నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

Showing posts with label తాళ్ళపాక పెద తిరుమలాచార్యులు శృంగార సంకీర్తనలు. Show all posts
Showing posts with label తాళ్ళపాక పెద తిరుమలాచార్యులు శృంగార సంకీర్తనలు. Show all posts

Nov 13, 2008

ముయికి ముయాయ నిదే ముచ్చట లిద్దరికిని

శంకరాభరణం
ముయికి ముయాయ నిదే ముచ్చట లిద్దరికిని
నయముల మీ యెడకు నవ్వు లేమి నవ్వము IIపల్లవిII

చింతాజలధిలోన చెలి పవళించె నాడ
పంతమునఁ బాలవెల్లిఁ బవళించితివి నీవు
వంతునకు వంతాయ వగవఁగాఁ బనిలేదు
యెంతకెంత యిఁక మీతో యెడమాట లాడము. IIముయికిII

విరహానలములోన వెలఁదికి నిరవాయ
అరిది రవిమండల మదే నీకు నిరవాయ
సరికి సరి యాయ మిమ్ము సాధింపఁ బనిలేదు
తరమిడి నిక మిమ్ము తగుఁ దగ దనము. IIముయికిII

రచనల యింతి మనోరథములకొండ లెక్కె
నిచట శ్రీవేంకటాద్రి యెక్కితి వీవు
పచరించ సమరతిబంధము లిద్దరి కాయ
యెచటా దేవుఁడవు నిన్ను యెన్నడును దూరము. IIముయికిII ౧౭-౨౬౩


ముయికి ముయి
తరమిడి
రచనల
పచరించ

0 comments

Nov 12, 2008

ఒకపరి కొకపరి కొయ్యారమై

Get this widget | Track details | eSnips Social DNA


శ్రీరాగం
ఒకపరి కొకపరి కొయ్యారమై
మొకమునఁ గళలెల్లా మొలచిన ట్లుండె IIపల్లవిII

జగదేకపతిమేనఁ జల్లిన కర్పూరధూళి
జిగిగొని నలువంకఁ జిందగాను
మొగిఁ జంద్రముఖి నురమున నిలిపెఁ గనక
పొగరువెన్నెల దీగఁబోసిన ట్లుండె. IIఒకII

పొరి మెఱుఁగుఁజెక్కులఁ బూసిన తట్టు పుణుఁగు
కరఁగి యిరుదెసలఁ గారగాను
కరిగమనవిభుఁడు గనక మోహమదము
తొరిగి సామజసిరి దొలఁకిన ట్లుండె. IIఒకII

మెఱయ శ్రీవేంకటేశుమేన సింగారముగాను
తఱచయిన సొమ్ములు ధరియించఁగా
మెఱుఁగుఁబోణి యలమేలుమంగయుఁ దాను
మెఱపుమేఘము గూడి మెఱసిన ట్లుండె.IIఒకII౧౭-౪౮౫

0 comments

Nov 11, 2008

మాతో దాఁచే వింకా మగువరో యిఁకనేలే

శంకరాభరణం
మాతో దాఁచే వింకా మగువరో యిఁకనేలే
యీతలి ఆతలి ముచ్చట యిరవులు దెలిపెడిని IIపల్లవిII

చెక్కునఁ బెట్టిన చేయిని చెలిపై నొరగిన మేనును
ముక్కునఁ బెట్టిన వేలును మోహము దెలిపెడిని
తొక్కెడి పాదపు వ్రాఁతల తొడిఁబడ జారిన తురుమును
వెక్కసమగు నిట్టూర్పులు విరహము దెలిపెడిని. IIమాతోII

రెప్పలు వేయనిచూపులు రేసుల వాడిన మోవియు
అప్పసమగు పెంజెమటలు ఆసలు దెలిపెడిని
యెప్పుడు నేకాంతంబులు యెక్కువలగు పరవశములు
తిప్పఁగరాని పరాకులు తెగువలు దెలిపెడిని. IIమాతోII

మోమున నిండిన కళలును మోనపు సెలవుల నవ్వులు
కామించిన సంభోగపు కత లివె తెలిపెడిని
దోమటి దొడికెడి సిగ్గులు తోరపు సంతోషంబుల
కోమలి శ్రీవేంకటపతికూటమి దెలిపెడిని. IIమాతోII ౧౭-౩౫౭

అన్నమయ్య కీర్తనల సంకీర్తన లక్షణం గురించిన వివరాలేమీ నాకు తెలియదు.కాని ఈకీర్తన నడక లోని తూగు నాకెంతో ఇష్టం.ఇదే లయతో ఉన్న సంకీర్తనలు అన్నమయ్య వ్రాసినవి కూడా చాలా ఉన్నాయి.ఈ కీర్తన తాలూకూ ఛందో వివరణ ఎవరైనా చెప్పగలిగితే ఎంత బావుణ్ణు.

నరసింహ బ్లాగులో పోస్టుచేస్తున్నవాటిలో ఇది 100 వ పోస్టు.అప్పుడే 100 పూర్తయినాయనే సంతోషం మీ అందరితో పంచుకోవాలన్పించింది.

0 comments

Jun 20, 2008

అంపఁగల వెల్లా నంపె నతనిరాకకుఁ జెలి

రామక్రియ

అంపఁగల వెల్లా నంపె నతనిరాకకుఁ జెలి
చెంపజాఱుఁదురుముల చిఱునవ్వు లంపె IIపల్లవిII

కాంతఁ దనరమణునికడకుఁ జెలియ నంపె
వింతకనుచూపులు వెంటనే యంపె
మంతనాన నెదురుగా మనోరథము లంపె
పంతపుఁ గన్నీట యర్ఘ్యపాద్యము లంపె IIఅంపII

పిలిచి తెమ్మని పతిపేరిట లేఖ లంపె
వెలిఁ దనయడుగులు వెంటనే యంపె
నెలవయి వేగిరాన నిట్టూర్పుగాలి నంపె
అలర నాందోళపు టందలము లంపె IIఅంపII

కౌఁగిటికిఁ గరములఁ గైకోలు వీడె మంపె
నీఁగిన గొరిచంద్రుల వెంటనే యంపె
రాఁగి శ్రీవేంటపతి రతిఁ గూడి యీ చెలి
లోఁగిన సిగ్గుల నెల్లా లోలోనే యంపె IIఅంపII

పంపించ గలిగిన వాటినెల్లా చెలియె తన రమణుని రాక కోరి ఎదురుగా పంపించినదట. చెంపను జారే కొప్పున ముడిచిన (పూవుల) చిఱుత నవ్వులను పంపినదట.
కాంత తన ప్రియుని దగ్గరకు చెలికత్తెను పంపినది. ఆ వెంటనే వింత కనుచూపులను పంపినది.
రహస్యముగా తన మనోరథములను ఎదురుగా పంపినది. పౌరుషముతో కూడిన కన్నీటితో అర్ఘ్యపాద్యములను(పూజ కొరకు ఉపయోగించు నీరు ) పంపించింది.
పిలచికొని తెమ్మని పతి పేరు మీదుగా లేఖలను పంపించినది. బయలులో తన అడుగులను వెంటనే పంపినది.
ఉన్నచోటునుండి త్వరితంగా తన నిట్టూర్పుగాలిని పంపినది.సంతోషముతో ఊగులాడే పల్లకీని పంపినది.
కౌగిలికంగీకరిస్తున్న చేతులతో తాంబూలమంపినది.చలించుచున్న గొరిచంద్రుల(?) ను వెంటనే పంపినది.
అనురాగముతో యీ చెలి శ్రీవేంకటపతిని రతిగూడి లోకువైనసిగ్గులను లోలోనే పంపినది.

0 comments

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks