వెయ్యేళ్ళ తెలుగు పద్యం. మ. హరిదంభోరుహలోచన ల్గగనరంగాభోగరంగ త్తమో భర నేపథ్యము నొయ్య నొయ్య సడలింపన్, రాత్రి శైలూషికిన్ వరుసన్ మౌక్తికపట్టమున్, నిటలమున్, వక్తంబునుం దోఁచె నా హరిణాంకాకృతి వొల్చె రే కయి, సగం బై, బింబ మై తూర్పునన్. ఇది వసు చరిత్రలో రామరాజ భూషణుని చంద్రోదయ వర్ణన. వెయ్యేళ్ళ తెలుగు పద్యం పేరుమీదుగా ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో (1980 దశకంలో ) కీ.శే. పుట్టపర్తి నారాయణాచార్యులు గారు నిర్వహించిన శీర్షికలోని తొట్టతొలి పద్యం. గగనరంగ మనే విశాల రంగస్థలం మీద రాత్రి అనే నట్టువకత్తె చూపించబోయే నాట్య ప్రదర్శనకు ముందుగా పద్మలోచనలు తాము పట్టుకున్న చీకటి అనే తెఱను మెల్లమెల్లగా సడలిస్తుండగా రాత్రి అనే నట్టువకత్తెకు వరుసగా ముందు మౌక్తిక పట్టము, తఱువాత నుదుటి భాగము ఆ తఱువాత నిండుముఖమూ కనిపించినట్లుగా మొదట ఒక వంకర రేక గాను తఱువాత సగ భాగముగాను తఱువాత పూర్ణబింబమూ గాను తూర్పున ఉదయిస్తూన్న ( లేడిని తనయందు గలిగి ఉన్న) చందమామ కనిపించినదట. ఎంత మనోహర వర్ణన ! |
శ్రీరామరాజ్యం : వనం జ్వాలా నరసింహారావు
13 hours ago