శ్రీరామ జననం
ఉ.
కెవ్వున స్నిగ్ధమంథరము కేక వినంబడె మంత్రసానియున్
బువ్వునువోలెఁ జే శిశువుఁబూనెను బట్టపురాణియున్ గనుల్
నొవ్వగుమూఁతవిచ్చుచు గనుంగొనె భాగ్యము నామె కన్నులున్
నవ్వెనొ జాలిపొండెనొ సనాతనమౌ మధుకాంతిఁ జిమ్మెనో ! 211
ఎంత స్నిగ్ధ సుందరంగా వుందీ పద్యం.
క.
అలసములగు చేతుల గో
సలరాట్సుత శిశువు గొనఁగఁజాచెను నవ్వుల్
గిలకొట్టి మంత్రసానియు
వలదని చేసన్నఁ జేసి బాలుని గిల్లెన్. 212
క.
కెవ్వునఁ గేక లిడెన్ శిశు
నవ్వసుధానాథు మహిషి ప్రాణములందున్
జివ్వు మనె మంత్రసానికి
నవ్వులు పరిహాసములును నానావిధముల్. 213
గిల్లితే మరి ఏడవడా, పాపం !
ఉ.
మంతరసానితో నొకతె మానుము తప్పుడుదాన ! పిల్లవాఁ
డెంతగ నేడ్చెనే యనిన యేడ్వడొ ? యింకను వడ్లగింజము
ల్లంతటిసామి వచ్చె జగమంతయు నాఁగదొ యింక నంచుఁ గే
రింతలు నాడుచున్ బులకరించెను జూపులలో సమార్ద్రమై. 214
ఇటువంటి పద్యాలు చదువుకోడానికి మనమెంత పుణ్యం చేసుకున్నామో కదా.
బాలునికి బొడ్డుకోసిన తర్వాత--
ఆ.
గోదుమలనుబోసి గొతుపుపట్టుంజీరఁ
బఱిచి లోకనాథుఁ బండఁబెట్టి
గడ్డమీఁది చిన్న బిడ్డ మాదంచును
గొఱవిఁ ద్రిప్పినారు గ్రుడ్డుచుట్టు.225
ఇది యేమిటో , ఇలా ఎందుకు చేస్తారో నాకు తెలియదు. ఎవరైనా తెలియజేస్తే వారికి ముందుగా నా కృతజ్ఞతలు.
క.
చిటచిట సవ్వడి వినఁబడె
గిటకిటనన్ బట్టమహిషి కిటికిదెసఁ గనన్
చిటికలు గుటికలు మెటికలు
పటపట చిటచిటని జల్లువాన కురిసెడున్. 227
క.
చినుకులను దిస్సమొలతోఁ
జని చేతులు చాఁచుకొంచు జగ్గులనవ్వుల్
తనరఁగ శాంతాదేవీ
వనితామణి కొడుకు వానవల్ల ప్పాడెన్. 230
ఉ.
నిండిన కోర్కి చేత నవనీపతి లో నయనాభిరామచం
ద్రుం డనుకొంచు బోవు నొకత్రోపున లో శతశోభిరామచం
ద్రుండనుకొంచుఁబోవు హృదిఁద్రొక్కిసలాడుచు నంత రామచం
ద్రుండనుకొంచు బోవు నెద నూర్పిడిసేయుచుఁ దూరుపెత్తుచున్. 243
ధీర విదుషీమణి - డా.పి.చిరంజీవిని కుమారి
18 hours ago
0 comments:
Post a Comment