కాళియమర్దనము
ఉ.
ఘోర విషానల ప్రభలు గొబ్బునఁ గ్రమ్మఁగ సర్పసైన్య వి
స్ఫారుఁడు కాళియోరగుఁడు పాఱి వడిన్ గఱచెన్ బయోధరా
కారుఁ బయోవిహారు భయకంప విదూరు మహాగభీరు నా
భీరకుమారు వీరు నవపీత శుభాంబరధారు ధీరునిన్.
చివరలో 'ధీరు' అనే పదం వాడదామని ఆ పదం అందం సంతరించుకోవడం కోసమని అలా అలా రు కారాల్ని తగిలించుకుంటూ పోయా రాయన.అదీ పోతన గారంటే.
క.
విషకుచయుగ యగు రక్కసి
విషకుచ దుగ్ధంబు ద్రావి విషవిజయుఁడ వై
విషరుహలోచన!యద్భుత
విషయుం డగు నీకు సర్పవిషమెక్కెఁ గదా.
ఇది వరలో పోతన చనుఁ బాలు త్రాగే ఘట్టం మరోసారి జ్ఞాపకం చేస్తున్నా రాయన మనకు.
క.
కట్టా! క్రూరభుజంగము, కట్టలుకన్ నిన్నుఁ గఱవఁ గంపించితివో
తిట్టితివో పాపపువిధిఁ,బట్టీ! మముఁ దలచి కాఁక బలవించితివో.
క.
పన్నగము మమ్ముఁ గఱవక, ని న్న్మేటికిఁ గఱచెఁ గుఱ్ఱ! నెమ్మి గలిగి నీ
వున్నను మము రక్షింతువు, నిన్నున్ రక్షింప నేము నేరము తండ్రీ!
సీ.
ఘన యమునానదీ కల్లోల ఘోషంబు సరస మృదంగ ఘోషంబు గాఁ గ
సాధు బృందావన చర చంచరీక గానంబు గాయక సుగానంబు గాఁ గఁ
గలహంస సారస కమనీయ మంజు శబ్దంబులు తాళశబ్దములు గాఁ గఁ
దివినుండి వీక్షించు దివిజ గంధర్వాది జనులు సభాసీన జనులు గాఁ గఁ
తే.
బద్మరాగాది రత్న ప్రభాసమాన
మహిత కాళియఫణి ఫణామంటపమున
నళినలోచన విఖ్యాత నర్తకుండు
నిత్య నైపుణ్యమునఁ బేర్చి నృత్యమాడె.
నాగకాంతలు స్వామిని స్తుతించే ఘట్టంలో--
ఉ.
ఒల్లరు నిర్జరేంద్రపద మొల్లరు బ్రహ్మపదంబు నొందఁగా
నొల్లరు చక్రవర్తి పద మొల్లరు సర్వరసాధిపత్యము
న్నొల్లరు యోగసిద్ధి మఱి యొండు భవంబుల నొంద నీని నీ
సల్లలి తాంఘ్రిరేణువుల సంగతి నొందిన ధన్యు లెప్పుడున్.
ఉ.
నేరము లెన్న నెక్కడివి నేము దలంచు తలంపులందు లో
నేరుపు లున్నవే సుతుల నేరమిఁ దండ్రులు ద్రోచిపుచ్చ రే
నేరము సేయువారి ధరణీపతు లొక్కొకమాటు గావరే
నేరమి గల్గు మద్విభుని నేఁ డిటు గావఁగదే కృపానిధీ!
ఆ.
మమ్ముఁ బెండ్లిసేయు మా ప్రాణవల్లభు
ప్రాణమిచ్చి కావు భక్తవరద!
నీవు సేయు పెండ్లి నిత్యంబు భద్రంబు
పిన్ననాఁటి పెండ్లి పెండ్లి గాదు.
ఇంద్రవజ్రము.
నీ యాన! యెవ్వారిని నిగ్రహింపం
డా యుగ్ర పాపాకృతి నందఁ డింకన్
నీ యాజ్ఞలో నుండెడు నేఁటినుండిన్
మా యీశు ప్రాణంబులు మాకు నీవే.
అని ప్రార్ధించగా కృష్ణుడు కాళీయుని విడిచి పెడతాడు.
Jan 14, 2009
శ్రీమహాభాగవతము-దశమస్కంధము
Posted by
Unknown
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment