నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

Jun 20, 2009

వనజాక్షి ! నీవింక వనరఁగ బోకు వే

ఇష్టి ఖండము
దశరథుడు సంతానార్థియై చింతిస్తూ ఉంటాడు. అతడు మంత్రి సుమంత్రునితో అదే విషయాన్ని గుఱించి మాట్లాడుతూ మాట్లాడుతూ హఠాత్తుగా లేచి సుమంత్రునితో--
ఉ.
ఇంకను నీ వహో యిచటనే నిలుచుంటి విదేమి ? పోయి నా
యంకెకు మంత్రులన్ బిలువు మల్ల వశిష్ఠుల వామదేవులన్
లెంక నృపుండు రమ్మనియె లెండని వేగమ కొంచురమ్ము నా
శంకలు పోయె ఱేనికిని సంతతి గల్గు భయంబు లేదిఁకన్. 84

ఇంకా ఇక్కడే నిలుచున్నావేమిటి ? వెళ్ళలేదా, వెళ్ళి అందరినీ పిల్చుకొని రా. అని మనమందరం చాలా సామాన్యంగా మాట్లాడుకొనే మాటలనే ఉపయోగిస్తూ సుమంత్రుని దశరథుడు హెచ్చరించాడు. అశ్వమేధ యాగం చేస్తే తప్పక సంతానం కలుగుతుందనే నమ్మకంతో కలిగిన వేగిరపాటది.
దశరథుడు వెంటనే విచారగ్రస్థయై కూర్చున్న కౌసల్యాదేవిని జబ్బలు పూని లేపి నిలుచుండఁబెట్టి కన్నులఁగన్ను లుంచి-
సీ.
వనజాక్షి ! నీవింక వనరఁగ బోకు వే
నావంకఁ జూడవే నలినవదన !
యమృతాంశుముఖమండలా ! దుఃఖమేటికే
కష్టముల్ తొలఁగెనే కంజనేత్ర !
హరిణాక్షి ! మనబాము లవ్నియఁ దీరెనే
బెడఁదలు తొలఁగెనే బిసరుహాక్షి !
ముత్స్యపుచ్ఛాభిరామ విలోచనాంచల !
సుకృతముల్ పండెనే ముకురవదన !
గీ.
క్రీడహయమేధ మన్న నాఁగేటికొఱ్ఱు
లాగి పాపంపు బెట్టపొలాలు దున్ని
దివిజతర్పణ మన్న బోదియలు ద్రవ్వి
మంచిసుతు లను శాలి పండించి వైతు. 87

ముసలివాఁడైన దశరథునకు సంతానం కలగొచ్చనే భరోసా ఎంత ఉత్సాహాన్ని కలిగించిందో చూడండి.
ఉ.
అచ్చట యజ్ఞభూమి కనువైన ప్రదేశము నీదు మంత్రులం
బుచ్చుము పుణ్యపు దలఁపు పుట్టిన యప్పుడె కార్యరూపమం
దచ్చుపడంగఁ జేయవలె నాపయి నేదొ వికల్పమందినన్
లొచ్చగుహెచ్చగున్ దలఁపులోఁబని దీర్చుట యుత్తమంబగున్. 116

మంచిపనిని వేగిరంగానే చెయ్యాలి అంటారందఱూ. ఆలస్యాదమృతం విషం . అందుకని వెంటనే పూర్తి చేయటం ఉత్తమం.
గీ.
వెదకఁబోయిన తీవ దవిలెను గాలి
కందు రపు డేమి సేయుదు రల్లతీవఁ
ద్రెంచి తెచ్చి యౌషధము వండించుకొనుటె
మిగిలినది భిషగ్రత్నముల్ మీరు సూడ. 123

వెతకపోయిన తీగ కాలికి తగిలిందని సామెత.
క.
ఎఱుఁగని దానవొ నీకుం
గఱదలు సెప్పంగ ననుచుఁ గదలి యిలేశుం
డఱిముఱి సుమిత్ర మేడకు
నెఱకలు కట్టుకొనినట్టు లేగె నడచుచున్. 130

ఎఱకలు కట్టుకొని పోయినట్టు పోయాడు అని మనమందరం వాడుతుంటాం. ఎఱకలు అంటే ఱెక్కలు అని అర్థం.
కౌసల్యకే కాక నీకూ పుత్త్రుడు కలుగుతాడని దశరథుడు సుమిత్రతో చెపుతూ ఇలా అంటాడు.
గీ.
దీక్షఁగై కొని వ్రతయుక్తి ధృతమనోవి
నిశ్చయాత్మవు సుతుకోర్కి నెగడెదేని
ఫలముఁ గందువు పొలములో వాన యొక్క
చెక్కఁగుఱిసి వేఱొక చెక్కఁ జుక్కపడదె ! 133

అలాగే.

ఆ.
ఎన్ని తరువులున్న నన్నియుఁ గాయంగఁ
బూఁటఁ బూఁట వేచుఁ దోఁటమాలి
కడుపు నీదికూడఁ గాచిన నాగుండె
యటమటించు టాగి హర్షమొందు. 138

ఇటువంటి పలుకుబడులు అన్నీ యిన్నీ కావు యీ కల్పవృక్షంలో. మన శక్తి కొద్దీ తవ్విన కొద్దీ బయటపడుతూనే ఉంటాయి. అవునిది కల్పవృక్షం కదా ! మనకోరికలనన్నిటినీ తీరుస్తుంది కదా మరి.

3 comments:

కామేశ్వరరావు said...

"దశరథుడు సంతానార్థియై చింతిస్తూ ఉంటాడు. అతడు మంత్రి సుమంత్రునితో అదే విషయాన్ని గుఱించి మాట్లాడుతూ మాట్లాడుతూ హఠాత్తుగా లేచి సుమంత్రునితో--"

ఇలా హఠాత్తుగా దశరథుడు లేవడం వెనక చాలా కథ ఉంది. ఇది జరగడానికి ముందు సుమంత్రుడు రాజుతో అనే మాటలివి:

"నిద్రాహారములెల్ల మాని యిదిగో నీ మంత్రులున్ గాఢ శు
క్కద్రూసంభవ దష్టులై మెలికలుంగా జుట్టుకొంచుంద్రు నన్
భద్రా! పొమ్మని పంచిరిందు మఱలన్ బాలింపవే! నీవొ య
క్షుద్రాత్ముండవు యాజ్ఞికుండవు నిదా శోకంబు నీకేటికిన్"

ఇలా అనగానే, "అనిన హఠాత్తుగా నొక మహాద్భుత భావము తోచినట్లు..." దశరథుడు లేచి అశ్వమేథయాగానికి తొందరపెడతాడు. హఠాత్తుగా ఈ మహాద్భుత భావం దశరథుడికి ఎలా తోచింది? అది తెలియాలంటే సుమంత్రుని మాటలు దశరథునిలాగే మనం కూడా జాగ్రత్తగా వినాలి. రాజు చింతని పోగొట్టడానికి సుమంత్రుడు దీనికి ముందు కూడా దశరథుని దగ్గరకి వచ్చి సరిగ్గా ఇవే మాటలంటాడు. కాని అప్పుడు తట్టని ఈ ఆలోచన దశరథునికి రెండోసారి తడుతుంది! అదెందుకు? ఇక్కడ దశరథుణ్ణి గురించి రెండు మాటలన్నాడు సుమంత్రుడు. ఒకటి "అక్షుద్రాత్ముడు", రెండు "యాజ్ఞికుడు". మొదటిసారి సుమంత్రుడిలా మాట్లాడినప్పుడు మొదటి మాట దగ్గరే ఆగిపోయాడు దశరథుడు - తను నిజంగానే అక్షుద్రాత్ముడినేనా అన్న సందేహంతో. ఆ సందేహాన్ని తీర్చడానికి దశరథుణ్ణి దేశాటనకి తీసుకువెళతాడు సుమంత్రుడు. తన రాజ్యం ఎంత సుభిక్షంగా ఉందో, ప్రజలందరూ ఎంత హాయిగా జీవిస్తున్నారో చూపిస్తాడు. ఎవరైనా ఎక్కడైనా ఏవైనా బాధలు పడుతున్నారేమో, తన పరిపాలన మీద అసంతృప్తి చెంది ఉన్నారేమో అని చారులని కూడా పెడతారు. అలా రాజుకి తాను అక్షుద్రాత్ముడిని కాను అని నమ్మకం కలిగిస్తాడు. అప్పటికీ దశరథుని చింత తీరదు. అప్పుడు మళ్ళీ అతని దగ్గరకి వచ్చి మళ్ళీ అవే మాటలంటాడు సుమంత్రుడు. అప్పుడు ఆ రెండవ సంబోధన దశరథుడి మనసులోకి వెళుతుంది. అది యజ్ఞం చేస్తే సంతానం పొందవచ్చునన్న స్ఫురణ అతనికి కలిగిస్తుంది.
దశరథునికి హఠాత్తుగా ఆ ఆలోచన కలగడం వెనక ఇంత కథ ఉంది! ఇదంతా విశ్వనాథ వివరంగా చెప్పరు. ప్రయోగించిన పదాల్లో, రచనా విధానంలో ధ్వనింప జేసి పాఠకుల గ్రహణ శక్తికి వదిలేస్తారు!

"ముత్స్యపుచ్ఛాభిరామ విలోచనాంచల !" - అచ్చుతప్పు. అది "మత్స్యపుచ్ఛాభిరామ విలోచనాంచల !". ఇలాంటి సంబోధన మరెక్కడా కనిపించదు!

కామేశ్వరరావు said...

"అలా రాజుకి తాను అక్షుద్రాత్ముడిని కాను అని నమ్మకం కలిగిస్తాడు."

చిన్న పొరపాటు. "అలా రాజుకి తాను అక్షుద్రాత్ముడిని అని నమ్మకం కలిగిస్తాడు."

Unknown said...

విశ్వనాథ వారి భావాన్ని సుబోధకం చేసి వివరించి నందుకు మీకు నా ధన్యవాదాలు.మళ్ళీ జాగ్రత్తగా చదివేలా చేసారు.
రెండోసారి చదివినప్పుడు ఈ సీసపద్యాన్నికూడా పోస్టు చేయాల్సిందే అనిపించింది. అందుకే ఇక్కడ పోస్టు చేస్తున్నాను.
సీ.
నిద్రాహారములెల్ల- అనే పద్యం తరువాత దశరథుడు సుమంతునితో అంటాడిలా.
సీ.
ఇడి పొ త్తికల భార్య నడికట్టుతో వచ్చి
యందీయఁ బసిపాప నందుకొనఁగఁ
జిటికతోఁ బల్కరించినఁ దొట్టెలో బిడ్డ
బోసినవ్వుల చిట్టిహౌసు మఱుగ
రా బాబు నీ విట్లు రా యని నవ్వుచుఁ
జే సాచ మార్నవ్వు శ్రీ ల కుబుక
గృహముఁ జేరినయంతనే కాళ్ళ కడ్డమ్ము
వచ్చి మోకాళ్ళులఁ బ్రాక నుబ్బఁ
గీ.
దతసుకృత మేమి చేయు దంపతులు ధాత్రి
నోఁచుకొందురొ నే నింత నోఁచలేదు
అల్ల కౌసల్య నోఁచలే దా సుమిత్ర
నోఁచలేదు కైకేయి యు నోఁచలేదు. 33
ఉ.
ఓరగఁ బుణ్యలోకము లటుండఁ బ్రజార్థము కానియట్టి భా
ర్యారతిచూడఁ బాశవము కన్ననుహీనముసంతులేని సం
సారము సేఁత ధర్మపరిసంగతి మాలిన రాజ్యపాలనం
బారయ ద్రవ్యకామమలినాత్ములుసేయుదు రిట్టి పాపముల్.
ఇందులో పాశవము అంటే ఏమిటో తెలియలేదు. వివరించగలరా.

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks