సీ.
తా నదేమో పిచ్చితల్లి కౌసల్య యే
ప్రేమఁబోయిన నదే ప్రేమఁబోవు
శాంత పంపించిన సన్నజరీచీరఁ
బదునేడుదినము లాపగిది కట్టె
నెందఱు వలదన్న నిది శాంతచీరంచు
నది యుతికించును నదియ కట్టుఁ
దెలివి యరుంధతీ దేవి వల్కలమీయ
నాపైని నది తాల్చె నదియ పనిగఁ
గీ.
పదియునాల్గుదినంబు లాపగిదిఁజూచి
కొఱ్ఱుపట్టిన వని దాచికొనియె దాసి
పట్టమహిషి మహాయోగ పరిధులైన
చీర లాపైని దాల్పఁ జేసినది దాసి. 165
ఇటువంటి హృదయంగమమైన పద్యాలు రాయటం కేవలం విశ్వనాథ వారికే చేతనౌను. స్త్రీల మనోభావాలను ఇంతందంగా వ్యక్తీకరించటం వారికే చెల్లు. ఆమాటకొస్తే స్త్రీ కవయిత్త్రులలో కూడా వారి వారి భావాలను విశ్వనాథ వారిలా ఇంతందంగా చెప్పినవారెవరూ లేరు నాకు తెలిసి. తరువాతి పద్యం చూద్దాం రండి.
సీ.
శ్రీరంగనాథపూజా రాజిత వ్రత
దినమును స్నానమాడును దలార
నెలకు మూన్నాళ్ళు వానలయెద్దడిని మడి
చీర యారక తడిచీరఁగట్టు
యజ్ఞ శేషము వశిష్ఠాశ్రమమ్ముననుండి
తినదు సుయజ్ఞుండు తెచ్చుదాఁకఁ
బ్రాశించదును రంగపతి కారగింపైన
వార్తయంచెలమీఁద వచ్చుదాఁకఁ
గీ.
బర్వదినములఁ జిఱుచాప పైని బండు
కొనును జూలాండ్రరకు నివి కూడ దనుచు
మొత్తుకొందురు దాసీలు ముసలివారు
వ్రతము భంగముచేయదు రాణిగారు. 166
శ్రీరంగనాథ పూజాదినం నాడు కౌసల్య తలారా స్నానం చేస్తుందట.
నెలకు మూడురోజులు వానలవల్ల తన మడిచీర లారకపోతే ఆ తడిచీరల్నే మళ్ళీ కట్టుకుంటుందట.
సుయజ్ఞుడు వశిష్ఠాశ్రమం నుంచి యజ్ఞశేషాన్ని తెచ్చిస్తేగానీ ముందుగా ఆమె వేరేమీ ముట్టుకొనేది కాదట.
రంగపతికి ఆరగింపు సేవ పూర్తయిందన్న వార్త అంచెలంచెలమీద ఆమెకు చేరితేనే కానీ ఇంకేమీ ముందుగా నోట పెట్టేది కాదట .
పండుగరోజుల్లో చిఱుచాప మీద నేలపైనే పవ్వళించేది కాని చూలాండ్రకది కూడదని ఎందరు యెన్నివిధాల చెప్పినా వినేది కాదట.
ఎందరు ముసలిదాసీలు నెత్తీనోరూ మొత్తుకున్నా కూడా ఆమె మటుకు వ్రతభంగాన్ని కానిచ్చేది కాదట.
అవును మరి! ఆమె జన్మనీయబోయేది ఎవరికి ? సాక్షాత్తూ ఆ శ్రీరామచంద్రులవారికి కదా. మరలాంటప్పుడు వ్రతభంగాన్నెలా చేస్తుందావిడ.
Jul 6, 2009
తా నదేమో పిచ్చితల్లి కౌసల్య యే ప్రేమఁబోయిన నదే ప్రేమఁబోవు
Posted by
Unknown
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment