నలకూబర మణిగ్రీవులు చేసిన కృష్ణ స్తుతి
శా.
నీ పద్యావళు లాలకించు చెవులున్ ని న్నాడు వాక్యంబులున్
నీపేరం బనిసేయు హస్తయుగమున్ నీ మూర్తిపైఁ జూపులున్
నీ పాదంబులపొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపైఁ జిత్తముల్
నీపై బుద్ధులు మాకు నిమ్ము నీరేజపత్రేక్షణా!
గోపికలతో శ్రీకృష్ణుడు బంతి చల్దులు గుడుచుట
ఉ.
ఎన్నఁడు నైన యోగివిభు లెవ్వని పాదపరాగ మింతయున్
గన్నులఁ గాన రట్టిహరిఁ గౌఁగిటఁ జేర్చుచుఁ జెట్ట బట్టుచున్
దన్నుచు గ్రుద్దుచు న్నగుచుఁ దద్దయుఁ బై పడి కూడి యాడుచున్
మన్నన సేయు వల్లవ కుమారుల భాగ్యము లింత యొప్పునే.
క.
ప్రియురాలివలని వార్తలు, ప్రియజనులకు నెల్ల ప్రొద్దుఁ బ్రియ మగు భంగిన్
బ్రియుఁ డగు హరిచరితంబులు, ప్రియభక్తుల కెల్ల యెడలఁ బ్రియములు గావే.
మళ్ళీ వృత్యనుప్రాసే.
మ.
కనియెం గృష్ణుఁడు సాధునీరము మహా గంభీరముం బద్మ కో
కనద స్వాదు వినోద మోద మద భృంగ ద్వంద్వ ఝంకారమున్
ఘన కల్లోల లతావితాన విహర త్కాదంబ కోలాహల
స్వన విస్ఫారము మందవాయుజ కణాసారంబుఁ గాసారమున్.
ఎక్కడ ఎప్పుడు ఏ కాసారాన్ని వర్ణించ వలసొచ్చినా పోతన గారికి ఈ విధమైన వృత్యను ప్రాసాలంకారము గబగబా అలా అలా దొర్లుకుంటూ వచ్చేస్తుంటుంది.ఆయన గారికదంటే అంత ఇష్టమనుకుంటా.
గోపాలురతో చల్దులారగించుట
సీ.
మాటిమాటికి వ్రేలు మడిచి యూరించుచు నూరుఁగాయలు దినుచుండు నొక్కఁ
డొకని కంచములోని దొడిసి చయ్యన మ్రింగు చూడు లేదని నోరు సూపు నొక్కఁ
డేగు రార్గుర చల్దు లెలమిఁ బన్నిదమాడి కూర్కొని కూర్కొని కుడుచు నొక్కఁ
డిన్నియుఁ దగఁ బంచి యిడుట నెచ్చలితన మనుచు బంతెనగుండు లాడు నొకడు
ఆ.
కృష్ణుఁ జూడు మనుచుఁ గికురించి పరు మ్రోలి
మేలి భక్ష్యరాశి మెసఁగు నొకఁడు
నవ్వు నొకఁడు సఖుల నవ్వించు నొక్కఁడు
ముచ్చటాడు నొకఁడు మురియు నొకఁడు.
పిల్లల సరదా సరదా ఆటలు ఎంత బాగా వర్ణించారో కదా.
వ.అయ్యవసరంబున.
సీ.
కడుపున దిండుగాఁ గట్టిన వలువలో లాలిత వంశనాళంబుఁ జొనిపి
విమల శృంగంబును వేత్రదండంబును జాఱి రానీక డాచంక నిఱికి
మీఁగడపెరుఁగుతో మేళవించిన చల్దిముద్ద డాపలిచేత మొనయ నునిచి
చెలరేఁగి కొసరి తెచ్చిన యూరుఁగాయలు వ్రేళ్ళసందులను దా వెలయ నిఱికి
ఆ.
సంగడీల నడుమఁ జక్కనఁ గూర్చుండి
నర్మభాషణములు నగవు నెఱపి
యాగభోక్త కృష్ణుఁ డమరులు వెఱఁగంద
శైశవంబు మెఱసి చల్ది గుడిచె.
ఆ కృష్ణుని రూపాన్ని మన కళ్ళకు కట్టేలా చేస్తారాయన.
పోతన గారు వ్రాసిన యీ ఘట్టం కరుణశ్రీగారి చేత కూడా అందమైన పద్యాలను వ్రాయించింది.
Jan 13, 2009
శ్రీమహాభాగవతము-దశమ స్కంధము
Posted by
Unknown
Subscribe to:
Post Comments (Atom)
3 comments:
నరసింహగారు,
మంచి పద్యాలని బుద్ధిపుట్టినప్పుడల్లా హాయిగా చదువుకోడానికి ఇక్కడ పెడుతున్నందుకు నెనరులు. జీవితాన్ని అనుభవించి దాన్ని కవిత్వంలో ప్రతిఫలించ గలిగినప్పుడే ఇలాంటి అందమైన వర్ణనలు వస్తాయి. కేవలం సంస్కృతం నుంచి ముక్కస్య ముక్కహ అని అనువదించేస్తే అందులో జీవం ఎక్కడుంటుంది?
పోతన అనుప్రాసలకి ప్రేరణ, మార్గదర్శకమూ అయ్యింది నాచన సోమన పద్యాలు.
మీ ప్రతిస్పందనకి నా కృతజ్ఞతలు.బేతవోలు రామబ్రహ్మం గారు కూడా వారి పద్యకవితా పరిచయం పుస్తకంలో పోతన గారి గురించి ఇదే విషయాన్ని తెలియజేసారు.
నాచన సోముని హరివంశం చదివే భాగ్యం నాకు ఇంతవరకూ కలగలేదు.తొందరలో అవకాశాన్ని దొరకపుచ్చుకొని పుస్తకం సంపాదించి చదివే ప్రయత్నం చెయ్యాలి.
idi vinandi:
http://annamacharya-lyrics.blogspot.com/2010/08/715achchapurala-yamunalopala.html
Post a Comment