నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

Jun 19, 2009

అల నన్నయ్యకు లేదు తిక్కనకు లేదా భోగ మస్మాదృశుం

అవతారిక-2
చ.
తిరుపతి వేంకటేశ్వరులు దేశముఁ గైతయు గ్రుచ్చియెత్త బం
దరు పుర మాంగ్లపుం జదువునం జని వారలలోన వేంకటే

శ్వర గురు రాజమౌళి పదసంజనిత త్రిదివాపగా సుధా

ఝురముల మున్కలాడు ఫలసంగతి సత్కవి నై మెలంగుచున్
. 18
చ.
తన యెదయెల్ల మెత్తన కృతప్రతిపద్యము నంతకంటె మె
త్తన తన శిష్యులన్న నెడదం గల ప్రేముడి చెప్పలేని మె

త్తన యయి శత్రుపర్వతశతారము సత్కవి చెళ్ళపిళ్ళ వేం

కన గురువంచుఁ జెప్పికొనఁగా నది గొప్ప తెలుంగునాఁడునన్. 19
ఎంత సుతి మెత్తని పద్యం.
శత్రుపర్వతశతారము=పర్వతములవంటి శత్రువులకు వజ్రాయుధము వంటి
మ.
అల నన్నయ్యకు లేదు తిక్కనకు లేదా భోగ మస్మాదృశుం
డలఘుస్వాదు రసావతార ధిషణాహంకార సంభారదో

హల బ్రాహ్మీమయమూర్తి శిష్యుఁ డైనా డన్నట్టి దావ్యోమపే
శలచాంద్రీ మృదుకీర్తి చెళ్ళపిళవంశస్వామి కున్నట్లుగన్. 21

ఆయన తన గురువుగారి గొప్పదనాన్ని కీర్తిస్తున్నట్లుగా కనిపించే ఈ పద్యం లో విశ్వనాథ వారు తన గొప్పదనాన్నే ఘనంగా చెప్పుకొన్న తీరు అమోఘం మరియు అద్భుతం. వారి గురువైన చెళ్ళపిళస్వామిగారి కున్నటువంటి మృదుకీర్తి భోగం అల ఆ నన్నయ్య గారికి గాని తిక్కన గారికి గాని లేదంట. ఏమిటంటా అది. తనవంటి లఘుస్వాదు రసావతార ధిషణాహంకార సంభారదోహల బ్రాహ్మీమయమూర్తి శిష్యుఁ డైనా డన్నట్టి ఆవ్యోమపేశల చాంద్రీమయ మృదుకీర్తి అట. ఈ పెద్దసమాసానికర్థం తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం.
అలఘు=చులుకన కాని
స్వాదురస=ద్రాక్ష
అవతార=దిగుట
ధిషణాహంకార=బుద్ధివలని కలిగిన అహంకారము
సంభార=సర్వపూర్ణత్వము
దోహల=ఉత్సాహము
బ్రాహ్మీమయమూర్తి=సరస్వతీమూర్తి
వ్యోమ=ఆకాశము
పేశల=చక్కనిది
చాంద్రీమృదుకీర్తి=వెన్నెలవంటి మెత్తని కీర్తి
నేను అర్థం చేసుకున్న విధంగా ఈ పద్యానికి అర్థం ఇలా ఉంటుందనుకుంటున్నాను.

చులుకన కాని ద్రాక్షారసంతో కూడిన బుద్ధి అనే అహంకారంతో సర్వసంపూర్ణత్వాన్నికలిగి ఉత్సాహంతోకూడి సాక్షాత్ సరస్వతీ స్వరూపమైన నావంటి శిష్యుని కలిగివుండటం వల్ల పొందగలిగే, ఆకాశాన్ని ప్రకాశింపచేస్తున్నచల్లని వెన్నెలవంటి మృదు కీర్తి అనబడే భోగం మా గురువైన చెళ్ళపిళ స్వామికే కలిగింది కాని ఆనాటి గొప్పకవులైన నన్నయ్యగారికిగాని తిక్కన గారికి గాని కలగలేదు.
ఎంత గొప్పగా తనగొప్పదనాన్ని గురువులమీది భక్తినీ ఏకకాలంలో వ్యక్తం చేసారోకదా. అలా రాయటం కేవలం ఆ మహా మనీషికే చెల్లు.
ఒకపదానికి నిఘంటువులలో అనేకానేక అర్థాలుంటాయి. సందర్భాన్ని బట్టి మనం తీసుకొనే అర్థాన్ని బట్టి మనకు తోచే అర్థం మారుతూ ఉంటుంది. నాకర్థం అయిన భావం పైన వ్రాసాను. పూర్తిగా సరికాకపోవచ్చు. పెద్దలు ఇంకా మంచి అర్థం వివరిస్తే కృతజ్ఞుడనై ఉంటాను.
సీ.
ఋషివంటి నన్నయ్య రెండవ వాల్మీకి
తిక్కన్న శిల్పపుఁ దెనుఁగుతోట
యెఱ్ఱన్న సర్వమార్గేచ్ఛావిధాతృండు
పోతన్న తెలుఁగుల పుణ్య పేటి
శ్రీనాధుఁడు రసప్రసిధ్ధ ధారాధుని
కృష్ణరాయఁ డనన్య కృతిప్రబంధ
పెద్దన్న వడపోత పెట్టి నిక్షురసంబు
రామకృష్ణుఁడు సురారామగజము
గీ.
ఒకఁడు నాచనసోమన్న, యుక్కివుండు
చెఱిపి పదిసార్లు తిరుగ వ్రాసినను మొక్క
వోని యీ యాంధ్రకవిలోకమూర్ధమణుల
మద్గురుస్థానములుగ నమస్కరించి. 30

తనకు గురువుగా ఉన్న కవుల పేర్లను ఎన్నుకోవడానికి నిజంగానే విశ్వనాథ వారు ఒకటికి పదిసార్లు చెఱిపి తిరిగి తిరిగి వ్రాసికున్నారేమో-- అందుకోసమేనేమో చివరలో ఆమాట కూడా పడింది పద్యంలో.
ఇక సంస్కృత కవుల విషయానికొస్తే
ఆ.
భాసకాళిదాస భవభూతి దిఙ్నాగు
లకుఁ బ్రశస్తవాగ్విలక్షణుంఢు ము
రారిభట్టునకును రామకథాభాష్య
కారులకును మోడ్పు కై ఘటించి. 31
శా.
ఈ సంసార మిదెన్ని జన్మలకు నేనీ మౌని వాల్మీకి భా
షాసంక్రాంతఋణంబుఁ దీర్పఁగలదా ! సత్కావ్యనిర్మాణరే
ఖాసామాగ్రి ఋణంబుఁ దీర్పఁగలదా ? కాకుత్థ్సుఁ డౌ స్వామి గా
థాసంపన్నము భక్తిఁదీర్చినను ద్వైతా ద్వైతమార్గంబులన్.34
గీ.
ఒక్క వాల్మీకి కాక వేఱొక్కఁ డెవఁడు
సుకవిశబ్దవాచ్యుం డిఁక గుకవినింద
యప్రశస్తపథంబుగా నవుటఁ జేసి
మునిఋణముఁ దీర్ప నీ కావ్యమును రచింతు.35

నిజంగానే విశ్వనాథవారు మునిఋణాన్ని తీర్చుకున్నారు. ఆయన ఋణాన్ని మనం తీర్చుకోవాల్సివుంది.
గీ.
నాది వ్యవహారభాష మంథరము శైలి
తత్త్వము రసధ్వనులకుఁ బ్రాధాన్యమిత్తు
రసము పుట్టింపంగ వ్యవహారము నెఱుంగ
జనును లోకమ్ము వీడి రసమ్ములేదు. 38

ఎంత బాగా చెప్పారు.
మ.
తొడవుల్ వృత్తులునున్ గుణంబులును రీతుల్ వ్యంగముల్ దీప్తి యే
ర్పడగాఁ గావ్యత, సంస్కృతంబొలసియాంధ్రంబయ్యె నీ తెల్గుమేల్
నుడికారమ్ములు దేశ్యముల్ పలుకుబళ్ళును జాతి మాట్లాడు కై
వడి సత్కావ్యము లొప్పునాంధ్రమున, నా రామాయణం బట్టిదే. 39

ఈ పై పద్యమే నాచేత ఈ టపాలను వ్రాయటానికి పురికొల్పింది. తెల్గుమేల్నుడికారమ్ములు దేశ్యముల్ పలుకుబళ్ళును జాతి మాట్లాడు కైవడి-- వీటిని ఏర్చి ఒకచోట కూర్చాలన్నదే నా అశక్తి, ఆరాటమునూ.
సీ.
చిఱునవ్వు నవ్వెనా ! చిన్నారి ముత్యాలు
ప్రోవులు ప్రోవులు పోసినట్లు
కనులెత్తి చూచెనా ? కప్రంపుఁ జిఱుపొడు
లుప్ఫని తీగఁగా నూదినట్లు
ఒక యింత నడచెనా ! యొగి ఢిల్లి భోగాల
రాశి లాభము కొలపోసినట్లు
పన్నెత్తి యాడెనా ! ప్రభుత విస్మృతిపడ్డ
సాధుభావము బారసాచినట్లు
గీ.
మంజులవినీత వేషుఁడు మధురమూర్తి
యార్ద్రభావుఁడు కుదిమట్ట మైన బొమ్మ
బాలరాఘవువలెఁ బితృవాక్యపాల
నా నినీషా మనీషా సనాతనుండు.41

ముక్త్యాల యువరాజుగారి గుఱించి వ్రాసినదీ పద్యం.
ఉ.
ఇచ్చెదనంచు చెప్పు సగమిచ్చును చాలద యద్ది కాన, వే
రిచ్చెడు వానికై వెదకు నిచ్చినదిన్ దినివేయు వీఁడు వే
రిచ్చెడువాఁడు కావలయు నీగతి జీననముద్రణమ్ములన్
ద్రచ్చుకొనున్ దరిద్రుఁడు సరస్వతి నాలుకమీఁద నాడినన్. 62

మండలి వెంకట కృష్ణారావుగారి గుఱించి చెబుతూ ఆయనిలా అంటారు.
గీ.
స్నేహమని లేదు కాని నా స్నేహితులకు
చిన్ననాఁటి స్నేహితులకు స్నేహితుండు
రావు మండలికుల కృష్ణరా వొకండు
ఒగిని మేమందఱము కృష్ణయొడ్డుజాతి !69

కృష్ణవొడ్డు జాతివారి గొప్పదనం గుఱించి కృష్ణాతీరం పుస్తకంలో మల్లాది వారు రాసింది గుర్తుకొస్తోంది. మేం గోదావరి వొడ్డునుండే వాళ్ళం. భారతం మూడూళ్ళు తిరిగితేనే కాని పూర్తికాలేదట. కాని భాగవతం మటుకు పోతన ఒక్కడూ ఒంటి చేతిమీద పూర్తి చెయ్యగలిగాడట. అదట ఆ కృష్ణమ్మ గొప్పదనం.

6 comments:

కామేశ్వరరావు said...

"తన యెదయెల్ల మెత్తన..." పద్యం సరైన పాదవిభజన:

తన యెదయెల్ల మెత్తన కృతప్రతిపద్యము నంతకంటె మె
త్తన తన శిష్యులన్న నెడదం గల ప్రేముడి చెప్పలేని మె
త్తన యయి శత్రుపర్వతశతారము సత్కవి చెళ్ళపిళ్ళ వేం
కన గురువంచుఁ జెప్పికొనఁగా నది గొప్ప తెలుంగునాఁడునన్.

"స్వాదురస" అంటే ద్రాక్షరసమే అవ్వక్కరలేదు, రుచికరమైన రసము అని చెప్పుకోవచ్చు. ఒకవైపు రసావతారము - అంటే హృదయానంద కారకమైన రచన చెయ్యగల శక్తి, మరోవైపు ధిషణాహంకారము - అంటే బుద్ధి బలమూ. ఈ రెండు కలిగి ఉండడం వల్లనే సంపూర్ణత్వము వచ్చిందతని కవిత్వానికి.
"ఆ వ్యోమ" - ఆకాశమంతా పరచుకున్న

"ఋషివంటి నన్నయ్య..." పద్యంలో "ఉక్కియుండు" అనే పదం ఏ అర్థంలో వాడేరో తెలియడం లేదు.

"తొడవుల్ వృత్తులునున్..." పద్యంలో చివరిపాదంలో యతి ఎలా సరిపోయిందో తెలియడం లేదు!

Unknown said...

నా దగ్గఱనున్న ప్రతిలో యుక్కివుండు అని ఉన్నది.
ఉక్కివుఁడు అంటే కపటము గలవాడు అని ఉంది శబ్దరత్నాకరంలో. కాని ఈ అర్థం ఎలా సరిపోతుందో నాకూ తెలియటం లేదు.
వ కు రా కు యతి కుదురుతుందో లేదో నాకు తెలియదు.

Koundinya Sai said...

వ కు రా కు యతి కుదరదు కానీ విశ్వనాథ వంటి మహాకవి పొరపాటు చేసి ఉంటారా ? మరోసారి పరిశీలించాలి

Anonymous said...

ప్రస్తుతం రామాయణ కల్పవృక్షం ప్రతులు బయిట లభించడం లేదు.విజయవాడలో గల ప్రముఖ పబ్లిషర్లను అడిగిచూశాను.నిరాశ పడ్డాను.విశ్వనాథ వారి పౌత్రులు హైదారాబాద్ లో ఉన్నారని తెలుసుకొని,వారి మొబైల్ నెంబరు పట్టుకొని సంప్రదించాను.ఎందుకో వారు అంతగా సుముఖత చూపలేదు.మరోసారి ముద్రిస్తున్నాం అన్నారు.ఎప్పటికి ఈ పని పూర్తి అవుతుందో తెలియదు.ఎవరి వద్దమైనా ఉంటే నేను సంతోషంగా తగిన మూల్యం చెల్లించి తీసుకుంటాను.

విన్నకోట నరసింహా రావు said...

ebooks.tirumala.org

అనే‌ TTD వారి website గానీ,

archive.org

అనే website లో గానీ దొరుకుతుందేమో వెతికి చూడండి.

Anonymous said...

"వ"లోని అచ్చు "అ"కు, "రా"లోని అచ్చు "ఆ"కు యతిమైత్రి కుదురుతుంది అనుకుంటాను. మూడవపాదంలో కూడా "ను"లోని "ఉ"కు, "ళ్ళు"లోని "ఉ"కు యతిమైత్రి కుదిరింది కదా.

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks