నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

Jul 27, 2009

శ్రీరఘురామచంద్రునకుఁ జిత్తము జానకిపైఁ గరంబు వి

రాముఁడు శివధనుర్భంగము చేయుట
క.
మీ యిష్టము తెప్పించితి
నాయుష్మంతులను చూడమనవే ! యన గా
ధేయుఁడు రాముని గాంచె వి
ధేయుఁడు రాముండు నేత్ర దీధితు లేచెన్. 294

గాధేయుడు శివధనుస్సును గురించిన వివరాలను జనకుని నుండి వినిన తరువాత ఆ ధనువును తెప్పించమని కోరగా జనకుడు దానిని సభకు తెప్పించి పై విధంగా అంటాడు. విశ్వామిత్రుడు సాభిప్రాయంగా రామునివంక చూడగా రాముడు లేచి ధనువు వద్దకు రా సాగెను.
గీ.
రామచంద్రుఁడు ధనువు చేరంగఁబోయి
తెఱచి మంజూష ధనువుపై దృష్టిపఱపి
కౌశికునివంకఁజూచి ప్రకాశమాన
మందహాసాభిరామాస్యమండలుండు. 295

రాముడు ధనువును చేరి పెట్టెను తెఱచి ధనువుపై దృష్టినుంచి గాధేయునివంక చూచి చిఱునవ్వు నవ్వుతూ ఇలా అన్నాడు.
క.
ఇది మొదలు తాఁకెదన యె
త్తుదునో పయి నెక్కు పెట్టుదునొ యత్నింతున్
ముదల; యనిన గాధేయుఁడు
సదమల రఘువంశ జలధిచంద్రమ ! రామా ! 296

మొదలు దీనిని తాకి చూస్తాను. తఱువాత ఎత్తుతానో ఆపైన యెక్కుపెడతానో ప్రయత్నం చేస్తాను . ఆజ్ఞ దయచేయండి.
అనగా గాధేయుడు స్వచ్ఛమైన రఘవంశమనే సముద్రానికి చందమామ వంటి వాడవైన ఓ రామా!
గీ.
తాటకాప్రాణపథ నిరాఘాటమూర్తి
కోటిమారీచధునన బాహాటశక్తి
క్షుద్రదైతేయకోటిసంస్ఫోటభయద
తాఁకవే యింతయే చాలు ధనువునకును. 297

గాధేయుడు రామునకు ధనువును తాకటానికి అనుజ్ఞను దయచేసాడు. ధనువును తాకవే అదే చాలు అన్నాడాయన.
వ.
అని విశ్వామిత్రుఁడనినంత శ్రీరామచంద్రుండు తత్సభాభవననివిష్ట ప్రాగ్దిశా సౌధంబు పై యంస్తున నంతఃపురస్త్రీల కదలిక గుర్తుపట్టి తలయెత్తిన- 298

అలా విశ్వామిత్రుడు అంటున్నప్పుడు ఆ సభాభవన పై అంతస్తు నందు అంతఃపురస్త్రీల కదలికను గమనించాడు రాముడు.
సీ.
ఇద మిత్థ మని నిర్ణయింపఁగా రాని దే
కోర్కి యో రూపుఁ గై కొన్నయట్లు
జన్మజన్మాంతర సంగతమ్మైన యా
శాబలం బవధికి సాగినట్లు
ప్రాణముల్ బయటికివచ్చి ముగ్ధాకార
మెనయించి దర్శన మిచ్చినట్లు
తనసృష్టిలోని యుత్తమభావ మానంద
ముగఁ బొంగి బింబమై పొడిచినట్టు
గీ.
లల యరుంధతియును నహల్యయును గోస
లాత్మజయు మువ్వురి యాననముల
కన్నను బవిత్రమగుచు శృంగారభావ
మొడిసిపట్టిన ముఖచంద్రుఁ డొకఁడుతోఁచె. 299

ఆ పైఅంతస్తునందు రామునికి ప్రప్రథమంగా సీతా దర్శనం కలిగింది.

ఇదమిత్థమని నిర్ణయించలేని ఏదో ఒక కోరిక రూపు కట్టినట్లుగాను, జన్మజన్మాంతర సంబంధ మేదో ఆశాబలాన్ని తుదముట్టేవరకూ సాగినట్లుగాను, ప్రాణాలు బయటికి వచ్చి ముగ్ధాకారాన్ని సరిపోల్చి దర్శన మిచ్చినట్లుగాను, సృష్టిలోని ఉత్తమభావమంతా ఆనందంగా పొంగి ఒక బింబంగా మారి కనిపించినట్లుగాను, యరుంధతి అహల్య కౌసల్యల ముగ్గురి మోములకంటె పవిత్రమైనదీ, శృంగారభావాన్ని ఒడిసిపట్టినదీ అయిన ఒక ముఖచంద్రుని(సీతాదేవి) దర్శనమయ్యిందట.
ఉ.
శ్రీరఘురామచంద్రునకుఁ జిత్తము జానకిపైఁ గరంబు వి
స్ఫార శరాస లస్తకముపై యుగపత్క్రియఁ జిత్రమయ్యె సం
ధారతిఁ గోటికెక్కిన గుణంబు బిగించుట లాగు టింతయున్
నేరఁడెఱుంగ నొక్కసడి నిండిన శబ్దము కల్గు నంతకున్. 301

రామునికి సీతయందు మనస్సెంతగా లగ్నమయ్యిందంటే నారిని వింటికొనకు తగిలించటం కాని నారి సారించటం గాని తెలుసుకోలేకపోయాడు ఒక్కసారిగా విల్లువిఱిగిన శబ్దమయిందంతే.
సీ.
మంజూషలోనె యమర్చి కోణంబందు
నొక్కి త్రాటం గొప్పు నెక్కు వెట్టెఁ
గాఁబోలు మంజూషికా వినిర్గమనంబు
వేళకే జ్యావల్లి బిగిసియుండెఁ
దాళప్రమాణమౌ ధనువు జానకిదృష్టి
కడ్డమ్ముగా వచ్చునంచు నెంచెఁ
గాఁబోలు నడ్డంబుగా ధనుస్సును బూని
పిడిబాకువలెఁ ద్రాడు వ్రీలలాగె
గీ.
నతని దృష్టికి జానకి యాఁగలేదు
అతని కృష్టికి శివధను స్సాఁగలేదు
సీత పూజడ వెన్నుగా శిరసు వంచెఁ
జెరుకుగడవోలె నడిమికి విఱిగె ధనువు. 302

పెట్టెలోనే అమర్చికొని కోణాన్నినొక్కిపట్టి నారిని కొప్పుకు ఎక్కుపెట్టాడు కాబోలు పెట్టెనుండి బయట పడేసరికే నారి విల్లుకు బిగించబడి వుంది. తాటిచెట్టంత పొడవైన ధనువు జానకినిచూచే తన దృష్టికి అడ్డంగా వుందని అనుకున్నాడు కాబోలు అడ్డంగా ధనువును పట్టుకుని పిడిబాకును ఒరలోనుండి బయటకు లాగిన విధంగా నారిని బాగా లాగాడు.
అతని దృష్టికి జానకి ఆగలేదు, అతని దుక్కికి శవధనుస్సాగలేదు. సీత తన పూజడ వెన్నువెంట వచ్చేట్లుగా తన శిరసును వంచుకున్నది. చెఱకుగడ వలె ధనుస్సు మధ్యకి రెండుగా విఱిగింది.
ఇదే ఘట్టాన్ని ఇంకా ఎంతో అందంగా మా గురువుగారు భైరవభట్ల కామేశ్వరరావు గారు తన బ్లాగులో వ్రాసినట్లు గుర్తు.
ఆ ఎడ్రసు నాకిప్పుడు దొరకలేదు.

0 comments:

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks