ధశరథుడు తన ముగ్గురు భార్యలతోనూ ఇతర పరిజనంతోనూ కలసి రోమపాదుని అంగరాజ్యానికి అతని అల్లుడైన ఋష్యశృంగుని తన రాజ్యానికి యాగం నిర్వహించటానికై ఆహ్వానించటానికై వెళతాడు. అక్కడ రోమపాదుని కూతురు శాంత కలివిడి మనస్తత్వాన్ని తెలియజేయడం కోసం విశ్వనాథవారిలా అంటారు.
సీ.
కౌసల్యయొడిలోనఁ గాని కూర్చుండదు
జడ సుమిత్రయె కాని ముడువరాదు
కై కేయితోఁగాని కై లాగుఁ బూనదు
వారితోఁ గాని నవ్వంగరాదు
తన సుతున్ గౌసల్యగనుక ముద్దాడ ని
చ్చు సుమిత్ర గనుక గ్రచ్చుకొననిచ్చు
కై కేయి గనుక చిక్కని ముంగురులు పాయ
గాఁ దీయఁగా నిచ్చుఁ గఱుదులాడి
గీ.
శాంత కీ రీతి వారితో జగము వారి
తో సకలముగా రోమపాదుండు చూచి
తల్లిచూచి హృదంతరుత్ఫుల్ల మోద
జలధులై యొక్కవారము జరిగె నిట్లు.227
అంతా మన తెలుగులోగిళ్ళలో జరిగినవే, జరిగేవే మన కళ్ళకు కట్టినట్టు చిత్రించి చూపారు.
ఓ ఏడెనిమిది రోజులాగిన తర్వాత ఒకనాడు ధశరథుడు రోమపాదునితో తన కోరిక వెల్లఢించాడిలా.
ఉ.
మిత్రయశోనిధీ ! తురగమేధము సేయ వశిష్ఠులాజ్ఞ చే
బుత్త్రులు లేని కారణము పొంటెఁ దలంచితి ఋష్యశృంగు లా
సత్త్రము సాగఁజేయ ఫలసంగతి శీఘ్రమ కల్గు నంచు నీ
మైత్రిఫలం బొసంగు మని మౌనిని యాచన సేయవచ్చితిన్. 230
శా.
నా వెంటన్ దయచేసి పంపఁగదె శాంతన్ ఋష్యశృంగున్
గ్రతు శ్రీ వేళన్ గబురంపెదన్ వెడలిరారే నీవు నీమంత్రులున్
నీ వాల్లభ్యము నీదు నంతిపురియున్ నీ వప్పు డేతెంచి నీ
వే వీక్షింతువు ఋష్యశృంగులను నం దేరీతిగాఁ జూతునో. 231
అలా తన కోరికనూ, తన ఆహ్వానాన్నీ కూడా తెలియచేస్తాడు దశరధుడు రోమపాదునితో. ఎంత మాట పొందికో చూడండి. దానికి రోమపాదుడు
క.
నీకూఁతు రగుటకు న్మును
నా కూఁతురె శాంత ? మౌని నా కల్లుఁడు ముం
దీ కొంచియమ్ము గౌరవ
మే కొండంతగ వచింతు వేలయ్య నృపా ! 234
వ.
మఱి ఋష్యశృంగుఁడో ! 235
శా.
శ్రీస్యందాననుఁ డై వశిష్ఠులని పేరే చెప్పినన్ గౌరవ
భ్రశ్యత్కేశ నిబంధనమ్ము గురుతాస్రంసన్నివీతంబుగా
వశ్యుం డై చనుదెంచు వెంటఁబడి నేఁ బంపించు టేమున్నదో
హాస్యంబౌగద నీవు నర్థివయి నేనా ! దాత నో మిత్రమా ! 236
ఇక్కడో సందేహం. ప్రాసాక్షరాలు రెండు పాదాల్లో (1,4) 'స' మఱి రెండింటిలో (2,3)'శ' --ఇలా వాడవచ్చో లేదో నాకు తెలియదు.
క.
సుఖమో దుఃఖమో జన్మము
ముఖస్తుతులు గావు నిన్ను బోఁలు నమృతుఁడౌ
సఖుఁడొక్కఁడున్న నీ దృశ
మఖంబు లొకవేయి యశ్రమంబుగ నెగ్గున్. 238
క.
అని ఋష్యశృంగుతోఁ జె ప్పిన నాయన రోమపాద పృథ్వీపతి యా జ్ఞను శాంతయుఁ దాను నయో ధ్యను జేరఁగ బయలు దేరి రా సమయమునన్. 239
పై సంభాషణ లన్నీ మన తెలుగు కుటుంబాలలో మనం రోజూ మట్లాడుకొనే సంభాషణల్లాగా లేవూ.
విశ్వనాథ వారు చేసిన ప్రతిజ్ఞ
"గీ.
నాది వ్యవహారభాష మంథరము శైలి
తత్త్వము రసధ్వనులకుఁ బ్రాధాన్యమిత్తు
రసము పుట్టింపంగ వ్యవహారము నెఱుంగ
జనును లోకమ్ము వీడి రసమ్ములేదు. 38" ను మళ్ళీ మళ్ళీ గుర్తుకు తీసుకొస్తుంది మనకు.
అయోధ్యకు వచ్చిన శాంతను చూసి పౌరజనులు
మత్తకోకిల.
ఎంతచక్కని చీరగట్టిన దెంతసొమ్ములు క్రొత్తవిన్
వింతలున్ మెయిఁ దాల్చికొన్నది విశ్వమోహనమూర్తియై
యెంతభాగ్యము భర్తతో రథమెక్కి ముందఱిబండిపై
నింతగౌరవ మొప్ప నేగుట యే లతాంగులు నోతురే ? 247
సీ.
పడఁతి మీపిత రోమపాదులు సేమమా ?
కుశలమా మీతల్లి కోర్కి వల్లి ?
యెండలోఁ బడివచ్చి తింక స్నానముచేసి
విశ్రాంతిఁ గై కొనవే కుమారి !
యెన్నాళ్ళు లైనదే యీవు రాఘవకుల
మ్మును వీడి చని యోసి ముద్దుబిడ్డ !
కడు స్రుక్కితివి లేచి కడఁగి భుజింపవే
మో మెంతవాడెనే ముద్దుగుమ్మ !
గీ.
అల్ల పసినాఁడు నీవు భాగ్యాలరాశి
వనుచు ఋషి ధర్మపత్ని వౌదంచు నెఱుఁగఁ
జాలమైతి మె యో పూతచరిత ! యేమి
భాగ్యమే నీది గౌరవయోగ్యురాల ! 249
Jun 23, 2009
కౌసల్యయొడిలోనఁ గాని కూర్చుండదు జడ సుమిత్రయె కాని ముడువరాదు
Posted by
Unknown
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment