నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

Aug 6, 2009

కావ్యాలంకారచూడామణి రసప్రకరణము

కావ్యాలంకారచూడామణి
రసప్రకరణము
౧.శృంగారరసము 2 విధములు (సంభోగ, విప్రలంభములు)
1. సంభోగశృంగారము
శృంగారరసోపపన్న చేష్టలు 20
వానిలో- అంగజాతములు 3
" - అయత్నసంభవములు 7
" - నైసర్గికములు 10
(1) అంగజాతములలో - 1.భావము, 2. హావము, 3.హేల.
(2) అయత్నసంభవములలో -
1.శోభ, 2.కాంతి, 3. దీప్తి, 4. మాధుర్యము, 5. ప్రాగల్భ్యము, 6. ఔదార్యము, 7. ధైర్యము.
(3) నైసర్గికములలో-
1.లీల, 2.విలాసము, 3.విచ్ఛితి, 4. విభ్రమము, 5.కిలకించితము, 6. మెట్టాయితనము, 7. కుట్టమితము, 8. బిబ్బోకము, 9.లలితము, 10. విహృతి.

2. విప్రలంభశృంగారము (12 దశలు)
1.చక్షుప్రీతి, 2. చిత్తసంగమము, 3. సంకల్పము, 4. ప్రలాపము, 5. జాగరము, 6. తనుకార్శ్యము, 7. విషయద్వేషము, 8. త్రపానాశము, 9. సంజ్వరము, 10. మోహము, 11. మూర్ఛ, 12. ద్వాదశదశ.

౨. హాస్యము. (హాస్య భేదములు) 6; 1.స్మితము, 2.హసితము, 3.నిహసితము, 4.ప్రహసితము, 5.అపహసితము, 6. అతిహసితము.)
౩. కరుణము.
౪.రౌద్రము, (2 విధములు ; మాత్సర్య విద్వేషరౌద్రములు)
౫.వీరము (3 విధములు ; దాన దయా యుద్ధ వీరములు)
౬.భయానకము,
౭. భీభత్సము(2 విధములు ; జుగుప్సా, వైరాగ్య.)
అద్భుతము,
౯. శాంతరసము.

0 comments

అనయము నయము సొంపారు క్రొవ్విరులు గొనబైన చెంగల్వకొలఁకులు చుట్టి

అన్నమాచార్య చరిత్రము
పొత్తపినాడు

అనయము నయము సొంపారు క్రొవ్విరులు
గొనబైన చెంగల్వకొలఁకులు చుట్టి

పొదలు గొజ్జంగపూఁబొదలు క్రిక్కిఱిసి

వదలక వెలుఁగుకైవడి వెలుఁగొందు-


తెరువరుల్ త్రోవ నేతెంచి యేతెంచి

పొరిపొరిఁ గణ్పు గణ్పునఁ బాలుగారు-


రసదాళిచెఱకు తోరపుఁదుంట లంది

మిసిమైన ముంతమామిడిపండ్లు వైవ-


నా రసంబులచేత నచటి రాజనపుఁ

బైరులు ముక్కారుఁ బండు; నెయ్యెడలఁ


బాలనే పెరిగిన పసిఁడిటెంకాయ

పాళెల నెడనీరు పట్టి పెట్టినను


అనఁటిపండులు మేసి యలసి పై దప్పి-

గొనివచ్చి కోవెలల్ గ్రోలు నచ్చటను;


నరిమీఱు నా మేటినాటి నానాఁటి-

సిరు లింక నే మని చెప్పంగవచ్చు.

0 comments

Aug 5, 2009

ఇంతకంటే నేమి సేసే మిదే మా మానసపూజ

శంకరాభరణం
ఇంతకంటే నేమి సేసే మిదే మా మానసపూజ
సంతతము నీవు తొల్లే సర్వసంపన్నుఁడవు. IIపల్లవిII

అంతర్యామివైనమీకు నావాహన మదివో
అంతటా విష్ణుఁడ మీకు నాసనము వేసినది
పంతపుఁ కోనేరే మీకుఁ బలుమారు నర్ఘ్యము
చెంతనే గంగాజలముచల్లేమీకుఁ బాద్యము. IIఇంతII

జలధు లన్నియును నాచమనియ్యము మీకు
అల యా వరుణజల మిదియే స్నానము
పలనుగా మీమహిమలే వస్త్రాభరణములు
అల వేదములే మీకు యజ్ఞోపవీతములు. IIఇంతII

ఇరవుగఁ గుబ్జ తొల్లిచ్చినదే మీకు గంధము
ధర మాలాకారునిపూదండలే మీకు పువ్వులు
ఉరుగతి మౌనులహోమమే మీకు ధూపము
తిరమైన మీకు రవితేజమే దీపము. IIఇంతII ౨-౨౭౨

పై పాటలో పంచదశోపచారాలే ఉన్నాయి. నీరాజనము తప్పిపోయినది.

0 comments

శ్రీ యలమేల్మంగఁ జిరకృపాపాంగఁ గాయజుఁ గనతల్లిఁ గాంతామతల్లి,

శ్రీః
అన్నమాచార్య చరిత్రము
రచయిత: తాళ్ళపాక చిన తిరువేంగళనాథుఁడు(చిన్నన్న)

అవతరణిక

శ్రీ యలమేల్మంగఁ జిరకృపాపాంగఁ
గాయజుఁ గనతల్లిఁ గాంతామతల్లి,

శ్రీవేంకటేశుఁ బోషితపద్మ కోశు
సేవకపరతంత్రు జితదైత్యతంత్రు,

దనుజకర్శనము మాధవ సుదర్శనము,
నినకోటితేజంబు హేతిరాజంబు,

నరహరిసంకీర్తి నవవిధు లొసఁగు-
పరమోపకృతిఁ దాళ్ళపాకాన్నయార్యు-

నాచారవిజితామరాచార్యుఁ దిరుమ-
లాచార్యు ఘను మదీయాచార్యుఁ గొలిచి

యార్యులు విని యన్నమాచార్యవర్యు-
చర్యకు మిగుల నాశ్చర్యంబుఁ జెంద,

జలజాతవాసిని చనుఁబాలపుష్టిఁ
బలికెద నా నేర్చుపరిపాటి నిపుడు,


జనపరంపరా శతసహస్రముల
వెనుకకు మేము దుర్విషయానురక్తిఁ

గుక్షింభరులమైన కొదవెల్లఁ దీఱ
రక్షించి, మా యపరాధము ల్మఱచి

యేపుట్టువున మిమ్ము నెఱుఁగంగఁజేసి
నీ పాలివారిఁగా నియమించి మమ్ము

హరి! మిమ్మునే కొనియాడు మా జిహ్వ
నొరులను గొనియాడకుండంగఁజేసి

కంటులేనట్టి లక్ష్మణగురు మతము-
వంటి సన్మతము మీవంటి దైవతము

తనవంటి గురుని నందఱలోనఁ దెచ్చి
వనజాక్ష! నేఁడు మావంటివారలకుఁ

గరతలామలకంబుఁ గావించెఁ గనుక,
అరయఁగఁ దాళ్ళపాకాన్నయాచార్యు-

పరమోపకార మెప్పటికి డెందమున
నరయుచుఁ గొనియాడు టది యొప్పుఁగనుక,-

నాయనఁ జూచి మాయపరాధకోటు-
లేయెడఁ దలఁచక యెడఁబాయ కెపుడు-

నే యాపదలు మమ్ము నెనయక యుండ
మా యిలవేల్పవై మన్నించుకతన,

నందను సద్వర్తనము తండ్రి ప్రియము-
నొందఁ గీర్తించుట యుచితంబు గనుక,

అఱలేక యీ యన్నమాచార్యచరిత
వెఱవక నీకు నే విన్నవించెదను;

మన్నించి యలమేలుమంగతో నీవు
నిన్నుఁ బాయని భక్తనికరంబుతోడ

నవధారు శ్రీవేంకటాచలాధీశ!
అవధరింపుఁడు గురుహరిభక్తులార !

0 comments

Aug 3, 2009

కావ్యాలంకారచూడామణి భావప్రకరణము


కావ్యాలంకారచూడామణి భావప్రకరణము
భావము

భావ బేధములు 4
1.విభావము----అ) ఆలంబన విభావము
ఆ) ఉద్దీపన విభావములు-4
౧)ఆలంబన గుణములు
౨) ఆలంబన చేష్టితములు
౩)హారాలంకారి
౪)ఉత్సవలీలలు

2.అనుభావము

3. సాత్త్విక భావములు 8
౧.స్తంభము, ౨. రోమాంచము, ౩. అశ్రువు, ౪. వైశ్వర్యము, ౫. కంపము, ౬.ప్రళయము,
౭.వైవర్ణ్యము, ౮. స్వేదము.

4.సంచారిభావములు 33
౧. గ్లాని, ౨.శంక, ౩. నిర్వేదము, ౪.మదము, ౫. అసూయ, ౬. ఆలస్యము, ౭.దైన్యము, ౮.శ్రమము, ౯. స్మృతి, ౧౦. మోహము, ౧౧. చపలత, ౧౨.చింత, ౧౩. విషాదము, ౧౪. సుప్తి, ౧౫. బోధము, ౧౬.ఔత్సుక్యము, ౧౭ ఆవేగము, ౧౮. గర్వము, ౧౯. హర్షము, ౨0. అమర్షము, ౨౧. నిద్ర, ౨౨. మతి, ౨౩. అపస్మారము, ౨౪. ఉన్మాదము, ౨౫. త్రాసము, ౨౬. ఉగ్రత, ౨౭. జడత, ౨౮. వితర్కము, ౨౯. అవహిత్థ, ౩౦. ధృతి, ౩౧.మరణము, ౩౨. వ్యాధి, ౩౩. వ్రీడ.

స్థాయిభావములు 9
౧.రతి, ౨. హాసము, ౩. శోకము, ౪. రోషము, ౫. ఉత్సాహము, ౬.భయము, ౭.జుగుప్స, ౮. విస్మయము, ౯. శమము.

0 comments

గౌరవంబు గల యింటి కగు నాఁడుపడుచు రాక యెంత సోభాయమానమో

రామాయణ కల్పవృక్షం-ధనుష్ఖండము
దశరథాదులు మిథిలకుఁ బ్రయాణమగుట
గీ.
గాఁగను బ్రయాణసన్నాహ కలితవేగ
రమ్యముఖులైరి నాల్గువర్ణములవారు
నంతిపురమునఁ బురమున నంగనలకు
నే మడతఁ దీయవలెనో యెఱుఁగరాదు. 338

మన తెలుగు ఆడపడుచుల మనస్తత్త్వమును ఎంతబాగా చెప్పారో చూడండి.
శాంతాదేవి కూడా మిథిలకు ప్రయాణమై వచ్చినపుడు కౌసల్య ఆమెతో ఎలా మాటాడిందో చూడండి.
వ.
అంతఁ గౌసల్యవచ్చి శాంతం గౌఁగిలించుకొని ముద్దాడి "తల్లీ నీవు వచ్చితివి; నా బరువు తీరినది; మాడుపట్టున నింతచమురుపెట్టుటకు మంగళహారతిపళ్ళెము పట్టుటకుఁ దమ్ముని దిద్దికొనుటకు నాఁడుపడుచవు వచ్చితి వని" పొంగిపోయె.
గీ.
శాంత కనుసన్నలంబడి సర్వమందు
సాధువు బ్రియంబునై యాజ్ఞ సాగె గౌర
వంబు గల యింటి కగు నాఁడుపడుచు రాక
యెంత సోభాయమానమో యెఱుఁగఁబడుచు. 354

తెలుగుదనాన్ని విశ్వనాథవారు రామాయణగాథలోనికెంత అందంగా ప్రవేశపెట్టారో చూసి మనమందరం మురుసుకోవాల్సివుంది.
సీరధ్వజుడు సుదాముడనే మంత్రిని దశరథుని కుమారులతో సహా అక్కడకు ఆహ్వానించమని పంపుతాడు.
అప్పుడు సుదాముడు
మ.
గురువుల్ మంత్రులతో సభాస్థలమునన్ గూర్చుండి నీపుత్త్రులున్
గురువుల్ నీవును రండటంచుఁ బిలిచెన్ క్షోణీశ ! వై దేహుఁడం
చురువౌ ప్రేమ సుదామనుండు వలుకన్ బ్రోద్దామ సమ్మోద ని
ర్భరుఁడై కోసలరాజు వచ్చితిమయా వైదేహునాస్థానికిన్. 382
గీ.
అని సబాంధవుఁడై నృపుఁ డరుగుదెంచె
నంతనంత సోపాధ్యాయుఁ డరుగుదెంచె
నంత నంత సపుత్త్రకుఁ డరుగుదెంచె
నంతలోన వియ్యంకుఁడై యరుగుదెంచె. 383

అనుప్రాసను ఎంతందంగా వాడారో ---

0 comments

Jul 31, 2009

నృత్యన్మంజుల తారహార కబరీనిష్యంది ముక్తామణి

రాముడు శివధనుర్భంగము చేయుట/పరశురామ గర్వభంగము

శివధనువు విఱిగిన ధ్వనిని గూర్చి వివరిస్తూ విశ్వనాథ వారు ఓ ఐదు అందమైన శార్దూల పద్యాలను వ్రాసారు. నాకీ పద్యాలు పూర్తిగా అర్థం కాలేదు. అయినా అంత అందమైన పద్యాలను బ్లాగీకరించకుండా ఉండటం నాకు సాధ్యం కాలేదు. విశ్వనాథవారు తరువాత ధనుష్ఖండంలోనే పరశురామ గర్వభంగం ఘట్టంలో ఇవే పద్యాలను (కొద్ది కొద్ది మార్పులతో) మళ్ళీ చెప్పటం జరిగింది. ఆ పద్యాలను కూడా ఈ పద్యాలక్రిందనే ఉదాహరిస్తున్నాను. మొదటి, తరువాతి పద్యాల వరుస సంఖ్యలను కూడా ప్రక్కనే వ్రాసాను.

వాల్మీకి రామాయణంలో ఈ శివధనుస్సు విరిగినప్పటి ధ్వని వర్ణన ఉందా అని అనుమానం వచ్చింది. అది తెలియాలంటే వాల్మీకి రామాయణం చదవాలి. వాల్మీకి రామాయణం నా దగ్గర లేదు. దానిని సంపాదించినా కాని నాకు సంస్కృతం రాదు. మరెలాగ. అప్పుడు గోపీనాధ రామాణం వాల్మీకి రామాయాణాన్ననుసరించి వ్రాసారన్నది గుర్తొచ్చింది. ఆ పుస్తకం నా దగ్గరుంది కాబట్టి తీసి ఆ ఘట్టం చదివా. అక్కడ ఉన్న 3 పద్యాలు ఇవి.
తే.
ఆ రఘుస్వామి సత్త్వ మే మనఁగ వచ్చుఁ
బగిలి పేడెత్తి జగములు పల్లటిల్లఁ
గరికరాహతి విఱిగిన చెఱకువోలె
ఘనరవంబునఁ దచ్ఛరాసనము విఱిగె. 1202
చ.
విఱిగెఁ గులాచలంబు లట బీఁటలు వాఱె దిగంతకుడ్యముల్
పఱియలు వాఱె భూతల మపాన్నిధులుం గలఁగెన్ వెసన్ దిశా
కరులు వడంకె భూతతతి గందెఁ గుశాన్వయుఁ డావిదేహదా
శరథులుఁ దక్క సర్వజనసంఘము మూర్ఛ మునింగె నత్తఱిన్. 1203
ఆ.
అంతఁ గొంతవడికి నమ్మహాశబ్దంబు, శాంతి నొందెఁ బిదప సభ్యులెల్ల
మూర్ఛ దేఱి చాల మోదంబు నొందిరి, జనకవిభుఁడు సాధ్వసంబు విడిచె. 1204

ఇంత మాత్రమే ఉంది. తరువాత విష్ణు ధనుష్టంకారశబ్దం గురించి ఏమీ లేదు. కాని విశ్వనాథ వారు వారి కల్పనను ఊహాశక్తిని జోడించి కడు హృద్యంగా ఈ ఘట్టాల్ని నడిపించారు.
అంటే ఇదంతా విశ్వనాథవారి స్వకపోల కల్పనే అనేది తెలిసి నిజంగా ఆశ్చర్య పోయాను.విశ్వనాథవారి కల్పనాశక్తికి ముగ్ధుడిని అయ్యాను. ఈ పద్యాల పూర్తి అర్థం తెలుసుకోవాలనే కోరికతో వాటిని క్రింద ఉదాహరిస్తున్నాను. చిత్తగించండి. పెద్దలెవరైనా ఈ పద్యాలకు ప్రతిపదార్థంతో వివరణ తెలియపరిస్తే వారికి కృతజ్ఞుడనై ఉంటాను.
శివధనుర్భంగం జరిగిన వెంటనే విశ్వనాథ వారు వ్రాసిన మొదటి పద్యం ఇది.
శా
.
నిష్ఠావర్ష దమోఘ మేఘపటలీ నిర్గచ్ఛదుద్యోతిత
స్పేష్ఠేరమ్మదమాలికా యుగప దుజ్జృంభన్మహా ఘోరబం

హిష్ఠ స్ఫూర్జధుషండమండిత రవాహీన క్రియా ప్రౌఢి ద్రా

ఘ్రిష్ఠంబై యొకరావ మంతట నెసంగెన్ ఛిన్న చాపంబునన్
. 303

ఛిన్నమైన శివుని చాపం నుండి వెలువడిన రావము(శబ్దం) గుఱించి వ్రాసిన పద్యం ఇది.ఇదే పద్యం కొద్ది మార్పులతో పరశురాముఁడు శివధనుర్భంగమునకుఁ గోపించి జనకుని సభకు వచ్చిన ఘట్టంలోని మొదటి పద్యం గా వారు వ్రాసారు. కాని మూలం ప్రకారం పరశురాముఁడు దశరథాదులు సీతారాములతో అయోధ్యకు తిరిగి వెళ్ళే దారిలో వస్తాడు కాని జనకుని సభలోనికి రాడు. ఆయన వచ్చేటప్పుడు వాకిట్లో శబ్దం ఘోరమై వినపడిందన్నారు. ఇది విష్ణుచాపధ్వని.
శా.
నిష్ఠావర్ష దురార మేఘపటలీ నిర్గచ్ఛదుద్యోతిత
స్పేష్ఠేరమ్మద మాలికా యుగపదుజ్జృంభ న్మహాఘోరబం

హిష్ఠ స్ఫూర్జధు షండమండల రవా హీనక్రియాప్రౌఢి ద్రా

ఘ్రిష్ఠమ్మై యొకరావ మంతట నెసంగెన్ వాకిటన్ ఘోరమై. 398


ఇక రెండో పద్యం.
శా.
హేరంబోన్నత శూర్పకర్ణ వివర హ్రీకారియై షణ్ముఖ
స్ఫార ద్వాదశ నేత్ర గోళవివృతి ప్రాకారమై శైల క

న్యారాజన్నవ ఫాలమండల విభుఘ్న క్రీడయై యాశ్ల

ద్గీరుగ్రప్రమథంబుగా ధనువు మ్రోఁగెన్ శైవలోకంబులన్
. 304

ఈ రెండో పద్యం పరశురాముని రాకకు ముందే బాలరాఘవు శివధనుర్భంగరవము దిగ్దిగంతములందుఁ బ్రతిధ్వనించె అంటూ చెప్పిన ఘట్టంలోనిది.
శా.
హేరంబోజ్జ్వల శూర్పకర్ణ వివరహ్రీకారియై షణ్ముఖ
స్ఫార ద్వాదశ నేత్రగోళ వివృతి ప్రాకారమై శైలక

న్యారాజన్నవఫాలమండల విభుగ్నక్రీడమై యాశ్చల

ద్గీరుగ్రప్రమథంబుగా నగుచు మ్రోఁగెన్ శైవలోకంబులన్. 390


పై రెండు పద్యాలలోను స్వల్పమైన మార్పులను గమనించండి.
తరువాతది మూడో పద్యం.
శా.
నృత్యన్మంజుల తారహార కబరీనిష్యంది ముక్తామణి
ప్రత్యగ్రప్రసవా క్షిసంకలనదీవ్యత్కంథ రాభేద సా

హిత్య ప్రౌఢ నవాప్సరోనటన సౌహిత్యప్రశస్తాచ్ఛదృ

గ్గీత్యాకారమనోజ్ఞమై ధనువు మ్రోగెన్ సర్వలోకంబులన్
. 305

ఈ పద్యం పరశురాముని నుండి రాముడు విష్ణుధనువుని తీసుకొని జ్యానినాదం చేసినపుడు దాని ధ్వనిని గుఱించి వ్రాసినది.
శా
.
నృత్యన్మంజుల తారహార కబరీనిష్యంది ముక్తామణి
ప్రత్యగ్రప్రసవాక్షి సంకలన దీవ్యత్కంధరా భేద సా

హిత్య ప్రౌఢనవాప్సరోనటన సౌహిత్యప్రశస్తాచ్ఛదృ

గ్గీత్యాకార మనోజ్ఞ మై ధనువు మ్రోగెన్ సర్వలోకంబులన్
. 484


తరువాతది నాల్గవ పద్యం.
శా
.
దర్పస్వీకృతహాస విశ్లథనరుంద్దుష్టవాగ్ధోరణీ
సర్పద్వీరచమూ పథశ్లథనమై స్రంసత్కటీ శాటికా

కూర్పాస ప్రకటోగ్ర సాధ్వసవధూగుర్విణ్య భద్రాధ్వమై

దర్పాడంబరమై ధనుస్సు మొఱసెన్ దైతేయలోకంబులన్
.306

ఈ పద్యం అధ్యాయంలోని చివరి పద్యం. శైవ వైష్ణవ చాపాల ధ్వనిని గురించి వ్రాసినది.
శా.
దర్పస్వీకృతహాస సంశ్లథన రుంధద్దుష్టవాగ్ధోరణీ
సర్ప ద్వీరచమూపథ శ్ల థనమై స్రంసత్క టీ శాటికా

కూర్పాస ప్రకటోగ్ర సాధ్వ సవధూగుర్విణ్యభద్రాధ్వమై

దర్పాడంబరమై ధనుస్సు మొఱసెన్ దైతేయలోకంబులన్
.507

చివదిదైన ఐదవ పద్యం.
శా.
స్ఫీ తాష్టాపదవిద్యుదుజ్జ్వల పయఃపీయుషధారాధునీ
నీతాస్వాద్యతర ప్రగల్భవచన స్నిగ్ధాననాంభోజ సం

ధా తీర్థాకృతి మాగధోల్భణము నానామేదినీరాట్సభా

గీతిస్వాదు మనోజ్ఞ మై ధనువు మ్రోగెన్ రాజలోకంబులన్
. 307

సీతారామ కల్యాణానికి ముందురోజు చెప్పిన చివరి పద్యం ఇది.
శా
.
స్ఫీ తాష్టాపద విద్యుదుజ్జ్వల పయఃపీయుష ధారాధునీ
నీతాస్వాద్యతర ప్రగల్భ వచన స్నిగ్ధాననాంభోజ సం

ధాతీర్థాకృతిమాగధోల్భణము నానామేదినీరాట్సభా

గీతిస్వాదుమనోజ్ఞ మై ధనువు మ్రోగెన్ రాజలోకంబులన్. 376


భైరవభట్ల కామేశ్వరరావు గారు, తాడేపల్లి గారు,రాఘవ గారు, ఇంకా ఆచార్య ఫణీంద్ర గారు మొదలైన పెద్దలెవరైనా నా సహాయానికి రాగలరని పై పద్యాలకు అర్థవివరణ చేసి నాకానందం కలిగిస్తారని ఆశిస్తూ ఈ టపా నిక్కడతో ముగిస్తున్నాను.

1 comments

Jul 27, 2009

శ్రీరఘురామచంద్రునకుఁ జిత్తము జానకిపైఁ గరంబు వి

రాముఁడు శివధనుర్భంగము చేయుట
క.
మీ యిష్టము తెప్పించితి
నాయుష్మంతులను చూడమనవే ! యన గా
ధేయుఁడు రాముని గాంచె వి
ధేయుఁడు రాముండు నేత్ర దీధితు లేచెన్. 294

గాధేయుడు శివధనుస్సును గురించిన వివరాలను జనకుని నుండి వినిన తరువాత ఆ ధనువును తెప్పించమని కోరగా జనకుడు దానిని సభకు తెప్పించి పై విధంగా అంటాడు. విశ్వామిత్రుడు సాభిప్రాయంగా రామునివంక చూడగా రాముడు లేచి ధనువు వద్దకు రా సాగెను.
గీ.
రామచంద్రుఁడు ధనువు చేరంగఁబోయి
తెఱచి మంజూష ధనువుపై దృష్టిపఱపి
కౌశికునివంకఁజూచి ప్రకాశమాన
మందహాసాభిరామాస్యమండలుండు. 295

రాముడు ధనువును చేరి పెట్టెను తెఱచి ధనువుపై దృష్టినుంచి గాధేయునివంక చూచి చిఱునవ్వు నవ్వుతూ ఇలా అన్నాడు.
క.
ఇది మొదలు తాఁకెదన యె
త్తుదునో పయి నెక్కు పెట్టుదునొ యత్నింతున్
ముదల; యనిన గాధేయుఁడు
సదమల రఘువంశ జలధిచంద్రమ ! రామా ! 296

మొదలు దీనిని తాకి చూస్తాను. తఱువాత ఎత్తుతానో ఆపైన యెక్కుపెడతానో ప్రయత్నం చేస్తాను . ఆజ్ఞ దయచేయండి.
అనగా గాధేయుడు స్వచ్ఛమైన రఘవంశమనే సముద్రానికి చందమామ వంటి వాడవైన ఓ రామా!
గీ.
తాటకాప్రాణపథ నిరాఘాటమూర్తి
కోటిమారీచధునన బాహాటశక్తి
క్షుద్రదైతేయకోటిసంస్ఫోటభయద
తాఁకవే యింతయే చాలు ధనువునకును. 297

గాధేయుడు రామునకు ధనువును తాకటానికి అనుజ్ఞను దయచేసాడు. ధనువును తాకవే అదే చాలు అన్నాడాయన.
వ.
అని విశ్వామిత్రుఁడనినంత శ్రీరామచంద్రుండు తత్సభాభవననివిష్ట ప్రాగ్దిశా సౌధంబు పై యంస్తున నంతఃపురస్త్రీల కదలిక గుర్తుపట్టి తలయెత్తిన- 298

అలా విశ్వామిత్రుడు అంటున్నప్పుడు ఆ సభాభవన పై అంతస్తు నందు అంతఃపురస్త్రీల కదలికను గమనించాడు రాముడు.
సీ.
ఇద మిత్థ మని నిర్ణయింపఁగా రాని దే
కోర్కి యో రూపుఁ గై కొన్నయట్లు
జన్మజన్మాంతర సంగతమ్మైన యా
శాబలం బవధికి సాగినట్లు
ప్రాణముల్ బయటికివచ్చి ముగ్ధాకార
మెనయించి దర్శన మిచ్చినట్లు
తనసృష్టిలోని యుత్తమభావ మానంద
ముగఁ బొంగి బింబమై పొడిచినట్టు
గీ.
లల యరుంధతియును నహల్యయును గోస
లాత్మజయు మువ్వురి యాననముల
కన్నను బవిత్రమగుచు శృంగారభావ
మొడిసిపట్టిన ముఖచంద్రుఁ డొకఁడుతోఁచె. 299

ఆ పైఅంతస్తునందు రామునికి ప్రప్రథమంగా సీతా దర్శనం కలిగింది.

ఇదమిత్థమని నిర్ణయించలేని ఏదో ఒక కోరిక రూపు కట్టినట్లుగాను, జన్మజన్మాంతర సంబంధ మేదో ఆశాబలాన్ని తుదముట్టేవరకూ సాగినట్లుగాను, ప్రాణాలు బయటికి వచ్చి ముగ్ధాకారాన్ని సరిపోల్చి దర్శన మిచ్చినట్లుగాను, సృష్టిలోని ఉత్తమభావమంతా ఆనందంగా పొంగి ఒక బింబంగా మారి కనిపించినట్లుగాను, యరుంధతి అహల్య కౌసల్యల ముగ్గురి మోములకంటె పవిత్రమైనదీ, శృంగారభావాన్ని ఒడిసిపట్టినదీ అయిన ఒక ముఖచంద్రుని(సీతాదేవి) దర్శనమయ్యిందట.
ఉ.
శ్రీరఘురామచంద్రునకుఁ జిత్తము జానకిపైఁ గరంబు వి
స్ఫార శరాస లస్తకముపై యుగపత్క్రియఁ జిత్రమయ్యె సం
ధారతిఁ గోటికెక్కిన గుణంబు బిగించుట లాగు టింతయున్
నేరఁడెఱుంగ నొక్కసడి నిండిన శబ్దము కల్గు నంతకున్. 301

రామునికి సీతయందు మనస్సెంతగా లగ్నమయ్యిందంటే నారిని వింటికొనకు తగిలించటం కాని నారి సారించటం గాని తెలుసుకోలేకపోయాడు ఒక్కసారిగా విల్లువిఱిగిన శబ్దమయిందంతే.
సీ.
మంజూషలోనె యమర్చి కోణంబందు
నొక్కి త్రాటం గొప్పు నెక్కు వెట్టెఁ
గాఁబోలు మంజూషికా వినిర్గమనంబు
వేళకే జ్యావల్లి బిగిసియుండెఁ
దాళప్రమాణమౌ ధనువు జానకిదృష్టి
కడ్డమ్ముగా వచ్చునంచు నెంచెఁ
గాఁబోలు నడ్డంబుగా ధనుస్సును బూని
పిడిబాకువలెఁ ద్రాడు వ్రీలలాగె
గీ.
నతని దృష్టికి జానకి యాఁగలేదు
అతని కృష్టికి శివధను స్సాఁగలేదు
సీత పూజడ వెన్నుగా శిరసు వంచెఁ
జెరుకుగడవోలె నడిమికి విఱిగె ధనువు. 302

పెట్టెలోనే అమర్చికొని కోణాన్నినొక్కిపట్టి నారిని కొప్పుకు ఎక్కుపెట్టాడు కాబోలు పెట్టెనుండి బయట పడేసరికే నారి విల్లుకు బిగించబడి వుంది. తాటిచెట్టంత పొడవైన ధనువు జానకినిచూచే తన దృష్టికి అడ్డంగా వుందని అనుకున్నాడు కాబోలు అడ్డంగా ధనువును పట్టుకుని పిడిబాకును ఒరలోనుండి బయటకు లాగిన విధంగా నారిని బాగా లాగాడు.
అతని దృష్టికి జానకి ఆగలేదు, అతని దుక్కికి శవధనుస్సాగలేదు. సీత తన పూజడ వెన్నువెంట వచ్చేట్లుగా తన శిరసును వంచుకున్నది. చెఱకుగడ వలె ధనుస్సు మధ్యకి రెండుగా విఱిగింది.
ఇదే ఘట్టాన్ని ఇంకా ఎంతో అందంగా మా గురువుగారు భైరవభట్ల కామేశ్వరరావు గారు తన బ్లాగులో వ్రాసినట్లు గుర్తు.
ఆ ఎడ్రసు నాకిప్పుడు దొరకలేదు.

0 comments

Jul 25, 2009

రఘుపులకోవ క్షీరధిచందమామకు వింటి కోసలయందు విజయ మగుత

శ్రీరామాయణ కల్పవృక్షము-ధనుష్ఖండము
సీ.
రఘుపులకోవ క్షీరధిచందమామకు
వింటి కోసలయందు విజయ మగుత
కౌసల్యబిడ్డకుఁ గన్నతండ్రికి విదే
హాధీశుసభలఁ గళ్యాణ మగుత
తాటకాప్రాణసంతాపన ద్విజిహ్వున
కఖిల మార్గమునందు నభయ మగుత
యఖలేశ్వరున కహల్యాప్రాణదాతకుఁ
ద్రిభువనంబులయందు శుభము లగుత
గీ.
గౌతమర్షి తేజము గూఁడుకట్టియున్న
యీ యహల్య ప్రాణములలో నెగయుచున్న
శ్రద్ధలును భక్తులును బరిస్పందములును
దండ్రి వెన్నాడి శుభములు తార్చుగాత. 2

సీ.
ఓ యమ్మ భూదేవి ! యీ యయ్య రఘుశిశు
బడలఁ బెట్టకు మమ్మ యడుగులందు
ఓ వాయుదేవ ! రఘూద్వహు శ్రీరాముఁ
జొక్కి పోకుండంగఁ జూడుమయ్య
ఓసి తేజోభూతమా ! సామి తేజమ్ము
బొడ్డు దీధితులను బొక్కనీకు
ఓ యగ్ని ! యీ కౌసలేయుండు పసిపాప
కడలనాల్గింటను బాచియుండు
గీ.
ఓ జలాధి దేవతలార ! రాజశిశివు
నీ రసాధిదేవత చూడుఁడీ ! సమస్త
రసపథంబులయందున రాపులేక
స్వామి మిథిలేశు సభలకు సాగుచుండె. 4

రామలక్ష్మణులు అహల్యా శాపవిమోచనానంతరము విశ్వామిత్రునితో కలసి మిథిలేశు నగరానికి ప్రయాణమై వెళ్ళుతున్నారు. అహల్యాదేవి వారికి వీడుకోలు పలుకుతున్నది.
సీ.
నా ప్రేమ యిద్ది యెన్నాళ్ళిట్టులే యుండుఁ
గదలిపోవయ్య రాఘవకులేంద్ర !
ఎన్నాళ్ళు తిలకంబు నిట్టె దీర్చుచునుందు
మునులు వేచెదరయ్య ముద్దుబిడ్డ
ఈ సాగనంపుట కెప్పు డంతుండదు
వహ్ను లెత్తిరి సుమీ బండ్లపైని
నా వ్రేలి యెఱ్ఱదనాలకుంకుమ యార
దా విదేహముల కీ వరుగవలయు
గీ.
నాయనా ! యచ్చటను శతానందుఁ డుండె
నీవు నా బిడ్డ వగుట వానికిని జెప్పు
నీవు నా తండ్రి వగుట వానికి వచింపు
నీవు నా దైవ మగుట వానికిని దెలుపు. 6

అదీ విశ్వనాథ వారి శైలి.
మ.
అల వైదేహియు శ్రీయుఁ గాఁదిరిగి పోనౌ వేళఁ గళ్యాణమూ
ర్తులు మీ జంటలు గౌతమాశ్రమముగాఁ ద్రోవం జనంజూడుఁడీ
శిలయౌ నొక్కతె వేచియుండు నిట రాజీవాక్ష ! మీకోసమై
యలరుం భక్తియె పేని చీర లవి మీకై కట్టబెట్టంగ నై.7

0 comments

Jul 24, 2009

తాటకావధంబునకును బారితోషికము పొందు మొసంగెద రాఘవా !

తాటక సంహారానంతరము దేవతలు విశ్వామిత్రుని వద్దకు వచ్చి భృశాశ్వవిద్యలను రామున కొసగమని కోరుతారు. విశ్వామిత్రు డలానే వారి కావిద్యలను ప్రసాదిస్తాడు.
చ.
చన జలదేశ మొండయిన సన్ముని యంతటఁ దాటకావధం
బునకును బారితోషికము పొందు మొసంగెద రాఘవా ! జలం
బును స్పృశియింపుమన్న రఘుమూర్తి స్పృశించెను నంతమౌని లో
చనములు కోటిసూర్యసదృశంబుగఁ దైజసమూర్తులొప్పఁగా. 159
వ.
మహాదివ్యంబులైన దండచక్ర కాలచక్ర ధర్మచక్ర విష్ణుచక్రంబులు నైంద్రవజ్రంబులు శైవంబయిన శూలంబునుబ్రహ్మశిరంబును నైషీకంబును బ్రహ్మాస్త్రంబును మోదకీ శిఖరీనామ గదాద్వయంబు ధర్మకాల వారుణ పాశంబులు శుష్కార్ద్రములును నశనులుఁ బైనాక నారాయణాస్త్రంబులు శిఖరమన్న యాగ్నేయా స్త్రంబును బ్రథమన్న వాయవ్యంబును హరశిరః క్రౌంచాస్త్రంబులును శక్తి ద్వయంబును నసురులు ధరించు కంకాళ ముసల కపాల కంకణా స్త్రంబులును వైద్యాధరాస్త్రంబు నందకాసి గాంధర్వమానవ ప్రస్వాపన ప్రశమన సౌరదర్పణ శోషణ సంతాపన విలాపనా స్త్రంబులును గందర్ప దయితంబును దైవదుర్ధర్ష మదనంబును బైశాచ దయితమ్మైన మోహనంబును సంవర్తదుర్ధర్ష మోసలమ్ములును సత్యాస్త్రంబును బరతేజో2పకర్షకం బైన మాయాధర్మమునుతేజఃప్రభాస్త్రంబును శిశిరంబను సోమాస్త్రంబును సుదామనంబను త్వష్టయస్త్రమ్మును భగుని ధారుణంబును శీతేషువును మానవాస్త్రంబును గామరూపంబులు మహాబలంబులు మరమోదారంబులు తేజోమూర్తులై కన్నులయెదుటఁ దిరిగిన- 159
ఆ.
సరగ వేని సర్వసంగ్రణంబు దై
వములకే నశక్యఫణితి యగునొ
యవియు గుంపుగాఁగ నరుదెంచి రాముని
యెదుట మోకరించి యిట్టు లనియె. 160
క.
పరమోదారులమును గిం
కరులము రఘునాథ ! మమ్ముఁ గైకొను మనినన్
దరణికులుఁడు శ్రద్ధామతి
గరమును నా మానసములుగా మెలఁగుడనెన్. 161

0 comments

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks