నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

Jan 11, 2009

శ్రీమహాభాగవతము-దశమస్కంధము

దధిభాండ వికలనాదులు - యశోద కృష్ణుని వెంట పరిగెత్తడం.
మ.
కని చేతన్ సెలగోల వట్టికొనుచున్ గానిమ్ము కానిమ్ము రా
తనయా! యెవ్వరియందుఁ జిక్కువడ నే దండంబునుం గాన నే
వినివారంబును బొంద నే వెఱపు నే విభ్రాంతియుం జెంద ము
న్ననియో నీ విటు నన్నుఁ గై కెనవు నే డారీతి సిద్ధించునే.


ఏవినివారంబును=?

అని అదలిస్తూ కొడుకు నడవడిని తలచి యశోద తనలో తాను--

సీ.
బాలుఁ డీతం డని భావింతు నందునా యే పెద్దలును నేర రీ క్రమంబు
వెఱ పెఱుంగుటకు నై వెఱపింతు నందునా కలిగి లే కొక్కఁడు గాని లేఁడు
వెఱపుతో నాబుద్ధి వినిపింతు నందునా తనుదాన యై బుద్ధి తప్పకుండు
నొం డెఱుంగక యింట నుండెడి నందునా చొచ్చి చూడని దొకచోటు లేదు

ఆ.
తన్ను నెవ్వరైనఁ దలపోయఁ బాఱెడు
నోజ లేదు భీతి యొక టెఱుంగఁ
డెలమి నూరకుండఁ డెకసెక్కెముల నాడుఁ
బట్టి శాస్తి చేయు భంగి యెట్లు?

వ.అని వితర్కించి,
క.
లాలనమున బహుదోషము, లోలిం బ్రాపించుఁ దాడనోపాయములం
జాల గుణంబులు గలుగును, బాలుర కును దాడనంబ పథ్యం బరయన్.


పిల్లలను అతిగా గారాబం చేస్తే చెడిపోతారు.అప్పుడపుడూ ఓటి రెండిచ్చుకుంటుంటేనే దారిలో పడతారు.బాలురకు తాడనమే(ఓ రెండిచ్చుకోవడం)పథ్యమైం దనుకుందటా యిల్లాలు మనందరిలాగానే.అలా అనుకుని చేతనున్న కోలతో జళిపించి నిలు నిలు అంటూ
వెంటబడితే ఱోలు మీదనుంచి కిందకుఱికి
క.
గజ్జెలు ఘల్లని మ్రోయఁగ,నజ్జలు ద్రొక్కుటలు మాని యతి జవమున యో
షిజ్జనములు నగఁ దల్లియుఁ, బజ్జం జనుదేర నతఁడు పరువిడె నధిపా!

అజ్జలు= పాదములు
యోషిజ్జనములు=స్త్రీసమూహము
పజ్జ=దగ్గఱ
మ.
స్తనభారంబున డస్సి క్రుస్సి యస దై జవ్వాడు మధ్యంబుతో
జనిత స్వేదముతోఁ జలత్కబరితో స్రస్తోత్తరీయంబుతో
వనజాతేక్షణ కూడఁ బాఱి తిరిగెన్ వారించుచున్ వాకిటన్
ఘన యోగీంద్రమనంబులన్ వెనుకొనంగా లేని లీలారతున్.


స్తనముల బరువుతో అలసి కృశించి సన్ననై జవ్వాడే నడుముతో, పట్టిన చెమటతో,ఊడిపోతున్న కొప్పుతో,చెదరిన వల్లెవాటుతో- పద్మాల్లాంటి కనులు గలిగిన యశోద వాకిట్లో కృష్ణుని వారిస్తూ కూడా పరిగెట్టిందట- ఘనయోగీంద్రుల మనస్సులలో కూడా చిక్కని లీలారతుని పట్టుకోవాలనే ప్రయత్నంలో.
వ.ఇట్లు కూడం జని,
సీ.
స్తంభాదికంబులు దనకు నడ్డం బైన నిట్టటు చని పట్టనీనివాని
నీ తప్పు సైరింపు మింక దొంగిలఁబోవ నేనని మునుముట్ట నేడ్చువానిఁ
గాటుక నెఱయంగఁ గన్నులు నులుముచు వెడలు కన్నీటితో వెగచువాని
నేదెస వచ్చునో యిది యని పలుమాఱు నురుఁగుచుఁ గ్రేఁగంటఁ జూచువాని

ఆ.
గూడఁబాఱి పట్టుకొని వెఱపించుచుఁ
జిన్ని వెన్నదొంగ చిక్కె ననుచు
నలిగి కొట్టఁ జేతు లాడక పూఁబోణి
కరుణతోడ బాలుఁ గట్టఁ దలచి.


మన పిల్లలందరితోనూ ప్రతి తల్లికీ కలిగే అనుభవమే ఎంత అందంగానూ హృద్యం గానూ వర్ణించారో చూడండి పోతన గారు.

క.
వీ రెవ్వరు శ్రీకృష్ణులు, గారా ! యెన్నఁడును వెన్న గానరఁట కదా
చోరత్వం బించుకయును, నేరరఁట,ధరిత్రి నిట్టి నియతులుఁ గలరే.

క.
పట్టినఁ బట్టుపడని నినుఁ, బట్టెద మని చలము కొనినఁ బట్టుట బెట్టే
పట్టువడ వండ్రు పట్టీ, పట్టుకొనన్ నాకుఁ గాక పరులకు వశమే.


క.
ఆ లలన గట్టె ఱోలన్, లీలన్ నవనీత చౌర్యలీలుం బ్రియవా
గ్జాలున్ బరివిస్మిత గో, పాలున్ ముక్తాలలామ ఫాలున్ బాలున్.

క.
చిక్కఁడు సిరి కౌఁగిటిలోఁ,జిక్కఁడు సనకాది యోగి చిత్తాబ్జములన్
జిక్కఁడు శ్రుతిలతికావళిఁ, జిక్కె నతఁడు లీలఁ దల్లి చేతన్ ఱోలన్.

0 comments:

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks