అప్పుడు ఆనకదుందుభి(వసుదేవుని ఇంకో పేరు)బిడ్డను తీసుకొని వెళ్ళినా కంసునిపై నమ్మకం లేకుండా ఉంటున్నాడు.
సీ.
ఒకనాడు నారదుం డొయ్యన కంసుని యింటికిఁ జనుదెంచి యేకతమున
'మందలోపల నున్న నందాదులును,వారి భార్యలుఁ బుత్రులు బాంధవులును
దేవకి మొదలగు తెఱవలు వసుదేవుఁడాదిగా గల సర్వ యాదవులును,
సురలు గాని, నిజంబు నరులు గారని చెప్పి 'కంసుండ!వీవు రక్కసుండ వనియు
ఆ.వె.
దేవమయుఁడు చక్రి దేవకీదేవికిఁ, బుత్త్రుఁడై జనించి భూతలంబు
సెఱుపఁ బుట్టినట్టి చెనఁటి దైత్యుల నెల్లఁ, జంపు'ననుచుఁ జెప్పి చనియె దివికి.
ఇలా నారదుడు చెప్పేసరికి కంసుడు కలతచెంది దేవకీవసుదేవులను కారాగారంలో బంధించి వారికి పుట్టిన పిల్లల నందరినీ వరుసగా వధింపసాగాడు.తన తండ్రి శూరసేనుని కూడా కారాగారంలో బంధించి తానే రాజై పరిపాలించ సాగాడు.అప్పుడు పోతన గారంటారు--
ఆ.వె.
తల్లిఁ దండ్రి నైనఁ దమ్ముల నన్నల, సఖుల నైన బంధుజనుల నైన
రాజ్యకాంక్షఁజేసి రాజులు సంపుదు, రవనిఁ దఱచు జీవితార్థు లగుచు.
అలా వరుసగా 6గురు శిశువులను వధించిన తరువాత ఏడవసారి గర్భం ధరించగా శ్రీహరి యోగమాయ ద్వారా ఆ కడుపును వసుదేవుని ఇంకో భార్య(నందగోకులంలో ఉన్న)రోహిణి గర్భం లోనికి మార్పిస్తాడు.దేవకికి గర్భం పోయినదని అందరూ అనుకుంటారు. తరువాత తాను దేవకికి అష్టమ గర్భంగా పుడతానని యోగమాయను యశోదకు కూతురుగా జన్మించమని నియోగిస్తాడు.
ఆ.
బలము మిగులఁ గలుగ బలభద్రుఁ డన లోక
దమణుఁ డగుటఁ జేసి రాముఁ డనఁగ
సతికిఁ బుట్టె గర్భసంకర్షణమున సం
కర్షణుం డనంగ ఘనుఁడు సుతుఁడు.
అలా బలరాముడు పుట్టిన పిదప వసుదేవునివలన దేవకి శ్రీకృష్ణుని తన గర్భంలో ధరిస్తుంది.దేవకికి నెలలు నిండుతున్నపుడు--
సీ.
విమతుల మొగములు వెలవెలఁబాఱంగ విమలాస్య మోము వెల్వెలుకఁ బాఱె
మలయు వైరులకీర్తి మాసి నల్లన గాఁగ నాతి చూచుకములు నల్లనయ్యె
దుష్టాలయంబుల ధూమరేఖలు వుట్ట లేమ యూరున రోమరేఖ మెఱసె
నరిమానసముల నాహారవాంఛలు దప్ప వనజాక్షి కాహారవాంఛ దప్పె
తే.
శ్రమము సంధిల్లె రిపులకు శ్రమము గదుర
జడత వాటిల్లె శత్రులు జడను పడఁగ
మన్ను రుచి యయ్యెఁ బగతురు మన్ను చొరఁగ
వెలఁది యుదరంబులో హరి వృద్ధిఁ బొంద.
అప్పుడు బ్రహ్మాదిదేవతలు దేవకీ గర్భస్థుండైన స్వామిని ఈ విధంగా స్తుతిస్తారు.
మ.
గురు పాఠీనమ వై జలగ్రహమకోలంబ వై వై శ్రీనృకే
సరి వై భిక్షుఁడ వై హయాననుఁడ వై క్ష్మాదేవతా భర్త వై
ధరణీనాథుఁడ వై దయాగుణ గణోదారుండ వై లోకముల్
పరిరక్షించిన నీకు మ్రొక్కెద మిలాభారంబు వారింపవే.
క.
ముచ్చిరి యున్నది లోకము, నిచ్చలుఁ గంసాదిఖలులు నిర్దయు లేచన్
మచ్చికఁ గాఁవగవలయును, విచ్చేయము తల్లి కడుపు వెడలి ముకుందా!
క.
పంకజముఖి నీళ్ళాడను,సంకటపడ ఖలుల మానసంబుల నెల్లన్
సంకటము దోఁచె మెల్లనఁ,సంకటములు లేమి దోచె సత్పురుషులకున్.
దేవతలు పూలవానలు కురిపించు చుండగా దేవదేవుని దేవకీదేవి ప్రసవంచినది.
అప్పుడు--
సీ.
జలధరదేహు నాజాను చతుర్బాహు సరసీరుహాక్షు విశాలవక్షుఁ
జారు గదా శంఖ చక్ర పద్మ విలాసుఁ గంఠ కౌస్తుభమణి కాంతిభాసుఁ
గమనీయ కటిసూత్ర కంకణ కేయూరు శ్రీవత్సలాంఛ నాంచితవిహారు
నురుకుండల ప్రభాయుత కుంతల లలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు
తే.
బాలుఁ బూర్ణేందు రుచిజాలు భక్తలోక
పాలు సుగుణాలవాలుఁ గృపావిశాలుఁ
జూచి తిలకించి పులకించి చోద్యమంది
యుబ్బి చెలరేఁగి వసుదేవుఁ డుత్సహించె.
దేవకీదేవి కూడా స్వామిని గురించి ఈ విధంగా ప్రార్థన చెసింది.
సీ.
అట్టిట్టి దనరాని దై మొద లై నిండుకున్న దై వెలుఁగుచు గుణము లేని
దై యొక్కచందంబు దై కల దై నిర్విశేష మై క్రియ లేక చెప్పరాని
దీ రూప మని శ్రుతు లెప్పుడు నొడివెడి యా రూప మగుచు నధ్యాత్మదీప
మై బ్రహ్మ రెండవ యర్ధంబు తుది జగంబులు నశింపఁగఁ బెద్ద భూతగణము
ఆ.
సూక్ష్మభూతమందుఁ జొరఁగఁ నా భూతంబు
ప్రకృతిలోనఁ జొరఁగఁ బ్రకృతి వోయి
వ్యక్తమందుఁ జొరఁగ వ్యక్త మణంగను
శేషసంజ్ఞ నీవు చెలువ మగుదు.
ఉ.
విశ్వము లీలఁ ద్రిప్పుచు నవిద్యకు జుట్టమ వైన నీకు నా
శాశ్వత మైన కాల మిది సర్వము వేడబ మందు రట్టి వి
శ్వేశ్వర! మేలుకుప్ప! నిను నెప్పుడుఁ గోరి భజించువాఁడె పో
శాశ్వత లక్ష్మి మృత్యుజయ సౌఖ్యయుతుం డభయుండు మాధవా!
మత్తకోకిల.
ఒంటి నిల్చి పురాణయోగులు యోగమార్గ నిరూఢు లై
కంటి మందురు గాని నిక్కము గాన రీ భవదాకృతిన్
గంటి భద్రముఁ గంటి మాంసపుఁ గన్నులం గనఁబోలదీ
తొంటి రూపుఁ దొలంగఁ బెట్టుము తోయజేక్షణ మ్రొక్కెదన్.
ఆ.
విలయకాలమందు విశ్వంబు నీ పెద్ద
కడుపులోనఁ దాఁచు కడిమి మేటి
నటుఁడ వీవు నేఁడు నా గర్భజుఁడ వౌట
పరమపురుష! వేడబంబు గాదె.
తరల.
నళినలోచన! నీవు నిక్కము నాకుఁ బుట్టెద వంచు నీ
ఖలుఁడు కంసుడు పెద్దకాలము కారయింట నడంచె దు
ర్మలినచిత్తుని నాజ్ఞ సేయుము మమ్ముఁ గావుము భీతులన్
నులుసు లేక ఫలించె నోచిన నోము లెల్లను నీవయై.
Dec 31, 2008
గురు పాఠీనమ వై జలగ్రహమకోలంబ వై వై శ్రీనృకే
Posted by
Unknown
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment