నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

Showing posts with label శశాంక విజయము. Show all posts
Showing posts with label శశాంక విజయము. Show all posts

Oct 6, 2009

అరసి విశుద్ధ శబ్దములు, నర్థములున్, ధ్వనివైభవం, బలం కరణము, రీతివృత్తులును, గల్పన, పాకము, శయ్యయు,

శశాంక విజయము - శేషము వేంకటపతి
చంద్రుని బృహస్పతి సకల విద్యా పారంగతునిగా చేయుట.
చ.
అరసి విశుద్ధ శబ్దములు, నర్థములున్, ధ్వనివైభవం, బలం
కరణము, రీతివృత్తులును, గల్పన, పాకము, శయ్యయు, న్రస
స్ఫురణము, దోషదూరత, యచుంబిత భావము లొప్పఁ, జిత్ర వి
స్తర మధు రాశు లీలఁ గవితల్ రచియింపఁగ నేర్చె నంతటన్. 54
క.
అంగనల సొక్కు మందులు,
సంగీతము, భరతశాస్త్ర సరణియు విద్యా
సంగతు లగు గంధర్వుల
సంగతి న మ్మేటి నయ మెసంగఁగ నేర్చెన్. 55
క.
అఱువది నాలుగు విద్యల
నఱు పది, యఱ పది మొగంబు లయ్య నుతింపన్
సురగురుని కరుణఁ జిర భా
సుర గురు నియతిన్ , సుబుద్ధి సోముఁడు నేర్చెన్. 56
ఇన్ని విద్యలను సురగురుని కరుణతో చంద్రుడు నేర్చుకున్నాడట. తరవాత ఏం జరిగిందంటే -----------

0 comments

Sep 28, 2009

ఆఱని దివ్వె, యక్షయమహానిధి చూపు నవాంజనంబు, నూ రూరికి వచ్చి తోడుపడ నోపిన బంధుఁడు,

శశాంక విజయము
అత్రి ముని గావించిన విద్యా ప్రశంస
చ.

చదువునఁ బ్రజ్ఞ, దాన సరసజ్ఞత, యందునఁ గార్యఖడ్గ కో
విదతయు, దానఁజేసి ప్రతివీర నృపాల జయంబు, వానిచే
పదనుగ మీఱు సంపదలు, నందునఁ ద్యాగము భోగ, మందుచేఁ
బదపడి కీర్తి, దాన ననపాయ పదంబును గల్గు నెంచగన్. 35
ఉ.
ఆఱని దివ్వె, యక్షయమహానిధి చూపు నవాంజనంబు, నూ
రూరికి వచ్చి తోడుపడ నోపిన బంధుఁడు, జ్ఞాతి వర్గము
ల్గోరని సొమ్ము, దేవ నర లోక వశీకర ణౌషదం, బసా
ధారణ మైన విద్య, వసుధ న్నుతియింప వశంబె యేరికిన్ ? 36
క.
చెఱకునకుఁ బండు, పసిఁడికిఁ
బరిమళమును జిత్తమునకుఁ బ్రాణంబును, దా
నరుదుగఁ గల్గిన రీతిని;
నరపతులకు విద్య గలిగిన న్నలు వెసఁగున్. 37
ఈ పద్యాలు చదువుతుంటే భర్తృహరి సుభాషితాలు గుర్తుకొస్తున్నాయి నాకు.
ముఖ్యంగా ఏనుగు లక్ష్మణ కవిగారి పద్యాలు
శ్లో!!
విద్యానామ నరస్య రూపమధికం ప్రచ్ఛన్నగుప్తం ధనం!
విద్యా భోగకరీ యశస్సుఖకరీ విద్యాగురూణాం గురుః!
విద్యా బంధుజనో విదేశగమనే విద్యా పరం లోచనం!
విద్యా రాజసుపూజ్యతే నహి ధనం విద్యావిహీనః పశుః!! భర్తృహరి.నీతి.16.

ఉ.
విద్య నిగూఢగుప్త మగు విత్తము రూపము పూరుషాళికిన్
విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశబంధుఁడున్
విద్య విశిష్టదైవతము విద్యకు సాటి ధనంబు లే దిలన్
విద్య నృపాలపూజితము విద్య నెఱుంగనివాఁజు మర్త్యుడే.
ఏనుగు లక్ష్మణ కవి

మానవులకు విద్యయే సౌందర్యము;అదియే గుప్త ధనము; చదువే కీర్తిని,సుఖమును,భోగమును కలిగించును; విద్యయే గురువులకు గురువైనది; విదేశములకు పోయినపుడు విద్యయే బంధువు; అదియే మరొక కన్నువంటిది; రాజసభలలో పూజార్హత విద్యకే గాని ధనమునకు గాదు. ఇంతటి శ్రేష్ఠమైన విద్య లేని నరుడు వింతపశువు మాత్రమే.
ఇదే కాకుండా ఇంకా
విద్య యొసగును వినయంబు,
వినయంబునను బడయు పాత్రత,
పాత్రత వలని ధనంబు, దాని వలన
ఐహికాముష్మిక సుఖంబు లందు నరుండు.

0 comments

Sep 22, 2009

కర్ణాట కామినీ కర్ణావతంసిత కర్ణి కార పరాగ గణము రాల్చి

ప్రతిష్ఠానపురం లోని పుష్పలావికలు
సీ.

కర్ణాట కామినీ కర్ణావతంసిత
కర్ణి కార పరాగ గణము రాల్చి
మధు రాధ రాచర ల్మధురాధరా పున
ర్మిధువ నోత్సాహము ల్నిగుడఁ జేసి,
కుంత లాంచ దరాళ కుంత లాగరుగంధి
కుంత లామోదము ల్కొల్ల లాడి,
లాట శుద్ధాంత లలాట ఘర్మాంబు లీ
లాటన క్రియలఁ బాయంగఁ ద్రోసి,
గీ.
నలిన కువలయ నవ లయ నటన పటిమ
చలిత లలితవ దళికుల కలకల కల
వితత గతి కృతి చతురత వెలసి సొలసి,
విసరు మరు దంకురంబు ల వ్వీట నెపుడు. 28

చ.
"కలువల కేమి ? నీ విపుడు కన్గొనినంతనె తెప్ప తెప్పలౌ,
నలినము లెన్ని రావు లలనామణి ! నీ విటు మోము ద్రిప్పినన్ ?
వలసిన సంపెగ ల్గలుగవా మఱి నీ మెయి చాయ దాయ ? " నం
చెలమి విటాళి పల్క , విరు లిత్తురు నప్పురిఁ బుష్పలావికల్. 29

0 comments

చారు చిరత్న రత్నమయ సౌధముల న్బురి వైశ్య కన్యకల్ గీరనగింజ లాడు తఱిఁ,

ప్రతిష్ఠాన పుర వర్ణన -శశాంక విజయముఉ.

చారు చిరత్న రత్నమయ సౌధముల న్బురి వైశ్య కన్యకల్
గీరనగింజ లాడు తఱిఁ, గ్రిందను జిందిన దివ్య రత్నముల్
పౌరులు ద్రొక్కుచు న్జనఁగఁ బాదుకొన న్ధరణీ పురంధ్రికిన్
వారక రత్నగర్భ యను నామముఁ బెట్టిరి సత్కవీశ్వరుల్. 19

భూమికి రత్నగర్భ అనే పేరు అలావచ్చిందట.

0 comments

Sep 21, 2009

కలువల చెలికాడు, కళల కెల్లను వీడు, నెత్తమ్మి నేస్తకానికిని జోడు,

బాలచంద్రుని అందచందములు
అత్రి మహామునికీ అనసూయాదేవికీ త్రిమూర్త్యంశమున ముగ్గురు పుత్త్రులు - దత్తాత్రేయుడు, దూర్వాస మహాముని, చంద్రుడు పుడతారు. వారిలో కనిష్టుడైన బాలచంద్రుని అందచందాల్ని ఈ విధంగా వర్ణిస్తాడు వేంకటపతి కవి.
సీ.

కలువల చెలికాడు, కళల కెల్లను వీడు,
నెత్తమ్మి నేస్తకానికిని జోడు,
రాతిరి యెకిమీడు, జోతి యుండెడువాఁడు,
మగువలఁ దమిఁగొల్పు మాయలాఁడు,
జక్కవ గమి సూడు, చక్కని వగకాఁడు,
చిమ్మచీకటిఁ జిమ్ము ద్రిమ్మరీడు,
మరుని వజీరుఁడు, నెఱనీటు గలవాఁ,డు
ముద్దుగుమ్మల మొగమ్ములకు నీడు,
గీ.
అంకమున జింకఁ దాల్చిన యందకాఁడు,
అంబుజాక్షుని మోహంపు టన్నుతోడు,
స ద్ద్విజన్ములఁ బ్రోచు వజ్రంపు జోడు,
కలికితనమున మెఱయు చుక్కలకు ఱేఁడు. 38
కం.
సుద్దులచే బుద్దులచే 
ముద్దులచేఁ దల్లి దండ్రి ముద మలరంగాఁ 
దద్దయుఁ ద ద్దయ నెసఁగెను
ప్రొద్దుకుఁ బ్రొద్దుకును నింత పోణిమి మీఱన్.39






0 comments

భుజములు తమ్మి తూండ్లు, కను బొమ్మలు సింగిణి విండ్లు, చన్ను ల క్కజపుఁ బసిండి గిండ్లు,


శశాంక విజయము - శేషము వేంకటపతి

చ.
భుజములు తమ్మి తూండ్లు, కను బొమ్మలు సింగిణి విండ్లు, చన్ను ల
క్కజపుఁ బసిండి గిండ్లు, తెలి గన్నులు శ్రీసతి యిండ్లు, వాతెరల్ 
నిజముగ దొండపండ్లు,రమణీయ కటి ద్వయి పైడి బండ్లు, కా
యజు విరి కల్వ చెండ్లు, పురమందలి క్రొవ్విరి బోండ్లు చూడగన్. 21

ప్రతిష్ఠాన పురం లోని క్రొవ్విరి బోండ్ల వర్ణన యిది. ఎంతందంగా ఉందో చూడండి.

0 comments

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks