నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

Jul 10, 2014

అన్నమయ్య సంకీర్తనలు - ఛందస్సు(కొనసాగింపు-1)

మూల పాఠం

దేసాక్షి

వేదవేద్యులు వెదకేటి మందు
ఆది నంత్యము లేని ఆ మందు.

అడవిఁ మందులు గషాయములు నెల్లవారు
 కడగానక కొనఁ గాను
 తొడిఁబడ నొకమందు దొరకె మాకు భువి-
నడియాలమైనట్టి ఆ మందు .

లలితరసములుఁ దైలములు నెల్లవారు
కలకాలము గొనఁ గాను
చెలువైన దొకమందు చేరె మాకు భువి-
నలవిమీఱిన యట్టి యా మందు .

కదిసిన జన్మరోగముల నెల్లవారు
కదలలేక వుండఁ గాను
అదన శ్రీవేంకటాద్రి మీఁది మందు
అదివో మా గురుఁ డిచ్చె నా మందు.
ఇప్పుడు ఛందం లో ఉంచి మంజరీ ద్విపదకు తగినట్లుగా మార్పులు చేర్పులు చేసిన పాఠం.


వేదవేద్యులు వెదకేటి మందేది
       ఆది నంత్యము లేని ఆ మందు చూడు

అడవిమందులుఁ గషాయములు నెల్లండ్రు
       కడగానక కొనఁగానామందునున్ను
       తొడిఁబడ నొకమందు దొరకె మాకు భువి-
       నడియాల మైనట్టి ఆ మందు చూడు.

లలితరసములుఁ దైలములెల్లవారు
        కలకాలము గొనఁగానామందునున్ను
        చెలువైన దొకమందు చేరె మాకు భువి-
        నలవి మీఱినయట్టి యా మందుచూడు

కదిసిన జన్మ రోగములెల్లవారు
         కదల లేకుండఁగా నామందునున్ను
         అదన శ్రీవేంకటాచలమున్న మందు
          అదివొ మా గురుఁ డిచ్చె నా మందు నేడు      1-2.








తొడిఁబడ





0 comments

అన్నమయ్య సంకీర్తనలు - ఛందస్సు

అన్నమయ్య సంకీర్తనల 29 వాల్యూమ్లు నేను కొని దాదాపు 15 సంవత్సరములు పూర్తికావస్తోంది. అప్పటినుండి ఆ పుస్తకాలలోని సంకీర్తనలను చదువుతున్నపుడు ఆ సంకీర్తనలు ఏ ఛందస్సులో నిబంధించబడినాయో అనే సందేహం నాకు కలుగుతుండేది. ఆ పుస్తకాలలో ప్రతి సంకీర్తనకు పై భాగంలో ఆ సంకీర్తనను పాడవలసిన రాగం పేరు సూచించబడింది, కాని ఆ సంకీర్తనకు నిబద్దమైన ఛందస్సు పేరు సూచించబడలేదు. అన్నమయ్య సంకీర్తనలలోని ప్రతి పంక్తిలోనూ యతిప్రాసలు స్పష్టంగా మనకు దర్శనమిస్తుంటాయి. యతి ప్రాసలు అలా ఉంటున్నప్పుడు ఆ సంకీర్తనకు నిబద్ధమైన ఛందస్సు కూడా ఉండే ఉండాలి. అలా లేకపోవటానికి కారణాన్ని నేను ఇలా ఊహిస్తున్నాను.

అన్నమయ్య సంకీర్తనలు అన్నమయ్య నాడే రాగిరేకులలోనికి ఎక్కించబడలేదు. వాటిని ఆయన కుమారుడు పెదతిరుమలయ్య పర్యవేక్షణలో ఎంతోమంది రాగిరేకులపై అక్షరాలను చెక్కే పనివాండ్ర చేత వ్రాయించబడటం జరిగింది. మొదట్లో అన్నమయ్య సంకీర్తనలు తాటియాకులలో వ్రాయబడ్డాయనిన్నీ, వాటిని ఒకసారి తగులబెట్టే ప్రయత్నం జరిగిందనిన్నీని మనం తెలుసుకున్నాం. అంటే ఆ సంకీర్తనలను ఎంతోమంది అన్నమయ్య పరోక్షంలో ఎన్నోమార్లు తిరగవ్రాయించి ఉండటం జరిగి ఉంటుందనేది నా ఊహ.  తిరుమల తిరుపతి దేవస్థానం వారు అన్నమయ్య సంకీర్తలను రాగిరేకులనుండి ఉద్ధరించి పుస్తకాల రూపంలో అచ్చువేయించటానికి నియమించిన పెద్దలు కూడా చాలా శ్రమతో ఈ సంకీర్తనలను వారికి సరి అయినది అని తోచిన మార్గంలో సరిచూచి ప్రచురించటం జరిగి ఉంటుంది.ఇలా ఎంతోమంది చేత ఎన్నోసార్లు తిరగ వ్రాయటంలోఎన్నోమార్పులు అనివార్యంగా జరిగి ఉండవచ్చును. ఇది కేవలం నా ఊహ. తప్పైనా కావచ్చు. ఇలా జరిగే అవకాశాలు ఉండటంతో ఆ సంకీర్తనలకు పై భాగాన ఛందస్సు పేరు ఉదాహరించటం జరిగి ఉండకపోవచ్చు. ఇది నా ఊహ మాత్రమే.

నేను ఊహించిన దాని ప్రకారం ఆ సంకీర్తనలలో ఎన్నో మార్పులు చేర్పులు జరిగి ఉండటానికి చాలా ఎక్కువ ఆస్కారం ఉండి ఉంటుంది.

శ్రీ మిరియాల ప్రదీప్ గారి chandam.apphb.com అనే సైటులో ఏ పద్యాన్నిగానీ, ఛందోబద్ధమైన సంకీర్తనని గాని ఒక బాక్సులో వ్రాసి "గణించు" అనే బొత్తాన్ని నొక్కగానే ఆ బాక్సులోని పద్యం గానీ కీర్తనగానీ ఏ ఛందస్సుకు చెందినదో  గణాలతో సహితంగా తెలియజేస్తుంది. అంతేకాదు ఆ పద్యానికి గణ విభజన జరిగి ఆ గణాల సహాయంతో ఆ పద్యం కానీ సంకీర్తనకానీ ఏ ఛందస్సులో ఉందో తెలియవస్తుంది. ఆ పద్యంలోని పంక్తులలో యే యే పంక్తులలో యే యే గణాలలో యే యే దోషాలు ఉన్నాయో కూడా చూపిస్తుంది. దగ్గఱ దగ్గఱగా 363 ఛందస్సులవరకూ దీని ద్వారా మనం ఛంస్సులను గుర్తు పట్టవచ్చును. ఇది నా చేతికి "కోతికి కొబ్బరికాయ దొరికిన" చందంగా తయారయింది.

ఇటీవల శ్రీ భైరవభట్ల కామేశ్వరరావు గారు తెలుగు ఎమ్.ఏ. పరీక్షకు కట్టి విజయవంతంగా మొదటి సంవత్సరం కోర్సును కూడా పూర్తి చేసారని విని దానితో ఉత్తేజం పొంది నేను కూడా ఎమ్.ఏ. తెలుగు పరీక్షకు కూర్చుందామని తయారయ్యాను. కోర్సు మెటీరియలు పుస్తకాలు తెప్పించుకొని చదవటం ప్రారంభించాను. వానిలో ఛందస్సులోని పుస్తకంలో "రగడలు" అనే ఛందస్సు గుఱించిన వివరాలు వానిలోని వివిధ రగడల ఛందస్సును గూర్చి ఉన్నది.
అన్నమయ్య సంకీర్తనలని chandam లో ఉంచి ఆ సంకీర్తన ఛందస్సు ఏమిటో తెలుసుకోవచ్చును గదా అనిపించి ఆ పనిని మొదలుపెట్టాను. అన్నమయ్య సంకీర్తనలు చాలా వరకూ ఈ రగడల ఛందస్సులోనే ఉన్నాయి. ఈ రగడ ఛందస్సు జానపదులు పాటలు పాడుకోవటానికి ఎక్కువగా వినియోగిస్తారు.

అన్నమయ్య అధ్యాత్మిక సంకీర్తనల మొదటి వాల్యూమ్ తీసుకొని వరసగా మొదటి నాలుగైదు సంకీర్తనలని ఛందం తో పరిశీలించగా ఆ సంకీర్తనలు ఏదో ఓ రగడ భేదానికి సుమారుగా 80% వరకూ సరపోయేది, కాని పూర్తిగా సరిపోయేది కాదు. ఆ సంకీర్తనని ఎలాగైనా నూటికి నూరుపాళ్ళూ ఆ రగడకి సరిపెట్టాలనే ఉద్దేశ్యంతో మొదలుపెట్టి ఆ రగడ లక్షణాలకు సరిపోయే విధంగా భావానికి పెద్దగా మార్పు జరక్కుండా ఉండేలా శ్రద్ధ తీసుకొంటూ చిన్న చిన్న మార్పులు చేర్పులు చేయగా అవి ఒకటి "తురగవల్గన రగడ"కూ, ఇంకోటి "మంజరీ ద్విపదకూ", మరోటి "అల్పాక్కర"కూ, ఇంకోటి "హంసగతి రగడ"కూ సరిపోయినవి. అన్నమయ్య సంస్కృత సంకీర్తనలను సరిచూడటానికి ఛందం సాఫ్టువేరులో సంస్కృత ఛందస్సులను ఇంకా ఉంచలేదని మిరియాల ప్రదీప్ గారు చెప్పారు. త్వరలో ఆయన వాటిని కూడా చేరిస్తే అప్పుడు సంస్కృత సంకీర్తలని కూడా చూడవచ్చు ననుకుంటున్నాను.

అన్నమయ్య అధ్యాత్మ సంకీర్తనల మొదటి సంపుటం లోని మొట్టమొదటి సంకీర్తనకు చేసిన మార్పులను చేర్పులను ఇక్కడ ఉంచే ప్రయత్నం చేస్తున్నాను.

మూల పాఠం

సామంతం

వలచి పై కొనఁగ రాదు వలదని తొలఁగ రాదు
కలికి మరుఁడు సేసినాజ్ఞ కడవఁగ రాదురా.    IIపల్లవిII

అంగడి కెత్తినట్టి దివ్వె లంగనముఖాంబుజములు
మంగిటి పసిఁడి కుంభములను ముద్దులకుచయుగంబులు
యెంగిలి సేసినట్టి తేనె లితవులైన మెఱుఁగు  మోవులు
లింగము లేని దేహరములు లెక్క లేని ప్రియములు.       IIవలచిII

కంచములోని వేఁడికూరలు గరువంబులుఁ బొలయలుకలు
యెంచఁగ నెండలో నీడలు యెడనెడ కూటములు
తెంచఁగ రాని వలెతాళ్ళు తెలివిపడని లేఁత నవ్వులు
మంచితనము లోని నొప్పులు మాటలలోని మాటలు.       IIవలచిII

నిప్పులమీఁదఁ జల్లిన నూనెలు నిగిడి తనివి లేని యాసలు
దప్పికి నేయి దాగినట్లు తమకము లోని తాలిమి
చెప్పఁగ రాని మేలు గనుట శ్రీవేంకటపతిఁ గనుటలు
అప్పని కరుణ గలిగి మనుట అబ్బురమైన సుఖములు.     IIవలచిII

పై సంకీర్తనని ఛందం లో ఉంచగా కొన్ని పంక్తులలో తప్పులు సూచించబడినాయి. వాటిని ఆ తురగవల్గన రగడకు సరిపడే విధంగా ఉండేలా చేయటానికై చిన్నచిన్న మార్పులు చేయవలసి వచ్చినది. ఆ మార్పులు చేసిన తర్వాత పాఠం ఇలా ఉంది.


 సామంతం
తురగవల్గన రగడ
వలచి పైకొనంగరాదు వలదని తొలఁగంగ రాదు
         కలికి మరుఁడు సేసినాజ్ఞ కడవఁగ రాదురారోరి  IIపల్లవిII
అంగడి కెత్తినట్టిదివ్వె లంగనముఖాంబుజములు
       ముంగిటి పసిఁడి కుంభములును ముద్దులకుచయుగములును
       యెంగిలి సేసినట్టి తేనె లితవైన మెఱుఁగు మోవి
       లింగములేని దేహరము లెక్కలేని ప్రియంబేను.       IIవలచిII 
కంచములోని వేఁడికూరలు గరువపు బొలయలుకలు
       యెంచఁగ నెండలోనీడలు యెడనెడనికూటములును
       తెంచఁగరాని వలెతాళ్ళు తెలివిపడని లేఁనగవులు
       మంచితనములోని నొప్పులు మాటలందు మాటలును.  IIవలచిII

నిప్పులపై జల్లిననూనెలు  తనివియెలేని యాస
       దప్పికి నేయి దాగినటు దమకములో తాలిమేను
       చెప్పఁగరాని మేలు గనుట శ్రీవేంకటపతిఁ గనుట
       అప్పని కరుణ గలిగి మనుట అబ్బురంపు సుఖములును.  IIవలచిII  1-1

ఇక్కడికి ఇంతతో ఆపుచేస్తున్నాను. మిగిలిన సంకీర్తనలను ఓ రెండు మూడు రోజుల్లో వీలువెంబడి పోస్టు చేస్తాను.
పెద్దలందరూ నా ఈ ప్రయత్నానికి వారి వారి సహాయసహకారాలు సందేశాల రూపంలో అందజేయగలందులకు ప్రార్థిస్తూ శలవు తీసుకుంటున్నాను.


1 comments

May 5, 2014

మిమ్మల్ని మీరే గెలిపించుకోండి.



ఎవర్నో గెలిపించటం కాదు . మిమ్మల్ని మీరేగెలిపించుకోండి! ఆ అవకాశం ఇపుడు మీ ముంగిట్లోకి వచ్చి మీ తలుపు తడుతోంది ! మన మంతా సామాన్యులం. మనం ఇపుడు మనల్ని మనమే గెలిపించుకొని, అసామాన్యులుగా మనల్ని మనం నిరూపించుకొందాం. ఇదే మనకు తగిన చివరి అవకాశం. ఎల్లుండి 7వ తారీఖున జరగబోయే ఎన్నికలే అందుకు మనకు సరియైన వేదిక.
మన ఢిల్లీ సోదరులు గత అసెంబ్లీ ఎన్నికలలో వారి వోటును వారికే వేసుకొని 28 మంది సభ్యులను మాత్రం గెలిపించుకొని అసెంబ్లీకి వారి తరఫున పంపించుకొన్నారు. వారు అధికారాన్ని చేపట్టటానికి తగిన సంఖ్యాబలం లేనందున అధికారం చేపట్టటానికి మొదటగా సిద్ధపడలేదు. కాని, వారి కంటే అధిక సభ్యులున్న బి.జె.పి.వారు కూడా అధికారాన్ని స్వీకరించటానికి విముఖత చూపించటం వల్లనైతేనేమి, అత్యల్ప సభ్యులు కలిగిన కాంగ్రెస్ వారు ఆమ్ ఆద్మీ పార్టీ వారు అడగకపోయినప్పటికీ సంపూర్ణ మద్దతును అందించుతామని గవర్నరుగారికి లేఖ ద్వారా తెలియజేయటం వల్లనైతేనేమి, ఢిల్లీవాసులు అరవింద్ కేజ్రీవాల్ గారిని అధికారం చేపట్టమని కోరటం వల్లనైతేనేమి వారు ముందుకు వచ్చి అధికారం చేపట్టటం జరిగింది. 

కాని ఆ పరిపాలన కేవలం 49 రోజులు మాత్రమే ఉనికిలో ఉండి కేజ్రీవాల్ గారి రాజీనామా వల్ల అక్కడ ప్రభుత్వం లేకుండా పోయింది.

ఆ 49 రోజులలోనూ వారు చేయగలిగినంత మంచిని చేసి పరిపాలన అంటే ఎలాఉండాలో చూపించారు. వారు ఆ 49 రోజులలోను సాధించిన విజయాలలో, ముఖ్యమైనవి పేదలకు ఉచిత మంచినీటి సరఫరా, దిగువ,మధ్య తరగతి వినియోగదారులకు వారి విద్యుత్ రేట్లలో సగానికి సగం కుదింపు, ఆ పార్టీ ప్రథాన ఎజెండా అయిన అవినీతి నిర్మూలనలో గణనీయమైన ప్రగతిని సాధించటం( స్వతంత్ర్య వార్తా ఛానళ్ళ వార్తల వల్ల తెలిసిన విషయం), పిల్లలకు స్కూళ్ళలో డొనేషన్లు లేకుండా అనుమతులను సాధించటం వంటివి మనం చూశాం, విన్నాం. ఆ 49 రోజుల్లో వారు సాధించినన్ని విజయాలని మరే ఇతర రాజకీయ పార్టీలవారూ కూడా స్వాతంత్ర్యం వచ్చిన ఇన్ని నాళ్ళ పరిపాలనలో అంత తక్కువ సమయంలో కూడా సాధించలేకపోయింది.
ఆ 49 రోజులలోనే ప్రభుత్వాధికారులు లంచాలు తీసుకోవటానికి భయపడేంతగా మార్పు వచ్చిందనీ, రోడ్డు ట్రాన్సుపోర్టు ఆఫీసులలోనైతే లంచాలు ఇవ్వనక్కరలేకుండా, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ప్రజల పనులు జరిగిపోతున్నాయనికూడా మనం వినటం జరిగింది. మన దేశ సహజ వనరులను తమ గుప్పిటిలో ఉంచుకొని అత్యధికమైన ప్రపంచవ్యాప్త ఖరీదుతో మన వనరులను మనకే అమ్మి అత్యధిక లాభాలను మూటగట్టుకుంటున్న రిలయన్స్ ముఖేష్ అంబానీ మీద ఫస్ట్ ఇన్ఫర్మేషను రిపోర్టును దాఖలు చేయించి కేసుని నడిపించే సాహసాన్ని కూడా ఢిల్లీ ప్రభుత్వం కేజ్రీవాల్ గారి నాయకత్వంలో చూపించి ప్రజల మన్ననలను అందుకొంది.
మన దేశంలో అవినీతి నిర్మూలనకు బద్ధకంకంణాన్ని కట్టుకొన్న ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతి నిర్మూలనలో ప్రజాభాగస్వామ్యం కొఱకు ఉద్దేశించిన జన లోక్ పాల్ బిల్లును ఢిల్లీ అసెంబ్లీలో ప్రవేశపెట్టటానికి ప్రయత్నించి విఫలమయ్యారు. అంబానీల కనుసైగలలో పనిచేస్తున్న కాంగ్రెస్, బీ.జె.పి. పార్టీలవారిరువురు ఆమ్ ఆద్మీకి తమ తమ మద్దతును ఉపసంహరించటం ద్వారా కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని పడగొట్టారు. నీతివంతమైన మార్గం లోనే తమ పరిపాలనను సాగించదలచిన కేజ్రీవాల్ గారు తమ పదవిని తృణప్రాియంగా ఎంచి రాజీనామా చేసారు. 

గతంలో ఒకే ఒక రైలు ఏక్సిడెంటు జరిగినప్పుడు దానికి తాను నైతిక బాధ్యత వహిస్తూ తమ మంత్రిపదవికి రాజీనామా సమర్పించిన కీ.శే. లాల్ బహదూర్ శాస్త్రిగారి మార్గంలో తిరిగి నీతిమంతమైన రాజకీయానికి ప్రాణప్రతిష్ఠ చేయాలనే సదుద్దేశ్యంతో సమర్పించిన రాజీనామాను బాధ్యతల నుండి భయంతో పారిపోతున్నట్లుగా చిత్రించి మీడియా ప్రచారాన్ని ప్రారంభించింది. 

తాను బాధ్యతల నుండి ఎక్కడకూ పారిపోవటం లేదనీ ప్రజలు కోరితే దేశంలో అవినీతిని నిర్మూలించి చూపెట్టాలనే సదుద్దేశ్యంతో 434 పార్లమెంటు నియోజక వర్గాల్లోనూ, కొన్ని కొన్నిరాష్టాలలోని అసెంబ్లీ నియోజక వర్గాల్లోనూ కూడా ఆమ్ ఆద్మీలను పోటీకి దించి ఎలక్షన్లలో మన ఆమ్ ఆద్మీలను మనతరఫున పార్లమెంటు సభ్యులుగాను, అసెంబ్లీ సభ్యులుగానూ ఎన్నుకొనే అవకాశాన్ని మనకు కలిగించారు.
జన లోక్ పాల్ బిల్లు ఢిల్లీలో పాస్ కాలేకపోవటానికి కారణాలు 1) ఆమ్ ఆద్మీ పార్టీకి ఢిల్లీవాసులు పూర్తి మెజారిటీని గత ఎన్నికలలో ఇవ్వకపోవటం, 2)అధికమెజారిటీని కలిగిన బి.జె.పి. వారు వారి బాధ్యతను నిర్వహించకుండా ప్రక్కకు తప్పుకోవటం, 3) తమ బేషరతు మద్దతును అంబానీవారి డైరెక్షనులో కాంగ్రెస్ వారు బి.జె.పి. తో కలసి ఉపసంహరించుకోవటం.( ముఖేష్ అంబానీ పై వచ్చిన F.I.R కారణంగా)

ఇంకో చిన్న విషయం:
 
బి.జె.పి. పార్టీ వారు వారి తరఫున ప్రధానమంత్రి అభ్యర్థిగా నిలబెట్టిన మోడీ గారి మీద కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి అనే ఉద్దేశ్యంతో వారణాసి నుండి ఆమ్ ఆద్మీ అయిన కేజ్రీవాల్ గారు తనే వారణాసి నుండి మోడీ గారిపై పోటీకి దిగారు. ఆయన తన నామినేషన్ కేవలం వారణాసి లో మాత్రమే వేసారు. కానీ ఆయనకు పోటీగా నిలచిన మోడీగారు మటుకు ఓడిపోతానేమోనన్న భయంతో కాబోలు గుజరాత్లోని వేరే నియోజకవర్గం నుంచి కూడా పోటీకి దిగారు. కాని మన ఆమ్ ఆద్మీ అయిన కేజ్రీవాల్ గారు మటుకు ఒకే వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ నియోజక వర్గాల్లో పోటీ చేయటం అనైతికమనే అభిప్రాయంతో ఒకచోటనుండే అంటే వారణాసి నుండే పోటీలో ఉన్నారు. అలాగే బి.జె.పి. వారు, కాంగ్రెస్ వారు కూడా ఒక్కొక్క నియోజకవర్గానికో Rs.50 నుండి Rs.80 కోట్ల వరకూ ఎన్నికలలో (రాజకీయ పార్టీలు పారిశ్రామిక వర్గాల నుండి అంబానీలనుండి అందిన ఆర్థిక దన్నుతో) ఖర్చు చేస్తుండగా ఆమ్ ఆద్మీ మటుకు తమ వెబ్ సైటు ద్వారా ప్రజల నుండి సేకరించిన విరాళాలతోనే (Rs. 35 కోట్లు) 434 పార్లమెంటు నియోజక వర్గాల్లోనూ ఇంకా కొన్ని అసెంబ్లీ ఎన్నికలలోనూ పోటీ చేస్తూ ఉండటం ఇక్కడ మనమంతా గమనించాల్సి ఉన్న విషయం.

వీరి తరఫున పోటీకి దిగిన వారంతా మీలాంటి నాలాంటి ఆమ్ ఆద్మీలే నన్న విషయం కూడా మనం గుర్తించాల్సి ఉంది.
అందుచేత పై విషయాలనన్నింటినీ మనం పరిగణనలోకి తీసుకొని ఈ సారి కాంగ్రెస్, బి జె పీ లకు బదులుగా మన ఆమ్ ఆద్మీలను గెలిపించుకొనే ప్రయత్నం చేద్దాం. 434 సీట్లలో నిలచిన ఆమ్ ఆద్మీలలో అత్యధికులను గెలిపించుకొని ప్రభుత్వ ఏర్పాటుకు తగిన సంఖ్యా బలాన్ని మనము  ఆమ్ ఆద్మీలకు కలిగిద్దాం. జరిగితే మనకందరితీ మంచే జరుగుతుంది, కాని చెడు జరిగే అవకాశం మటుకు లేదు. ఆమ్ ఆద్మీకి మనం ఓటేస్తే అరవింద్ కేజ్రీవాల్కు ఓటేసినట్లు కాదు. మనకి మనమే ఓటేసికున్నట్లు. సురాజ్య స్థాపన దిశగా ఇది మన ముందడుగు. We get what we deserve.  దీనిని గుర్తులో ఉంచుకొని మనం మన ఓట్లనన్నింటినీ మనకే వేసుకొని సురాజ్యాన్ని స్థాపించుకుదాం. రండి ! కదలి రండి! అందరూ ఓట్లేయండి! మన ఆమ్ ఆద్మీలను గెలిపించి తద్వారా మీరే మిమ్మల్ని పరిపాలించుకోండి.  శుభం భూయాత్! జై హింద్!    

0 comments

Mar 7, 2014

వర్ణన రత్నాకరము - మన్మథోపాలంబనము - రుక్మిణీ పరిణయము - కూచిమంచి తిమ్మకవి

వర్ణన రత్నాకరము - మన్మథోపాలంబనము - రుక్మిణీ పరిణయము - కూచిమంచి తిమ్మకవి

ఆ.
పొలఁతి పొలఁతి తోడఁ పురుషుండుఁ బురుషుతోఁ, బొందు సేయఁదగునుఁ బోరఁ దగును
పురుషుఁ డబల తోడ బోరాడ రా దిందు, రాకు మార యిందిరా కుమార.
                                          రుక్మిణీ కళ్యాణము - అ.2 పద్య 304

0 comments

Mar 1, 2014

వర్ణన రత్నాకరము - అభ్యంగనాదికము - యామినీపూర్ణతిలకావిలాసము - చెళ్ళపిళ్ళ సరసకవి

వర్ణన రత్నాకరము - అభ్యంగనాదికము - యామినీపూర్ణతిలకావిలాసము - చెళ్ళపిళ్ళ సరసకవి

సరులు పెనంగ లేఁ జమట జాలుగొనంగఁ గురు ల్విడంగఁ గ్రొ
వ్విరు లురలంగఁ బైఁట చెఱగింపుగ నోరిసిలంగ గుబ్బచ
న్మెరుగు లెఱుంగఁ గౌను జవ మించు టెసంగ నగల్ మెలంగఁగా
గురుకుచ యోర్తు బిల్హణునకుం దల యంటె ననేక భంగులన్.
                                               యామినీ పూర్ణతిలకా విలాసము - చెళ్ళపిళ్ళ సరసకవి - అ 5

జాలుకొను=ప్రవహించు
క్రొవ్విరి = కొత్త పుష్పము
ఉరలబడు=దొర్లు
ఓరసిలబడు=తొలగగా
కౌను= నడుము

తలంటును గుఱించి కూడా ఇలా సరసమైన పద్యాలను మన వాళ్ళు రచించారు పూర్వం.

0 comments

Feb 28, 2014

వర్ణన రత్నాకరము - సారంగధర చరిత్రము - .చేమకూర వేంకటకవి - స్త్రీ గర్హణము

వర్ణన రత్నాకరము - సారంగధర చరిత్రము - .చేమకూర వేంకటకవి - స్త్రీ గర్హణము

క.
జనకు నయిన సోదరు నై, నను సుతు నైన నొకపరిఁ గనం దరుణులకున్

దను పెక్కును లజ్జాపద, మని హరితో ద్రుపద పుత్రి యనెఁ గద తొలుతన్. 

                                             సారంగధర చరిత్రము - అ 2 . పద్య 45
తనుపు =తృప్తి, తనివి,తడి,satisfaction, content,
  • ఆతర్పణము, ఆదలు, ఆపూర్తి, ఆప్యాయము, ఆశితంభవము, తనివి, తనుపు, తర్పణము, తోషణము, తోషము, పూర్తి, ప్రకామము, ప్రతుష్టి, ప్రసన్నము, ప్రీణనము, సంతర్పణ, సంతసము, సంతృప్తి, సంప్రియము, సురతి, సౌఖ్యము, సౌమనసము, సౌమనస్యము, సౌహిత్యము, స్వాస్థ్యము, హృషి. 
  • ఇలా చాలా అర్థాలు ఉన్నవి.

0 comments

Feb 27, 2014

వర్ణన రత్నాకరము - విజయ విలాసము - చేమకూర వేంకటకవి - విటులు

వర్ణన రత్నాకరము - విజయ విలాసము - చేమకూర వేంకటకవి - విటులు

సీ.
అతి వినోదము గాఁగ రతుల మెప్పించు నీ, పచ్చల కడియాల పద్మగంధి
చక్కెర మో విచ్చి చవులఁ దేలించు నీ, ముత్యాల కమ్మల ముద్దులాఁడి
తృణముగా లోఁ జేయు నెంతటి వాని నీ, నీలాల ముంగఱ నీలవేణి
వెల లేని పొందిక విడివడ మెఱయు నీ, కెంపులఁ బొగడల కీరవాణి
గీ.
యనుచుఁ దమలోన నెఱజాణ తనము మీఱ, వారకాంతామణుల మేలు వార్త లెల్లఁ
దెలుపుచును వెన్నెల బయిళ్ళఁ గలసి నగుచు, విటులు  విహరింతుర ప్పురీ వీథు లందు.

                           విజయ విలాసము - చేమకూర వేంకటకవి - అ 1, పద్య 81.

 
 

0 comments

Feb 26, 2014

వర్ణన రత్నాకరము - పద్మినీ పరిణయము - ఉన్నవ యోగానందసూరి - మన్మథోపాలంబనము

వర్ణన రత్నాకరము - పద్మినీ పరిణయము - ఉన్నవ యోగానందసూరి - మన్మథోపాలంబనము

సీ.
ఎత్తిన నీ ధ్వజం బేటి పాలైపోను, పాంథుల నేఁచకు పంచబాణ
అలరు నీ వాహనం బడవి పాలైపోను, పథికుల నేఁచకు పంచబాణ
నీ చేతి పెనువిల్లు నేలపాలైపోను, పడఁతుల నేఁచకు పంచబాణ
నీ రూపవిభవంబు నెఱి భస్మమైపోను, బలముల విడువకు పంచబాణ
గీ.
పతి వియోగుల డాయకు పంచబాణ, బాల నని విన్నవించితి పంచబాణ
పాపమున కేల రోయవు పంచబాణ, పచ్చి బోయవు గదరోరి పంచబాణ.

పద్మినీ పరిణయము   -ఉన్నవ యోగానందసూరి అ 4. పద్య 43

ఎంత హాయిగా సాగిందీ పద్యం. ఈ పుస్తకం గానీ ఈ రచయిత గుఱించి గానీ ఏమీ తెలియదు కదా!


0 comments

Feb 25, 2014

వర్ణన రత్నాకరము - క్షత్రియులు - అనిరుద్ధ చరిత్రము - కనుపర్తి అబ్బయామాత్యుఁడు

వర్ణన రత్నాకరము - క్షత్రియులు - అనిరుద్ధ చరిత్రము - కనుపర్తి అబ్బయామాత్యుఁడు

సీ.
సముదీర్ణ చంద్రహాస కళా వినోదముల్, ముఖములందును రణోన్ముఖములందు
ధర్మగుణాను సంధానతా చతురతల్, శయములందును హృదాశయములందు
బుధగురు చక్రావన ధురీణ చిహ్నంబు, లాఖ్యలందు నిజాన్వయాఖ్యలందుఁ
బ్రకట పంచానన ప్రక్రియా విభవముల్, భటులందు విక్రమార్భటులయందు
గీ.
వెలయ వెలయుదు రనివార్య వీర్య శౌర్య, ధైర్య గాంభీర్య సమధికౌదార్యతుర్య
ధుర్యులైనట్టి బాహుజ వర్యు లెపుడు, సిరులఁ జెలువొందు నప్పుర వరమునందు.

సముదీర్ణ =గొప్పది అయిన
శయము=చేయి
హృదాశయము= హృదయమునందలి ఆశయము
చక్ర అవన ధురీణ చిహ్నము= చక్రమును కాపాడే బరువును మోసే యెద్దుయొక్క గుర్తు(?)
ఆఖ్య= పేరు
ఆ పురమేదో నాకు తెలియదు,నేను అనిరుద్ధ చరిత్ర చదవలేదు. కాని అనుప్రాస యెంత మనోహరంగా ఉందో కదా !

0 comments

వర్ణన రత్నాకరము - వైజయంతీ విలాసం - సారంగు తమ్మయ

వర్ణన రత్నాకరము - వైజయంతీ విలాసం - సారంగు తమ్మయ 

ఆ విప్రోత్తము వజ్రపంజర నిభంబై నిశ్చలంబైన స
ద్భావంబంగన సాహచర్య గుణ సంపర్కంబునన్ లోహమై
గ్రావంబై ధృడ దారువై తరుణ వృక్షంబై ఫలప్రాయమై
పూవై తన్మకరందమై కరిగెఁ బోఁ బోఁ నీళ్ళకున్ బల్చనై
                                      వైజయంతీ విలాసము - సారంగు తమ్మయ -అ 2, పద్య 139

గోల్కొండసామ్రాజ్యాన్ని పాలించిన కులీ కుతుబ్ షాహీ కాలం నాటి సారంగు తమ్మయ్య  -అనే కవి రచించిన
“వైజయంతీ విలాసం”అనే కావ్యం లోని విప్రనారాయణ చరిత్రము లోనిది ఈ పద్యం.
పరమభక్త శిఖామణి అయిన విప్రనారాయణుడు దేవదేవి అనే వారకాంత వలలో చిక్కుకొని భ్రష్టుడై పోతాడు. ఎలా ఉండేవాడుఎలా అయిపోయాడో తెలియజేసిన వైనం ఈ చక్కటి పద్యంలో కవి వివరించాడు.
ఆ బ్రాహ్మణ శ్రేష్టుని యొక్క అత్యంత ధృడమైన వజ్రపంజరంవలె ఉండే – అంటే అభేద్యంగా ఉండే సద్భావం. సద్భావం అంటేసద్విషయకమైన భావం. భగవంతుడు సత్ చిదానంద స్వరూపుడు. సత్ అంటే ఉండేది. తక్కినవన్నీ ఉండవు. తద్విషయకమైనభావం సద్భావం. పరమేశ్వర సంబంధమైన భావం.
అంతవరకూ బ్రహ్మచర్య దీక్షలో ఉన్న విప్రనారయణుని సద్భావం అంగన – స్త్రీ - – ఆ దేవదేవితోడి సాహచర్యము చేయడం అనేగుణముతో కలిసి ఉండటం చేత (సాహచర్యగుణ సంపర్కమ్మునన్) వజ్రం లాంటి సద్భావం మెత్తబడుతూ క్రమంగా లోహమై, రాయి (గ్రావంబు) అయి, ఆ పై గట్టి కొయ్య (ధృడ దారువు) అయింది. అక్కడితో ఆగకుండా, లేత చెట్టు (తరళ వృక్షము)అయింది. ఇంకా ఆగలేదు. పండు అయింది, పువ్వు అయ్యింది. దానిలోని తేనె (తత్ మకరందం) అయింది. ఈ రీతిగా క్రమేపీపల్చబడుతూ పల్చబడుతూ పోగా పోగా (పో పో) అన్నింటికన్నా పల్చనైన నీళ్ళ కన్నా కూడా పల్చగా కరిగి పోయిందిట!

1 comments

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks