నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

Jul 31, 2009

నృత్యన్మంజుల తారహార కబరీనిష్యంది ముక్తామణి

రాముడు శివధనుర్భంగము చేయుట/పరశురామ గర్వభంగము

శివధనువు విఱిగిన ధ్వనిని గూర్చి వివరిస్తూ విశ్వనాథ వారు ఓ ఐదు అందమైన శార్దూల పద్యాలను వ్రాసారు. నాకీ పద్యాలు పూర్తిగా అర్థం కాలేదు. అయినా అంత అందమైన పద్యాలను బ్లాగీకరించకుండా ఉండటం నాకు సాధ్యం కాలేదు. విశ్వనాథవారు తరువాత ధనుష్ఖండంలోనే పరశురామ గర్వభంగం ఘట్టంలో ఇవే పద్యాలను (కొద్ది కొద్ది మార్పులతో) మళ్ళీ చెప్పటం జరిగింది. ఆ పద్యాలను కూడా ఈ పద్యాలక్రిందనే ఉదాహరిస్తున్నాను. మొదటి, తరువాతి పద్యాల వరుస సంఖ్యలను కూడా ప్రక్కనే వ్రాసాను.

వాల్మీకి రామాయణంలో ఈ శివధనుస్సు విరిగినప్పటి ధ్వని వర్ణన ఉందా అని అనుమానం వచ్చింది. అది తెలియాలంటే వాల్మీకి రామాయణం చదవాలి. వాల్మీకి రామాయణం నా దగ్గర లేదు. దానిని సంపాదించినా కాని నాకు సంస్కృతం రాదు. మరెలాగ. అప్పుడు గోపీనాధ రామాణం వాల్మీకి రామాయాణాన్ననుసరించి వ్రాసారన్నది గుర్తొచ్చింది. ఆ పుస్తకం నా దగ్గరుంది కాబట్టి తీసి ఆ ఘట్టం చదివా. అక్కడ ఉన్న 3 పద్యాలు ఇవి.
తే.
ఆ రఘుస్వామి సత్త్వ మే మనఁగ వచ్చుఁ
బగిలి పేడెత్తి జగములు పల్లటిల్లఁ
గరికరాహతి విఱిగిన చెఱకువోలె
ఘనరవంబునఁ దచ్ఛరాసనము విఱిగె. 1202
చ.
విఱిగెఁ గులాచలంబు లట బీఁటలు వాఱె దిగంతకుడ్యముల్
పఱియలు వాఱె భూతల మపాన్నిధులుం గలఁగెన్ వెసన్ దిశా
కరులు వడంకె భూతతతి గందెఁ గుశాన్వయుఁ డావిదేహదా
శరథులుఁ దక్క సర్వజనసంఘము మూర్ఛ మునింగె నత్తఱిన్. 1203
ఆ.
అంతఁ గొంతవడికి నమ్మహాశబ్దంబు, శాంతి నొందెఁ బిదప సభ్యులెల్ల
మూర్ఛ దేఱి చాల మోదంబు నొందిరి, జనకవిభుఁడు సాధ్వసంబు విడిచె. 1204

ఇంత మాత్రమే ఉంది. తరువాత విష్ణు ధనుష్టంకారశబ్దం గురించి ఏమీ లేదు. కాని విశ్వనాథ వారు వారి కల్పనను ఊహాశక్తిని జోడించి కడు హృద్యంగా ఈ ఘట్టాల్ని నడిపించారు.
అంటే ఇదంతా విశ్వనాథవారి స్వకపోల కల్పనే అనేది తెలిసి నిజంగా ఆశ్చర్య పోయాను.విశ్వనాథవారి కల్పనాశక్తికి ముగ్ధుడిని అయ్యాను. ఈ పద్యాల పూర్తి అర్థం తెలుసుకోవాలనే కోరికతో వాటిని క్రింద ఉదాహరిస్తున్నాను. చిత్తగించండి. పెద్దలెవరైనా ఈ పద్యాలకు ప్రతిపదార్థంతో వివరణ తెలియపరిస్తే వారికి కృతజ్ఞుడనై ఉంటాను.
శివధనుర్భంగం జరిగిన వెంటనే విశ్వనాథ వారు వ్రాసిన మొదటి పద్యం ఇది.
శా
.
నిష్ఠావర్ష దమోఘ మేఘపటలీ నిర్గచ్ఛదుద్యోతిత
స్పేష్ఠేరమ్మదమాలికా యుగప దుజ్జృంభన్మహా ఘోరబం

హిష్ఠ స్ఫూర్జధుషండమండిత రవాహీన క్రియా ప్రౌఢి ద్రా

ఘ్రిష్ఠంబై యొకరావ మంతట నెసంగెన్ ఛిన్న చాపంబునన్
. 303

ఛిన్నమైన శివుని చాపం నుండి వెలువడిన రావము(శబ్దం) గుఱించి వ్రాసిన పద్యం ఇది.ఇదే పద్యం కొద్ది మార్పులతో పరశురాముఁడు శివధనుర్భంగమునకుఁ గోపించి జనకుని సభకు వచ్చిన ఘట్టంలోని మొదటి పద్యం గా వారు వ్రాసారు. కాని మూలం ప్రకారం పరశురాముఁడు దశరథాదులు సీతారాములతో అయోధ్యకు తిరిగి వెళ్ళే దారిలో వస్తాడు కాని జనకుని సభలోనికి రాడు. ఆయన వచ్చేటప్పుడు వాకిట్లో శబ్దం ఘోరమై వినపడిందన్నారు. ఇది విష్ణుచాపధ్వని.
శా.
నిష్ఠావర్ష దురార మేఘపటలీ నిర్గచ్ఛదుద్యోతిత
స్పేష్ఠేరమ్మద మాలికా యుగపదుజ్జృంభ న్మహాఘోరబం

హిష్ఠ స్ఫూర్జధు షండమండల రవా హీనక్రియాప్రౌఢి ద్రా

ఘ్రిష్ఠమ్మై యొకరావ మంతట నెసంగెన్ వాకిటన్ ఘోరమై. 398


ఇక రెండో పద్యం.
శా.
హేరంబోన్నత శూర్పకర్ణ వివర హ్రీకారియై షణ్ముఖ
స్ఫార ద్వాదశ నేత్ర గోళవివృతి ప్రాకారమై శైల క

న్యారాజన్నవ ఫాలమండల విభుఘ్న క్రీడయై యాశ్ల

ద్గీరుగ్రప్రమథంబుగా ధనువు మ్రోఁగెన్ శైవలోకంబులన్
. 304

ఈ రెండో పద్యం పరశురాముని రాకకు ముందే బాలరాఘవు శివధనుర్భంగరవము దిగ్దిగంతములందుఁ బ్రతిధ్వనించె అంటూ చెప్పిన ఘట్టంలోనిది.
శా.
హేరంబోజ్జ్వల శూర్పకర్ణ వివరహ్రీకారియై షణ్ముఖ
స్ఫార ద్వాదశ నేత్రగోళ వివృతి ప్రాకారమై శైలక

న్యారాజన్నవఫాలమండల విభుగ్నక్రీడమై యాశ్చల

ద్గీరుగ్రప్రమథంబుగా నగుచు మ్రోఁగెన్ శైవలోకంబులన్. 390


పై రెండు పద్యాలలోను స్వల్పమైన మార్పులను గమనించండి.
తరువాతది మూడో పద్యం.
శా.
నృత్యన్మంజుల తారహార కబరీనిష్యంది ముక్తామణి
ప్రత్యగ్రప్రసవా క్షిసంకలనదీవ్యత్కంథ రాభేద సా

హిత్య ప్రౌఢ నవాప్సరోనటన సౌహిత్యప్రశస్తాచ్ఛదృ

గ్గీత్యాకారమనోజ్ఞమై ధనువు మ్రోగెన్ సర్వలోకంబులన్
. 305

ఈ పద్యం పరశురాముని నుండి రాముడు విష్ణుధనువుని తీసుకొని జ్యానినాదం చేసినపుడు దాని ధ్వనిని గుఱించి వ్రాసినది.
శా
.
నృత్యన్మంజుల తారహార కబరీనిష్యంది ముక్తామణి
ప్రత్యగ్రప్రసవాక్షి సంకలన దీవ్యత్కంధరా భేద సా

హిత్య ప్రౌఢనవాప్సరోనటన సౌహిత్యప్రశస్తాచ్ఛదృ

గ్గీత్యాకార మనోజ్ఞ మై ధనువు మ్రోగెన్ సర్వలోకంబులన్
. 484


తరువాతది నాల్గవ పద్యం.
శా
.
దర్పస్వీకృతహాస విశ్లథనరుంద్దుష్టవాగ్ధోరణీ
సర్పద్వీరచమూ పథశ్లథనమై స్రంసత్కటీ శాటికా

కూర్పాస ప్రకటోగ్ర సాధ్వసవధూగుర్విణ్య భద్రాధ్వమై

దర్పాడంబరమై ధనుస్సు మొఱసెన్ దైతేయలోకంబులన్
.306

ఈ పద్యం అధ్యాయంలోని చివరి పద్యం. శైవ వైష్ణవ చాపాల ధ్వనిని గురించి వ్రాసినది.
శా.
దర్పస్వీకృతహాస సంశ్లథన రుంధద్దుష్టవాగ్ధోరణీ
సర్ప ద్వీరచమూపథ శ్ల థనమై స్రంసత్క టీ శాటికా

కూర్పాస ప్రకటోగ్ర సాధ్వ సవధూగుర్విణ్యభద్రాధ్వమై

దర్పాడంబరమై ధనుస్సు మొఱసెన్ దైతేయలోకంబులన్
.507

చివదిదైన ఐదవ పద్యం.
శా.
స్ఫీ తాష్టాపదవిద్యుదుజ్జ్వల పయఃపీయుషధారాధునీ
నీతాస్వాద్యతర ప్రగల్భవచన స్నిగ్ధాననాంభోజ సం

ధా తీర్థాకృతి మాగధోల్భణము నానామేదినీరాట్సభా

గీతిస్వాదు మనోజ్ఞ మై ధనువు మ్రోగెన్ రాజలోకంబులన్
. 307

సీతారామ కల్యాణానికి ముందురోజు చెప్పిన చివరి పద్యం ఇది.
శా
.
స్ఫీ తాష్టాపద విద్యుదుజ్జ్వల పయఃపీయుష ధారాధునీ
నీతాస్వాద్యతర ప్రగల్భ వచన స్నిగ్ధాననాంభోజ సం

ధాతీర్థాకృతిమాగధోల్భణము నానామేదినీరాట్సభా

గీతిస్వాదుమనోజ్ఞ మై ధనువు మ్రోగెన్ రాజలోకంబులన్. 376


భైరవభట్ల కామేశ్వరరావు గారు, తాడేపల్లి గారు,రాఘవ గారు, ఇంకా ఆచార్య ఫణీంద్ర గారు మొదలైన పెద్దలెవరైనా నా సహాయానికి రాగలరని పై పద్యాలకు అర్థవివరణ చేసి నాకానందం కలిగిస్తారని ఆశిస్తూ ఈ టపా నిక్కడతో ముగిస్తున్నాను.

1 comments:

రాఘవ said...

బాలకృష్ణమూర్తిగారూ, ఈ ఐదు పద్యాలలో నాకు అర్థమైనది ఇక్కడ వ్రాసాను, చూడండి. నెనరులు.

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks