నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

Jan 9, 2009

శ్రీమహాభాగవతము-దశమస్కంధము

గోపికలు యశోదతో శ్రీకృష్ణుని దుడుకుచేతలను గురించి చెప్పేఘట్టంలోనివి.
క.
ఆడం జని మీఁగడ పెరుఁ, గోడక మీ సుతుఁడు త్రావి యొకయించుక తాఁ
గోడలి మూఁతిం జరిమినఁ,గోడలు మ్రుచ్చనుచు నత్త కొట్టె లతాంగీ!

క.
వా రిల్లు సొచ్చి కడవలఁ, దోరంబుగ నెయ్యి త్రావి తుది నా కడవల్
వీ రింటను నీ సుతుఁ డిడ, వారికి వీరికిని దొడ్డ వా దయ్యె సతీ!


క.
వెన్నఁ దినఁగ బొడగని మా, పిన్నది యడ్డంబు వచ్చి పిఱిఁదికిఁ దీయన్
జ న్నొడిసి పట్టి చీరెను, జిన్నికుమారుండె యితఁను శీతాంశుముఖీ!


క.
చేబంతి తప్పిపడెనని, ప్రాబల్యముతోడ వచ్చి భవనము వెనుకన్
మా బిడ్డ జలకమాడఁగ, నీ బిడ్డఁడు వలువఁ దెచ్చె నెలఁతుక తగునే!

క.
కొడుకులు లేరని యొకసతి, కడు వగవగఁ దన్ను మగనిఁగాఁ గై కొనిన్
గొడుకులు గలిగెద రని పైఁ, బడినాఁ డిది వినుము శిశువు పనులే తల్లీ!


క.
తలఁగినదానం దల మనఁ, దలఁగక నే దలఁగ నంచుఁ దగఁ బల్కుచు నీ
తలఁగినచో టెయ్యది యని, తల యూఁచెన్ నీ సుతుండు తగవె మృగాక్షీ!

తలఁగినదానం=బహిస్టుగా వున్నదానను
క.
వ్రాలఁగ వచ్చిన నీ సతి, చూలాలం దలఁగు మనిన, జూ లగుటకు నే
మూలంబు చెప్పు మనె నీ, బాలుఁడు చెప్పుదురె సతులు పర్వేందుముఖీ!

క.
మగువా నీ కొమరుడు మా, మగవా రటు వోవఁ జూచి మంతనమునకున్
దగఁ జీరి పొందు నడిగెను, జగముల ము న్నిట్టి శిశువు చదువంబడెనే!

క.
నా కొడుకును నా కోడలు, నేకతమునఁ బెనఁగఁ బాము నీతఁడు వై వం
గోక లెఱుంగక పాఱినఁ, గూఁక లిడె న్నీ సుతుండు గుణమె గుణాఢ్యా!


క.
కడు లచ్చి గలిగెనేనియుఁ, గుడుతురు గట్టుదురు గాక కొడుకుల నగుచున్
బడుగుల వాడలపైఁ బడ, విడుతురె రాకాంత లెందు విమలేందుముఖీ!

క.
ఓ యమ్మ! నీ కుమారుఁడు, మా యిండ్లను పాలు పెరుఁగు మననీఁ డమ్మా!
పోయెద మెక్కడి కైనను, మా యన్నల సురభు లాన మంజులవాణీ!

క.
చన్ను విడిచి చనఁ డిట్టటు, నెన్నఁడు బొరుగిండ్ల త్రోవ లెఱుఁగడు నేఁడుం
గన్నులు తెఱవని మా యీ, చిన్ని కుమారకుని ఱవ్వసేయం దగునే.

తే.
అన్య మెఱుఁగడు తనయంత నాడుచుండు
మంచివాఁ డితఁ డెగ్గులు మానరమ్మ!
రామలార! త్రిలోకాభిరామలార!
తల్లులార! గుణవతీమతల్లులార!

0 comments:

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks