతి

శ్రీకారం చుట్టుకున్న
స్త్రీజాతి కధానిక వలె
ఆకారం దాల్చిన లో
కైక శోకగీతిక వలె


వాల్మీకులవారి వెంట
వచ్చుచుంటి వెవ రమ్మా ?
ఎన రమ్మా ఎన రమ్మా ?
అమ్మా! నీ వెవరమ్మా ?


శ్రీరాముడు

భగీరధుని రధం నెనుక
ప్రవహించే సురనది వలె
అరుంధతీవిభుని వెనుక
అరుదెంచే నందిని వలె
వాల్మీకిమహర్షి వెనుక
వస్తున్నది నా జానకి !!


కౌసల్య

నాకోడలు! నాజానకి !
నాభాగ్యము! నాప్రాణము!
చిక్కి చిక్కి తనూవల్లి
చిట్టితల్లి వస్తున్నది


సౌమిత్రి

వాల్మీకాశ్రమము చెంత
వదలిపెట్టి వచ్చినట్టి
ఇక్ష్వాకుల యశోలక్ష్మి
ఇపుడు తిరిగి వస్తున్నది!


భరతుడు

తెల్లనివన్నీ పాలని
నల్లనివన్నీ నీళ్ళని
కల్లా కపటము లెరుగని
కన్నతల్లి వస్తున్నది!


కైక

లోకులు పలుగాకులుగా
'కా కా' యని యరచి కరచి
ఏకాకినిగా చేసిన
కోకిలమ్మ వస్తున్నది!


సుమిత్ర


బ్రతుకంతా బాష్పంగా
పారిజాత పుష్పంగా
పతిసేవావ్రతము నడపు
పరమ సాధ్వి వస్తున్నది!


ఊర్మిళ


మహీస్థలికి దిగివచ్చిన
మహాలక్ష్మి మాదిరిగా
నాల్మీకుల వారివెంట
వస్తున్నది అక్కగారు!

మాండవి

హిమవద్గిరివెంట వచ్చు
ఉమాదేవి చందమ్మున
వాల్మీకుల వారివెంట
వస్తున్నది అక్కగారు!


శృతకీర్తి


రసార్ద్రమై ప్రవహించే
రామాయణరచన రీతి
వాల్మీకులవారి వెంట
వస్తున్నది అక్కగారు!


శత్రుఘ్నుడు

నీతి నియమ రహితమైన
రాతిగుండె సంఘానికి
బుద్ధిచెప్పి పోవుటకై
పెద్దవదిన వస్తున్నది!


వసిష్ఠుడు

కుశలవులను గన్నతల్లి
దశథరేశ్వరుని కోడలు
మన రాముని ధర్మపత్ని
జనకపుత్రి వస్తున్నది!


అరుంధతి

ఆదికవుల గంటములో
అమృతలహరి చిందించిన
వేదమాత మహాసాధ్వి
విశ్వజనని వస్తున్నది!


కుశలవులు


అదిగోరా అమ్మ! అమ్మ!
అనురాగపు పూలకొమ్మ!
ధర్మముతో దయలాగున
తాతవెంట వస్తున్నది!


హనుమ

సీతమ్మ వచ్చింది! !
సీతమ్మ వచ్చింది! !
మాతల్లి మాయమ్మ
సీతమ్మ వచ్చింది! !


ప్రజలు


మన రాణి వచ్చింది
మన రాణి వచ్చింది
ఇనకులాధీశ్వరుని
ఇల్లాలు వచ్చింది!




బృందగీతి


సీత వచ్చి నిలుచున్నది
శ్రీవాల్మీకుల వెంబడి
శ్రీరాముని హృదయంలో
చెలరేగెను పెనుతుఫాను


సీత వచ్చి నిలుచున్నది
శ్రీవాల్మీకుల వెంబడి
రామచంద్రు వదనముపయి
క్రమ్ముకొనెను కార్మబ్బులు


సీత వచ్చి నిలుచున్నది
శ్రీవాల్మీకుల వెంబడి
రాముని నయనమ్ములలో
ప్రేమజలధి గట్లు తెగెను


వాల్మీకి


రఘురామ! రఘురామ! రామ!
రవివంశజలరాశిసోమ!
అవధారు రాజలలామ!
భువనైక పావననామ!

ఈ సీత లోకైకపూత
ఇక్ష్వాకువంశసంజాత!
ఇల్లాలి నంగీకరింపు
చల్లగా జగతి పాలింపు


అటువంటి పుట్టువు పుట్టి
ఇటువంటి ప్రభుని చేపట్టి
ఎటువంటి ఇక్కట్ల నందె
కటకటా మిధిలేశుపట్టి!


ఆనాడు లంకలో బిడ్డ
నగ్నికుండమున నెట్టితివి
ఈనాడు సడి కోడి సఖిని
కానకు వెడలగొట్టితివి


దిని సాక్షి! భువి సాక్షి! హోమ
గవి సాక్షి! రవిసాక్షి! రామ!
వేదాలు సాక్షి! నా తల్లి
వైదేహి సాధ్వీమతల్లి!


బృందగీతి


అన్నాడు వల్మీకభవుడు
విన్నాడు మేదినీధవుడు
తిలకించె పరిషత్తు నపుడు
దీనదీనమ్ముగా నృపుడు


వసిష్ఠుడు

పౌరజానపదులారా!
పరమధర్మవిదులారా!
పరిత్యక్తసాధ్వి నిపుడు
పరిగ్రహించును రాముడు


ప్రజలు

పరీక్ష కావలె పరీక్ష కావలె
పాతివ్రత్యం పరీక్ష కావలె


వాల్మీకి


జనకజ కగ్నిపరీక్ష
జరిగెను మున్నొకమాటు
జనులార! వైదేహి నిపుడు
శంకించు టిది పొరపాటు


ప్రజలు

ఎపుడో ఎచటో ఎవరికి తెలియును
ఇపుడే ఇచటే ఇది కావలయును


వసిష్ఠుడు

సాకేత ప్రజలు మీరు
సత్యపరాజ్ముఖులు కారు
సాధ్వీమణి ఈ జానకి
సందేహింతురు దేనికి


ప్రజలు

ప్రత్యక్షములో పరోక్షమేటికి!
పరీక్ష కొరకే నిరీక్ష నేటికి!


బృందగీతి


ప్రాచేతసముని రాముని
జూచెను సాకాంక్షముగా
చూచి చూడనట్లు శిరము
నూచె రాము డడ్డముగా


వాల్మీకులు దీనముగా
వసిష్ఠులను తిలకించిరి
వసిష్ఠులును మౌనముగా
వారిని గని తలవంచిరి


శ్రీరాముడు

ఫ్రజారాధనమె రఘుకుల
పార్ధివులకు ధర్మపథము
ప్రజలందరు విన జానకి
పలుకుగాక మరి శపథము


వాల్మీకి


ముద్దులబిడ్డా! వింటివె
పెద్దలైన వీ రెల్లరు
శపథ మొనర్చిననెగాని
సాధ్విగ నిను గననొల్లరు.



బృందగీతి
సీత వచ్చి నిలుచున్నది
శ్రీవాల్మీకుల ముందర-
శ్రీరాముని పేరులోని
శ్రీ సిగ్గున శిరసు వంచె.

సీత వచ్చి నిలుచున్నది
శ్రీవాల్మీకుల ముందర-
రాతిగుండె రాజనీతి
రఘురాముని కనులు మూసె.

సీత వచ్చి నిలుచున్నది
శ్రీవాల్మీకుల ముందర-
గగనము నిర్ఘాంతపోయి
కన్నార్పక చూచుచుండె.

సీత వచ్చి నిలుచున్నది
శ్రీవాల్మీకుల ముందర-
గుండె కరిగి కెరటాలై
గోమతి వెక్కి వెక్కి యేడ్చె

సీత వచ్చి నిలుచున్నది
శ్రీవాల్మీకుల ముందర-
కాలం కాలాడక క్షణ
కాలం స్తంభించిపోయె


సీత వచ్చి నిలుచున్నది
శ్రీవాల్మీకుల ముందర-
వియత్పథములో వేల్పుల
విమానాలు క్రిక్కిరిసెను

సీత వచ్చి నిలుచున్నది
శ్రీవాల్మీకుల ముందర-
భూతధాత్రి గుండెలలో
మాతృత్వం పొంగిపొరలె.



బృందగీతి

అరుంధతీ వసిష్ఠులను
అవలోకించెను జానకి
జాలి దూలు ముగురత్తల
అవలోకించెను జానకి


అన్నగారి మొగము గాంచు
అనుజుల గాంచినది సీత
బిక్కమొగము వేసిన
బిడ్డల గాంచినది సీత


అల్లాడే చెల్ల్రెండ్ర మ
హార్తిని కనుగొనె జానకి
మూర్ఛిల్లిన ఆంజనేయ
మూర్తిని కనుగొనె జానకి


భయపడి గుజగుజలువోవు
ప్రజలను చూచినది సీత
బరువుగ కనురెప్ప లెత్తి
ప్రభువుని చూచినది సీత


అభిమానం పట్టలేక
ఆక్రోశించినది సీత!
అవమానం మోయలేక
ఆక్రందించినది సీత!


"అమ్మా! అమ్మా! అమ్మా!"
అని ముమ్మారనెను సీత
అమ్మ లేని బిడ్డలాగు
అలమటించె మహీజాత!



సీత


శ్రీరాముని స్మరణమె నా
జీవన సర్వస్వమేని
నా తల్లీ భూదేవీ!
నాకు త్రోవ చూపింపుము!


నా నాథుని తప్ప పరుల
నా మదిలో తలపనేని
నా తల్లీ భూదేవీ!
నను నీ యొడి చేర్చుకొమ్ము!

స్వామి చరణ కమల రుచుల
నా మానస మలరునేని
నా తల్లీ భూదేవీ!
నను నీలో కలుపుకొనుము!



బృందగీతి

"జననీ! జననీ! జననీ!"
అని ముమ్మారనెను సీత!
జనని లేని బిడ్డ చంద
మున వాపోయినది సీత!


"కటకట! కటకటా!" యనుచు
కరిగి నీరయ్యెను స్వామి
"ఫటఫట ఫటఫటా" యనుచు
భ్రద్దలై పోయెను భూమి


భూమాత సాక్షాత్కరించి
పుత్రిని బుజ్జగించినది
కన్నీరు పైటతో నొత్తి
గట్టిగా కౌగిలించినది.


కన్నతల్లిని కౌగిలించి
గళమెత్తి రోదించె సాధ్వి
అనుగుబిడ్డను బుజ్డగించి
తనవెంట గొనిపోయె పృధ్వి

"సీతా" "సీతా" "సీతా"
శ్రీరాముని కంఠధ్వని!
"మాతా" "మాతా" "మాతా"
పాతాళమున ప్రతిధ్వని!


'కరుణ శ్రీ' అంటారు 'అరుణ రేఖలు' అనే తన ఉపోద్ఘాతంలో
"భగవంతుడు కరుణామయుడు.సృష్టి కరుణామయం.
జీవితం కరుణామయం.ప్రపంచం కరుణలో పుట్టి కరుణలో
పెరిగి కరుణలోనే విలీనమౌతుంది." అని.

ఈ కవితను గురించి పీఠిక లో ఇలా అన్నారు.
"సీత" ఒక చిరు సంగీత రూపకము,తెలుగు వారికి వాల్మీకి
రామాయణ కథ సుపరిచితమైనను కవితా మాధుర్యము మాత్రము సుదూరము.
వాల్మీకి రామాయణము లోని ఐతిహాసిక సౌలభ్యము,సాహితీ సారళ్యము,
ఉపమాన ప్రయోగ కౌశల్యము ఈ "సీత"అనే ఖండకావ్యములోనికి కొంతమేర
అవతరింప జేయగలిగినాడు కవి.'ఆకారం దాల్చిన లోకైక శోకగీతిక వలె-
భగీరథుని రథం వెనుక ప్రవహించే సురనది వలె- ధర్మంతో దయలాగున
వాల్మీకి మహర్షి వెంట వైదేహి వెడలి వచ్చినది.
శ్రీమద్రామాయణ మహాకావ్యము ఇక్షురస మహోదధి అయితే ఈ "సీత"
ఖండకృతి పంచదార స్ఫటికమాలిక.--

నాకెంతో యిష్టమయిన ఈ "సీత" మీకందరికీ కూడా నచ్చుతుంది. నా
చిన్నతనంలో రేడియో లో సంగీత రూపకం గా వచ్చేవుంటుంది.నాకు వినే అవకాశం
దక్కలేదు.ఎవరి దగ్గరైనా ఈ సంగీత రూపకం ఉండి ఉంటే అది వినగలిగే
అదృష్టం కలిగితే---???

4 comments

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks