నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

Jul 16, 2009

ఊరకే యనలము దాచుకొన్న ఫలమా ? క్రతు యోగ్యము కావలెం జుమీ !

విశ్వామిత్రుడు రాముడిని తనతో యజ్ఞసంరక్షణార్థము పంపమని కోరుట.

దశరథుడు విశ్వామిత్రునితో ఇలా అన్నాడు.
క.
ఊరకయ వచ్చి యుందురు
కోరిక యొక్కండు నన్నుఁ గోరుఁడు నేనుం

దీఱిచెద జన్మసఫలతఁ

గూరిచికొన వచ్చినందుకున్ దీర్థమతుల్.
19

మీరు నా దగ్గరకు ఏమీ ఆశించకుండా ఊరికే వచ్చివుంటారు. కాని మీరు నన్నో కోరిక కోరుకోండి. నా జన్మ సాఫల్యమయ్యేట్టుగా నేను తీరుస్తానని కూడా అన్నాడు. ఇంకా ఇలా కూడా అన్నాడు.
క.
ఇది యడుగవచ్చుఁ గాదని
మది నెంచకుఁ డేదియైన మామక పుణ్యా

స్పదము హఠాస్స్ఫురితము నీ

వదనంబుననుండి రానె వలయును స్వామీ
.20

హఠాత్తుగా మీకేది తోస్తే అది అడిగెయ్యాలి సందేహం లేకుండా-అని కూడా రొక్కించాడు.

దానికి విశ్వామిత్రుడు
సీ.
పాప మెన్నేండ్లకో పడయఁజాలవు సంతు
తుదకేమొ రత్నపుఁ దునుక కలిగె

నే ముని యాశ్రమ మ్మేగిన నీ కుమా

రుని గూర్చియే చెప్పుకొనుచునుంద్రు

పసివానిఁ బొగడుట పాటిగా దైనను

నింతని నీ భాగ్య మెట్లు చెప్ప

నాపనిఁ జెప్పెద నాపైని ముందు నీ
సుతు రామభద్రుని జూడవలయుఁ

గీ.

గబురుపంపు మనంగ భూకాంతుఁ డంత
రామభద్రుని బిలిపించె రామభద్రుఁ

డరుగుదెంచెను లక్ష్మణుం డరుగు దెంచె

నతని వెంబడి వినయంబు లతిశయిల్ల. 24


పాపం ఎన్నాళ్ళకెన్నాళ్ళకో గాని నీకు సంతానం కలుగలేదు. చివరికేమో రత్నపు తునకే పుట్టింది నీకు. మేము ఏ ముని ఆశ్రమానికెళ్ళినా నీ కొడుకు గుణగణాలే వింటున్నాం. పసివాడిని - పొగడకూడదు కాని నీ భాగ్యం ఇంతటిది అని ఎలా చెప్పేది. నా పని తరువాత చెప్తాను , కాని ముందు రాముడ్ని చూడాలయ్యా కబురు పంపు అని అడగ్గా దశరథుడు రామభద్రుని పిలిపించాడు. రామునితో పాటుగా లక్ష్మణుడూ అక్కడకు వచ్చి ఇద్దరూ విశ్వామిత్ర మహర్షికి పాదాభివందనం చేస్తారు.
తరువాత
సీ.
గాధేయుచూపులు కమలపత్రాభిరా
మము లైన రామునేత్రములఁ గలియు
గాధేయుకన్నులు కదలి వశిష్ఠుల
స్తిమితనేత్రములను జేరఁబోవు
గాధేయు చూపులు కమనీయ రామ మే
ఘముమేన శంపాభకాంతు లొలయు
గాధేయు కన్నులు కదలి వశిష్ఠ శం
పాలోచనైక్యభావంబు నందు
గీ.
రామచంద్రుని మధురదర్శనములోన
నిరువురు మునీంద్రులును బ్రహ్మఋషిత గాధి
సుతునకు వశిష్ఠు లిచ్చిన శుభసమయము
నందుఁగన్నను నధికసౌహార్ద్రులైరి. 28

గాధేయు చూపులు, గాధేయు కన్నులు - అనే వాటిని రెండేసి సార్లు పునరిక్తమయ్యేలా విశ్వనాథ వారు ఇక్కడ సాభిప్రాయంగా ఉపయోగించారు.
గాధేయుని చూపులు మొదట కమలపత్రాభిరామములైన రామచంద్రుని నేత్రములను కలిసాయట. ఆ సుందర నేత్రాలను చూచిన తర్వాత అక్కడనుండి గాధేయుని కన్నులు వశిష్ఠుల స్థిమితమైన నేత్రాలను చేరబోయినవట.
తరువాత గాధేయు చూపులు అక్కడనుండి తిరిగి అందమైన రాము డనే మేఘము మేని మీదకు మెఱపుల కాంతులలా ప్రకాశించాయట. అక్కడనుండి కదలి గాధేయుని కన్నులు వశిష్ఠుని మెరిసే కన్నులతో ఐక్యమయ్యాయట. రామచంద్రుని దర్శనములో ఇరువురు మునీంద్రులు కూడా పూర్వం గాధేయుని బ్రహ్మర్షిగా వశిష్ఠులవారు అంగీకరించి కీర్తించిన సమయంలో కంటె ఎక్కువ సౌహార్దాన్ని పొందారట ఆసమయంలో. ఎంత చక్కనైన వర్ణన.

అప్పుడు విశ్వామిత్రుడు దశరథునితో తన కోరిక ఇలా తెలియజేసాడట.
మ.
ఎవరయ్యా ! రఘురామచంద్రులకుఁ గానీ యస్త్రవిద్యాగురుల్
నవ బాహాపటుదీర్ఘదండునకు నీ నా యొద్ద శిష్యత్వ మొ
ప్పవలెన్ శ్రీరఘురాముబాహుపటిమల్ ప్రాశస్త్యమందన్ వలెన్.
వివృతంబుల్ మునికోటియజ్ఞతతి నిర్విఘ్నత్వ మొప్పన్ వలెన్. 30

ఎవరయ్యా రఘురామచంద్రులకు అస్త్రవిద్యా గురువులు ? ఈ నవ బాహాపటుదీర్ఘదండుడైన రామచంద్రునికి నీ (వశిష్ఠుని) నా (విశ్వామిత్రుని) యొద్దనే శిష్యత్వమొప్పవలె , అప్పుడే ఈ శ్రీరఘురామచంద్రుని బాహుపటిమల్ ప్రాశస్త్యమందుతాయి, మరియు మునుల యజ్ఞములు నిర్విఘ్నంగా ప్రకాశిస్తాయి.

అంతేకాదు.
చ.
మొనసి భృశాశ్వదత్తములు మూల్గుచునున్నవి నా కడన్ మహా
స్త్ర నిభృత విద్య లట్లె రఘురామున కై యవి యెల్ల నిచ్చెదన్
మనుజమహేంద్ర ! పంపుము కుమారుని నా వెనువెంట ; నూరకే
యనలము దాచుకొన్న ఫలమా ? క్రతు యోగ్యము కావలెం జుమీ ! 31

భృశాశ్వునిచే ఈయబడిన శస్త్రాస్త్రములు ఎన్నో నా దగ్గఱ మూల్గుచూ ఉన్నాయి. వాటినన్నింటినీ రఘురాముని కై ఇచ్చెస్తాను. ఓ రాజేంద్రా ! నీ కుమారు డైన రాముడ్ని నాతో పంపించు . ఊరకే అగ్నిని దాచుకుంటే ఫలితమేంటయ్యా ? అది క్రతువునకు ఉపయోగపడితేనే దాని ఉపయోగం కాని. అన్నాడు విశ్వామిత్రుడు దశరథునితో.


0 comments:

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks