నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

Dec 30, 2008

శ్రీకైవల్యపదంబుఁ జేరుటకునై చింతించెదన్, లోక ర

బ్లాగ్మిత్రులందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు


భారతీయులకు భారత రామాయణాలు రెండూ రెండు కళ్ళవంటివి.భాగవతం వారి హృదయం,భగవద్గీత వారి ఆత్మ.

హృదయం వంటి భాగవతం లో ప్రత్యేకించి దశమ స్కంధం ఒక్కటీ ఒక ఎత్తు.ఎందుకంటే దేవాదిదేవుడైన శ్రీకృష్ణభగవానుని దివ్యమంగళ లీలా విలాసాలన్నీ సమగ్రంగా సర్వాంగ సుందరంగా ఈ దశమస్కంధంలోనే అభివర్ణితములై ఉన్నాయి.దైవప్రేరణచేతనే అనుకుంటా- దశమస్కంధాన్ని ఓసారి తిరిగి చదవాలనిపించింది.చదువుతూ ఉంటే అందులోని మందార మకరంద మాధుర్యాల్ని మన బ్లాగు మిత్రులతో కలసి పంచుకోవాలని ఆ ఆనందాన్ని పెంచుకోవాలనిన్నీ అనిపించింది.ఆ ప్రేరణే ఈ పోస్టువ్రాయడానికి కారణం.
మన పెద్దలలో చాలా మందికి భాగవతం లోని చాలా పద్యాలు కంఠస్థంగా ఉండేవి.నా చిన్నప్పుడు మా తాతగారు "అలవైకుంఠ పురంబులో", "సిరికిం జెప్పడు", వగైరా పద్యాల్ని అప్పజెపుతుంటే నోరెళ్ళబెట్టుకుని వినటం నాకు ఇప్పటికీ బాగా జ్ఞాపకం. అటువంటి ధారణ కనువైన పద్యాల్ని ఎత్తి వ్రాయాలని,నా బ్లాగు సందర్శకులలో ఏ ఒక్కరైనా అవి చూచి చదివి ప్రేరేపితులై భాగవతం పఠించే కార్యక్రమాన్నిచేపట్టొచ్చునన్న అశతో ఆశయంతో ఇది ప్రారంభిస్తున్నాను.నా కృషి వృధా కాదని నాకు గట్టి నమ్మకం.

శ్రీకైవల్యపదంబుఁ జేరుటకునై చింతించెదన్, లోక ర
క్షైకారంభకు, భక్త పాలన కళా సంరంభకున్, దానవో
ద్రేక స్తంభకుఁ, గేళిలోల విలసుద్దృగ్జాల సంభూత నా
నా కంజాత భవాండ కుంభకు, మహానందాంగనా డింభకున్.


శ్రీమహాభాగవత ప్రారంభంలో పోతన 'మహా నందాంగనా డింభకు'డైన శ్రీకృష్ణుని చరిత్రను "శ్రీకైవల్యపదంబు చేరుటకునై చింతించెదన్" అని చెప్పుకొన్నాడు.మనం కూడా ఆ ప్రయత్నాన్నే కొనసాగిద్దాం.

ఉ.
క్షోణితలంబునన్ నుదురు సోఁకఁగ మ్రొక్కి నుతింతు సైకత
శ్రోణికిఁ జంచరీక చయ సుందరవేణికి రక్షితామర
శ్రేణికిఁ దోయజాతభవ చిత్త వశీకరణైక వాణికిన్
వాణికి నక్షదామ శుక వారిజ పుస్తక రమ్య పాణికిన్.


సరస్వతీ ప్రార్థన చేసి ముందుకు సాగుతూ

ఉ.
అమ్మల గన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ,చాలఁ బె
ద్దమ్మ,సురారులమ్మ కడు పాఱడి వుచ్చిన యమ్మ, దన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ, మా
యమ్మ, కృపాబ్ది యిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్.


ఆదుర్గాదేవిని ప్రసన్నం గావించుకుని--

క.
పలికెడిది భాగవతమఁట!,పలికించు విభుండు రామభద్రుండఁట! నేఁ
బలికిన భవహరమగునఁట!,పలికెద వేరొండు గాథ పలుకఁగ నేలా?


అని సంకల్పించుకొన్నవాడై

ఆ.
భాగవతము దెలిసి పలుకుట చిత్రంబు!, శూలికైనఁ దమ్మి చూలికైన!
విభుదజనుల వలన విన్నంత కన్నంత, దెలియ వచ్చినంత దేటపఱతు.


అని వినయంగా విన్నవించుకొని-

క.
కొందఱకుఁ దెనుఁగు గుణమగుఁ, గొందఱకును సంస్కృతంబు గుణమగు, రెండుం
గొందఱికి గుణములగు నే, నందఱ మెప్పింతుఁ గృతుల నయ్యైయెడలన్.


అని తన భాగవత రచన ఏ విధంగా చేయదలచినదీ ముందుగానే మనకు తెలియపరస్తూ--

మ.
ఒనరన్ నన్నయ తిక్కనాది కవు లీయుర్విం బురాణావళుల్
తెనుఁగుం జేయుచు మత్పురాకృత శుభాధిక్యంబు దా నెట్టిదో
తెనుఁగుం జేయరు మున్ను భాగవతమున్ దీనిం దెనింగించి నా
జననంబున్ సఫలంబుఁ జేసేదఁ బునర్జన్మంబు లేకుండఁగన్.


అని నిశ్చయించి పోతన గారు భాగవత రచనకు ఉపక్రమించారు.

ఈ భాగవతం సాక్షాత్తూ ఓ కల్పవృక్షమే.


లలిత స్కంధము, కృష్ణమూలము, శుకాలాపాభిరామంబు, మం
జులతాశోభితమున్,సువర్ణ సుమన స్సుజ్ఞేయమున్, సుందరో
జ్జ్వలవృత్తంబు, మహాఫలంబు, విమల వ్యాసాలవాలంబునై
వెలయున్ భాగవతాఖ్య తరు వుర్విన్ సద్ద్విజ శ్రేయమై.


ఇటువంటి భాగవతాఖ్య తరువున పండిన తీయని పండ్లు మనం చెప్పుకోబోయే దశమస్కంధం లో మనకి ఎన్నో ఎన్నెన్నో లభిస్తాయి.

పరీక్షితుడు శుకయోగీంద్రుని శ్రీకృష్ణుని చరిత్ర నంతటినీ చెప్పమని కోరతాడు.ఆ విష్ణుకథలెలాటివంటే--


విష్ణు కథా రతుఁ డగు నరు, విష్ణుకథల్ చెప్పు మనుచు వినుచుండు నరున్
విష్ణుకథా సంప్రశ్నము, విష్ణుపదీ జలముభంగి విమలులఁ జేయున్.


ఒకప్పుడు వేలకొలది రాక్షసులతో భూభారము అధికమై ఆ భారాన్ని తగ్గించమని ప్రార్థిస్తూ భూదేవి గోరూపం లో బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళింది.ఆయన భూదేవీ సహితంగా విష్ణువుని చేరి ప్రార్థిస్తాడు.విష్ణువు యాదవకులం లో శ్రీకృష్ణునిగా రాక్షస సంహారం నిమిత్తం తా నవతరిస్తానని చెప్పి వివిధ దేవతలను వారి వారి అంశములతో హరి పూజార్థం భూమిపై పుట్టమని నియోగిస్తాడు.

శూరసేనుడనే యాదవరాజు మథురానగరం రాజధానిగా మథుర,శూరసేన రాజ్యాల్ని పరిపాలిస్తుంటాడు.అతని కొడుకు వసుదేవుడు.ఇతడు దేవకిని పెండ్లియాడి దేవకి అన్న కంసుడు(ఉగ్రసేనరాజు కొడుకు)రథం నడుపుతుండగా తన పట్టణానికి దేవకితో ప్రయాణమై వస్తూ ఉండగా అశరీరవాణి కంసుడి నుద్దేశించి 'దేవకి అష్టమ గర్భజనితుని వలన కంసునికి చావు కలుగుతుం'దని హెచ్చరిస్తుంది.అది విని కంసుడు తన చెల్లెలు దేవకిని కొప్పుపట్టుకుని క్రిందకు ఈడ్చి చంపబోతాడు.అప్పుడు వసుదేవుడు కంసునికి అడ్డుపడి శాంతింపజేస్తూ--

ఉ.
అన్నవు నీవు చెల్లెలికి నక్కట!మాడలు చీరలిచ్చుటో
మన్నన సేయుటో మధుర మంజుల భాషల నాదరించుటో
మిన్నుల మ్రోఁతలే మే లని చంపకుమన్న!మాని రా
వన్న!సహింపు మన్న!తగ దన్న!వధింపకు మన్న! వేఁడెదన్.


అనుప్రాస అలంకారం పోతనగారికెంతో ఇష్టమయినది.

మత్తకోకిల.
వావిఁ జెల్లెలు గాని కూఁతురువంటి దుత్తమురాలు సం
భావనీయచరిత్ర భీరువు బాల నూత్నవివాహ సు
శ్రీవిలాసిని దీన కంపితచిత్త నీ కిదె మ్రోక్కెదన్
గావవే కరుణామయాత్మక! కంస! మానవ వల్లభా!


అని ఎన్నో విధములుగా ప్రార్థించి,

క.
లలనకుఁ బుట్టిన కొమరుని, వలనం దెగె దనుచు గగనవాణి వలికె నం
చలిగెదవేని మృగాక్షికిఁ,గల కొడుకులఁ జంప నిత్తుఁ గ్రమమున నీకున్.


అని వొడబరుస్తాడు.అలా అనటమే కాకుండా మొట్టమొదట కలిగిన బిడ్డని తీసుకువచ్చి కంసునికి ఇస్తాడు.కంసుడు దానికి మెచ్చి తనకు అష్టమ గర్భం వల్లనేకదా మృత్యువు అని వసుదేవుని సత్యసంధతకు మెచ్చి ఆ కొడుకును తిరిగి ఇచ్చివేస్తాడు.

సశేషం

0 comments:

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks