నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

Jul 24, 2009

ఇదె గోబ్రాహ్మణ రక్షకోసమయి యా యీ దేశసౌభాగ్యసంపదకై

తాటక వధ
విశ్వామిత్రుఁడు రామునితో తాటకిని వధించమని చెప్పినపుడు
మ.
అనినన్ రాముఁడు మీలితాక్షుఁడయి కట్టా ! యాఁడుదానిన్ వధిం
పను నా చేతికి నమ్మురాదనిన విశ్వామిత్రుఁడా దోష ముం
డిన నా యందున నుండు ధర్మమగు సంధింజూడు మట్లెంచ భూ
జనులిట్లే హతమారుచుండి రిటు లెంచన్ స్త్రీవధ క్లేశమున్. 131

విశ్వామిత్రుఁడు తాటకిని వధించమన్నప్పుడు రాముఁడు మీలితాక్షుడయి అయ్యో ! స్త్రీని వధించుటకు నాచేతికి బాణము రాదంటాడు. విశ్వామిత్రుఁడు ఆ దోషమేదయినా ఉంటే అది నాది. ఇలా స్త్రీవధ అనే క్లేశమును గుఱించి ఆలోచిస్తుంటే దానివలన అనేకమంది జనులు సంహరింపబడుతుంటారు. అంతేకాదు,
వ.
నృశంసుం డనృశంసుం డనక పాతకంబు సదోషం బనక సత్పురుషులు ప్రజారక్షణం బాచరింపవలయు; నిది సనాతనం బైన రాజధర్మంబు; ఇది పరమాధర్మురాలు; దీనింగూర్చి ధర్మవిచారణ లేదు; తొల్లి ధారణీదేవిఁ జంపబోవు మంథరను శక్రుండు వధించె, లోకంబనింద్రంబు జేయనెంచిన భృగుపత్నిని వెన్నుండు సంహరించె; అధర్మసహితలై స్త్రీలు తొల్లి మహా పురుషులచే వధింపఁబడిరి; ధర్మంబు మాకు వదలుము; నీప్రథమమార్గణదర్శనోత్సాహులము మాకుఁ గనువిందు సేయుము. 132
ఉ.
అల్ల భృశాశ్వునుండి సకలాస్త్రములున్ ననుఁ జేరె నస్త్రముల్
తల్లులు రెండునౌ నతిబలాబలలున్ నిను నన్ను నుండి శ్రీ
వల్లులు చేరె నేను గురువన్ గురుదక్షిణ యిమ్ము తాటకా
భల్లము నాకు రాఘవనృపాలక గేహమణి ప్రదీపికా ! 133

నేను నీకు గురువును. నీకు నా నుండి భృశాశ్వదత్తములు అస్త్రాలకెల్ల తల్లులు అనదగిన బల అతిబల అనే విద్యలు చేరినవి. నాకు గురుదక్షిణగా తాటకివధను చేయి. నీ ప్రతాపాన్నిచూడ ఉత్సాహపడుచున్నాము. మాకు కనువిందు చేయి అని అన్నాడు విశ్వామిత్రుడు.
మ.
అనినన్ రాముఁడు దోయిలించి ప్రభువా ! యట్లే పొనర్తున్ నినున్
నిను విద్యాగురు నేను గాదనుట లేనేలేదు; మా తండ్రులున్
ననుఁ బంపించెడు వేళ నీ వచనముల్ నానాత్రయీ మౌళిమం
డనముల్ గాఁగ సమాదరింపు మని యన్నారున్ మహః పేటికా ! 134

అలా అనగానే రాముడు దోసిలొగ్గి ప్రభూ అలాగే చేస్తాను నిన్ను నా విద్యాగురుని నేను కాదనుటన్నది లేనేనేదు. మా తండ్రిగారు సయితము మమ్ములను పంపించే టప్పుడు మీరు చెప్పిన పనిని వేదమంత్రములునుగా భావించి ఆచరించ మని చెప్పారు.
మ.
ఇదె గోబ్రాహ్మణ రక్షకోసమయి యా యీ దేశసౌభాగ్యసం
పదకై మద్గురు దక్షిణార్థమయి యీ పాపాత్మ యౌ తాటకన్
జదియింతున్ జదియింతు నంచును ధనుర్జ్యావల్లి శబ్దించినన్
హ్రద సేతుభ్రమ వారి నిస్వనముగా నార్చెన్ దిశాసంతతుల్. 135

ఇదె గోబ్రాహ్మణ రక్షకోసమయి యీ దేశసౌభాగ్యం కోసమై గురు దక్షిణ చెల్లించటం కోసమయి యీ పాపాత్మ అయిన తాటకిని వధిస్తాను అని అంటూ ధనుష్టంకారాన్ని చేసాడు రాఘవుడు.

తాటక వధ స్త్రీ హత్య. దానిని రాముడు చేసాడు గదా అని వాదించేవారికి సమాధానముగా విశ్వనాథవారు మంచి పకడ్బందీగా రామునిమీదకు నింద రాని విధంగా రాముడు ఎందుకు ఏ సందర్భంలో ఎలా దానినాచరించాడో వివరిస్తూ తెలియ చేసిన విధానం చాలా బాగా నచ్చింది నాకు.

రాముడు తాటకి కాలు సేతులు నరుకుతాడు ముందుగా , లక్ష్మణుడు ఆమె ముక్కుచెవులు కోస్తాడు. చివరాఖరికి శబ్దవేది విద్యను ప్రయోగించి రాముడు అదృశ్యరూపంలో ఉండి యుద్ధం చేస్తున్న తాటకిని సంహరిస్తాడు.




మ.

0 comments

Jul 22, 2009

కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే

SRI VENKATESWARA SUPRABHATAM IN TELUGU VIDEO


Hosted by eSnips
కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే
ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్.


చివరికెలాగయితేనేం దశరథుడు రామలక్ష్మణులను విశ్వామిత్త్రునితో యాగరక్షణకై పంపిస్తాడు.
ఉ.
స్కందవిశాఖు లిద్దఱును స్థాణుని వెంబడి నేగినట్లు శ్రీ
స్యందిముఖాశ్వినేయులును సారసగర్భుని వెంట నేగి న
ట్లందపుఁబ్రోవులౌ దశరథాత్మజు లిద్దఱు గాధిసూతి వెం
టం దపనీయ పాద వికట స్ఫురణంబుల నేగఁజొచ్చినన్. 76

స్కందుడు విశాఖుడు ఈశ్వరుని వెనుక వెళ్లినట్లుగాను, శ్రీస్యందిముఖాశ్వినేయులు విష్ణుని వెనుక వెళ్ళినట్లుగా రామలక్ష్మణులిరువురూ విశ్వామిత్రమహర్షి వెనుక వెళ్ళారట. ఇక్కడ విశ్వనాథవారు వెనుకకుఁ దిరుగఁడు తఱుముచు అని మొదలయ్యే 4 వరుస కందపద్యాల్ని వ్రాసారు. అలా వారు ముగ్గురూ సాయంత్రం అయ్యేసరికి సరయూనది దక్షిణ తీరం చేరతారు. ఆ సాయం వేళలో సూర్యాస్తమయానికి ముందుగానే రామలక్ష్మణులకు బల అతిబల అనే రెండు విద్యలను నేర్పిస్తాడు. వీటి ప్రభావం వలన వారిని ఆకలి దప్పులు, జ్వరము మొదలగునవి బాధించవు. ఆ రాత్రికి వారు ముగ్గురూ అక్కడ నిద్ర చేస్తారు. వేకువనే విశ్వామిత్రుడు మేల్కని రామలక్ష్మణులను నిద్రలేపుతాడు.

తొలివెలుఁగయ్య నిదోయి ! యోయి ! యోకో
సల సుతప్రజ ! సాధు రామచంద్రా !
తొలివెలుఁగయ్య నిదోయి ! కౌసలేయా !
మెలకువ వచ్చెనె మీకు రామభద్రా !

లేచి దైవమైన యాహ్నికంబుఁ దీర్పుండనినఁ దల్లి పిలుపుకన్నఁ బ్రేమార్ద్రము మృదువు నైన మునిమాటకు మేల్కని ---
SRI VENKATESWARA SUPRABHATAM IN TELUGU VIDEO
Hosted by eSnips

0 comments

Jul 21, 2009

మొదట నిత్తు నంచుఁ బిదప నీకుండుట యశ్వమేఘయాగ హతము సేత

మ.
పసివాఁడే పసివాఁడు రాఘవుఁడు నా ప్రాణంబులోఁ బ్రాణ మా
నిసువుం గాంచఁగ బడ్డ కష్టములు తండ్రీ ! విస్మృతిం గాంచలే
నస లీ నాఁటికి నేను; నీ కరుణ కట్టా యెంతదూరమ్ముగా
మసలున్ ? వచ్చెనొలేదొ రామునకు శంస్యమ్ముల్ పదార్వర్షముల్. 48

రాముడు పసివాడే పసివాడు , నా ప్రాణంలో ప్రాణం, ఆ నిసువుని కనడానికి పడ్డ కష్టాలు ఇంకా మరచిపోలేకుండా వున్నాను. నీ కరుణ నా కెంత దూరం గా వుంది. రాముడికింకా నిండా పదహారేళ్ళొచ్చేయో లేదో కూడాను.
ఉ.
తా మమకారమే యనుము తక్కిన ముగ్గురొకెత్తు వాఁడొకె
త్తోముని ! నాకు ; వానివిడి యోర్వఁగఁజాలను గోసలేంద్ర క
న్యామణి యోర్వ దెవ్వ రెటులైనను గైకయు యోర్వఁజాలదా
రాముఁడు లేని నాదు గృహరాజియు జీఁకటికోణముల్ మునీ ! 49
ఉ.
పువ్వులఁ గొట్టినన్ సొలసిపోయెడు రాముఁడు యుద్ధభూమిలో
నెవ్వడు ? వాఁడు నేర్చినది యేమి మహాధనురస్త్రవిద్య ? యా
యెవ్వరు విఘ్నకృద్దిజు లెవ్వని పుత్రకు లేమివారు ! నే
జివ్వకు దూసి వారలను జెండుట కేమి యుపాయ మొప్పెడిన్. 53

అనగా విశ్వామిత్రుడు రావణాసురుడిని గురించి వాని బంధువులైన మారీచ సుబాహుల్ని గురించి వాళ్ళు తన యాగం పాడు చేయటం గురించీ చెప్తాడు. అది విని దశరథుడు రాముడిని పంపనంటాడు. అప్పుడు విశ్వామిత్రునికి కోపం వచ్చి
మ.
అవునయ్యా ! యవునిత్తు వంటి మొదలీ యంతంబునం దీయనం
టివి; పోనీ ! రఘువంశయోగ్యమగునో నీ చేఁత ! నీకున్ సుఖం
బవు నీ బంధులు నీవునున్ సుఖము పెల్లైయుండుఁ డేఁ బోదు మా
నవనాధా ! సుఖమౌత నీకును బ్రతిజ్ఞాభంగపుణ్యాబ్ధికిన్. 63

సుఖం అనే మాటని మూడుసార్లనిపించారు. ప్రతిజ్ఞాభంగపుణ్యాబ్ధికిన్ అనే మరో చురక కూడా.

ఇలా అని చెప్పి విశ్వామిత్రుడు వెలుపలి ద్వారం దాకా వచ్చేస్తాడు. విశ్వామిత్రుని కోపం తగ్గింపజేసి వానిని తిరిగి వెనుకకు రప్పించమని వశిష్ఠుల వారిని వేడుకుంటాడు దశరథుడు.
క.
వైకుంఠ మొత్తిగిలినను
వైకుంఠ మె యొడ్డుకొనఁగవలయును మోహ
వ్యాకులత చిత్తు నన్నున్
గైకో సాఁకంగ నీకుఁగా కెవరికయా ! 66
వశిష్ఠుల వారంటారప్పుడు.
ఆ.
మొదట నిత్తు నంచుఁ బిదప నీకుండుట
యశ్వమేఘయాగ హతము సేత
మొదట వాపిఁ ద్రవ్వి పిదపఁ బూడ్పించుట
యీవు ధర్మ మూర్తి విదియుఁ దగునె 68


0 comments

రాముఁడు నాకు స్నానమగు రాముఁడు నాకు జపంబు ధ్యానమున్

విశ్వామిత్రుడు రాముని యాగసంరక్షణార్థం పంపించవలసిందని దశరథుని కోరుట

చిత్తము చిత్తమంచు నృపశేఖరుఁ డాసమదాస్యహాసుఁ డై
యొత్తిగిలెన్ నిషణ్ణతను నొత్తిడిఁ జేసెను మౌని రాజు లో
నుత్తలమందుచున్ బ్రభు ! ప్రభూ ! బ్రతుకంతయు వాచి కన్న యీ
పొత్తులబిడ్డఁ బాయ నిలుపోపనయా ! నిముసంబు నేనియున్. 32

అలా విశ్వామిత్రుడు రాముడ్ని తనతో పంపించమని అడగ్గానే దశరథుడు ' చిత్తము ', ' చిత్తము ' అని అంటున్నాడే కాని ముఖంలో కత్తివాటుకు నెత్తురుచుక్క లేకుండా అయిపోయిన వాడై ప్రక్కకు ఒత్తిగిలగా విశ్వమిత్రుడు అతడిని తిరిగి తిరిగి ఒత్తిడి చేయసాగాడు. అప్పుడు రాజు కలతచెందుతూ ' ప్రభు ! ', ' ప్రభూ !' "బ్రతుకంతా వాచి కన్న యీ పొత్తుల బిడ్డని ఒక నిముషమైనా విడిచిపెట్టడాన్ని సహించలేనయ్యా." అన్నాడు.
రామాయణం అచ్చంగా తెలుగు నేలమీదే జరిగిందనిపించేలా విశ్వానాథ వారుపయోగించిన అచ్చమైన తెలుగు పలుకుల నుడికారపు చెణుకులు. బ్రతుకంతా వాచి కన్న పొత్తులలోని బిడ్డడట రాముడు నిముసం కూడా విడిచి ఉండలేడట. అంతేకాదు,
ఉ.
రాముఁడు నాకు స్నానమగు రాముఁడు నాకు జపంబు ధ్యానమున్
రాముఁడె యెల్ల నాబ్రతుకు రాముఁడు నన్నును గన్నతండ్రి యీ
రాము వినా నిమేష మవురా మన జాలను గాదయేని నీ
రామునివీడి యీ యఖిలరాజ్యము గాధిసుతా ! గ్రహింపవే ! 33

రాముడే నాకు స్నానం, రాముడే నాకు జపం, రాముడే నాకు ధ్యానం, నా బ్రతుకే రాముడు, నేనతడ్ని కన్నతండ్రిని కాదు, రాముడే నన్ను కన్నతండ్రి . అటువంటి ఈ రాముడ్ని విడిచి ఒక్క నిముషం కూడా నేను బ్రతికి బట్టకట్టలేను. అంచేత ఈ రాముడ్ని మటుకు విడిచిపెట్టి ఓ గాధిసుతా ! యీ అఖిల రాజ్యాన్నీ తీసేసుకోవయ్యా ! అన్నాడు దశరథుడు.
ఇదే పద్యాన్ని దశరథుడు కైకేయి రాముని వనవాసానికి పంపమని కోరినప్పుడుకూడా అంటాడు. అచ్చ తెనుగు నుడికారం. విశ్వనాథో నమో నమః.
మ.
వసుధేశుం డిటులన్న యంతటన విశ్వామిత్రు నాస్యోద్గతం
బసకృద్ధాసము చిళ్ళ చిళ్ళలయి రాజాంతఃపురం బంతటన్
ముసరెన్ మౌనియు నిట్లు చెప్పె బళిరా ! భూపాల ! నీవేదియై
న సరే యింతకుమున్న యిత్తునని యన్నావే కదా దాత వై. 34

దశరథ మహారాజీ విధంగా అనగానే విశ్వామిత్రుని ముఖం నుండి కోపం చిళ్ళ చిళ్ళలయి(ఎంత అందమైన ప్రయోగం) రాజాంతఃపురాన్ని అంతటనూ ముసరిపోయిందట. ముని ఈ విధంగా పలికాడట: భళిరా ! భూపాల ! నీవేదియైనా సరే యిస్తానని ఇంతకు ముందే కదా అన్నావు పెద్ద దాత లాగ ! అని అంటపొడుస్తున్నట్లుగా అన్నాడు విశ్వామిత్రుడు.
క.
నీ కొడుకును గైకొనిచని
మా కాఁకలి యంచుఁదిందుమా ? పిచ్చినృపా !
మాకడఁ బ్రశస్త మస్త్ర
వ్యాకృతి కలదద్ది నేర్పి పంపెద మింతే. 35

నీ కొడుకుని తీసుకుపోయి మాకు ఆకలన్చెప్పి తింటామా ఏమిటి ? పిచ్చి రాజా ! మా దగ్గఱ బోల్డన్నిప్రశస్తమయిన అస్త్రశస్త్రాలు పడి మూలుగుతున్నాయయ్యా ! వాటిని నేర్పి పంపిస్తామంతే.
ఉ.
ఇమ్మగు విద్య నేర్పెదము నింకను నాకొక చిన్నమెత్తు కా
ర్యమ్మును జేసిపెట్టవలె నాపయిఁ బూవులలోనఁ బెట్టి కై
కొమ్మని నీకుమారుఁ డిడుగో నని నీక యొసంగువార మా
పిమ్మట నీవుగా నతని వీడవలెన్ మఱి మాకు నేటికిన్. 36

యుక్తమైన విద్యలను అతనికి నేర్పిస్తాము. ఇంకా నాకో చిన్నమెత్తు పనికూడా చేసిపెట్టాల్సింది వుంది. ఆ పైన నీ కుమారుడిని పూవుల్లోపెట్టి నీ కుమారు డిడిగో తీసుకో అని చెప్పి మరీ నీ కప్పగిస్తామయ్యా. ఆ పైన నీవుగా నీవే అతడిని విడిచిపెట్టాలి కాని మాకు సంబంధం లేదయ్యా అన్నాడు గాధిసుతుడు. (అవును ఋషివాక్కు భవిష్యద్దర్శనం చేస్తున్నది రాముడు వనవాసానికి వెళ్ళాక దశరథుడు పరలోకగతుడౌతాడు). తనకున్న ఆ చిన్నమెత్తు పని ఏమిటో కూడా చెప్తున్నాడు.

1 comments

Jul 16, 2009

ఊరకే యనలము దాచుకొన్న ఫలమా ? క్రతు యోగ్యము కావలెం జుమీ !

విశ్వామిత్రుడు రాముడిని తనతో యజ్ఞసంరక్షణార్థము పంపమని కోరుట.

దశరథుడు విశ్వామిత్రునితో ఇలా అన్నాడు.
క.
ఊరకయ వచ్చి యుందురు
కోరిక యొక్కండు నన్నుఁ గోరుఁడు నేనుం

దీఱిచెద జన్మసఫలతఁ

గూరిచికొన వచ్చినందుకున్ దీర్థమతుల్.
19

మీరు నా దగ్గరకు ఏమీ ఆశించకుండా ఊరికే వచ్చివుంటారు. కాని మీరు నన్నో కోరిక కోరుకోండి. నా జన్మ సాఫల్యమయ్యేట్టుగా నేను తీరుస్తానని కూడా అన్నాడు. ఇంకా ఇలా కూడా అన్నాడు.
క.
ఇది యడుగవచ్చుఁ గాదని
మది నెంచకుఁ డేదియైన మామక పుణ్యా

స్పదము హఠాస్స్ఫురితము నీ

వదనంబుననుండి రానె వలయును స్వామీ
.20

హఠాత్తుగా మీకేది తోస్తే అది అడిగెయ్యాలి సందేహం లేకుండా-అని కూడా రొక్కించాడు.

దానికి విశ్వామిత్రుడు
సీ.
పాప మెన్నేండ్లకో పడయఁజాలవు సంతు
తుదకేమొ రత్నపుఁ దునుక కలిగె

నే ముని యాశ్రమ మ్మేగిన నీ కుమా

రుని గూర్చియే చెప్పుకొనుచునుంద్రు

పసివానిఁ బొగడుట పాటిగా దైనను

నింతని నీ భాగ్య మెట్లు చెప్ప

నాపనిఁ జెప్పెద నాపైని ముందు నీ
సుతు రామభద్రుని జూడవలయుఁ

గీ.

గబురుపంపు మనంగ భూకాంతుఁ డంత
రామభద్రుని బిలిపించె రామభద్రుఁ

డరుగుదెంచెను లక్ష్మణుం డరుగు దెంచె

నతని వెంబడి వినయంబు లతిశయిల్ల. 24


పాపం ఎన్నాళ్ళకెన్నాళ్ళకో గాని నీకు సంతానం కలుగలేదు. చివరికేమో రత్నపు తునకే పుట్టింది నీకు. మేము ఏ ముని ఆశ్రమానికెళ్ళినా నీ కొడుకు గుణగణాలే వింటున్నాం. పసివాడిని - పొగడకూడదు కాని నీ భాగ్యం ఇంతటిది అని ఎలా చెప్పేది. నా పని తరువాత చెప్తాను , కాని ముందు రాముడ్ని చూడాలయ్యా కబురు పంపు అని అడగ్గా దశరథుడు రామభద్రుని పిలిపించాడు. రామునితో పాటుగా లక్ష్మణుడూ అక్కడకు వచ్చి ఇద్దరూ విశ్వామిత్ర మహర్షికి పాదాభివందనం చేస్తారు.
తరువాత
సీ.
గాధేయుచూపులు కమలపత్రాభిరా
మము లైన రామునేత్రములఁ గలియు
గాధేయుకన్నులు కదలి వశిష్ఠుల
స్తిమితనేత్రములను జేరఁబోవు
గాధేయు చూపులు కమనీయ రామ మే
ఘముమేన శంపాభకాంతు లొలయు
గాధేయు కన్నులు కదలి వశిష్ఠ శం
పాలోచనైక్యభావంబు నందు
గీ.
రామచంద్రుని మధురదర్శనములోన
నిరువురు మునీంద్రులును బ్రహ్మఋషిత గాధి
సుతునకు వశిష్ఠు లిచ్చిన శుభసమయము
నందుఁగన్నను నధికసౌహార్ద్రులైరి. 28

గాధేయు చూపులు, గాధేయు కన్నులు - అనే వాటిని రెండేసి సార్లు పునరిక్తమయ్యేలా విశ్వనాథ వారు ఇక్కడ సాభిప్రాయంగా ఉపయోగించారు.
గాధేయుని చూపులు మొదట కమలపత్రాభిరామములైన రామచంద్రుని నేత్రములను కలిసాయట. ఆ సుందర నేత్రాలను చూచిన తర్వాత అక్కడనుండి గాధేయుని కన్నులు వశిష్ఠుల స్థిమితమైన నేత్రాలను చేరబోయినవట.
తరువాత గాధేయు చూపులు అక్కడనుండి తిరిగి అందమైన రాము డనే మేఘము మేని మీదకు మెఱపుల కాంతులలా ప్రకాశించాయట. అక్కడనుండి కదలి గాధేయుని కన్నులు వశిష్ఠుని మెరిసే కన్నులతో ఐక్యమయ్యాయట. రామచంద్రుని దర్శనములో ఇరువురు మునీంద్రులు కూడా పూర్వం గాధేయుని బ్రహ్మర్షిగా వశిష్ఠులవారు అంగీకరించి కీర్తించిన సమయంలో కంటె ఎక్కువ సౌహార్దాన్ని పొందారట ఆసమయంలో. ఎంత చక్కనైన వర్ణన.

అప్పుడు విశ్వామిత్రుడు దశరథునితో తన కోరిక ఇలా తెలియజేసాడట.
మ.
ఎవరయ్యా ! రఘురామచంద్రులకుఁ గానీ యస్త్రవిద్యాగురుల్
నవ బాహాపటుదీర్ఘదండునకు నీ నా యొద్ద శిష్యత్వ మొ
ప్పవలెన్ శ్రీరఘురాముబాహుపటిమల్ ప్రాశస్త్యమందన్ వలెన్.
వివృతంబుల్ మునికోటియజ్ఞతతి నిర్విఘ్నత్వ మొప్పన్ వలెన్. 30

ఎవరయ్యా రఘురామచంద్రులకు అస్త్రవిద్యా గురువులు ? ఈ నవ బాహాపటుదీర్ఘదండుడైన రామచంద్రునికి నీ (వశిష్ఠుని) నా (విశ్వామిత్రుని) యొద్దనే శిష్యత్వమొప్పవలె , అప్పుడే ఈ శ్రీరఘురామచంద్రుని బాహుపటిమల్ ప్రాశస్త్యమందుతాయి, మరియు మునుల యజ్ఞములు నిర్విఘ్నంగా ప్రకాశిస్తాయి.

అంతేకాదు.
చ.
మొనసి భృశాశ్వదత్తములు మూల్గుచునున్నవి నా కడన్ మహా
స్త్ర నిభృత విద్య లట్లె రఘురామున కై యవి యెల్ల నిచ్చెదన్
మనుజమహేంద్ర ! పంపుము కుమారుని నా వెనువెంట ; నూరకే
యనలము దాచుకొన్న ఫలమా ? క్రతు యోగ్యము కావలెం జుమీ ! 31

భృశాశ్వునిచే ఈయబడిన శస్త్రాస్త్రములు ఎన్నో నా దగ్గఱ మూల్గుచూ ఉన్నాయి. వాటినన్నింటినీ రఘురాముని కై ఇచ్చెస్తాను. ఓ రాజేంద్రా ! నీ కుమారు డైన రాముడ్ని నాతో పంపించు . ఊరకే అగ్నిని దాచుకుంటే ఫలితమేంటయ్యా ? అది క్రతువునకు ఉపయోగపడితేనే దాని ఉపయోగం కాని. అన్నాడు విశ్వామిత్రుడు దశరథునితో.


0 comments

Jul 13, 2009

కక్ష్యాంతరములఁ జక్కఁగ ద్రోవ వదలుఁడా ! ద్వారపాలకుల మొత్తములవారు

అహల్యాఖండము
విశ్వామిత్రుఁడు దశరథునికడకు వచ్చుట
గీ.
అర్ఘ్య మర్ఘ్యమ్ము పాద్యమ్ము పాద్య
మవనిపతిఁ జెప్పఁబంపుడీ ! యవనిపతికిఁ
జెప్పఁబంపుడి ! ప్రభువు వశిష్ఠమునికిఁ
దెలియవలయు బ్రహ్మర్షికిఁ దెలియవలయు.

విశ్వామిత్ర మహర్షి రాకను ఎంతగా తగిన రీతిలో హడావుడిని సృష్టించి మరీ చెప్పారో చూడండి. ఒక్కొక్క పదాన్నీ రెండేసి సార్లు పలకించారు చూడండి. ఇలా చేయటం వలన చెప్పాలనుకున్నదానికి మంచి ఊపు వస్తుంది. పాఠకులకు సంభ్రమం కలుగుతుంది. కూడా కూడా వస్తాడు పాఠకుడు.
సీ.
కక్ష్యాంతరములఁ జక్కఁగ ద్రోవ వదలుఁడా !
ద్వారపాలకుల మొత్తములవారు
ఇరువంకలను బరాబరులుగా నిలువుఁడా !
చాలు లై వెండిబెత్తాలవారు
రహిని గర్పూరనీరాజనం బెత్తుఁడా !
కంకణా లులియ హెగ్గళ్ళవారు
వింజామరములు వీవుఁడా వినయమ్ము !
కందళింపగఁ గంచుకాలవారు
గీ.
ఎవరయా ? ప్రతీహారు లా యెవరొగాని
యవనినాధునకును గబురందవలయు
నింక నిచ్చటనేయుండి రేమి మీరు ?
రాజఋషి బ్రహ్మఋషి గాధిరాజసుతులు. 3
హెగ్గళ్ళవారు=అంతఃపురపు కావలివారు

ఎంత బాగుందో చూడండి. ఆ మహాఋషికి తగిన స్వాగతం పలుకుతున్నట్లుంది. ఈ ఘట్టాన్ని ఇతర రామాయణాలలో ఇంత పకడ్బందీగా నిర్వహించి ఉండలేదనుకుంటాను.
శా.
అంతర్వంశికు లిట్లుగా గుడుసులై యంతంతఁ ద్రొక్కిళ్ళుగా
నింతంతం జని సౌవిదల్లకజనుల్ హెగ్గళ్ళు దౌవారికుల్
బంతుల్ దీరిచి కొల్వఁగాఁ బనిచి భూపాలున్ బ్రబోధింపఁగా
నంతఃపత్తన మేగి తెల్పఁగ నృపుం డావిర్భవద్భక్తి యై. 4
వ.
ఒక్కనిమేషంబులోన జాబాలి కశ్యప సుయజ్ఞ వశిష్ఠులరుగుదేర దశరథబండు సపురోథసుఁడై విశ్వామిత్రున కెదురుపోయి. 5
ఎంత వేగంగా పనులు జరిగినాయో చూడండి. ఒక్క నిమేషంబులోన అందరూ కూడుకున్నారట.

1 comments

Jul 9, 2009

తానో 'లాములు' తండ్రి పేరెవరయా ? 'దాచాతమాలాలు' నౌ

శా.
తానో 'లాములు' తండ్రి పేరెవరయా ? 'దాచాతమాలాలు' నౌ
లే ! నాపే' రన 'నమ్మగాల' నఁగ నోలిందల్లి 'కౌసల్య తం
డ్రీ !' నాఁగా ననఁబోయి రాక కనులన్ నీర్వెట్టఁ 'గౌసల్య నౌఁ
గానే కానులె యమ్మనే' యని ప్రభున్ గౌసల్య ముద్దాడెడిన్. 334

కౌసల్య తన చిన్ని రామునితో ఆడుతున్నప్పుడు సంభాషణా పూర్వకంగా నడిచిన ఘట్టమిది.

కౌసల్య బాలరాముణ్ని తన పేరేమిటో చెప్పమంది. 'రాముడు' తన పేరులోని 'రా' అనే అక్షరం , 'డు' అనే అక్షరం సరిగా పలక చేతరాక 'లాములు' అని అంటాడు.

నాన్నపేరేమిటీ అని అడుగుతుంది వెంటనే, ఏం చెపుతాడో ఎలా చెపులాడో వినాలనే సహజమైన కుతూహలంతో.

'దశరథమహారాజు' అనే పదాల్ని పలక రాక 'దాచాతమాలాలు ' అంటాడు.

కొడుకు నుండి సరియైన సమాధానం వచ్చేసరికి ఇంకా రెట్టించిన ఉత్సాహంతో 'మరి నా పేరో' అంటుంది. చెప్పగలడేమో ననే ఆశతో. కాని చిన్నపిల్లలకి అమ్మ పేరుతో పనేంటి. అమ్మ అమ్మే కదా.

అందుకని 'అమ్మగారు' అనబోయి నోరు తిరక్క 'అమ్మగాల' అంటాడు. అతడ్ని సరిచేద్దామని 'కౌసల్య తండ్రీ' అని చెప్పుతుంది. కాని చిన్నపిల్లాడికి నోరు తిరగొద్దూ. అంచేత అలా అనటానికి ప్రయత్నించిన వాడై చేతకాక, చెప్పలేక పాపం కన్నులకు నీరు తెచ్చుకున్నాట్ట ఆ పసిబిడ్డడు. వెంటనే ఊరడించాలిగా ఏడవబోతున్న బిడ్డని తల్లి , అందుచేత 'కౌసల్యను కానులే', 'అమ్మనే' అంటూ బాబుని ఊరడించి మనకు ప్రభువైన ఆ శ్రీరామచంద్రులవారిని కౌసల్యాదేవి ముద్దాడిందట.
తల్లులు తమ పిల్లలతో వాళ్ళ వాళ్ళ పేర్లు చెప్పించుకొనే ఈ ఘట్టాన్ని అత్యంత రమణీయంగా సహజసుందరంగా తీర్చి దిద్దిన విశ్వనాథ వారికి ఏం చేసి ఈ జాతి తన ఋణం తీర్చుకోగలుగుతుంది ? వారి గ్రంధాలు చదివి ఆనందించడం తప్పించి.

3 comments

స్నాన మాడిన బాలెంత చక్కఁదనము

తే.
స్నాన మాడిన బాలెంత చక్కఁదనము
పరిణయమునాటి యందమ్ము పాదరించు
రాజు శిశువులఁ గాంచునో ! రాణులముఖ
దేహకాంతులు కాంచునో ! తెలియలేదు. 270
తే.
రంజితాధర తాంబూల రక్తిమంబు
చిఱునగవు తెల్లఁదనములోఁ జిటిలిపోవ
నెఱుపు విరుగుచుం దెలినిగ్గు లెక్కుచంద్ర
బింబములవోలె సతులు కన్పించినారు. 271
తే.
ఆఱుగడియలలోఁ దల్లి యనుట తెలియు
నాఱు నెలలకుఁ బైఁ దండ్రి యనుట తెలియు
ననుట నిజమే శిశువు రాజుహస్తమందు
నేడ్చి కౌసల్య చేతిలో నేడ్పు మానె. 273

0 comments

Jul 7, 2009

కెవ్వున స్నిగ్ధమంథరము కేక వినంబడె మంత్రసానియున్

శ్రీరామ జననం
ఉ.
కెవ్వున స్నిగ్ధమంథరము కేక వినంబడె మంత్రసానియున్
బువ్వునువోలెఁ జే శిశువుఁబూనెను బట్టపురాణియున్ గనుల్
నొవ్వగుమూఁతవిచ్చుచు గనుంగొనె భాగ్యము నామె కన్నులున్
నవ్వెనొ జాలిపొండెనొ సనాతనమౌ మధుకాంతిఁ జిమ్మెనో ! 211

ఎంత స్నిగ్ధ సుందరంగా వుందీ పద్యం.
క.
అలసములగు చేతుల గో
సలరాట్సుత శిశువు గొనఁగఁజాచెను నవ్వుల్
గిలకొట్టి మంత్రసానియు
వలదని చేసన్నఁ జేసి బాలుని గిల్లెన్. 212
క.
కెవ్వునఁ గేక లిడెన్ శిశు
నవ్వసుధానాథు మహిషి ప్రాణములందున్
జివ్వు మనె మంత్రసానికి
నవ్వులు పరిహాసములును నానావిధముల్. 213

గిల్లితే మరి ఏడవడా, పాపం !
ఉ.
మంతరసానితో నొకతె మానుము తప్పుడుదాన ! పిల్లవాఁ
డెంతగ నేడ్చెనే యనిన యేడ్వడొ ? యింకను వడ్లగింజము
ల్లంతటిసామి వచ్చె జగమంతయు నాఁగదొ యింక నంచుఁ గే
రింతలు నాడుచున్ బులకరించెను జూపులలో సమార్ద్రమై. 214

ఇటువంటి పద్యాలు చదువుకోడానికి మనమెంత పుణ్యం చేసుకున్నామో కదా.
బాలునికి బొడ్డుకోసిన తర్వాత--
ఆ.
గోదుమలనుబోసి గొతుపుపట్టుంజీరఁ
బఱిచి లోకనాథుఁ బండఁబెట్టి
గడ్డమీఁది చిన్న బిడ్డ మాదంచును
గొఱవిఁ ద్రిప్పినారు గ్రుడ్డుచుట్టు.225

ఇది యేమిటో , ఇలా ఎందుకు చేస్తారో నాకు తెలియదు. ఎవరైనా తెలియజేస్తే వారికి ముందుగా నా కృతజ్ఞతలు.
క.
చిటచిట సవ్వడి వినఁబడె
గిటకిటనన్ బట్టమహిషి కిటికిదెసఁ గనన్
చిటికలు గుటికలు మెటికలు
పటపట చిటచిటని జల్లువాన కురిసెడున్. 227
క.
చినుకులను దిస్సమొలతోఁ
జని చేతులు చాఁచుకొంచు జగ్గులనవ్వుల్
తనరఁగ శాంతాదేవీ
వనితామణి కొడుకు వానవల్ల ప్పాడెన్. 230
ఉ.
నిండిన కోర్కి చేత నవనీపతి లో నయనాభిరామచం
ద్రుం డనుకొంచు బోవు నొకత్రోపున లో శతశోభిరామచం
ద్రుండనుకొంచుఁబోవు హృదిఁద్రొక్కిసలాడుచు నంత రామచం
ద్రుండనుకొంచు బోవు నెద నూర్పిడిసేయుచుఁ దూరుపెత్తుచున్. 243

0 comments

Jul 6, 2009

తా నదేమో పిచ్చితల్లి కౌసల్య యే ప్రేమఁబోయిన నదే ప్రేమఁబోవు

సీ.
తా నదేమో పిచ్చితల్లి కౌసల్య యే
ప్రేమఁబోయిన నదే ప్రేమఁబోవు
శాంత పంపించిన సన్నజరీచీరఁ
బదునేడుదినము లాపగిది కట్టె
నెందఱు వలదన్న నిది శాంతచీరంచు
నది యుతికించును నదియ కట్టుఁ
దెలివి యరుంధతీ దేవి వల్కలమీయ
నాపైని నది తాల్చె నదియ పనిగఁ
గీ.
పదియునాల్గుదినంబు లాపగిదిఁజూచి
కొఱ్ఱుపట్టిన వని దాచికొనియె దాసి
పట్టమహిషి మహాయోగ పరిధులైన
చీర లాపైని దాల్పఁ జేసినది దాసి. 165

ఇటువంటి హృదయంగమమైన పద్యాలు రాయటం కేవలం విశ్వనాథ వారికే చేతనౌను. స్త్రీల మనోభావాలను ఇంతందంగా వ్యక్తీకరించటం వారికే చెల్లు. ఆమాటకొస్తే స్త్రీ కవయిత్త్రులలో కూడా వారి వారి భావాలను విశ్వనాథ వారిలా ఇంతందంగా చెప్పినవారెవరూ లేరు నాకు తెలిసి. తరువాతి పద్యం చూద్దాం రండి.
సీ.
శ్రీరంగనాథపూజా రాజిత వ్రత
దినమును స్నానమాడును దలార
నెలకు మూన్నాళ్ళు వానలయెద్దడిని మడి
చీర యారక తడిచీరఁగట్టు
యజ్ఞ శేషము వశిష్ఠాశ్రమమ్ముననుండి
తినదు సుయజ్ఞుండు తెచ్చుదాఁకఁ
బ్రాశించదును రంగపతి కారగింపైన
వార్తయంచెలమీఁద వచ్చుదాఁకఁ
గీ.
బర్వదినములఁ జిఱుచాప పైని బండు
కొనును జూలాండ్రరకు నివి కూడ దనుచు
మొత్తుకొందురు దాసీలు ముసలివారు
వ్రతము భంగముచేయదు రాణిగారు. 166

శ్రీరంగనాథ పూజాదినం నాడు కౌసల్య తలారా స్నానం చేస్తుందట.
నెలకు మూడురోజులు వానలవల్ల తన మడిచీర లారకపోతే ఆ తడిచీరల్నే మళ్ళీ కట్టుకుంటుందట.
సుయజ్ఞుడు వశిష్ఠాశ్రమం నుంచి యజ్ఞశేషాన్ని తెచ్చిస్తేగానీ ముందుగా ఆమె వేరేమీ ముట్టుకొనేది కాదట.
రంగపతికి ఆరగింపు సేవ పూర్తయిందన్న వార్త అంచెలంచెలమీద ఆమెకు చేరితేనే కానీ ఇంకేమీ ముందుగా నోట పెట్టేది కాదట .
పండుగరోజుల్లో చిఱుచాప మీద నేలపైనే పవ్వళించేది కాని చూలాండ్రకది కూడదని ఎందరు యెన్నివిధాల చెప్పినా వినేది కాదట.
ఎందరు ముసలిదాసీలు నెత్తీనోరూ మొత్తుకున్నా కూడా ఆమె మటుకు వ్రతభంగాన్ని కానిచ్చేది కాదట.
అవును మరి! ఆమె జన్మనీయబోయేది ఎవరికి ? సాక్షాత్తూ ఆ శ్రీరామచంద్రులవారికి కదా. మరలాంటప్పుడు వ్రతభంగాన్నెలా చేస్తుందావిడ.

0 comments

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks