విశ్వామిత్రుడు రాముని యాగసంరక్షణార్థం పంపించవలసిందని దశరథుని కోరుట
ఉ
చిత్తము చిత్తమంచు నృపశేఖరుఁ డాసమదాస్యహాసుఁ డై
యొత్తిగిలెన్ నిషణ్ణతను నొత్తిడిఁ జేసెను మౌని రాజు లో
నుత్తలమందుచున్ బ్రభు ! ప్రభూ ! బ్రతుకంతయు వాచి కన్న యీ
పొత్తులబిడ్డఁ బాయ నిలుపోపనయా ! నిముసంబు నేనియున్. 32
అలా విశ్వామిత్రుడు రాముడ్ని తనతో పంపించమని అడగ్గానే దశరథుడు ' చిత్తము ', ' చిత్తము ' అని అంటున్నాడే కాని ముఖంలో కత్తివాటుకు నెత్తురుచుక్క లేకుండా అయిపోయిన వాడై ప్రక్కకు ఒత్తిగిలగా విశ్వమిత్రుడు అతడిని తిరిగి తిరిగి ఒత్తిడి చేయసాగాడు. అప్పుడు రాజు కలతచెందుతూ ' ప్రభు ! ', ' ప్రభూ !' "బ్రతుకంతా వాచి కన్న యీ పొత్తుల బిడ్డని ఒక నిముషమైనా విడిచిపెట్టడాన్ని సహించలేనయ్యా." అన్నాడు.
రామాయణం అచ్చంగా తెలుగు నేలమీదే జరిగిందనిపించేలా విశ్వానాథ వారుపయోగించిన అచ్చమైన తెలుగు పలుకుల నుడికారపు చెణుకులు. బ్రతుకంతా వాచి కన్న పొత్తులలోని బిడ్డడట రాముడు నిముసం కూడా విడిచి ఉండలేడట. అంతేకాదు,
ఉ.
రాముఁడు నాకు స్నానమగు రాముఁడు నాకు జపంబు ధ్యానమున్
రాముఁడె యెల్ల నాబ్రతుకు రాముఁడు నన్నును గన్నతండ్రి యీ
రాము వినా నిమేష మవురా మన జాలను గాదయేని నీ
రామునివీడి యీ యఖిలరాజ్యము గాధిసుతా ! గ్రహింపవే ! 33
రాముడే నాకు స్నానం, రాముడే నాకు జపం, రాముడే నాకు ధ్యానం, నా బ్రతుకే రాముడు, నేనతడ్ని కన్నతండ్రిని కాదు, రాముడే నన్ను కన్నతండ్రి . అటువంటి ఈ రాముడ్ని విడిచి ఒక్క నిముషం కూడా నేను బ్రతికి బట్టకట్టలేను. అంచేత ఈ రాముడ్ని మటుకు విడిచిపెట్టి ఓ గాధిసుతా ! యీ అఖిల రాజ్యాన్నీ తీసేసుకోవయ్యా ! అన్నాడు దశరథుడు.
ఇదే పద్యాన్ని దశరథుడు కైకేయి రాముని వనవాసానికి పంపమని కోరినప్పుడుకూడా అంటాడు. అచ్చ తెనుగు నుడికారం. విశ్వనాథో నమో నమః.
మ.
వసుధేశుం డిటులన్న యంతటన విశ్వామిత్రు నాస్యోద్గతం
బసకృద్ధాసము చిళ్ళ చిళ్ళలయి రాజాంతఃపురం బంతటన్
ముసరెన్ మౌనియు నిట్లు చెప్పె బళిరా ! భూపాల ! నీవేదియై
న సరే యింతకుమున్న యిత్తునని యన్నావే కదా దాత వై. 34
దశరథ మహారాజీ విధంగా అనగానే విశ్వామిత్రుని ముఖం నుండి కోపం చిళ్ళ చిళ్ళలయి(ఎంత అందమైన ప్రయోగం) రాజాంతఃపురాన్ని అంతటనూ ముసరిపోయిందట. ముని ఈ విధంగా పలికాడట: భళిరా ! భూపాల ! నీవేదియైనా సరే యిస్తానని ఇంతకు ముందే కదా అన్నావు పెద్ద దాత లాగ ! అని అంటపొడుస్తున్నట్లుగా అన్నాడు విశ్వామిత్రుడు.
క.
నీ కొడుకును గైకొనిచని
మా కాఁకలి యంచుఁదిందుమా ? పిచ్చినృపా !
మాకడఁ బ్రశస్త మస్త్ర
వ్యాకృతి కలదద్ది నేర్పి పంపెద మింతే. 35
నీ కొడుకుని తీసుకుపోయి మాకు ఆకలన్చెప్పి తింటామా ఏమిటి ? పిచ్చి రాజా ! మా దగ్గఱ బోల్డన్నిప్రశస్తమయిన అస్త్రశస్త్రాలు పడి మూలుగుతున్నాయయ్యా ! వాటిని నేర్పి పంపిస్తామంతే.
ఉ.
ఇమ్మగు విద్య నేర్పెదము నింకను నాకొక చిన్నమెత్తు కా
ర్యమ్మును జేసిపెట్టవలె నాపయిఁ బూవులలోనఁ బెట్టి కై
కొమ్మని నీకుమారుఁ డిడుగో నని నీక యొసంగువార మా
పిమ్మట నీవుగా నతని వీడవలెన్ మఱి మాకు నేటికిన్. 36
యుక్తమైన విద్యలను అతనికి నేర్పిస్తాము. ఇంకా నాకో చిన్నమెత్తు పనికూడా చేసిపెట్టాల్సింది వుంది. ఆ పైన నీ కుమారుడిని పూవుల్లోపెట్టి నీ కుమారు డిడిగో తీసుకో అని చెప్పి మరీ నీ కప్పగిస్తామయ్యా. ఆ పైన నీవుగా నీవే అతడిని విడిచిపెట్టాలి కాని మాకు సంబంధం లేదయ్యా అన్నాడు గాధిసుతుడు. (అవును ఋషివాక్కు భవిష్యద్దర్శనం చేస్తున్నది రాముడు వనవాసానికి వెళ్ళాక దశరథుడు పరలోకగతుడౌతాడు). తనకున్న ఆ చిన్నమెత్తు పని ఏమిటో కూడా చెప్తున్నాడు.
Jul 21, 2009
రాముఁడు నాకు స్నానమగు రాముఁడు నాకు జపంబు ధ్యానమున్
Posted by
Unknown
Subscribe to:
Post Comments (Atom)
1 comments:
చాలా బాగుంది.
Post a Comment