నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

Mar 7, 2014

వర్ణన రత్నాకరము - మన్మథోపాలంబనము - రుక్మిణీ పరిణయము - కూచిమంచి తిమ్మకవి

వర్ణన రత్నాకరము - మన్మథోపాలంబనము - రుక్మిణీ పరిణయము - కూచిమంచి తిమ్మకవి

ఆ.
పొలఁతి పొలఁతి తోడఁ పురుషుండుఁ బురుషుతోఁ, బొందు సేయఁదగునుఁ బోరఁ దగును
పురుషుఁ డబల తోడ బోరాడ రా దిందు, రాకు మార యిందిరా కుమార.
                                          రుక్మిణీ కళ్యాణము - అ.2 పద్య 304

0 comments

Mar 1, 2014

వర్ణన రత్నాకరము - అభ్యంగనాదికము - యామినీపూర్ణతిలకావిలాసము - చెళ్ళపిళ్ళ సరసకవి

వర్ణన రత్నాకరము - అభ్యంగనాదికము - యామినీపూర్ణతిలకావిలాసము - చెళ్ళపిళ్ళ సరసకవి

సరులు పెనంగ లేఁ జమట జాలుగొనంగఁ గురు ల్విడంగఁ గ్రొ
వ్విరు లురలంగఁ బైఁట చెఱగింపుగ నోరిసిలంగ గుబ్బచ
న్మెరుగు లెఱుంగఁ గౌను జవ మించు టెసంగ నగల్ మెలంగఁగా
గురుకుచ యోర్తు బిల్హణునకుం దల యంటె ననేక భంగులన్.
                                               యామినీ పూర్ణతిలకా విలాసము - చెళ్ళపిళ్ళ సరసకవి - అ 5

జాలుకొను=ప్రవహించు
క్రొవ్విరి = కొత్త పుష్పము
ఉరలబడు=దొర్లు
ఓరసిలబడు=తొలగగా
కౌను= నడుము

తలంటును గుఱించి కూడా ఇలా సరసమైన పద్యాలను మన వాళ్ళు రచించారు పూర్వం.

0 comments

Feb 28, 2014

వర్ణన రత్నాకరము - సారంగధర చరిత్రము - .చేమకూర వేంకటకవి - స్త్రీ గర్హణము

వర్ణన రత్నాకరము - సారంగధర చరిత్రము - .చేమకూర వేంకటకవి - స్త్రీ గర్హణము

క.
జనకు నయిన సోదరు నై, నను సుతు నైన నొకపరిఁ గనం దరుణులకున్

దను పెక్కును లజ్జాపద, మని హరితో ద్రుపద పుత్రి యనెఁ గద తొలుతన్. 

                                             సారంగధర చరిత్రము - అ 2 . పద్య 45
తనుపు =తృప్తి, తనివి,తడి,satisfaction, content,
  • ఆతర్పణము, ఆదలు, ఆపూర్తి, ఆప్యాయము, ఆశితంభవము, తనివి, తనుపు, తర్పణము, తోషణము, తోషము, పూర్తి, ప్రకామము, ప్రతుష్టి, ప్రసన్నము, ప్రీణనము, సంతర్పణ, సంతసము, సంతృప్తి, సంప్రియము, సురతి, సౌఖ్యము, సౌమనసము, సౌమనస్యము, సౌహిత్యము, స్వాస్థ్యము, హృషి. 
  • ఇలా చాలా అర్థాలు ఉన్నవి.

0 comments

Feb 27, 2014

వర్ణన రత్నాకరము - విజయ విలాసము - చేమకూర వేంకటకవి - విటులు

వర్ణన రత్నాకరము - విజయ విలాసము - చేమకూర వేంకటకవి - విటులు

సీ.
అతి వినోదము గాఁగ రతుల మెప్పించు నీ, పచ్చల కడియాల పద్మగంధి
చక్కెర మో విచ్చి చవులఁ దేలించు నీ, ముత్యాల కమ్మల ముద్దులాఁడి
తృణముగా లోఁ జేయు నెంతటి వాని నీ, నీలాల ముంగఱ నీలవేణి
వెల లేని పొందిక విడివడ మెఱయు నీ, కెంపులఁ బొగడల కీరవాణి
గీ.
యనుచుఁ దమలోన నెఱజాణ తనము మీఱ, వారకాంతామణుల మేలు వార్త లెల్లఁ
దెలుపుచును వెన్నెల బయిళ్ళఁ గలసి నగుచు, విటులు  విహరింతుర ప్పురీ వీథు లందు.

                           విజయ విలాసము - చేమకూర వేంకటకవి - అ 1, పద్య 81.

 
 

0 comments

Feb 26, 2014

వర్ణన రత్నాకరము - పద్మినీ పరిణయము - ఉన్నవ యోగానందసూరి - మన్మథోపాలంబనము

వర్ణన రత్నాకరము - పద్మినీ పరిణయము - ఉన్నవ యోగానందసూరి - మన్మథోపాలంబనము

సీ.
ఎత్తిన నీ ధ్వజం బేటి పాలైపోను, పాంథుల నేఁచకు పంచబాణ
అలరు నీ వాహనం బడవి పాలైపోను, పథికుల నేఁచకు పంచబాణ
నీ చేతి పెనువిల్లు నేలపాలైపోను, పడఁతుల నేఁచకు పంచబాణ
నీ రూపవిభవంబు నెఱి భస్మమైపోను, బలముల విడువకు పంచబాణ
గీ.
పతి వియోగుల డాయకు పంచబాణ, బాల నని విన్నవించితి పంచబాణ
పాపమున కేల రోయవు పంచబాణ, పచ్చి బోయవు గదరోరి పంచబాణ.

పద్మినీ పరిణయము   -ఉన్నవ యోగానందసూరి అ 4. పద్య 43

ఎంత హాయిగా సాగిందీ పద్యం. ఈ పుస్తకం గానీ ఈ రచయిత గుఱించి గానీ ఏమీ తెలియదు కదా!


0 comments

Feb 25, 2014

వర్ణన రత్నాకరము - క్షత్రియులు - అనిరుద్ధ చరిత్రము - కనుపర్తి అబ్బయామాత్యుఁడు

వర్ణన రత్నాకరము - క్షత్రియులు - అనిరుద్ధ చరిత్రము - కనుపర్తి అబ్బయామాత్యుఁడు

సీ.
సముదీర్ణ చంద్రహాస కళా వినోదముల్, ముఖములందును రణోన్ముఖములందు
ధర్మగుణాను సంధానతా చతురతల్, శయములందును హృదాశయములందు
బుధగురు చక్రావన ధురీణ చిహ్నంబు, లాఖ్యలందు నిజాన్వయాఖ్యలందుఁ
బ్రకట పంచానన ప్రక్రియా విభవముల్, భటులందు విక్రమార్భటులయందు
గీ.
వెలయ వెలయుదు రనివార్య వీర్య శౌర్య, ధైర్య గాంభీర్య సమధికౌదార్యతుర్య
ధుర్యులైనట్టి బాహుజ వర్యు లెపుడు, సిరులఁ జెలువొందు నప్పుర వరమునందు.

సముదీర్ణ =గొప్పది అయిన
శయము=చేయి
హృదాశయము= హృదయమునందలి ఆశయము
చక్ర అవన ధురీణ చిహ్నము= చక్రమును కాపాడే బరువును మోసే యెద్దుయొక్క గుర్తు(?)
ఆఖ్య= పేరు
ఆ పురమేదో నాకు తెలియదు,నేను అనిరుద్ధ చరిత్ర చదవలేదు. కాని అనుప్రాస యెంత మనోహరంగా ఉందో కదా !

0 comments

వర్ణన రత్నాకరము - వైజయంతీ విలాసం - సారంగు తమ్మయ

వర్ణన రత్నాకరము - వైజయంతీ విలాసం - సారంగు తమ్మయ 

ఆ విప్రోత్తము వజ్రపంజర నిభంబై నిశ్చలంబైన స
ద్భావంబంగన సాహచర్య గుణ సంపర్కంబునన్ లోహమై
గ్రావంబై ధృడ దారువై తరుణ వృక్షంబై ఫలప్రాయమై
పూవై తన్మకరందమై కరిగెఁ బోఁ బోఁ నీళ్ళకున్ బల్చనై
                                      వైజయంతీ విలాసము - సారంగు తమ్మయ -అ 2, పద్య 139

గోల్కొండసామ్రాజ్యాన్ని పాలించిన కులీ కుతుబ్ షాహీ కాలం నాటి సారంగు తమ్మయ్య  -అనే కవి రచించిన
“వైజయంతీ విలాసం”అనే కావ్యం లోని విప్రనారాయణ చరిత్రము లోనిది ఈ పద్యం.
పరమభక్త శిఖామణి అయిన విప్రనారాయణుడు దేవదేవి అనే వారకాంత వలలో చిక్కుకొని భ్రష్టుడై పోతాడు. ఎలా ఉండేవాడుఎలా అయిపోయాడో తెలియజేసిన వైనం ఈ చక్కటి పద్యంలో కవి వివరించాడు.
ఆ బ్రాహ్మణ శ్రేష్టుని యొక్క అత్యంత ధృడమైన వజ్రపంజరంవలె ఉండే – అంటే అభేద్యంగా ఉండే సద్భావం. సద్భావం అంటేసద్విషయకమైన భావం. భగవంతుడు సత్ చిదానంద స్వరూపుడు. సత్ అంటే ఉండేది. తక్కినవన్నీ ఉండవు. తద్విషయకమైనభావం సద్భావం. పరమేశ్వర సంబంధమైన భావం.
అంతవరకూ బ్రహ్మచర్య దీక్షలో ఉన్న విప్రనారయణుని సద్భావం అంగన – స్త్రీ - – ఆ దేవదేవితోడి సాహచర్యము చేయడం అనేగుణముతో కలిసి ఉండటం చేత (సాహచర్యగుణ సంపర్కమ్మునన్) వజ్రం లాంటి సద్భావం మెత్తబడుతూ క్రమంగా లోహమై, రాయి (గ్రావంబు) అయి, ఆ పై గట్టి కొయ్య (ధృడ దారువు) అయింది. అక్కడితో ఆగకుండా, లేత చెట్టు (తరళ వృక్షము)అయింది. ఇంకా ఆగలేదు. పండు అయింది, పువ్వు అయ్యింది. దానిలోని తేనె (తత్ మకరందం) అయింది. ఈ రీతిగా క్రమేపీపల్చబడుతూ పల్చబడుతూ పోగా పోగా (పో పో) అన్నింటికన్నా పల్చనైన నీళ్ళ కన్నా కూడా పల్చగా కరిగి పోయిందిట!

1 comments

Feb 23, 2014

వర్ణన రత్నాకరము - నల చరిత్రము - సిరిప్రగడ ధర్మయామాత్యుఁడు -క్షత్రియులు

వర్ణన రత్నాకరము - నల చరిత్రము - సిరిప్రగడ ధర్మయామాత్యుఁడు -క్షత్రియులు

సీ.
వేరంపుఁ బరునికి వెన్నిచ్చె నని కాని, ఘనుఁడు దధీచి యొక్కరుఁడె సాటి
వెఱవైన మగతనం బఱఁ గొఱంతని కాని, కనకాద్రి ధన్వుఁ డొక్కరుఁడె సాటి
గణుతించుచోఁ గళంకముఁ జెందెనని కాని,కమలాభియాతి యొక్కరుఁడె సాటి
ప్రతిదినంబును భంగపాటొందునని కాని, కన్నిధిస్వామి యొక్కరుఁడె సాటి
గీ.
కాని యితరులు సరిగారు దానశూరు, లతుల విక్రము లకలంకు లతి గభీరు
లగుచు వెలసిన రూపజితార్ధి పుత్త్ర, మారులకుఁ బురి రాజకుమారులకును.

నెఱవు= నిండైన, పూర్తిగా నున్న
అఱ=సగము,  "అఱచందురుని క్రొత్తమెఱుఁగుల
అభియాతి=వైరి, పగతుడు, 
ఈ పద్యానికి సరియైన అర్థం బోధపడటం లేదు. ఎవరైనా తెలియజేస్తే వారికి ముందుగా నా ధన్యవాదములు.ఈ పద్యంలోని అలంకారం యొక్క వివరణనూ తెలియ పఱచగలరని ఆశిస్తూ---

0 comments

వర్ణన రత్నాకరము - బిల్హణీయము - చిత్రకవి సింగనార్యుఁడు -సూర్యోదయము

వర్ణన రత్నాకరము - బిల్హణీయము - చిత్రకవి సింగనార్యుఁడు -సూర్యోదయము

చ.
సమయవినోది మిన్ననెడి చక్కని రంగమునందు  సర్వ ది
గ్రమణులు చూఁడ గారడము రక్తిని జూప విధుండ నెండు న
ద్దము నొక కర్ణమం దునిచి దాపలి కర్ణము నందు హేమ చ
క్రము వెడలంగఁ దీసెననఁగా రవి దోఁచెఁ బ్రభా ప్రభావుఁడై.

బల్హణీయము. అ.3, పద్య 187.

ఈ కావ్యము గుఱించి నాకు ఏమీ తెలియదు. పూర్వం "వెయ్యేళ్ళ తెలుగు పద్యం" అనే శీర్షికన కీ.శే. పుట్టపర్తి నారాయణాచార్యుల వారు ఓ వారపత్రికలో నిర్వహిస్తున్నధారావాహికలో మొట్టమొదటి పద్యం అనుకుంటాను ఈ పద్యం. చూడండి ఎంత అందమైన వర్ణనో.

కాలపురుషుడు ఆకాశమనే చక్కని రంగస్థలం మీద అన్ని దిక్కులలోని స్త్రీలు చూస్తూ ఉండగా గారడీవిద్యను ప్రదర్శిస్తూ ఆ గారడీవిద్యను  రక్తి కట్టించే విధంగా చూపనెంచి బ్రహ్మ అనే అద్దాన్ని తన ఒక చెవి వెనకగా ఆనించి ఉంచి తన రెండవ చెవినుండి బంగారు చక్రాన్ని బయటకు వెలికి వచ్చేలా తీసేడా అన్నట్లుగా సూర్యుఁడు తూర్పున తన సహస్రకిరణాలతోనూ ప్రకాశిస్తూ ఉదయంచేడట. ఎంత అందమైన ఊహ!!

అప్పటినుండీ ఎప్పటికైనా బిల్హణీయాన్ని దొరకబుచ్చుకొని చదవాలని అనుకుంటున్నాను.ఎప్పటికి కుదురుతుందో ఏమో!
.

0 comments

Feb 22, 2014

వర్ణన రత్నాకరము - తారాశశాంక విజయము - శేషము వేంకటపతి - స్త్రీ వర్ణనము

వర్ణన రత్నాకరము - తారాశశాంక విజయము - శేషము వేంకటపతి - స్త్రీ వర్ణనము


సీ.
ఇది మనోహర కాంతి కింపైన బింబంబు, బింబంబు కాదిది బెడగు కెంపు
కెంపు గాదిది తేఁటి యొంపని మంకెన, మంకెన గాదిది మంచి చిగురు
చిగురు కాదిది వింత జిగి హెచ్చు పగడంబు, పగడంబు గాదిది పానకంబు
పానకంబిది గాదు పలుచని చెఱకుపాల్, చెఱుకుపాలిది గాదు కురుజు తేనె
గీ.
కురుజు తేనెయు గాదిది కుసుమరసము, కుసుమరసమును గాదిది గొనబు జున్ను
జున్ను గాదిది చవిఁ గుల్కు సుధలదీవి, సుధల దీవియు గాదిది సుదతి మోవి.
                                                           తారాశశాంక విజయము - శేషము వేంకట కవి - అ 1

0 comments

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks