నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

Jul 24, 2009

ఇదె గోబ్రాహ్మణ రక్షకోసమయి యా యీ దేశసౌభాగ్యసంపదకై

తాటక వధ
విశ్వామిత్రుఁడు రామునితో తాటకిని వధించమని చెప్పినపుడు
మ.
అనినన్ రాముఁడు మీలితాక్షుఁడయి కట్టా ! యాఁడుదానిన్ వధిం
పను నా చేతికి నమ్మురాదనిన విశ్వామిత్రుఁడా దోష ముం
డిన నా యందున నుండు ధర్మమగు సంధింజూడు మట్లెంచ భూ
జనులిట్లే హతమారుచుండి రిటు లెంచన్ స్త్రీవధ క్లేశమున్. 131

విశ్వామిత్రుఁడు తాటకిని వధించమన్నప్పుడు రాముఁడు మీలితాక్షుడయి అయ్యో ! స్త్రీని వధించుటకు నాచేతికి బాణము రాదంటాడు. విశ్వామిత్రుఁడు ఆ దోషమేదయినా ఉంటే అది నాది. ఇలా స్త్రీవధ అనే క్లేశమును గుఱించి ఆలోచిస్తుంటే దానివలన అనేకమంది జనులు సంహరింపబడుతుంటారు. అంతేకాదు,
వ.
నృశంసుం డనృశంసుం డనక పాతకంబు సదోషం బనక సత్పురుషులు ప్రజారక్షణం బాచరింపవలయు; నిది సనాతనం బైన రాజధర్మంబు; ఇది పరమాధర్మురాలు; దీనింగూర్చి ధర్మవిచారణ లేదు; తొల్లి ధారణీదేవిఁ జంపబోవు మంథరను శక్రుండు వధించె, లోకంబనింద్రంబు జేయనెంచిన భృగుపత్నిని వెన్నుండు సంహరించె; అధర్మసహితలై స్త్రీలు తొల్లి మహా పురుషులచే వధింపఁబడిరి; ధర్మంబు మాకు వదలుము; నీప్రథమమార్గణదర్శనోత్సాహులము మాకుఁ గనువిందు సేయుము. 132
ఉ.
అల్ల భృశాశ్వునుండి సకలాస్త్రములున్ ననుఁ జేరె నస్త్రముల్
తల్లులు రెండునౌ నతిబలాబలలున్ నిను నన్ను నుండి శ్రీ
వల్లులు చేరె నేను గురువన్ గురుదక్షిణ యిమ్ము తాటకా
భల్లము నాకు రాఘవనృపాలక గేహమణి ప్రదీపికా ! 133

నేను నీకు గురువును. నీకు నా నుండి భృశాశ్వదత్తములు అస్త్రాలకెల్ల తల్లులు అనదగిన బల అతిబల అనే విద్యలు చేరినవి. నాకు గురుదక్షిణగా తాటకివధను చేయి. నీ ప్రతాపాన్నిచూడ ఉత్సాహపడుచున్నాము. మాకు కనువిందు చేయి అని అన్నాడు విశ్వామిత్రుడు.
మ.
అనినన్ రాముఁడు దోయిలించి ప్రభువా ! యట్లే పొనర్తున్ నినున్
నిను విద్యాగురు నేను గాదనుట లేనేలేదు; మా తండ్రులున్
ననుఁ బంపించెడు వేళ నీ వచనముల్ నానాత్రయీ మౌళిమం
డనముల్ గాఁగ సమాదరింపు మని యన్నారున్ మహః పేటికా ! 134

అలా అనగానే రాముడు దోసిలొగ్గి ప్రభూ అలాగే చేస్తాను నిన్ను నా విద్యాగురుని నేను కాదనుటన్నది లేనేనేదు. మా తండ్రిగారు సయితము మమ్ములను పంపించే టప్పుడు మీరు చెప్పిన పనిని వేదమంత్రములునుగా భావించి ఆచరించ మని చెప్పారు.
మ.
ఇదె గోబ్రాహ్మణ రక్షకోసమయి యా యీ దేశసౌభాగ్యసం
పదకై మద్గురు దక్షిణార్థమయి యీ పాపాత్మ యౌ తాటకన్
జదియింతున్ జదియింతు నంచును ధనుర్జ్యావల్లి శబ్దించినన్
హ్రద సేతుభ్రమ వారి నిస్వనముగా నార్చెన్ దిశాసంతతుల్. 135

ఇదె గోబ్రాహ్మణ రక్షకోసమయి యీ దేశసౌభాగ్యం కోసమై గురు దక్షిణ చెల్లించటం కోసమయి యీ పాపాత్మ అయిన తాటకిని వధిస్తాను అని అంటూ ధనుష్టంకారాన్ని చేసాడు రాఘవుడు.

తాటక వధ స్త్రీ హత్య. దానిని రాముడు చేసాడు గదా అని వాదించేవారికి సమాధానముగా విశ్వనాథవారు మంచి పకడ్బందీగా రామునిమీదకు నింద రాని విధంగా రాముడు ఎందుకు ఏ సందర్భంలో ఎలా దానినాచరించాడో వివరిస్తూ తెలియ చేసిన విధానం చాలా బాగా నచ్చింది నాకు.

రాముడు తాటకి కాలు సేతులు నరుకుతాడు ముందుగా , లక్ష్మణుడు ఆమె ముక్కుచెవులు కోస్తాడు. చివరాఖరికి శబ్దవేది విద్యను ప్రయోగించి రాముడు అదృశ్యరూపంలో ఉండి యుద్ధం చేస్తున్న తాటకిని సంహరిస్తాడు.




మ.

0 comments:

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks