శ్రీమద్రామాయణం రామాయణం గురించి వ్రాద్దామనుకుంటుండగా భక్తి టి.వి.లో రామానంద్ సాగర్ గారి తెలుగు రామాయణ ప్రసారం మొదలయ్యింది. రామలక్ష్మణులు శబరి ఆశ్రమాన్నిదర్శించిన ఘట్టం ప్రసారమయ్యింది ఈరోజు. ఇలా ఈ పోస్టు ప్రారంభం కావటం ఓ శుభసూచన గా అన్పిస్తోంది నాకు. రామాయణంలో సుందరకాండ ప్రాముఖ్యం గుఱించి ఎందరెందఱో ఎన్నెన్నో విధాలుగా చెప్తుంటారు. రామాయణ పారాయణాన్ని సుందర కాండతో ప్రారంభించాలని కూడా పెద్దలు చెప్తుంటారు. కాని ఎందువల్లనో తెలియదు 63 యేళ్ళు వచ్చినా కూడా ఇంతవరకూ నాకు సుందరకాండను వినే అదృష్టం కలగలేదు. కాకినాడలో మా స్నేహితుల ఇంటివద్ద శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు సుందర కాండను గుఱించి చెప్తున్నారనితెలిసింది. తెలియటమే కాదు ఆ గృహస్థురాలు మాయింటి ఆడవారికి ఫోనుచేసి నన్ను ఆ కార్యక్రమానికి రమ్మని ఆహ్వానించారు కూడా.అది 5 రోజుల కార్యక్రమం. మొదటి రోజు చివరి రోజు మాత్రమే వెళ్ళగలిగాను.మధ్యలో ఆఫీసు పనిమీద భాగ్యనగరానికి వెళ్ళటం చేత కార్క్రక్రమానికి వెళ్ళలేకపోయాను.చివరిరోజు కార్యక్రమానంతరం ఆయింటివారు అందరికీ గీతాప్రెస్సువారి సుందరకాండ పుస్తకాన్ని ఉచితంగా పంచిపెట్టారు.నాకూ ఓ కాపీ అందింది. దానిలో తెలుగు లిపిలో సంస్కృత శ్లోకం ఒకవైపునా దాని తెలుగు తాత్పర్యం ప్రక్కనే వచ్చేటట్లుగా రెండు వరుసల్లో ప్రింటింగు చేసారు.సంస్కృతం ఈ మధ్యన అధ్యయనం చేయటం ప్రారంభించిన కారణంగా కొంచెం కొంచెం అర్థం అయ్యేది.మొదట్లో రోజుకు ఒక సర్గ కంటె ఎక్కువ చదవలేకపోయేవాడిని. ఇప్పుడు నలభైయ్యోసర్గలో ఉన్నాను.కొంచెం వేగంగానే చదవగలుగుతున్నాను.రోజురోజుకీ చదువుతుంటే ఆనందం పెరుగుతున్నట్లుగా అనిపిస్తున్నది.అది సుందరకాండ మాహాత్మ్యమేమో కూడా నాకు తెలియదు. ఈ మధ్య బ్లాగుల్లోనే ఎక్కడో చదివిన విషయం ఒకటి గుర్తొస్తుంది.అది రామాయణ అనువాదాల గుఱించి.ఎంతోమంది కవులూ పెద్దలూ చాలా కాలంగా రామాయణాన్ని తెలుగులోనికి అనువాదం చేస్తూ వస్తున్నారు.వావిలికొలను సుబ్బారావు గారు మందరం పేరిట, శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రిగారు, వగైరా పండితులు,కవులూ యథావాల్మీకంగా రామాయణాన్నిపద్య గద్యాత్మకంగా అనువదించారు. కవిత్రయంలో ఒకరైన తిక్కనామాత్యుడు కూడా నిర్వచనోత్తర రామాయణాన్ని వ్రాసాడు. అలాగే ఇంకా చాలామంది రామాయణాన్ని తెలుగు చేసారు.రంగనాథ రామాయణం, గోపీనాథం వేంకటకవి గారి గోపీనాథ రామాయణం మొల్లరామాయణం, భాస్కర రామాయణం విశ్వనాథ సత్యనారాయణ గారి రామాయణ కల్పవృక్షం,ఉషశ్రీ రామాయణం ఆదిభట్ల నారాయణ దాసుగారి రామాయణం మొదలైనవి కూడా ఎన్నో ఉన్నాయి. ఆటవెలది రామాయణం, ద్విపద రామాయణం ,మునిపల్లి సుబ్రహ్మణ్య కవిగారి అధ్యాత్మ రామాయణ కీర్తనలు ఇలా ఎన్నో ఎన్నెన్నో రూపాలలో రామాయణం ఆంధ్రీకరించబడింది. ద్విపద రామాయణం కూడా ఉన్నదని విన్నాను దఱిమడుగు మల్లయ్యగారి రామాయణం కూడా ఒకటి ఉన్నది. నేను చదివిన కామెంట్ ఏమిటంటే --యథావాల్మీకంగా అనువదించబడిన రామాయణ కావ్యాలకంటే కవుల స్వకపోల కల్పనలతోనిండి ఉన్న ఇతర రామాయణ కృతులకే తెలుగు వారు మొదటినుండీ పెద్దపీట వేస్తున్నారని.--ఇలా ఎందుకు జరుగుచున్నదని నాకు సందేహం కలిగి ఈ పోస్టు రాయటానికి పూనుకున్నాను. ఈ విషయంలో పెద్దల, విజ్ఞుల అభిప్రాయాలు తెలుసు కోవాలనిపించింది. ఈ విషయమై ఇంకాముందుకు పోవటానికి ముందుగా అసలు తెలుగులో ఎన్ని రామాయణాలు ఎవరెవరు ఎప్పుడెపుడు ఏ ఏ రూపాల్లో వ్రాసారో తెలుసుకోవటం అత్యవసరం అనిపించింది.అందుకని పెద్దలందరూ వారి వారికి తెలిసిన రామాయణ గ్రంథాల్నిగుఱించి తెలియజేస్తారని ఆశిస్తూ ఈ మొదటి భాగాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను. |
ప్రాచీన గాథలు
3 days ago