నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

Jun 27, 2009

ఊపిరి యాడకుండఁ దినుచుందురు త్రావుచునుందురంతఁ దా

అవతార ఖండము
దేవతలు రావణునివలనఁ బొందుచున్న బాధలను విష్ణుమూర్తికి విన్నవించుట
క.
ప్రభు నన్నుఁ జెప్పు మనెదరు
ఋభువులుఁ దశకంధరీకృతతేజో

విభువులు దినదినగండము

విభు నూఱేండ్లాయు వయ్యె వీరల బ్రతుకుల్
. 14
చ.
వరము లొసంగకుండినఁ దపస్సులు చేయరు చేసిరేనిఁ గా
పురుషులకున్ వరా లొసఁగ బోమని చెప్పఁగలేదు దానఁ గా

పురుషులయందు వాని ఫలముల్ విపరీతములౌఁ దపస్సులున్

వరములు దైత్యు లీ వరుస స్వర్గ సముచ్ఛ్రయకృచ్ఛ్రతాప్తియౌ
. 15
ఉ.
అన్నిటి కేమి గాని వనజాక్ష వరంబు లొసంగె వేధ యు
త్సన్నులు పెద్దరాక్షసు లజయ్యులె యౌటకునోర్తువారిలోఁ

బిన్నయు వచ్చి నా నొసటఁబెట్టునటే యడిదంబు మొన్ననో

నిన్ననొ తాఁగనుల్ తెఱచెవే మఱి వాఁడును నింద్రజిత్తటే
. 22
ఆ.
ఒక్కనాఁడు మాన్మథోత్సవాకృతులచ్చ
రలను గాంచినంత రామ ! రామ !

వెడలుచుండు నాకు వెయుయు రెండు క

న్నీటిబొట్లు నిముస నిముసమునకు.
24
ఈ రామ రామ అనే ప్రయోగం రామాయణం బాగా వ్యాప్తిలోనికి వచ్చిన తఱవాత వాడుకలోనికి వచ్చిన ప్రయోగం అనుకునేవాడిని . దీనిని రామునిపుట్టుకకు ముందే విశ్వనాధ వారు ఎంత బాగా వాడారో చూడండి.
సీ.
అతని గేహము లేమి యా పురంబున నెల్ల
నధమ సేవకుఁ డయ్యె నగ్ని యనఁగఁ
జమురు వత్తియు లేక జ్వలియింపవలె దివ్వె
తెలిబూదితో మండవలయుఁ బ్రొయ్యి
యొగి దయవచ్చిన నొకతడికట్టె యం
టింతు రంటింపరు పంతగాండ్రు
రాఁజుదునో నేను రాఁజనో తడికట్టెఁ
దడికట్టెయును లేక తప్పనపుడు
గీ.
మరల నందునఁ దక్కువ మండుటయును
వనట నెక్కువ మండుట పనికిరాదు
మనసుతోడ నా యంత నే మండవలయు
నంతలోన నా యంత నే నాఱవలయు. 33

ఇది అగ్నిదేవుని వేదన అయితే యముని బాధ యెలావుందో చూడండి.
ఉ.
అంతట దక్షిణేశుఁడను నంబుజనాభ ! విచిత్రమైన వృ
త్తాంతము నాది నేను యముఁడౌటయు నాకుయముండు రావణుం
డింతకు దక్షి ణేశుఁడను నేనో దశాస్యుఁడొ చెప్పలేను ప్రా
ణాంతకమౌ నిరర్థకదిశాధిపతిత్వము లేల మాకిటన్. 35
గీ.
అన నిఋతి యంతదూర మేలయ్య యే యు
మేశుతో నుట్టికట్టి యూరేగు నితఁడు
అతఁడె తనగిరి నితఁ డెత్తినపుడు కాలి
బొటన వ్రేల్నొక్కఁగాఁ గనుల్ మిటకరించె. 38
వాయువు బాధ యంకో రకం.
క.
నే నై దువిధము లందం
బ్రాణుల దేహంబులందు మసలుదును గదా !
దానవుల మై నెచట నే
నేనో నేనే యెఱుంగ నేరను శౌరీ. 40
ఉ.
ఊపిరి యాడకుండఁ దినుచుందురు త్రావుచునుందురంతఁ దా
నై పృథివీ పదార్థము దయన్ దన సూక్ష్మతరాణుమధ్యవీ
థీపథమం దొసంగి వెలితిన్ జొరనిచ్చును నన్ను లేనిచో
నూపిరి యాడకుండుట ప్రభూ ! దనుజాళికొ నా కొ చెప్పవే ? 41

0 comments

Jun 26, 2009

ఎన్నన్ నీవ జటాయువా ? సఖుడ ! రా ! యెన్నాళ్ళ కెన్నాళ్ళ కీ

దశరథుని యజ్ఞాన్నితిలకించవచ్చిన జటాయువుతో దశరథుడు.
శా.
ఎన్నన్ నీవ జటాయువా ? సఖుడ ! రా ! యెన్నాళ్ళ కెన్నాళ్ళ కీ
నన్నున్ లోనఁ దలంచినావు కబు రందం జేసిరా నీకునున్
మిన్నున్ డిగ్గుము నీవు వచ్చితివి నా మేధంబు సాఫల్య మం
దు న్నీకున్ గబురంపుటన్ దగు సుమంత్రుండున్ సుమంత్రుండుగా.౩౪౪

ఎంత ఆప్యాయత నిండి వుంది ఆ పలకరింపులో. తఱువాత అలాగే జటాయువును సాగనంపుతూ కూడా..
గీ.
ఉండుమని యెంత బలవంతమో పొనర్చె
రాజు మీ మానవులకు నారాక యొకఁడె
వ్రేఁగు నిలుచుట కాదని వెడలె నతఁడు
రాజునకును గన్నీళ్ళపర్యంత మయ్యె.

గీ.
ఒక్క పరదేశి నిరుపేద యుర్విసురుఁడు
కూడి యెకిమీనుతోఁ దనగోడు చెప్పఁ
గదలు నన వచ్చి మున్ గా మురారి
కరఁగి పతి తీసి యొసఁగె ముంగా మురారి. 395
ఎకిమీను=రాజు
చివరి రెండు పాదాలూ అర్థం కాలేదు. ఎవరైనా పుణ్యం కట్టుకొని విడమఱచి అర్థం చెప్పరూ.

0 comments

Jun 25, 2009

ఇపుడె గుండిగ దింపి యిగురబెట్టితిఁ బొడి బొడి పొళ్ళాడు నీ యన్నమును దినుండు

ఉ.
సుందర యజ్ఞవాటి వెనుచొప్పునఁ దీరిచి దిద్ది వోయు మేల్
పందిరులందు సోలుపులు బంతులు తీరిచి నాథవంతులున్
దిందు రనాథవంతులును దిందురు గఱ్ఱునఁ ద్రేఁచి త్రేఁచి గో
విందలు కొట్టుచున్ జిఱుతబిడ్డల పొట్టలనిండఁ గ్రుక్కుచున్. 333
ఉ.
విస్తరిమీఁద వంగబడ వేయక మానెదరేమొ సూదకుల్
విస్తరిపైని వంగుటకు వెన్నును వంగదు పొట్ట వంగదున్
హస్తము లడ్డముంచినను నాఁగక వడ్డన చేతురన్నియున్
గస్తిగ నట్లె తిందు రవుగాదనలేక క్రతుప్రసాదముల్. 334
సీ.
ఇపుడె గుండిగ దింపి యిగురబెట్టితిఁ బొడి బొడి
పొళ్ళాడు నీ యన్నమును దినుండు
పూర్ణమ్ము లేకుండఁ బునుకులుగా వేసి
తిమి కరకరలాడు తినుఁడు వాని
గాలుచు నున్నది కాఁబోలు క్షీరాన్న
మిదె దొన్నెలను దెచ్చియిత్తు నుండుఁ
డిది గడ్డపెరుఁగు మీ రింకఁ గొంచెము వేసి
కొనవలెఁ జలువ చేయునుగదండి
గీ.
యనుచు బతిమాలి బతిమాలి యవనినాథ
సూదకులు కొల్లలుగఁ దెచ్చి చూఱయీయ
నన్నమున నాదరంబునఁ దిన్నకడుపు
లెన్న నెడఁదలు నుబ్బిపోయెదరు జనులు. 335
సీ.
అన్నంపురాసులు చిన్న తోమాలెల
కై సన్నజాజులు పోసినట్లు
సన్న ఖర్జూరపుఁ జాపలపై సూప
రాసులు గంధమ్ము తీసినట్లు
ఎఱ్ఱవాగుగను వేయించి నప్పడములు
పునుఁగు కుంకుమ కుప్పవోసినట్లు
వంగపండుల పేళ్ళ వరుగు చోష్యపు గుబా
ళింపు ల త్తరుల నొల్కించినట్లు
గీ.
రాఘవుల యిలవేల్పు శ్రీరంగనాథ
ప్రభువు పవళింపుసేవకై భద్రపఱిచి
నట్టి సంభార మనఁగ మహాసనంబు
ద్రవ్యముల పొల్చె దశరథక్రతువు వేళ. 336

వంగపండుల పేళ్ళ వరుగు చోష్యపు గుబాళింపు=ఎన్నన్నెన్నేళ్ళయిందో ఈ వంగపండు పేడులతో చేసిన కూర రుచి చూసి. విశ్వనాథ వారి పుణ్యమాని మళ్ళీ ఇన్నాళ్ళకు కాదు కాదు ఇన్నేళ్ళకు చూసాను, బాగా చిన్నప్పుడు మా అమ్మ వండిపెడితే ఆనందంగా ఆరగించిన ఈ కూర రుచిని. మనకి బాగా యిష్టమైన కూర రుచి ఎన్నాళ్ళయినా ఎన్నేళ్ళయినా అలా నాలుకను పట్టి ఉండిపోతుందంతే.

0 comments

Jun 23, 2009

కౌసల్యయొడిలోనఁ గాని కూర్చుండదు జడ సుమిత్రయె కాని ముడువరాదు

ధశరథుడు తన ముగ్గురు భార్యలతోనూ ఇతర పరిజనంతోనూ కలసి రోమపాదుని అంగరాజ్యానికి అతని అల్లుడైన ఋష్యశృంగుని తన రాజ్యానికి యాగం నిర్వహించటానికై ఆహ్వానించటానికై వెళతాడు. అక్కడ రోమపాదుని కూతురు శాంత కలివిడి మనస్తత్వాన్ని తెలియజేయడం కోసం విశ్వనాథవారిలా అంటారు.
సీ.
కౌసల్యయొడిలోనఁ గాని కూర్చుండదు
జడ సుమిత్రయె కాని ముడువరాదు

కై కేయితోఁగాని కై లాగుఁ బూనదు

వారితోఁ గాని నవ్వంగరాదు
తన సుతున్ గౌసల్యగనుక ముద్దాడ ని
చ్చు సుమిత్ర గనుక గ్రచ్చుకొననిచ్చు
కై కేయి గనుక చిక్కని ముంగురులు పాయ

గాఁ దీయఁగా నిచ్చుఁ గఱుదులాడి
గీ.
శాంత కీ రీతి వారితో జగము వారి

తో సకలముగా రోమపాదుండు చూచి

తల్లిచూచి హృదంతరుత్ఫుల్ల మోద
జలధులై యొక్కవారము జరిగె నిట్లు.227

అంతా మన తెలుగులోగిళ్ళలో జరిగినవే, జరిగేవే మన కళ్ళకు కట్టినట్టు చిత్రించి చూపారు.
ఓ ఏడెనిమిది రోజులాగిన తర్వాత ఒకనాడు ధశరథుడు రోమపాదునితో తన కోరిక వెల్లఢించాడిలా.
ఉ.
మిత్రయశోనిధీ ! తురగమేధము సేయ వశిష్ఠులాజ్ఞ చే
బుత్త్రులు లేని కారణము పొంటెఁ దలంచితి ఋష్యశృంగు లా

సత్త్రము సాగఁజేయ ఫలసంగతి శీఘ్రమ కల్గు నంచు నీ

మైత్రిఫలం బొసంగు మని మౌనిని యాచన సేయవచ్చితిన్. 230
శా.
నా వెంటన్ దయచేసి పంపఁగదె శాంతన్ ఋష్యశృంగున్
గ్రతు
శ్రీ వేళన్ గబురంపెదన్ వెడలిరారే నీవు నీమంత్రులున్
నీ వాల్లభ్యము నీదు నంతిపురియున్ నీ వప్పు డేతెంచి నీ

వే వీక్షింతువు ఋష్యశృంగులను నం దేరీతిగాఁ జూతునో. 231

అలా తన కోరికనూ, తన ఆహ్వానాన్నీ కూడా తెలియచేస్తాడు దశరధుడు రోమపాదునితో. ఎంత మాట పొందికో చూడండి. దానికి రోమపాదుడు
క.
నీకూఁతు రగుటకు న్మును
నా కూఁతురె శాంత ? మౌని నా కల్లుఁడు ముం
దీ కొంచియమ్ము గౌరవ

మే కొండంతగ వచింతు వేలయ్య నృపా !
234
వ.
మఱి ఋష్యశృంగుఁడో ! 235
శా.
శ్రీస్యందాననుఁ డై వశిష్ఠులని పేరే చెప్పినన్ గౌరవ
భ్రశ్యత్కేశ నిబంధనమ్ము గురుతాస్రంసన్నివీతంబుగా
వశ్యుం డై చనుదెంచు వెంటఁబడి నేఁ బంపించు టేమున్నదో

హాస్యంబౌగద నీవు నర్థివయి నేనా ! దాత నో మిత్రమా ! 236

ఇక్కడో సందేహం. ప్రాసాక్షరాలు రెండు పాదాల్లో (1,4) 'స' మఱి రెండింటిలో (2,3)'శ' --ఇలా వాడవచ్చో లేదో నాకు తెలియదు.
క.
సుఖమో దుఃఖమో జన్మము
ముఖస్తుతులు గావు నిన్ను బోఁలు నమృతుఁడౌ
సఖుఁడొక్కఁడున్న నీ దృశ

మఖంబు లొకవేయి యశ్రమంబుగ నెగ్గున్.
238
క.
అని ఋష్యశృంగుతోఁ జె ప్పిన నాయన రోమపాద పృథ్వీపతి యా జ్ఞను శాంతయుఁ దాను నయో ధ్యను జేరఁగ బయలు దేరి రా సమయమునన్. 239

పై సంభాషణ లన్నీ మన తెలుగు కుటుంబాలలో మనం రోజూ మట్లాడుకొనే సంభాషణల్లాగా లేవూ.
విశ్వనాథ వారు చేసిన ప్రతిజ్ఞ
"గీ.
నాది వ్యవహారభాష మంథరము శైలి
తత్త్వము రసధ్వనులకుఁ బ్రాధాన్యమిత్తు
రసము పుట్టింపంగ వ్యవహారము నెఱుంగ
జనును లోకమ్ము వీడి రసమ్ములేదు. 38" ను మళ్ళీ మళ్ళీ గుర్తుకు తీసుకొస్తుంది మనకు.

అయోధ్యకు వచ్చిన శాంతను చూసి పౌరజనులు

మత్తకోకిల.
ఎంతచక్కని చీరగట్టిన దెంతసొమ్ములు క్రొత్తవిన్
వింతలున్ మెయిఁ దాల్చికొన్నది విశ్వమోహనమూర్తియై
యెంతభాగ్యము భర్తతో రథమెక్కి ముందఱిబండిపై
నింతగౌరవ మొప్ప నేగుట యే లతాంగులు నోతురే ? 247
సీ.
పడఁతి మీపిత రోమపాదులు సేమమా ?
కుశలమా మీతల్లి కోర్కి వల్లి ?
యెండలోఁ బడివచ్చి తింక స్నానముచేసి
విశ్రాంతిఁ గై కొనవే కుమారి !
యెన్నాళ్ళు లైనదే యీవు రాఘవకుల
మ్మును వీడి చని యోసి ముద్దుబిడ్డ !
కడు స్రుక్కితివి లేచి కడఁగి భుజింపవే
మో మెంతవాడెనే ముద్దుగుమ్మ !
గీ.
అల్ల పసినాఁడు నీవు భాగ్యాలరాశి
వనుచు ఋషి ధర్మపత్ని వౌదంచు నెఱుఁగఁ
జాలమైతి మె యో పూతచరిత ! యేమి
భాగ్యమే నీది గౌరవయోగ్యురాల ! 249

0 comments

ఒనర బోర్కాడించి యుయ్యెలతొట్టెలోఁ బండఁ బెట్టిన పసిపాపవోలె

ఋష్యశృంగుని అశ్వమేధ యాగానికి ముందే ఇక్కడకు తీసుకొని రావాలని అతని మహత్త్వమున రాజుకు సంతానం తప్పకుండా కలుగుతుందనిన్నీ తాను పూర్వం సనత్కుమారుడు చెప్పగా విన్నాననీ సుంమత్రుడు చెప్పగా దశరథుడు విన్నాడు. తరువాత
సీ.
ఒనర బోర్కాడించి యుయ్యెలతొట్టెలోఁ
బండఁ బెట్టిన పసిపాపవోలె
వీథులంబడి తిర్గి బూదియ మైఁ జల్లు
కొని పర్వులంబెట్టు కుఱ్ఱవోలె
నన్నమ్ముఁ దించు మో మంతయుఁ బెరుఁగన్న
మును జేసికొన్నట్టి బొట్టెవోలెఁ
జిట్టి ! తలంటిపోసెద నన్న నందక
తొలఁగి పర్వులువెట్టు నులిపివోలె
గీ.
వెల్ల దుస్తులు కట్టించి వీధులన్ షి
కారు పంపిన రాజకుమారువోలె
మింట నడుచక్కి జాబిల్లి మేదినీశు
నేత్రములకును జలువఁ బండించిపోసె.204

వశిష్ఠులవారు దశరథునితో
ఆ.
అనుచు మంత్రితోడ నరిగి యట్లే వశి
ష్ఠులకుఁ దెల్పఁగా గడున్ ముదంబుఁ
బొంది వారి తండ్రి ! పో ఋష్యశృంగుండు
చిన్ని సుకర పాల జున్నుగడ్డ.
వ.
అని వశిష్ఠు లనుమతిం జూపిన-
చిన్ని సుకర పాల జున్నుగడ్డ. ఈ ప్రయోగానికి అర్థం తెలియలేదు.



0 comments

Jun 22, 2009

తండ్రి కన్నను ముందు దానె మేల్కని యగ్ని

ఋష్యశృంగుని చరిత్ర
ఉ.
అంగములేలు భూమిపతి యాత్తసుహృన్మతి రోమపాదుఁ డే
లంగల యూళ్ళు బెట్టయి యిలాపతి ధర్మగతిన్ వ్యతిక్రమ
మ్ముం గలుగంగ వర్షములు పుట్టకయుండిన యంత
నంగముల్
చెంగలులై చెడెన్ జినుకు చిన్కిన పాపమునందుఁ బోవకే. 148

ధర్మవ్యతిక్రమం వలన దేశంలో వర్షాలు కుఱవకపోతే భూములన్నీ పాడైపోయి ఊళ్ళన్నీ బీడయి పోయాయి. చినుకు చినికితే ఒట్టు. అలా వుంది పరిస్థితి.
సీ.
మాగాని పరశురామప్రీతి యైనట్లు
మొలకనారులె యెఱ్ఱతలలు వేసె

మెట్టచాలులు విత్తు వెట్టకమున్నె చు
మ్మలుచుట్టి మలమల మాఁడిపోయె
ఊటలూరెడి సెలయేటి మేల్వరవలు

నెండిన బుగ్గలై యింకిపోయె

బావులలో నీరువట్టి పూడికఁదీయ

మున్ను పుట్టిన జల మిన్నుముట్టె

గీ.

పాఁడియావుల చన్నులు పట్ట నెత్రు

ధార లోడిన
జనులు హాహారవముల

రాజు మొగసాల నిలచి మొఱ్ఱలిడినంత

విభుఁడు నేడ్చుచు వారిఁ జే విసరిపంపి
. 149

తెలుగు జాతీయాలను ఎంతబాగా వాడారో చూడండి.
క.
ఒకచోటఁ గుఱుపు మందిం
కొకచో నన్నట్లు పాప ముర్వీపతిదిన్
వికృతపు బాములు ప్రజలవి
యకటా ! యీ బాము లెట్టు లపహృతము లగున్. 151

కుఱుపు ఒకచోటైతే మందింకో చోట రాసినట్టయింది పరిస్థితి. పాపం రాజు చేస్తే ప్రజలు కష్టపడుతున్నారు మఱి.
అని పురోహితులనడుగగా వారతనికి సలహా చెప్పారట.
వ.
మహాతపస్వియగు కాశ్యపునకు విభాండకుండు పుట్టె నవ్విభాండకునకు ఋష్యశృంగుఁడను కుమారుండు కలిగెను. ఆ ఋష్యశృంగుండు విభాండకుని కన్నులకు వత్తి; తండ్రి యాయన నట్లు పెంచె. 156
చ.
అతనికి లోకమే తెలియ దగ్నియు దండ్రియు నిద్దఱే జగ
మ్మతనికి బ్రహ్మచర్య మిపుడై నను నట్లె ద్విధాగతి ప్రసా
రితముగఁ బొల్చు నవ్వనిఁ జరించును దూరపుఁదోట పోఁడు లో
భితమతి కాఁడు స్త్రీ పురుష భేదముకూడ నెఱుంగఁడింతయున్. 157

కనీసం స్త్రీ పురుష భేదం కూడా తెలియకుండా ఎవ్వరినీ చూడకుండా కేవలం తండ్రితో మాత్రమే గడుపుతూ పెఱిగాడన్నమాట.
క.
మూడవ మానిసి నెఱుఁగడు
నాఁడుది యన నేమొ యెఱుఁగ డంతకుమున్నీ
పోఁడిమి విని జని తెచ్చిన
కాఁడలు సమిధలును బండ్లుఁ గాయలె యెఱుఁగున్. 158
సీ.
తండ్రి కన్నను ముందు దానె మేల్కని యగ్ని
హోత్రమ్ము సరిచూచి యుముకఁ బెట్టుఁ
దండ్రికన్నను సముద్యద్ఘోష మేపార
నర్ధర్చలును ఋక్కు లనువదించుఁ
దండ్రికన్నను సమాహితశ్రద్ధమై యుష
ర్బుధున కర్చాహవిర్బుధ్నము లిడుఁ
దండ్రికన్నను నిశ్చితజ్ఞాన దృఢబుద్ధిఁ
బితృసమార్చాధురాప్రీతిఁగాంచు
గీ.
నతఁడు పుంరూపబ్రహ్మచర్యంబు శ్రద్ధ
ప్రోవు నెల్ల ప్రాయశ్చిత్తరూప మతఁడు
వాని నాషాఢ మేఘమువోని వాని
నిటకుఁ దెచ్చితివే ననావృష్టి తొలఁగు. 159

ఆ ఋశ్యశృంగుడిని ఇక్కడకు తీసుకొని వస్తే అనావృష్టి తొలగిపోతుంది
క.
నీ తనయ శాంత నొసగుమ
యా తబిసికిఁ గదలఁ డిచట నాతం డెన్నా
ళ్ళే తావునందు నుండునొ
యా తావున నీతిబాధ యనిలేదు నృపా !
అని చెప్పారు పురోహితులు.


0 comments

ఎయ్యది యెప్డు దాఁచవలె నెయ్యది యెప్డు వచింపఁగావలెన్

సుమంత్రుఁడు దశరథునకు ఋష్యశృంగోపాఖ్యానమును జెప్పుట
చంద్రకళ.
మున్ను విన్నది దేవరహస్యంబున్ దమకున్ వినిపింపఁగా
నెన్నొసార్లు తలంచితిఁ గానీ యేను వచింపనె లేదు నేఁ
డెన్నఁ జెప్పకయున్న ఫలం బొక్కింతయు లేదు ధరాధిపా !
మన్ను దేవయుగంబున వింటిన్ భూప ! భవత్సుతహేతువున్. 144

విశ్వనాథ వారు వారి రామాయణంలో మిగిలిన కవులు తరచుగా వాడని ఎన్నెన్నో కొత్త కొత్త ఛందస్సులని మనకు పరిచయం చేస్తారు. అటువంటివాటిలో ఈ చంద్రకళ ఒకటి. ర స స త జ జ గ గణాలుగా ఉన్నాయి. యతి స్థానము నాకు తెలియలేదు.
క.
అని చంద్రకళలు విరిసిన
వన బల్కిన మంత్రిఁ గని రహస్యంబా ? న
న్నును మఱుఁగు వెట్టి యిన్నా
ళ్ళును దాఁచితి వేటి కీ ప్రలోభము మంత్రీ ! 145

చూడండి, చంద్రకళ పద్యం చెప్పిన వెంటనే ఆ చంద్రకళల నాలాగే పట్టుకుని తరువాతి పద్యం. ఇదీ ఆయన చమత్కారం.
ఉ.
ఎయ్యది యెప్డు దాఁచవలె నెయ్యది యెప్డు వచింపఁగావలెన్
గయ్యలుకోయు టెందొ ? యధికంబుగ నొండులుపేర్చు టెందొ ! నీ
వ య్యమరాపగంబలె మహాప్రభుబుద్ధివి దాని జెప్పుమా
య య్యతనంబు సేయుదము సాద్భుతమంత్ర వినిర్ణయాకృతీ ! 146

రెండు నాలుగు పాదాలు అర్థం కాలేదు. పెద్దలు తెలియపరిస్తే కృతజ్ఞుడిని.
క.
అను ఱేని ప్రశ్రయంబున
కును గొంచెము కదలి రాజగోపాలక ! నా
వినినది చనినది యొకటియ
చనినది నీ వెఱుఁగుదువును చారులవలనన్.147
ప్రశ్రయంబు=అనునయము

0 comments

Jun 20, 2009

వనజాక్షి ! నీవింక వనరఁగ బోకు వే

ఇష్టి ఖండము
దశరథుడు సంతానార్థియై చింతిస్తూ ఉంటాడు. అతడు మంత్రి సుమంత్రునితో అదే విషయాన్ని గుఱించి మాట్లాడుతూ మాట్లాడుతూ హఠాత్తుగా లేచి సుమంత్రునితో--
ఉ.
ఇంకను నీ వహో యిచటనే నిలుచుంటి విదేమి ? పోయి నా
యంకెకు మంత్రులన్ బిలువు మల్ల వశిష్ఠుల వామదేవులన్
లెంక నృపుండు రమ్మనియె లెండని వేగమ కొంచురమ్ము నా
శంకలు పోయె ఱేనికిని సంతతి గల్గు భయంబు లేదిఁకన్. 84

ఇంకా ఇక్కడే నిలుచున్నావేమిటి ? వెళ్ళలేదా, వెళ్ళి అందరినీ పిల్చుకొని రా. అని మనమందరం చాలా సామాన్యంగా మాట్లాడుకొనే మాటలనే ఉపయోగిస్తూ సుమంత్రుని దశరథుడు హెచ్చరించాడు. అశ్వమేధ యాగం చేస్తే తప్పక సంతానం కలుగుతుందనే నమ్మకంతో కలిగిన వేగిరపాటది.
దశరథుడు వెంటనే విచారగ్రస్థయై కూర్చున్న కౌసల్యాదేవిని జబ్బలు పూని లేపి నిలుచుండఁబెట్టి కన్నులఁగన్ను లుంచి-
సీ.
వనజాక్షి ! నీవింక వనరఁగ బోకు వే
నావంకఁ జూడవే నలినవదన !
యమృతాంశుముఖమండలా ! దుఃఖమేటికే
కష్టముల్ తొలఁగెనే కంజనేత్ర !
హరిణాక్షి ! మనబాము లవ్నియఁ దీరెనే
బెడఁదలు తొలఁగెనే బిసరుహాక్షి !
ముత్స్యపుచ్ఛాభిరామ విలోచనాంచల !
సుకృతముల్ పండెనే ముకురవదన !
గీ.
క్రీడహయమేధ మన్న నాఁగేటికొఱ్ఱు
లాగి పాపంపు బెట్టపొలాలు దున్ని
దివిజతర్పణ మన్న బోదియలు ద్రవ్వి
మంచిసుతు లను శాలి పండించి వైతు. 87

ముసలివాఁడైన దశరథునకు సంతానం కలగొచ్చనే భరోసా ఎంత ఉత్సాహాన్ని కలిగించిందో చూడండి.
ఉ.
అచ్చట యజ్ఞభూమి కనువైన ప్రదేశము నీదు మంత్రులం
బుచ్చుము పుణ్యపు దలఁపు పుట్టిన యప్పుడె కార్యరూపమం
దచ్చుపడంగఁ జేయవలె నాపయి నేదొ వికల్పమందినన్
లొచ్చగుహెచ్చగున్ దలఁపులోఁబని దీర్చుట యుత్తమంబగున్. 116

మంచిపనిని వేగిరంగానే చెయ్యాలి అంటారందఱూ. ఆలస్యాదమృతం విషం . అందుకని వెంటనే పూర్తి చేయటం ఉత్తమం.
గీ.
వెదకఁబోయిన తీవ దవిలెను గాలి
కందు రపు డేమి సేయుదు రల్లతీవఁ
ద్రెంచి తెచ్చి యౌషధము వండించుకొనుటె
మిగిలినది భిషగ్రత్నముల్ మీరు సూడ. 123

వెతకపోయిన తీగ కాలికి తగిలిందని సామెత.
క.
ఎఱుఁగని దానవొ నీకుం
గఱదలు సెప్పంగ ననుచుఁ గదలి యిలేశుం
డఱిముఱి సుమిత్ర మేడకు
నెఱకలు కట్టుకొనినట్టు లేగె నడచుచున్. 130

ఎఱకలు కట్టుకొని పోయినట్టు పోయాడు అని మనమందరం వాడుతుంటాం. ఎఱకలు అంటే ఱెక్కలు అని అర్థం.
కౌసల్యకే కాక నీకూ పుత్త్రుడు కలుగుతాడని దశరథుడు సుమిత్రతో చెపుతూ ఇలా అంటాడు.
గీ.
దీక్షఁగై కొని వ్రతయుక్తి ధృతమనోవి
నిశ్చయాత్మవు సుతుకోర్కి నెగడెదేని
ఫలముఁ గందువు పొలములో వాన యొక్క
చెక్కఁగుఱిసి వేఱొక చెక్కఁ జుక్కపడదె ! 133

అలాగే.

ఆ.
ఎన్ని తరువులున్న నన్నియుఁ గాయంగఁ
బూఁటఁ బూఁట వేచుఁ దోఁటమాలి
కడుపు నీదికూడఁ గాచిన నాగుండె
యటమటించు టాగి హర్షమొందు. 138

ఇటువంటి పలుకుబడులు అన్నీ యిన్నీ కావు యీ కల్పవృక్షంలో. మన శక్తి కొద్దీ తవ్విన కొద్దీ బయటపడుతూనే ఉంటాయి. అవునిది కల్పవృక్షం కదా ! మనకోరికలనన్నిటినీ తీరుస్తుంది కదా మరి.

3 comments

Jun 19, 2009

అల నన్నయ్యకు లేదు తిక్కనకు లేదా భోగ మస్మాదృశుం

అవతారిక-2
చ.
తిరుపతి వేంకటేశ్వరులు దేశముఁ గైతయు గ్రుచ్చియెత్త బం
దరు పుర మాంగ్లపుం జదువునం జని వారలలోన వేంకటే

శ్వర గురు రాజమౌళి పదసంజనిత త్రిదివాపగా సుధా

ఝురముల మున్కలాడు ఫలసంగతి సత్కవి నై మెలంగుచున్
. 18
చ.
తన యెదయెల్ల మెత్తన కృతప్రతిపద్యము నంతకంటె మె
త్తన తన శిష్యులన్న నెడదం గల ప్రేముడి చెప్పలేని మె

త్తన యయి శత్రుపర్వతశతారము సత్కవి చెళ్ళపిళ్ళ వేం

కన గురువంచుఁ జెప్పికొనఁగా నది గొప్ప తెలుంగునాఁడునన్. 19
ఎంత సుతి మెత్తని పద్యం.
శత్రుపర్వతశతారము=పర్వతములవంటి శత్రువులకు వజ్రాయుధము వంటి
మ.
అల నన్నయ్యకు లేదు తిక్కనకు లేదా భోగ మస్మాదృశుం
డలఘుస్వాదు రసావతార ధిషణాహంకార సంభారదో

హల బ్రాహ్మీమయమూర్తి శిష్యుఁ డైనా డన్నట్టి దావ్యోమపే
శలచాంద్రీ మృదుకీర్తి చెళ్ళపిళవంశస్వామి కున్నట్లుగన్. 21

ఆయన తన గురువుగారి గొప్పదనాన్ని కీర్తిస్తున్నట్లుగా కనిపించే ఈ పద్యం లో విశ్వనాథ వారు తన గొప్పదనాన్నే ఘనంగా చెప్పుకొన్న తీరు అమోఘం మరియు అద్భుతం. వారి గురువైన చెళ్ళపిళస్వామిగారి కున్నటువంటి మృదుకీర్తి భోగం అల ఆ నన్నయ్య గారికి గాని తిక్కన గారికి గాని లేదంట. ఏమిటంటా అది. తనవంటి లఘుస్వాదు రసావతార ధిషణాహంకార సంభారదోహల బ్రాహ్మీమయమూర్తి శిష్యుఁ డైనా డన్నట్టి ఆవ్యోమపేశల చాంద్రీమయ మృదుకీర్తి అట. ఈ పెద్దసమాసానికర్థం తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం.
అలఘు=చులుకన కాని
స్వాదురస=ద్రాక్ష
అవతార=దిగుట
ధిషణాహంకార=బుద్ధివలని కలిగిన అహంకారము
సంభార=సర్వపూర్ణత్వము
దోహల=ఉత్సాహము
బ్రాహ్మీమయమూర్తి=సరస్వతీమూర్తి
వ్యోమ=ఆకాశము
పేశల=చక్కనిది
చాంద్రీమృదుకీర్తి=వెన్నెలవంటి మెత్తని కీర్తి
నేను అర్థం చేసుకున్న విధంగా ఈ పద్యానికి అర్థం ఇలా ఉంటుందనుకుంటున్నాను.

చులుకన కాని ద్రాక్షారసంతో కూడిన బుద్ధి అనే అహంకారంతో సర్వసంపూర్ణత్వాన్నికలిగి ఉత్సాహంతోకూడి సాక్షాత్ సరస్వతీ స్వరూపమైన నావంటి శిష్యుని కలిగివుండటం వల్ల పొందగలిగే, ఆకాశాన్ని ప్రకాశింపచేస్తున్నచల్లని వెన్నెలవంటి మృదు కీర్తి అనబడే భోగం మా గురువైన చెళ్ళపిళ స్వామికే కలిగింది కాని ఆనాటి గొప్పకవులైన నన్నయ్యగారికిగాని తిక్కన గారికి గాని కలగలేదు.
ఎంత గొప్పగా తనగొప్పదనాన్ని గురువులమీది భక్తినీ ఏకకాలంలో వ్యక్తం చేసారోకదా. అలా రాయటం కేవలం ఆ మహా మనీషికే చెల్లు.
ఒకపదానికి నిఘంటువులలో అనేకానేక అర్థాలుంటాయి. సందర్భాన్ని బట్టి మనం తీసుకొనే అర్థాన్ని బట్టి మనకు తోచే అర్థం మారుతూ ఉంటుంది. నాకర్థం అయిన భావం పైన వ్రాసాను. పూర్తిగా సరికాకపోవచ్చు. పెద్దలు ఇంకా మంచి అర్థం వివరిస్తే కృతజ్ఞుడనై ఉంటాను.
సీ.
ఋషివంటి నన్నయ్య రెండవ వాల్మీకి
తిక్కన్న శిల్పపుఁ దెనుఁగుతోట
యెఱ్ఱన్న సర్వమార్గేచ్ఛావిధాతృండు
పోతన్న తెలుఁగుల పుణ్య పేటి
శ్రీనాధుఁడు రసప్రసిధ్ధ ధారాధుని
కృష్ణరాయఁ డనన్య కృతిప్రబంధ
పెద్దన్న వడపోత పెట్టి నిక్షురసంబు
రామకృష్ణుఁడు సురారామగజము
గీ.
ఒకఁడు నాచనసోమన్న, యుక్కివుండు
చెఱిపి పదిసార్లు తిరుగ వ్రాసినను మొక్క
వోని యీ యాంధ్రకవిలోకమూర్ధమణుల
మద్గురుస్థానములుగ నమస్కరించి. 30

తనకు గురువుగా ఉన్న కవుల పేర్లను ఎన్నుకోవడానికి నిజంగానే విశ్వనాథ వారు ఒకటికి పదిసార్లు చెఱిపి తిరిగి తిరిగి వ్రాసికున్నారేమో-- అందుకోసమేనేమో చివరలో ఆమాట కూడా పడింది పద్యంలో.
ఇక సంస్కృత కవుల విషయానికొస్తే
ఆ.
భాసకాళిదాస భవభూతి దిఙ్నాగు
లకుఁ బ్రశస్తవాగ్విలక్షణుంఢు ము
రారిభట్టునకును రామకథాభాష్య
కారులకును మోడ్పు కై ఘటించి. 31
శా.
ఈ సంసార మిదెన్ని జన్మలకు నేనీ మౌని వాల్మీకి భా
షాసంక్రాంతఋణంబుఁ దీర్పఁగలదా ! సత్కావ్యనిర్మాణరే
ఖాసామాగ్రి ఋణంబుఁ దీర్పఁగలదా ? కాకుత్థ్సుఁ డౌ స్వామి గా
థాసంపన్నము భక్తిఁదీర్చినను ద్వైతా ద్వైతమార్గంబులన్.34
గీ.
ఒక్క వాల్మీకి కాక వేఱొక్కఁ డెవఁడు
సుకవిశబ్దవాచ్యుం డిఁక గుకవినింద
యప్రశస్తపథంబుగా నవుటఁ జేసి
మునిఋణముఁ దీర్ప నీ కావ్యమును రచింతు.35

నిజంగానే విశ్వనాథవారు మునిఋణాన్ని తీర్చుకున్నారు. ఆయన ఋణాన్ని మనం తీర్చుకోవాల్సివుంది.
గీ.
నాది వ్యవహారభాష మంథరము శైలి
తత్త్వము రసధ్వనులకుఁ బ్రాధాన్యమిత్తు
రసము పుట్టింపంగ వ్యవహారము నెఱుంగ
జనును లోకమ్ము వీడి రసమ్ములేదు. 38

ఎంత బాగా చెప్పారు.
మ.
తొడవుల్ వృత్తులునున్ గుణంబులును రీతుల్ వ్యంగముల్ దీప్తి యే
ర్పడగాఁ గావ్యత, సంస్కృతంబొలసియాంధ్రంబయ్యె నీ తెల్గుమేల్
నుడికారమ్ములు దేశ్యముల్ పలుకుబళ్ళును జాతి మాట్లాడు కై
వడి సత్కావ్యము లొప్పునాంధ్రమున, నా రామాయణం బట్టిదే. 39

ఈ పై పద్యమే నాచేత ఈ టపాలను వ్రాయటానికి పురికొల్పింది. తెల్గుమేల్నుడికారమ్ములు దేశ్యముల్ పలుకుబళ్ళును జాతి మాట్లాడు కైవడి-- వీటిని ఏర్చి ఒకచోట కూర్చాలన్నదే నా అశక్తి, ఆరాటమునూ.
సీ.
చిఱునవ్వు నవ్వెనా ! చిన్నారి ముత్యాలు
ప్రోవులు ప్రోవులు పోసినట్లు
కనులెత్తి చూచెనా ? కప్రంపుఁ జిఱుపొడు
లుప్ఫని తీగఁగా నూదినట్లు
ఒక యింత నడచెనా ! యొగి ఢిల్లి భోగాల
రాశి లాభము కొలపోసినట్లు
పన్నెత్తి యాడెనా ! ప్రభుత విస్మృతిపడ్డ
సాధుభావము బారసాచినట్లు
గీ.
మంజులవినీత వేషుఁడు మధురమూర్తి
యార్ద్రభావుఁడు కుదిమట్ట మైన బొమ్మ
బాలరాఘవువలెఁ బితృవాక్యపాల
నా నినీషా మనీషా సనాతనుండు.41

ముక్త్యాల యువరాజుగారి గుఱించి వ్రాసినదీ పద్యం.
ఉ.
ఇచ్చెదనంచు చెప్పు సగమిచ్చును చాలద యద్ది కాన, వే
రిచ్చెడు వానికై వెదకు నిచ్చినదిన్ దినివేయు వీఁడు వే
రిచ్చెడువాఁడు కావలయు నీగతి జీననముద్రణమ్ములన్
ద్రచ్చుకొనున్ దరిద్రుఁడు సరస్వతి నాలుకమీఁద నాడినన్. 62

మండలి వెంకట కృష్ణారావుగారి గుఱించి చెబుతూ ఆయనిలా అంటారు.
గీ.
స్నేహమని లేదు కాని నా స్నేహితులకు
చిన్ననాఁటి స్నేహితులకు స్నేహితుండు
రావు మండలికుల కృష్ణరా వొకండు
ఒగిని మేమందఱము కృష్ణయొడ్డుజాతి !69

కృష్ణవొడ్డు జాతివారి గొప్పదనం గుఱించి కృష్ణాతీరం పుస్తకంలో మల్లాది వారు రాసింది గుర్తుకొస్తోంది. మేం గోదావరి వొడ్డునుండే వాళ్ళం. భారతం మూడూళ్ళు తిరిగితేనే కాని పూర్తికాలేదట. కాని భాగవతం మటుకు పోతన ఒక్కడూ ఒంటి చేతిమీద పూర్తి చెయ్యగలిగాడట. అదట ఆ కృష్ణమ్మ గొప్పదనం.

3 comments

మఱల ని దేల రామాయణం బన్నచో

సీ.
మఱల ని దేల రామాయణం బన్నచో
నీ ప్రపంచక మెల్ల నెల్ల వేళఁ

దినుచున్న యన్నమే తినుచున్న దిన్నాళ్ళు

తనరుచి బ్రదుకులు తనవిగాన

చేసిన సంసారమే సేయుచున్నది

తనదైన యనుభూతి తనదిగాన
తలఁచిన రామునే తలఁచెద నేనును
నా భక్తి రచనలు నావిగాన

గీ.
కవి ప్రతిభలోన నుండును గావ్యగత శ
తాంశములయందుఁ తొంబదియైన పాళ్ళు

ప్రాగ్విపశ్చిన్మతంబున రసము వేయి
రెట్లు గొప్పది నవకథాదృతిని మించి. 5

మళ్ళీ ఈ రామాయణం ఏంటయ్యా అనేవారికి విశ్వనాధ సత్యనారాయణ గారి జవాబు ఈ పై పద్యం. "నా భక్తి రచనలు నావి గాన". ఇదీ ఆయన జవాబు. కావ్యంలోని గొప్పతనం 90 పాళ్ళు కవి ప్రతిభలోనే ఉంటుందట. కథ కంటె కూడా రసము వేయి రెట్లు గొప్పది.
గురువులు భైరవభట్లవారూ, చింతా రామకృష్ణారావుగారు మొదలైన పెద్దవారంతా విశ్వనాథ వారి కల్పవృక్షం గుఱించి ఎంతో అందంగా వారి వారి బ్లాగుల్లో వ్రాస్తూనే వున్నారు కదయ్యా. మళ్ళీ నీవుకూడా ఆవిషయాలే రాస్తానంటున్నా వేమిటి అనే వారికి నా జవాబు "నాదైన యనుభూతి నాదిగాన"అనే. భైరవభట్ల వారు రామాయణ కల్పవృక్షం గుఱించి వారి బ్లాగులో వ్రాసినది చదివినప్పుడూ, విశ్వనాథ వారి సాహిత్యం సంపూర్ణంగా చదివి అర్థం చేసుకోవటానికి ఒక జన్మ పూర్తిగా సరిపోదేమో అని వారన్నప్పుడు నావద్ద శిధిలావస్థలో ఉన్న రామాయణ కల్పవృక్షం పుస్తకాలు గుర్తు కొచ్చినాయి. వాటిని తిరిగి బయటకుతీసి బైండు చేయించే కార్యక్రమం మాత్రం ఈమధ్యనే పూర్తి చేయగలిగాను. బాలకాండ తీసి చదువుతుంటే విశ్వనాథ వారి తెలుగు పలుకుబళ్ళు తెలుగు నానుడుల గురించి బ్లాగ్మిత్రులతో పంచుకోవాలనే ఆరాటం నన్ను నిలవనీయలేదు. అందుచేతనే ఈ ప్రయత్నాన్ని ప్రారంభించేను. పిన్నలూ పెద్దలూ అందరూ నా యీ చిన్ని ప్రయత్నాన్ని సాదరంగా స్వీకరిస్తారని, ప్రోత్సహిస్తారనిన్నీనా ఆశా ఆకాంక్షాను.

ఇంకావిశ్వనాథవారు రఘురాముని కథ గొప్పదనం గుఱించి ఇలా అంటున్నారు.
ఉ.
పావు నెఱుంగు బ్రహ్మ సగపాలునుమాత్ర మెఱుంగుఁ బార్వతీ
దేవియు నీ వెఱుంగుదువు తెల్లము రామమహత్తు కృత్స్నమా
దేవున కేను నీ యనుమతింపబడి నంకిత మిత్తు జానకీ
దేవి మనోహరుండు రఘుదేవుని సాధుకథా ప్రపంచమున్.
4

రాముని మహత్తు పావు భాగం మాత్రం బ్రహ్మదేవు డెఱుగునట. సగపాలు వరకూ పార్వతీదేవికి తెలియునట. ఆ విశ్వేశ్వరునకు మాత్ర్రం పూర్తిగా తెలియునట. ఆ విశ్వేశ్వరునకు ఆయన అనుమతితో సీతా మనోహరు డైన రఘుదేవుని కథా ప్రపంచాన్ని అంకితం చేస్తున్నానని విశ్వనాథ వారంటారు వారి అవతారికా పద్యాలలో.
ఉ.
వ్రాసిన రామచంద్రుకథ వ్రాసితివం చనిపించుకో వృధా
యాసముగాక కట్టుకత లైహికమా ? పరమా ? యటంచుఁ దాఁ
జేసిన తండ్రియాజ్ఞ యును జీవుని వేదన రెండు నేకమై ----- 7
వ్రాసానంటారు విశ్వనాథ వారు అవతారికలో.

వారు వారి తండ్రిగారైన శోభనాద్రి గారి గురించి అవతారికలో ఇంకా ఇలా చెప్తున్నారు.
సీ.
నకనకలాడునట్టి కడుపులన్ వచ్చి
త్రేఁచుఁచుఁ బోయెడు తెరువరులును
చినిఁగిన గుడ్డలఁ జనుదెంచి నూతన
పరిధానములఁ దాల్చి యరుగు జనులు
పరిదీనవదను లై యరుదెంచి యుత్సాహ
కృత మందహాసు లై యేగువారు
సందేహ భాజనాస్యములతో వచ్చి యా
శ్చర్య సూచిముఖాలఁ జనెడువారుఁ
తే.
బొలుతు రన్నాతురులు యాచకులును నిత్య
కలిత బహుళ కార్యాంత రాగతులు విశ్వ
నాథ వంశాబ్ధిశశి శోభనాద్రియింట
నిరులు వదలి వెల్తురులు గొం చేగునట్లు. 9
గీ.
సప్త సంతానములలోఁ బ్రశస్తిఁ గాంచి
ఖిలము గాకుండునది ధాత్రిఁ గృతి యటన్న
నట్టి కృతిశత నిర్మాతనైన బిడ్డఁ
బడసె నా తండ్రి కృతిలోక పారిషదుఁడు. 13

ఇంకా వారు వారి తమ్ముళ్ళ నిద్దరి గుఱించీ ఏమంటున్నారో చూడండి.
ఉ.
తమ్ములు రామచంద్రునకుఁ దమ్ములు నూహ యెఱింగి చేయఁగాఁ
దమ్ములు ధర్మరాజునకుఁ దమ్ములు చెప్పిన యట్లు సేయ నా
తమ్ములు నట్టిరందుఁ జినతమ్ముఁడు సన్మతి రామమూర్తి చి
త్తమ్మున నేను వానికొక దైవముగాఁ గనిపింతు నెంతయున్. 15
ఉ.
పండిత కీర్తనీయుఁ డిరుబాసల దిట్ట రసజ్ఞమౌళి మా
రెండవవాఁడు సన్మతి ధురీణ కవిత్వకళోగ్రకార్తి కే
యుండును వేంకటేశ్వరులహో ! మఱి నా కవనం బిదెల్ల ధీ
శౌండుఁడు తత్పరీక్షఁ బడి సంకున బోసిన తీర్థమై చనున్. 16

శంఖున పోసిన తీర్థం అనే నానుడిని చక్కగా వాడుకున్నారిక్కడ. ఇటువంటి నానుడుల గుఱించి తెలుసుకోవాలనీ, తెలిసింది నలుగురితో పంచుకోవాలనే నా ప్రయత్నం. ఇటువంటి వాటి గురించి తెలుసుకుంటూ మనం కూడా మన సంభాషణల్లో వీటిని వాడటం మొదలు పెడితే మన తెలుగు భాష అజరామరంగా ఎప్పటికీ నిలిచే ఉంటుందనటం లో నా కెంతమాత్రం సందేహం లేదు.
విశ్వనాథవారు వారి గురువుగారి గురించీ అన్యాపదేశంగా నైనా వారిగురించీ చెప్పుకున్న పద్యాలు తరువాత కలసినప్పుడు తెలుసుకుందాం.

3 comments

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks