నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

Jul 10, 2014

అన్నమయ్య సంకీర్తనలు - ఛందస్సు

అన్నమయ్య సంకీర్తనల 29 వాల్యూమ్లు నేను కొని దాదాపు 15 సంవత్సరములు పూర్తికావస్తోంది. అప్పటినుండి ఆ పుస్తకాలలోని సంకీర్తనలను చదువుతున్నపుడు ఆ సంకీర్తనలు ఏ ఛందస్సులో నిబంధించబడినాయో అనే సందేహం నాకు కలుగుతుండేది. ఆ పుస్తకాలలో ప్రతి సంకీర్తనకు పై భాగంలో ఆ సంకీర్తనను పాడవలసిన రాగం పేరు సూచించబడింది, కాని ఆ సంకీర్తనకు నిబద్దమైన ఛందస్సు పేరు సూచించబడలేదు. అన్నమయ్య సంకీర్తనలలోని ప్రతి పంక్తిలోనూ యతిప్రాసలు స్పష్టంగా మనకు దర్శనమిస్తుంటాయి. యతి ప్రాసలు అలా ఉంటున్నప్పుడు ఆ సంకీర్తనకు నిబద్ధమైన ఛందస్సు కూడా ఉండే ఉండాలి. అలా లేకపోవటానికి కారణాన్ని నేను ఇలా ఊహిస్తున్నాను.

అన్నమయ్య సంకీర్తనలు అన్నమయ్య నాడే రాగిరేకులలోనికి ఎక్కించబడలేదు. వాటిని ఆయన కుమారుడు పెదతిరుమలయ్య పర్యవేక్షణలో ఎంతోమంది రాగిరేకులపై అక్షరాలను చెక్కే పనివాండ్ర చేత వ్రాయించబడటం జరిగింది. మొదట్లో అన్నమయ్య సంకీర్తనలు తాటియాకులలో వ్రాయబడ్డాయనిన్నీ, వాటిని ఒకసారి తగులబెట్టే ప్రయత్నం జరిగిందనిన్నీని మనం తెలుసుకున్నాం. అంటే ఆ సంకీర్తనలను ఎంతోమంది అన్నమయ్య పరోక్షంలో ఎన్నోమార్లు తిరగవ్రాయించి ఉండటం జరిగి ఉంటుందనేది నా ఊహ.  తిరుమల తిరుపతి దేవస్థానం వారు అన్నమయ్య సంకీర్తలను రాగిరేకులనుండి ఉద్ధరించి పుస్తకాల రూపంలో అచ్చువేయించటానికి నియమించిన పెద్దలు కూడా చాలా శ్రమతో ఈ సంకీర్తనలను వారికి సరి అయినది అని తోచిన మార్గంలో సరిచూచి ప్రచురించటం జరిగి ఉంటుంది.ఇలా ఎంతోమంది చేత ఎన్నోసార్లు తిరగ వ్రాయటంలోఎన్నోమార్పులు అనివార్యంగా జరిగి ఉండవచ్చును. ఇది కేవలం నా ఊహ. తప్పైనా కావచ్చు. ఇలా జరిగే అవకాశాలు ఉండటంతో ఆ సంకీర్తనలకు పై భాగాన ఛందస్సు పేరు ఉదాహరించటం జరిగి ఉండకపోవచ్చు. ఇది నా ఊహ మాత్రమే.

నేను ఊహించిన దాని ప్రకారం ఆ సంకీర్తనలలో ఎన్నో మార్పులు చేర్పులు జరిగి ఉండటానికి చాలా ఎక్కువ ఆస్కారం ఉండి ఉంటుంది.

శ్రీ మిరియాల ప్రదీప్ గారి chandam.apphb.com అనే సైటులో ఏ పద్యాన్నిగానీ, ఛందోబద్ధమైన సంకీర్తనని గాని ఒక బాక్సులో వ్రాసి "గణించు" అనే బొత్తాన్ని నొక్కగానే ఆ బాక్సులోని పద్యం గానీ కీర్తనగానీ ఏ ఛందస్సుకు చెందినదో  గణాలతో సహితంగా తెలియజేస్తుంది. అంతేకాదు ఆ పద్యానికి గణ విభజన జరిగి ఆ గణాల సహాయంతో ఆ పద్యం కానీ సంకీర్తనకానీ ఏ ఛందస్సులో ఉందో తెలియవస్తుంది. ఆ పద్యంలోని పంక్తులలో యే యే పంక్తులలో యే యే గణాలలో యే యే దోషాలు ఉన్నాయో కూడా చూపిస్తుంది. దగ్గఱ దగ్గఱగా 363 ఛందస్సులవరకూ దీని ద్వారా మనం ఛంస్సులను గుర్తు పట్టవచ్చును. ఇది నా చేతికి "కోతికి కొబ్బరికాయ దొరికిన" చందంగా తయారయింది.

ఇటీవల శ్రీ భైరవభట్ల కామేశ్వరరావు గారు తెలుగు ఎమ్.ఏ. పరీక్షకు కట్టి విజయవంతంగా మొదటి సంవత్సరం కోర్సును కూడా పూర్తి చేసారని విని దానితో ఉత్తేజం పొంది నేను కూడా ఎమ్.ఏ. తెలుగు పరీక్షకు కూర్చుందామని తయారయ్యాను. కోర్సు మెటీరియలు పుస్తకాలు తెప్పించుకొని చదవటం ప్రారంభించాను. వానిలో ఛందస్సులోని పుస్తకంలో "రగడలు" అనే ఛందస్సు గుఱించిన వివరాలు వానిలోని వివిధ రగడల ఛందస్సును గూర్చి ఉన్నది.
అన్నమయ్య సంకీర్తనలని chandam లో ఉంచి ఆ సంకీర్తన ఛందస్సు ఏమిటో తెలుసుకోవచ్చును గదా అనిపించి ఆ పనిని మొదలుపెట్టాను. అన్నమయ్య సంకీర్తనలు చాలా వరకూ ఈ రగడల ఛందస్సులోనే ఉన్నాయి. ఈ రగడ ఛందస్సు జానపదులు పాటలు పాడుకోవటానికి ఎక్కువగా వినియోగిస్తారు.

అన్నమయ్య అధ్యాత్మిక సంకీర్తనల మొదటి వాల్యూమ్ తీసుకొని వరసగా మొదటి నాలుగైదు సంకీర్తనలని ఛందం తో పరిశీలించగా ఆ సంకీర్తనలు ఏదో ఓ రగడ భేదానికి సుమారుగా 80% వరకూ సరపోయేది, కాని పూర్తిగా సరిపోయేది కాదు. ఆ సంకీర్తనని ఎలాగైనా నూటికి నూరుపాళ్ళూ ఆ రగడకి సరిపెట్టాలనే ఉద్దేశ్యంతో మొదలుపెట్టి ఆ రగడ లక్షణాలకు సరిపోయే విధంగా భావానికి పెద్దగా మార్పు జరక్కుండా ఉండేలా శ్రద్ధ తీసుకొంటూ చిన్న చిన్న మార్పులు చేర్పులు చేయగా అవి ఒకటి "తురగవల్గన రగడ"కూ, ఇంకోటి "మంజరీ ద్విపదకూ", మరోటి "అల్పాక్కర"కూ, ఇంకోటి "హంసగతి రగడ"కూ సరిపోయినవి. అన్నమయ్య సంస్కృత సంకీర్తనలను సరిచూడటానికి ఛందం సాఫ్టువేరులో సంస్కృత ఛందస్సులను ఇంకా ఉంచలేదని మిరియాల ప్రదీప్ గారు చెప్పారు. త్వరలో ఆయన వాటిని కూడా చేరిస్తే అప్పుడు సంస్కృత సంకీర్తలని కూడా చూడవచ్చు ననుకుంటున్నాను.

అన్నమయ్య అధ్యాత్మ సంకీర్తనల మొదటి సంపుటం లోని మొట్టమొదటి సంకీర్తనకు చేసిన మార్పులను చేర్పులను ఇక్కడ ఉంచే ప్రయత్నం చేస్తున్నాను.

మూల పాఠం

సామంతం

వలచి పై కొనఁగ రాదు వలదని తొలఁగ రాదు
కలికి మరుఁడు సేసినాజ్ఞ కడవఁగ రాదురా.    IIపల్లవిII

అంగడి కెత్తినట్టి దివ్వె లంగనముఖాంబుజములు
మంగిటి పసిఁడి కుంభములను ముద్దులకుచయుగంబులు
యెంగిలి సేసినట్టి తేనె లితవులైన మెఱుఁగు  మోవులు
లింగము లేని దేహరములు లెక్క లేని ప్రియములు.       IIవలచిII

కంచములోని వేఁడికూరలు గరువంబులుఁ బొలయలుకలు
యెంచఁగ నెండలో నీడలు యెడనెడ కూటములు
తెంచఁగ రాని వలెతాళ్ళు తెలివిపడని లేఁత నవ్వులు
మంచితనము లోని నొప్పులు మాటలలోని మాటలు.       IIవలచిII

నిప్పులమీఁదఁ జల్లిన నూనెలు నిగిడి తనివి లేని యాసలు
దప్పికి నేయి దాగినట్లు తమకము లోని తాలిమి
చెప్పఁగ రాని మేలు గనుట శ్రీవేంకటపతిఁ గనుటలు
అప్పని కరుణ గలిగి మనుట అబ్బురమైన సుఖములు.     IIవలచిII

పై సంకీర్తనని ఛందం లో ఉంచగా కొన్ని పంక్తులలో తప్పులు సూచించబడినాయి. వాటిని ఆ తురగవల్గన రగడకు సరిపడే విధంగా ఉండేలా చేయటానికై చిన్నచిన్న మార్పులు చేయవలసి వచ్చినది. ఆ మార్పులు చేసిన తర్వాత పాఠం ఇలా ఉంది.


 సామంతం
తురగవల్గన రగడ
వలచి పైకొనంగరాదు వలదని తొలఁగంగ రాదు
         కలికి మరుఁడు సేసినాజ్ఞ కడవఁగ రాదురారోరి  IIపల్లవిII
అంగడి కెత్తినట్టిదివ్వె లంగనముఖాంబుజములు
       ముంగిటి పసిఁడి కుంభములును ముద్దులకుచయుగములును
       యెంగిలి సేసినట్టి తేనె లితవైన మెఱుఁగు మోవి
       లింగములేని దేహరము లెక్కలేని ప్రియంబేను.       IIవలచిII 
కంచములోని వేఁడికూరలు గరువపు బొలయలుకలు
       యెంచఁగ నెండలోనీడలు యెడనెడనికూటములును
       తెంచఁగరాని వలెతాళ్ళు తెలివిపడని లేఁనగవులు
       మంచితనములోని నొప్పులు మాటలందు మాటలును.  IIవలచిII

నిప్పులపై జల్లిననూనెలు  తనివియెలేని యాస
       దప్పికి నేయి దాగినటు దమకములో తాలిమేను
       చెప్పఁగరాని మేలు గనుట శ్రీవేంకటపతిఁ గనుట
       అప్పని కరుణ గలిగి మనుట అబ్బురంపు సుఖములును.  IIవలచిII  1-1

ఇక్కడికి ఇంతతో ఆపుచేస్తున్నాను. మిగిలిన సంకీర్తనలను ఓ రెండు మూడు రోజుల్లో వీలువెంబడి పోస్టు చేస్తాను.
పెద్దలందరూ నా ఈ ప్రయత్నానికి వారి వారి సహాయసహకారాలు సందేశాల రూపంలో అందజేయగలందులకు ప్రార్థిస్తూ శలవు తీసుకుంటున్నాను.


0 comments:

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks