నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

Showing posts with label అన్నమాచార్య చరిత్రము (చిన్నన్న). Show all posts
Showing posts with label అన్నమాచార్య చరిత్రము (చిన్నన్న). Show all posts

Nov 15, 2009

నని యలమేలుమంగాధీశు పేరః నినమండలాంతరాబితమూర్తి పేర-

అన్నమాచార్య చరిత్రము
అంకితము


నని యలమేలుమంగాధీశు పేరః
నినమండలాంతరాబితమూర్తి పేర-


హరి పేర దరచక్రహస్తుని పేర
ధర నెన్ను మా కులదైవంబు పేర-


నాలీలఁ దాళ్ళపాకన్నమాచార్యు-
నేలిన శ్రీవేంకటేశ్వరు పేర-


నంకితంబుగను శ్రీహరిభక్తపాద-
పంకజార్చక తాళ్ళపాన్నమార్య-

తనయ తిమ్మార్యనందన రత్న శుంభ-
దనుపమ శ్రీ వేంకటాధీశదత్త-


మకరకుండలయుగ్మ మండితకర్మ
సకలవైష్ణవపాద సంసేవకాబ్జ-


సదనా వధూలబ్ధ సరసకవుత్వ-
విదితమానస తిరువేంగళనాథ-


విరచిత సద్భక్తి విభవన్నమార్య-
చరితంబు జగదేకసన్నుతం బగుచు


నాచక్రశంఖాంక యశముతోఁగూడ
నాచంద్రతారార్కమై యుండుఁగాత .


0 comments

సిరివరు మెప్పించి చెలఁగి యా దేవు- వరమునఁ దనయంతవారిఁ బుత్రకుల

అన్నమాచార్య చరిత్రము
అన్నమాచార్య సంతతి


సిరివరు మెప్పించి చెలఁగి యా దేవు-
వరమునఁ దనయంతవారిఁ బుత్రకుల


నరసయాచార్యు నున్నతయశోధనునిఁ ,
దిరుమలాచార్యుని ధీవిశారదునిఁ 


గాంచి , వారును దనకరణి విద్యలను
గాంచనాంబరు భక్తి కలిమిఁ బెంపొంద

శౌరికథాసుధాసల్లాప గరిమ
ధారుణి నెంతయుఁ దనరారుచుండె ;

మనసునఁ గపటంబు మాని సద్భక్తి
ననఘమౌ నీ యన్నమాచార్యచరిత

వినిన వ్రాసినఁ బేరుకొనినఁ జదివిన
జనులకు నిష్టార్థ సౌఖ్యంబు లొదవు -

1 comments

Nov 14, 2009

యోగమార్గంబున నొకకొన్ని బుధులు రాగిల్ల శృంగార రసరీతిఁ గొన్ని

అన్నమాచార్యుని చరిత్రము
అన్నమాచార్యుల రచనలు


యోగమార్గంబున నొకకొన్ని బుధులు 
రాగిల్ల శృంగార రసరీతిఁ గొన్ని

వైరాగ్యరచనతో వాసింపఁ గొన్ని
సారసనేత్రు పై సంకీర్తనములు


సరసత్వమునఁ దాళసముఖముల్ గాఁగ
పరమమంత్రములు ముప్పది రెండువేలు ,


ప్రవిమల ద్విపద ప్రబంధరూపమున
నవముగా రామాయణము , దివ్యభాష


నా వేంకటాద్రిమాహాత్మ్య మంతయును
గావించి , రుచుల శృంగారమంజరియు


శతకముల్ పదిరెండు సకలభాషలను
ప్రతిలేని నానా ప్రబంధముల్ చేసి ,

0 comments

Nov 13, 2009

గద్య పద్యముల డెబ్బది రెండుమంది- యాద్యులచేఁ గొనియాడించుకొన్న

అన్నమాచార్యుని చరిత్రము
అన్నమాచార్య పురందరదాసుల చెల్మి


గద్య పద్యముల డెబ్బది రెండుమంది-
యాద్యులచేఁ గొనియాడించుకొన్న


రసికుండు శ్రీ పండరంగవిఠ్ఠలుఁడు
కొసరెడు భక్తి చేకూరఁ జేసేత-


నెనయ సంధ్యలకు నీళ్ళియ్యఁ జేకొనుచుఁ
దనరు పురందరసాహ్వయుండు


పరమ భాగవతుఁడై పరఁగుచు నంద-
వరకులాగ్రణియైన వైష్ణవోత్తముఁడు


సవరించు మురవైరి సంకీర్తనములు
కువలయంబునఁ బేరుకొన్న మాత్రమున


తలఁచిన భూత బేతాళ పిశాచ-
ములు పాఱిపోవ నిమ్ముల శుభం బెసఁగ


విని కనియును లోన వెఱఁగందికొనుచు
చని , తాళ్ళపాకశాసనుఁ డన్నమయ్య


వెన్నునిఁగానె భావించి కీర్తించి
సన్నుతిసేయ నాచార్యవర్యుండు


నతని విఠ్ఠలునిఁగా ననయంబు దలఁచి
ప్రతిలేని గతుల సంభావించె నపుడు ;-


నీ రీతి మహిమ లనేకముల్ వెలయ
వారక వరభాగవతులు గీర్తింప

0 comments

Nov 12, 2009

నా వరకృత్యంబు లన్నింటి లెక్క గావింప నాకు శక్యమె , నాఁటివార-

అన్నమాచార్యుని చరిత్రము
అన్నమాచార్యుని మహిమలు

నా వరకృత్యంబు లన్నింటి లెక్క
గావింప నాకు శక్యమె , నాఁటివార-


లెఱుఁగుదు; రవి పెద్ద లెఱిఁగింప వినుచు-
నెఱిఁగిన కృతకృత్యు లిపుడును గలరు ;


ఐన నందొక కొన్ని యనఘమానసుల-
వీనులవిందుగా వినుతింతు నేను


మండెమురాయ నామక నరసింహ
దండనేత్రున కిష్టధనబలస్ఫూర్తి-


ననుపమంబుగ వేంకటాద్రి చెంగటను
తన యగ్రహారమై తనరుచునున్న 


మరులుంకు (?) నోక జీడిమామిడి దాన
సరసంబువోయిన చవిఁ బండ్లు పండు-


నెఱ్ఱనై గొప్పవై యేపారు పండ్ల
విఱ్ఱవీఁగుచుఁ దనవీథి నెన్నడిమి 


మినుకైన మంచిమామిడిరీతి నెదుటఁ
గనుపట్టు నా చెట్టుఁ గని యొక్కనాఁడు


కపటమానసుల యాకారంబు పోలె-
నపు డెంతొ దృష్టప్రియంబులై యున్న


శ్రీ మాధవునకు నర్పించి యాపండ్లు
తా మారగింప నత్తఱిఁ బండ్లు పులియ


నమృతంబుతోఁబుట్టువగు పద్మ మోవి-
నమృతంబు తనివోవ నాను వెన్నునికి-


నీయెడ నెఱుఁగక యీ జీడిపులుసు-
కాయ లెట్లొసఁగితిఁ గటకటా యనుచు-


నా చెట్టు ముట్టితి నప్పయ్య దీన-
నేచిన దుర్గుణంబెల్లఁ బోఁజేసి


మించైన తియ్యమామిడి సేయుమనినఁ
బంచదారలవంటి ఫలములదయ్యె ;-


నా సుద్ది విని యొకఁ డట పెండ్లియాడఁ
గాసువీసము నాకు గల్గ దీవింపు-


మన విని , యటువలె నౌఁగాక యనిన
వెనుకొని వాఁ డెన్ని వేఁడినఁగాని


కాసువీసంబునే కాని యొక్కరుఁడు
చేసేత నొకరూక చేతిలో నిడఁడు ;


అది విని యది యొట్టి(ట్ట?)దని గాయకుండు
తదనుజ్ఞ మహిమగాఁ దలఁచి యేతెంచి


ఓతండ్రి నా పెండ్లి కొదవెడు ధనము
చేతికి రా దయసేయవే ! యనుడు-


నటువలె నౌఁగాక ! యనిన , నా విప్రుఁ-
డట వీథి కేఁగెడునపుడు రా జొకఁడు-


నాదరంబునఁ బిల్చి యడిగిన ధనము
ద్వాదశీ కన్యకా దాన మిచ్చుటయు-


నా వార్త విని జను లరుదందికొనుచు
వావిరి నొడి వళావళికిఁగా బెగడి


చెలువొందు నా గురు శ్రీపాదరక్ష
తల నిడి తమయాపదల వీడికొనిరి ;

0 comments

Nov 9, 2009

నది గని ముదమంది యన్నయార్యుండు సదయుఁడై నృపతి నెంజలిఁ బ్రస్తుతించి

అన్నమాచార్య చరిత్రము
అన్నమాచార్యుడు రాజు ననుగ్రహించుట

నది గని ముదమంది యన్నయార్యుండు
సదయుఁడై నృపతి నెంజలిఁ బ్రస్తుతించి

మునుపటి నీచేయు మొక్కలంబునకు-
ననుతాపమును జెంది తది కారణమున

మునుకొన్న యపరాధమును తాళుకొనియె
దనుజారి ; యింక నింతటనుండి నీవు


నరహరి సంకీర్తనము సేయువారిఁ
బరసమానులుగాఁగఁ బరికింపవలదు


మురవైరి కృతయుగమున సర్వజనుల
నిరత నిజధ్యాననిష్ఠచే మెచ్చుఁ;


గ్రతువులఁ ద్రేతాయుగమున, నర్చనలఁ
బ్రతిలేనియట్టి ద్వాపరమున నలరు;


నా మూఁడు యుగముల ధ్యానాదివిధుల-
నేమేమి నరులకు నిచ్చు నన్నియును


జలజోదరుఁడు నిజసంకీర్తనమునఁ
గలియుగంబున నిచ్చుఁ గావున, నీవు

ప్రతిలేని వేంకటపతిమీఁద భక్తి-
నతని దాసులమీఁద నారీతి భక్తి

వదలక మనుమని వరదుఁడై పలికె;-
నది మొద లా రాజు నఱలేని కూర్మి


సభయుఁడై యన్నమాచార్యు శేషాద్రి-
విభునిఁగా నాత్మ భావింపుచునుండె;


సకలలోకములు నా చందాన గురుని
నకలంకగతిఁ గొనియాడంగఁదొడఁగె;-


నా రాజు వీడ్కొని యాదేశికుండు
నారాయణాచలనాథు సేవించి


శృంగారమంజరిఁ జేసి శేషాద్రి-
శృంగవాసునకు నర్పించి యిచ్చుటయు,


నాడుచుఁ బతకమాకన్నలజోల
పాడఁగ నాఁడెల్లఁ బసిబిడ్డ నైతి-


నా కృష్ణమాచార్యు నధ్యాత్మవినుతి-
రాకఁ గొన్నాళ్ళు విరక్తుండనైతి


జగతి నీ శృంగారసంకీర్తనముల-
కగపడి మంచిప్రాయపువాఁడ నయితి


నని వేంకటేశ్వరుఁ డన్నమాచార్యుఁ
గనుఁగొని వాక్రుచ్చి గౌరవించుటయు


వేదముల్ పొగడఁ గోవిదులు నుతింప
నా దేవతలు కొనియాడ గోవింద !


నే నిన్నుఁ గొనియాడ నెంతటివాఁడ
నా నేర్పు నీ నేరు పరసి చూచినను


పలికెడు వఈణలోపలి చక్కఁదనము
పలికించునతనిదై పరఁగిన రీతి-


నని వినుతించి , యయ్యంబుజోదరునిఁ
దనుఁ గన్నతండ్రి నెంతయు మెచ్చఁజేసి


ప్రతివత్సరంబు తప్పక వృషభాద్రి-
పతికిఁ గావించు నా బ్రహ్మోత్సవములు


సేవించుకొనుచు నా శ్రీశైలనాథు-
పావన వినుతి ప్రభావంబుచేత


జగతిపై సకల వాచాసుద్ధి కలిగి
నగుచునైనను దీవనల నిచ్చెనేని


లలిమీఱఁ గినిసి యొల్లమిఁ దిట్టెనేని
యల రెండు నెపుడు ప్రత్యక్షమై చూపు-

0 comments

Oct 21, 2009

బరికించి భూపతి భయమంది యతని - చరణాబ్జములఁ జక్క సాఁగిలి మ్రొక్కి

అన్నమాచార్య చరిత్రము
రాయల పశ్చాత్తాపము

బరికించి భూపతి భయమంది యతని -
చరణాబ్జములఁ జక్క సాఁగిలి మ్రొక్కి

కన్నీరు గదుర గద్గదకంఠుఁడగుచు
పన్నిన దైన్య మేర్పడఁగ నిట్లనియె;-

నపరాధి నపరాధి నన్నమాచార్య !
కృపఁజూడు నను నీవు కృపణశరణ్య !

యెఱుఁగని పసిబిడ్డఁ డేమైనఁ జేయ-
నరుదైన తల్లికి నలుగంగఁదగునె ?

నను నీవు పిన్నటనాఁటనుండియును
బనుపడ బంటుగాఁ బనిగొంటి గనుక

మందెమేళమున నీ మహిమఁ జింతింప-
కిందఱవలె నేన యిట్టు చేసితిని -

వేంకటపతివి నీవే మాకు మనసు-
శంక లింకించి ప్రసన్నుండ వగుము

నీ వలిగిన నల్గు నీలవర్ణుండు
నీవు మెచ్చిన మెచ్చు నీరజోదరుఁడు-

నాయర్థ మంతయు నన్నమాచార్య
నీయందె కంటిమి నిక్కంబు గాఁగ ;

నని పట్టమహిషితో నతనిఁ గీర్తించి
పనిఁబూని పన్నీటఁ బాదముల్ కడిగి

బంగారు విరులజొంపములఁ బూజించి
పొంగారు వేడుక భూషణావళులఁ

జిత్రాంబరంబులఁ జిత్రవస్తువులఁ
జిత్రంబుగాఁగ భూషించి తోషించి

తనకుఁగా మును పాయితంబైన పసిఁడి-
యనుసుల చతురంతయాన మెక్కించి

భజియించి తనమూఁపు పల్లకికొమ్ము
నిజభుజంబున నిడి నెమ్మి గావింప ,-

0 comments

Oct 9, 2009

నిను నొల్ల నిటువంటి నీపొందు నొల్లఁ జనియెద వేంకటేశ్వరుఁ గొల్వ నేను

అన్నమాచార్య చరిత్రము
సంకెల వేయించుట
నిను నొల్ల నిటువంటి నీపొందు నొల్లఁ
జనియెద వేంకటేశ్వరుఁ గొల్వ నేను

అనుచు దిగ్గన లేచి యరిగెడు గురుని
పనిఁబూని భటులచేఁ బట్టి చెప్పించి

తన బాల్యసఖ్యంబుఁ దలఁచి సంపదలఁ
దనయంతవానిఁగాఁ దనరఁ జేసితిని

గబ్బిమై నొక మాట కావలెనన్న
గొబ్బునఁ గోపించుకొన నేలవచ్చె

నీ వేమి సేయుదు నిను నింత సేయు-
నావల్ల నేరము నను నింత సేసె-

నని కనుఁగవ యెఱ్ఱనై నిప్పు లురుల
ననుచరవర్గంబు నదలించి పిలిచి

లోఁగి నే నెంత దాళుచు వేఁడుకొనిన
లోఁగని పుడమివేలుపుదంట కోడె-

ఱంకెలు చన మూరురాయరగండ-
సంకెల నిడి మొగసాలలో నిడుఁడ

యన నూడిగెలవార లాచార్యుఁ దోడు
కొనిపోయి మొగసాలఁ గూర్చుండ నిలిపి

కొంకుచు రాజునకును భయంపడుచు
శంకలేమియు లేక సంకెల వేసి

కావలియై నలుగడ నుండి; రంతఁ
గోవిదుఁడైన యగ్గురువరేణ్యుండు

మునుపు ప్రహ్లాదుండు మురవైరిఁ దలఁచి
దనుజబాధలఁ గాలఁ దన్నిన కరణి

ఫణిరాజశైలేంద్రుఁ బ్రణతార్తిహరుని
గణుతించి హృదయపంకజవీథి నిలిపి

"సంకెల లిడువేళఁ జంపెడువేళ-
నంకిలి ఋణదాత లాఁగెడువేళ

వదలక వేంకటేశ్వరుని నామంబె
విదలింప గతిగాని వేఱొండు లేదు

వనమాలి యతఁడె నావగపెల్ల నుడుపు"-
నను నర్థములతోడ నలవడియుండ

సంకలితాత్ముఁడై సరగున నొక్క-
సంకీర్తనముఁ జెప్పి శరణుసొచ్చుటయు

ఘల్లునఁ వీడి శృంఖల లూడె ; గుండె
ఝల్లనఁ జూచి యచ్చటివారు బెగడి

యీవిధం బంతయు నా రాజుతోడ
వేవేగఁ బఱతెంచి విన్నవించుటయు,

నగి వడి సింహాసనము డిగ్గ నుఱికి
పగగొన్న బెబ్బులిపగిది నేతెంచి

అన్నయార్యునిఁ జూచి యయ్యరో ! వద్ద
నున్నవారల కెల్ల నొగి లించి మించి (లంచ మిచ్చి కావచ్చు )

వేయని సంకెళ్ళు వీడె నటంచు
మాయురె ! నీ వెంత మాయ వన్నినను

నే నేల పోనిత్తు నిది నిక్కమైన-
నే నుండి తిరుగ వేయించెద నిపుడు

కిదుకక నీదు సంకీర్తనంబునకు
నది వీడెనా నిజంబని యెన్నవచ్చు

నీ పాలిదైవంబు, నిన్ను, నీ మహిమ
బాపురె ! యని మెచ్చి పాటింపఁదగును-

ననుచు నొద్దనె యుండి యా నిగళంబు
తనికి చేనెత్తి యిద్దఱు దేర మగుడ

నెగసెక్కెమునకు వేయించిన గురుఁడు
నగి తొంటి సంకీర్తనము సేయుటయును

కాలిసంకెల చిటికన వ్రేలి పలుము-( చిటుకన వ్రీలి పలము- అయియుండవచ్చు )
చీలలు వీడి చెచ్చెర నూడిపడినఁ

0 comments

Oct 1, 2009

కవులు విద్వాంసులు గాయకుల్ భూమి- ధవులు సామంతులు దనుఁ జుట్టి కొలువ-

అన్నమాచార్య చరిత్రము
మరలఁ బాటలు పాడించుట

కవులు విద్వాంసులు గాయకుల్ భూమి-
ధవులు సామంతులు దనుఁ జుట్టి కొలువ-

నంగజగురుమీఁద నభినవంబైన-
శృంగారయుతపదశ్రేణిఁ బాడింప


"చెలులార ! వేంకటశిఖరనాయకుని-
కలికికిఁ గడగంటఁ గనుపట్టునెఱుపు


చెలువ మేగతి నుండెఁ జెప్పరే " యనిన
"నలువునఁ బ్రాణేశు నాఁటిన చూపు

నిలువునఁ బెఱుక నూనిన శోణితంబు
తలపోయఁ గాదుగదా " యన్న పదము

పలుమఱుఁ బాడించి పాడించి చొక్కి
తలయూఁచి "యిది ! కవిత్వం " బని మెచ్చి


యనుపమంబైన ద్రోణాచార్యుమహిమ
గనియుఁ ద్రౌపదితండ్రి గర్వించినటుల-

నన్నమాచార్యు మహత్త్వ మంతయును
గన్నారఁ గనియును గర్వాంధుఁడగుచు

పదరక వేంకటపతిమీఁద నుడువు-
పదముల రీతి నా పై నొక్కపదము

చెప్పుమా యనవుడుఁ జెవు లిరుగేల-
నప్పళింపుచు మూసి హరిహరీ ! యనుచుఁ

బరమపతివ్రతాభావంబుఁ బూని
హరి ముకుందునిఁ గొనియాడు నా జిహ్వ

నినుఁ గొనియాడంగనేర దెంతైన
నను నెట్లు పలికితి నైచ్యంపుఁబలుకు-
 

నాయచ్యుతునిఁ దక్క నన్యుల వినుతి-
సేయుట నా కన్న చెలియలి వావి



0 comments

Sep 27, 2009

కనకాంబరుని గుణగణముల్ శ్రుతులు గని చిక్కుగొనురీతిఁ గను కపోలములు

అన్నమాచార్య చరిత్రము
రాయఁ డన్నమాచార్యుని మరలఁ బిలిపించుట
కనకాంబరుని గుణగణముల్ శ్రుతులు
గని చిక్కుగొనురీతిఁ గను కపోలములు


నత్తఱి మదిలోని హరికీర్తి మొలక-
లొత్తినగతి నున్న యూర్ధ్వపుండ్రములు


లాలితాచ్యుతభక్తిలలన వరించు-
మాలికగతి తిరుమణివడంబులును

తలనిడు విష్ణుపాదపుఁ దమ్మిపువ్వు
మెలుపైన కెంబట్టు మేలుకుళ్ళాయి


అరవిందనయను కృపామృతధార-
కరణిఁ జూపట్టెడు కంఠమాలికయు


నరహరికై కంకణము గట్టియున్న-
సరణిఁ జూపట్టు పచ్చల కడియములు


ధవళనేత్రుని శారదావిలాసంబు
నివసించునట్లున్న నిలువు పేరణము


వాసుదేవునియాజ్ఞ వడిఁ జుట్టుకొన్న-
యా సత్త్వగుణమున నలరు దుప్పటము


నలవఁడ జతురంతయానంబు నెక్కి
బలసి సంకీర్తనపరుల సేవింప

ఘనతర ధవళ శంఖధ్వానమడరఁ
జనుదెంచి నృపతి యాస్థానంబు చెంతఁ

బల్లకి డిగి వెంటఁ బరఁగు వైష్ణవుని-
నల్లన చెయ్యూఁది యాలోని కరిగి


కూరిమిఁ దనరాక కోరి వీక్షించు-
నారాజుఁ గదిసి నెయ్యముతియ్య మెసఁగ


సొలవక " శ్రీనివాసో రక్ష " తనుచు
నెలమిఁ జే తిరుమణి నిచ్చె నిచ్చుటయు,


నెదురుగాఁ జనుదెంచి యెలమిఁ జేకొనుచు
ముదమునఁ గరపద్మములు సాఁగి మ్రొక్కి


యన్నమాచార్యుతో ననుఁగు దీపింపఁ
దిన్నని పసిఁడిగద్దియమీఁద నుండి




0 comments

Sep 15, 2009

తవిలి యెన్నినఁ గాళిదాసాదులైన- కవులందుఁ జిక్కిన కవులందు నిట్టి-

అన్నమాచార్య చరిత్రము
రాయఁ డన్నమాచార్యు సత్కరించుట

తవిలి యెన్నినఁ గాళిదాసాదులైన-
కవులందుఁ జిక్కిన కవులందు నిట్టి-


కవితయు నిట్టి శృంగారభావంబు
వివరింపఁ గంటిమే వింటిమే మున్ను


కన్నవిన్నవి గావు గదర ! యీ పదము-
లన్నయార్యునివి మోహనమూర్తు లనుచు


వీనులవిందుగా విని చాల మెచ్చి
యానందవార్ధి నోలాడి యా రాజు


పచ్చలకడియాలు బంగారువ్రాఁత-
పచ్చడంబులును గెంబట్టు కుళ్ళాయి


యంగదంబులు నుభయాతపత్రములు
రంగైన వింజామరలజోడు మంచి-

యుదిరిఁజేసిన గిండియును గళాచికయు
మొదలైనవెల్ల సమ్ముఖమున నొసఁగి


తన పెద్దనగరియొద్దనె యొక్కనగరు-
ననువొందఁ జూపించి యట నుండఁ బనిచి


యనుదినంబును వేంకటాద్రీశుమీఁది-
వినుతులు వేడుక వినుచుండి యుండె


నరనాథుఁ; డట నొక్కనాఁ డన్నమార్యుఁ
బరిచివర్గంబుఁ బంపి రమ్మనిన



0 comments

Sep 14, 2009

కెలనఁ జూపట్టు సంకీర్తనపరులఁ బిలిచి లెస్సగ వినిపించఁగావలయు-

అన్నమాచార్య చరిత్రము

అన్నమాచార్యుఁడు సంకీర్తనములు పాడుట.

కెలనఁ జూపట్టు సంకీర్తనపరులఁ
బిలిచి లెస్సగ వినిపించఁగావలయు-

నిపు డన్న వారలు నెడఁ బాఱఁబాఱఁ
దిపిరిదండెలు శ్రుతుల్ తిన్నగాఁ గూర్చి

దండిమై నెఱగానదండెయు వాద్య-
దండెయుఁ దానసంతానంబు చూప

స్థాయి షడ్జమును బంచమమును జేసి
ఠాయముల్ కడువింత డాలుగాఁ జూప

తేనెలపై తేట తిన్ననిచెఱకు
పానకముల నేరుపఱచిన మేలు

చక్కెరలో తీపు చల్లఁదెమ్మెరలు
చిక్కని కపురంబు జీవరత్నములు

కల యమృతంబు మీఁగడమీఁది చవులు
చిలుకుచుఁ గవులెల్లఁ జేయెత్తి మ్రొక్క

వేంకటపతికిఁ గావించిన మంచి-
సంకీర్తనముల రసంబు లుట్టఁగను

సింగార మొకకుప్పఁ జేసిన రీతి
రంగైన రాగవర్ణములఁ బాడుటయు,

0 comments

Sep 12, 2009

నానాఁట నా నరనాథుండు వేఱు- లేని కూరిమితోడ లీనమైయుండె;

అన్నమాచార్య చరిత్రము

నరసింగరాయఁడు విజయములందుట.

నానాఁట నా నరనాథుండు వేఱు-
లేని కూరిమితోడ లీనమైయుండె;

తన సంపదలు సమస్తము నన్నమయ్య-
వని యెన్ను నడకల నారీతి నడచు-

నే పని గలిగిన నెఱిఁగించికాని
చేపట్టి తనయంతఁ జేయఁ డెప్పుడును

హితునిఁగా గురునిఁగా నెల్లబంధులఁగ
నతనినే భావించి యంగవింపుచును

పావనుండగు తాళ్ళపాకన్నమయ్య-
దీవెనలంది వర్ధిలుచు నా రాజు

బలియుఁడై పరిపంథిబలముల నడఁచి
నలిరేఁగి సింహాసనంబు చేకొనుచు

తన రాజధానియై తనరారు పసిఁడి-
పెనుగొండగతి నుండు పెనుగొండ నుండి

యన్నమాచార్యుల నటకు రావించి
యెన్నిక నెదురుగా నేతెంచి మ్రొక్కి

కనకాంబరాదుల గ్రామసంతతులఁ
గనువారలకు దండగాఁ బూజచేసి

వెన్నునిపై విన్నవించిన లోక-
సన్నుతంబైన మీ సంకీర్తనములు

విన నాకు మిక్కిలి వేడుకయ్యెఁడును-
ననఘాత్మ వినిపించు మనిన నగ్గురుఁడు

0 comments

Sep 11, 2009

నావార్త విని విని యట్టి మహాను- భావునిఁ గన బాళిఁబడుచు డెందమున-

అన్నమాచార్య చరిత్రము
సాళ్వనరసింగరాయఁ డన్నమాచార్యు దర్శించుట

నావార్త విని విని యట్టి మహాను-
భావునిఁ గన బాళిఁబడుచు డెందమున-

నా చేర్వ టంగుటూరను పురంబేలు-
రాచమూకలలోఁ బరాక్రమశాలి

నాళీకబాంధవాన్వయుఁ డజేయుండు
సాళువ నరసింహ జనపాలుఁ డొకఁడు

పరివారవాద్య సంభ్రమము రెట్టింపఁ
కరమొప్పఁ జేకానికలు గొనివచ్చి

యా తాళ్ళపాకాన్నమయ్యకు సాఁగి
చేతులు మొగిచి మచ్చికఁ బూజచేసి

శ్రీకృష్ణు మన్ననఁ గ్రీడి భూచక్ర-
మేకచక్రంబుగా నేలిన పగిది-

నాలాగు మీ సహాయము నాకుఁ గలుగ-
నేలుదు ధరయెల్ల నేకచక్రముగ

నన్ను మన్నించి విన్నప మాలకించి
క్రన్నన మాయూరికడ కేఁగుదెంచి

మాకు బుద్ధులు సెప్పి మా చేయుపూజ
చేకొని మమ్ము రక్షింపరే ! యనిన

సహజవైష్ణవభక్తి సలిపెడువాని-
సహవాసమైన దోసములేదటంచు-

నతఁడు పట్టించిన యందలంబెక్కి
యతఁడు భృత్యప్రాయుఁడై కొల్చి రాఁగఁ

జని టంగుటూరి కేశవమూర్తిఁ గాంచి
వినతుఁడై యతఁడు కోవెలదండఁ దనకు

సకలసంపదలతో సవరించియున్న-
యొక పెద్దనగరిలో నొగిఁ బ్రవేశించె;-

0 comments

Sep 9, 2009

నెలజవ్వనము మేన నిగురొత్తు కొడుకుఁ దలిదంఢ్రు లరసి యాతనిఁ దోడుకొనుచు

అన్నమయ్య చరిత్రము

అన్నమయ పెండ్లి

నెలజవ్వనము మేన నిగురొత్తు కొడుకుఁ
దలిదంఢ్రు లరసి యాతనిఁ దోడుకొనుచు

కులములవారిండ్లకును బోయి సుతున-
కెలమి మీ పడుచుల నీవలె నన్న-

నేవేళఁ జూచిన నితఁడు శ్రీరామ
గోవింద హరి యనుకొనుచుండుఁ గాని

యలవోక సంసార మది యిచ్చఁ దనకు
వలెననఁ డది యెటువంటి గొంటైన

నాచారముల దాసరయ్యను జూచి
చూచి యేగతిఁ బడుచుల నిచ్చు ననిన

వారల కలలోన వారిజోదరుఁడు
దారియు మొనఁ జూపి తనదు భక్తునకు-

నన్నయార్యునకుఁ గన్యకల నిమ్మనిన-
నన్నన్న యని వారు నరుదందికొనుచు

తిరుమలమ్మను నొక్కతిరువాలుఁగంటి-
నరుదైన యక్కలమ్మను నొక్కకన్య

బంగారు ప్రతిమల భావంబుఁ జూప
సింగార మెఱపుగాఁజేసి మోదమునఁ

గ్రన్నన నాగమోక్తప్రకారమునఁ
జెన్నుగాఁ బెండ్లిడ్లు చేసిరంతటను;

పరమేశుఁడగు నహోబిలనృసింహుండు
గురుభావమునఁ జేరుకొని త్రిదండంబు-

నా నరసింహు చక్రాదిమంత్రములు
తానె ప్రత్యక్షంబు దయ సేయఁ గొనుచు,

హరి హయగ్రీవుఁ బ్రత్యక్షంబుఁ జేసి
ధర సర్వతంత్ర స్వతంత్రుఁడైనట్టి-

వేదాంతదేశికు వేంకటాచార్యు-
నా దివ్యసంప్రదాయమున వర్తించు-

శఠకోపమునివద్ద సకల వేదాంత-
పఠనంబుఁ జేసి యభంగవిస్ఫూర్తి

హరిపూజ హరిసేవ హరికీర్తనంబు
హరిమననము ధ్యాన మనిశంబుఁ దనకు

ఘనతర సకలభోగంబులుగాఁగ
మనుచు వాల్మీకిరామాయణ మెల్ల

రాగంబుతో ననురాగంబుతోడ
బాగుగా గంధర్వుబాగుగాఁ జదివి

పాటలన్నియుఁ దన పాటపిమ్మటన
పాటపాటనె పాటపాడి చూపఁగను

విన్నవారెల్ల నువ్విళ్ళూరి యొక్క(చొక్క?)
ప్రన్నవీనులు నిండుపండువుల్ సేయ

తుంబురుఁడో నారదుఁడొ కాక యీ వి-
ధంబున దిరుగు గంధర్వుఁడో కాక


మనుజుఁడో యీ యన్నమయ యని సర్వ
జనులును గొనియాడి సంతసింపఁగను-





0 comments

Sep 5, 2009

గాలంపుఁ జిక్కులు గదియించునట్టి తాళముల్ వీడియుఁ దనుదానె పడిన

అన్నమాచార్య చరిత్రము

వైఖానసార్చకు లన్నమయ మహిమ గుర్తించుట


గాలంపుఁ జిక్కులు గదియించునట్టి

తాళముల్ వీడియుఁ దనుదానె పడిన


అలతలుపులు ఫెళ్ ఫెళన(ని) తెఱచుటయు,-

నలరుచు నర్చకుం డరుదెంచి చూచి


భళిభళి! యనుచు నబ్బాలకు మెచ్చి

యల దేవుమహిమకు నాశ్చర్యమొంది


గురుభక్తి నతనిఁ దోడ్కొనిపోయి చెంత

గరుడ సేనేశులఁ గపిరాజముఖుల


జనకజా సౌమిత్రి సహితు రాఘవునిఁ

గను పించుకొని నమస్కారముల్ చేసి


ముందరనే జగన్మోహాకారుఁ

బొందిన పసిఁడిసొమ్ముల నిమ్ముగొనుచు


కారు మెఱుంగు తీఁగలు చుట్టు నిలుపు-

ధారాధరంబు చందముఁ జూపువాని


పంచాస్త్రకోటిసంపదఁ జక్రసహిత-

పంచబేరాకృతి బాగైనవాని


శ్రీ వేంకటేశు నాశ్రితకల్పంబు

సేవించి, వినతుఁడై చేతులు మొగిచి


బహులాంగరంగవైభవములతోడ

మహితచందన పుష్పమాల్యవైఖరుల


ధూపనీరాజనాదులతోడ వైది-

కోపచారముల నా యుర్వీధరునకు


మురవైరిరెండవమూర్తియో యనఁగఁ

గరమొప్పుచున్న వైఖానసోత్తముఁడు


నంబి చెంగటఁ బూజనము సేయుతఱిని

పంబినభక్తి నబ్బాలుండు మఱియు


వెంకటప్పకు విన్నవించిన తొంటి-

వేంకటశతకంబు విన్నవించుటయు,


పెట్టిన ముత్యాల పే రా యశోద-

పట్టి పాదములపైఁ బడఁ బ్రసాదించె;-


నది చూచి యర్చకుం డరుదెంచి వచ్చి

ముదమున శఠకోపమును బ్రసాదించి,


యీయన్న బాలుఁడే యెన్నఁ గోనేటి-

రాయని దివ్యవరప్రసాదుండు



కాకున్న నీ నవ్యకావ్యంబు సేయఁ

జేకూరుటెట్టు చర్చింపంగ ననుచు-


నందఱు విన బాలు నాదరింపుచును

జందన తీర్థప్రసాదంబు లొసఁగఁ


జేకొని బాలుండు శిరసావహించి

దాకొని కోనేటిదరి భుజియించి


యాదివరాహు గేహమున సుఖించి

ద్వాదశినాఁడు నా ధవళాక్షుఁ గొలిచి


దేవుని యా పెద్దతిరువీథివెంటఁ

గోవెల వలచుట్టుకొని యేఁగి యేఁగి


సారెసారెకు రాగసంగతి గదుర

నారాయణస్మరణంబు సేయుచును-


నకలంకమై చల్లనై చూడఁదగిన-
యొక పంచతిన్నె పై నుండె నుండుటయు,

0 comments

Aug 30, 2009

నవగాహనము చేసి యా తేటనీట ధవళంబుగా మును దాఁ గట్టుచీర-

అన్నమాచార్య చరిత్రము
అన్నమయ స్వామిపై శతకము చెప్పుట

నవగాహనము చేసి యా తేటనీట
ధవళంబుగా మును దాఁ గట్టుచీర-

నుదికి యాఱఁగవైచి యొకరాతి దండ-
నది యెండ నాఱెడు నంతలోపలనె

వితత వృత్తంబుల వేంకటపతికి
శతకంబు కుతుకంబు సమకూరఁజేసి

పదిరెండు నామముల్ బాగుగాఁ దీర్చి
సదమలాచార్యుఁడై చనుదెంచి యతఁడు

వరుసతో హరిపరివారంబుఁ గొలిచి
మరుగురు ద్వారసీమకు వచ్చి మ్రొక్కి

యలవేంకటేశ్వరు నపరంజి తగడు-
తలుపులు బీగముల్ దాఁచియున్నెడను,

వేంకటపతిమీఁద వివరస్తవముగ
వేంకటశతకంబు విన్నవించుటయు

0 comments

Aug 27, 2009

బంగారుగాదెలపజ్జ సాష్టాంగ- మంగవింపుచుఁ బులకాంకితుఁడగుచు

అన్నమాచార్య చరిత్రము

అన్నమయ స్వామిని దర్శించుట

బంగారుగాదెలపజ్జ సాష్టాంగ-
మంగవింపుచుఁ బులకాంకితుఁడగుచు

గ్రక్కున దగ్గఱఁ గనుపట్టు పసిఁడి-
టక్కుల తలవాకిటను గానవచ్చు-

ధళ ధళల్ తులకించు దరచక్రహస్త-
ములు బొడ్డుమానికమును గఠారమును

మంజీర కింకిణీ మంజులపాద-
కంజద్వయంబును గాంచనాంబరము

కటిమీదఁ జేర్చిన కరపంకజంబు
తటుకున వరమిచ్చు తమ్మి కెంగేలు

కులికెడు మణిమయ కుండల ద్యుతులు
కలకలనగు ముద్దుగారు నెమ్మొగము

మంచిముత్యాల నామంబుపైఁ గాను-
పించు రత్నాంశుదీపిత కిరీటంబు

తట్టుపునుంగు పూఁతయుఁ గిరీటాదిఁ-
జుట్టిన చెంగల్వ చొళ్ళెంపుదండ

వనమాలికయును శ్రీవత్సకౌస్తుభము
అనుపమ దివ్యభూషాదివైఖరులు

గలిగిన దివ్యమంగళ విగ్రహంబు
గలయంగఁ గన్నుల కఱవెల్లఁ దీర

సేవించి తనివోక శ్రీవేంకటేశు
దేవుని మఱియుఁ గీర్తింపంగఁదొణఁగె;

కంటి నయ్యఖిలాండకర్త నే నధికుఁ
గంటి నా యఘము నిక్కము వీడుకొంటి

పావనంబైన పాపవినాశనమ్ము
కోవిదుల్ కొనియాడు కోనేఱు గంటి

నావంటి దీను విన్నప ముద్ధరించు
శ్రీవేంకటేశ్వరు సేవింపఁగంటి

అను నర్థ మలవడ నా దేవునెదుట-
ననువుగా సంకీర్తనంబులు సేయఁ

దనుఁజూచి యచట నందఱు మెచ్చి మెచ్చి
చనవిచ్చి తీర్థప్రసాదంబు లిడుచు

ఎదజేర్చి శఠకోప మిడుచు దీవింపఁ
దదనుజ్ఞ నొక విడిదల కేఁగె; నంతఁ-

బ్రాయమెక్కుచు విష్ణుపదపల్లవంబు-
చాయ చాయల నెఱసంజఁ జూపట్టె-

నల కలానిధి; భక్తి కా రాత్రి మేను
పులకించెనన మింటఁ బొడమెఁ దారకలు;

గగనాచ్యుతుఁడు సుధాకలశంబు గొన్న-
పగిదిఁ జందురుఁడు చూపట్టె నెంతయును;

అరయ నన్నయగురు ననురక్తి బెరయు-
హరిబింబమోయన హరిబింబ మలరె;

హరిచరణ స్మరణాశక్తుఁ డగుచు
హరివాసరంబైన యమ్మఱునాఁడు-

నీరీతి నెనిమిది యేఁడుల పిన్న-
బాలుఁడయ్యును నిష్ఠఁ బనిఁబూని యతఁడు

దైత్యుఁదారకు గొంచు దఱిగిన బ్రహ్మ-
హత్య సేనానిఁ బాయఁగఁ జేయునట్టి-

కొమరధారను, దేవకులములు గొలుచు-
నమరతీర్థమును, నయ్యంజనాదేవి

కనకాంబరుని మెచ్చుఁ గను పనిమంతు
హనుమంతుఁ గాంచిన యాకాశగంగ

సారెకు జనుల దోసములు నీరగుచుఁ
బాఱిపోఁజేయు పాపవినాశనమును

బార్థు కోరికలిచ్చు పాండవనామ-
తీర్థంబు మొదలైన దేవతీర్థముల-

0 comments

Aug 19, 2009

నానావిధావనోన్నతమైనయట్టి కోనేఱు గడతెంచి గురుపుణ్యవారి-

అన్నమాచార్య చరిత్రము

అన్నమయ కొండపై దివ్యస్థలముల దర్శించుట

నానావిధావనోన్నతమైనయట్టి
కోనేఱు గడతెంచి గురుపుణ్యవారి-

కోనేఱు దా నేఱుకున్న మన్ననల-
నీ నేరుపరుదని యెల్లలోకములు

వినుతించు నా తీర్థవిభుని సేవించి
చనుదెంచి యట కృతస్నానుఁడై యతఁడు

సేవంతిపూనీటి సెలయేటి వఱుతఁ
దావితామరల నిద్దంపుఁ బుప్పొళ్ళ

ముగ్గుల పరుసల మురిపెంబుచేత
నగ్గలంబై పొంగు నంబుపూరములు

పెను సోబనాలు చూపెడు సోబనాలు
గనుపట్టు స్వామిపుష్కరిణి సోయగము

వెండియుఁ జూచె సవిస్మయుండగుచు
పుండరీకముల యొప్పులఁ గన్నులయ్యె;

నురగేంద్రు శిరసుపై నొక పాద మూఁది
చరణ మొక్కటి రసాస్థలి మోవఁ జాఁచి

డాకేలు పుడమిపడంతుక నలమి
యా కేలు కటినూఁది యనురక్తిఁ జక్కఁ

బంటవలంతి గుబ్బలతావి మోవి-
పంటితేనియ లొకపరి యాను తమిని

మోముదామరఁ జూఁచి మొగసిరి కేలి-
తామరలను శ్రుతిద్వయము నిక్కించి

సంకుచక్రముల హస్తమ్ముల రెంటఁ
బొంకించి కరుమ చూపుల జొబ్బిలంగ-

నాదరిఁ బెంపొందు నాదివరాహు-
నాదరంబునఁ గొనియాడి సేవించి,

వలచుట్టుకొని వచ్చి వచ్చి కుందనపుఁ
బొలుపుల పెద్దగోపురము సేవించి,

తరగని ఫలపుష్పతతితోడ నీడ-
తిరుగని చింత వర్తిల నమ్రుఁడగుచు

పరుసల కిష్టసంపద లిచ్చు పసిఁడి-
గరుడగంబము పేర్మిఁ గని సాగి మ్రొక్కి

కారుమించులకును గలరీతి ముద్దు-
గారు పువ్వులు నొత్తుగాఁబడి రాల

రమణ బ్రహ్మాండకరండ మంతయును
ఘుమఘుమతావులు గులికి వాసింపఁ

గనుపట్టు నా చంపకపుఁబ్రదక్షిణము
చనుదెంచి స్వామిపుష్కరిణిఁ బూజించి,

తిమ్మప్పనికి నివేదితమైన మీఁదఁ
బమ్మి యమ్మెడు పైఁడిపళ్లెరంబులును

వారక యమృతంపు వారలు వట్టు-
మారివారలకు నోరూరించు చవుల-

పరికరంబుల చేతపడిఁ గదంబించు-
పరిపరిరివిధముల భక్ష్యభోజ్యములు

వెన్నగాఁచిన నేతి వింతపచ్చళ్ళు
సన్నరాజనపుఁ బ్రసాదంబుతోడ

పెన్నెలగుజ్జు పర్వినవన్నె నున్న-
యున్నతంబైన దధ్యోజనంబులును

అతిరసంబగు వడ లప్పాలు పాలు
అతిరసంబులు మొదలగు ప్రసాదములు

పచ్చకప్రపుఁ గలపంబు కుంకుమము
పచ్చకస్తురి సరివాటుగాఁ జేసి

తిగిచి పన్నీట మేదించి కుందనపు-
బిగువు చూపుచునున్న భృంగారుకలును

కమ్మగా వాసనల్ క్రమ్మఁగాఁ జిత్త-
రమ్మగు నడగోపురమ్ము సొత్తెంచి

దందడి నవ్వేల్పుతళిఘల క్రింద
జిందఁగాఁ జేత నూర్చిన నంటివచ్చు-

నొకనాఁటినెయ్యి వేఱొక దేవళమున
నొకయేఁటనైనను నున్నదే యనుచు

తలయూఁచి మెచ్చుచుఁ దనలోనె తాను
పలుమాఱు నాశ్చర్యపడుచు నా పడుచు

శ్రీనివాసుని నమస్కృతిచేసి దండ-
గానుపించిన భాష్యకారులఁ బొగడి

శ్రీనరసింహుని సేవ గావించి
దానవాంతకు జనార్దను సన్నుతించి

అలమేలుమంగకు నభివందనములు
సలిపి చెంగటి యాగశాలఁ గీర్తించి

మెఱుఁగులు గప్పఁగ్రమ్మినభాతి రుచుల
నెఱయించు నానందనిలయంబు గాంచి,

మరుగురు కల్యాణమంటపమునకుఁ
గరములు మొగిచి చెంగటితేజి కెఱఁగి

బంగారు గరుడుని భజియించి చెంత
సింగారమైయున్న శేషునిఁ గొలిచి

వాసన నలుదెసల్ వలగొన రాశి-
పోసి యుండెడు గోవ పునుఁగు చట్టలును

గట్టి బంగరుసలాకలఁ గ్రుచ్చి కాఁచి
తట్టుపునుంగు లత్తఱి నొత్తువిధము

పసిఁడి పళ్ళెరమునఁ బసనిచక్కెరలు
గొసరి గోవింద ముకుంద తిమ్మప్ప

అని పరుసలవార లంతంతఁ జేరఁ
జనుదేర వేంకటశైలభర్తకును

గుట్టున మది మ్రొక్కికోరొ కానుకలు
పెట్టరో, దండముల్ పెట్టరో, యిపుడె

కోరినకోర్కె చేకూరు నటంచు
నేరుపు పంచవన్నియ చిలుకలును

కనకభూషణవస్త్ర ఘనవస్తుతతుల
మొనసిన బండారమును దేరకొనుచు

తడఁబడఁ జుట్టిన తన పంచెకొంగు-
కడనున్న దొక కానుక వెట్టి

0 comments

Aug 18, 2009

నత్తఱి నలుదిక్కు లరసి యా శిశువు చిత్తంబులోన నచ్చెరువందుకొనుచు

అన్నమయ్య చరిత్రము

అన్నమయ దేవిపై శతకము చెప్పుట

నత్తఱి నలుదిక్కు లరసి యా శిశువు
చిత్తంబులోన నచ్చెరువందుకొనుచు

కలయొ యాందోళమొ కాక నిక్కంబొ
కలవళంబో దీని కరణి యే కరణి

యని నిక్కమని యాత్మ నలరి యా పద్మ
తనకేల నిడు ప్రసాదప్రాభవమున

పరమసారస్వత పారీణుఁ డగుచు
సరసకవిత్వ వాచాప్రౌఢి మెఱసి

యలమేలుమంగకు నాశుమార్గమున
సలలితంబుగ నొక్క శతకంబుఁ జెప్పె;

0 comments

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks