నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

Jun 9, 2009

కూరిములే కదవమ్మ కోపమయ్యీని కడు-

కాంభోది
కూరిములే కదవమ్మ కోపమయ్యీని కడు-
భారమైన పోటుగాదా పచ్చిదేరే పలుకు. IIపల్లవిII

పున్నమచందురుని తోఁబుట్టుగైన నీమోము-
వెన్నెలలే కదవమ్మ వేఁచఁజొచ్చీని
పన్నిన పగల వెలుపటివారికంటెను
ఎన్న రాని పగగాదా యింటిలోనిపోరు. IIకూరిII

చిత్తజుని జనియించఁ జేసే మొక్కలపు నీ-
చిత్తమిదే కదవమ్మ సిగ్గు వాపీని
మిత్తివలెఁ జెలరేఁగి మీఁదఁ గాసే యెండకంటే
నెత్తిమీఁది చిచ్చుగాదా నీడలోని యెండ. IIకూరిII

కట్టఁగడ చందనపుగాలికి మీరిన నీ-
నిట్టూరుపులేకావా నిగ్గుదేరీని
యిట్టె యివె తిరువేంకటేశుఁగూడఁబట్టి నీకు
చుట్టపుఁబగలే మంచిచుట్టములై నవి. IIకూరిII 5-199

0 comments

Jun 7, 2009

అబ్బురంపు శిశువు ఆకుమీఁదిశిశువు

Get this widget | Track details | eSnips Social DNA


మంగళకౌశిక
అబ్బురంపు శిశువు ఆకుమీఁదిశిశువు
దొబ్బుడు రోలశిశువు త్ప్రువి త్ప్రువి త్ప్రువి. IIపల్లవిII

పుట్టు శంఖుచక్రములఁ బుట్టిన యాశిశువు
పుట్టక తోల్లే మారుపుట్టు వైన శిశువు
వొట్టుక పాలువెన్నలు నోలలాడు శిశువు
తొట్టెలలోని శిశువు త్ప్రువి త్ప్రువి త్ప్రువి. IIఅబ్బుII

నిండిన బండి దన్నిన చిన్ని శిశువు
అండవారిమదమెల్ల నణఁచిన శిశువు
కొండలంతేశసురులఁ గొట్టిన యా శిశువు
దుండగంపు శిశువు త్ప్రువి త్ప్రువి త్ప్రువి. IIఅబ్బుII

వేఁగైన వేంకటగిరి వెలసిన శిశువు
కౌఁగిటి యిందిర దొలఁగని శిశువు
ఆఁగి పాలజలధిలో నందమైన పెనుఁబాము
తూఁగుమంచము శిశువు త్ప్రువి త్ప్రువి త్ప్రువి. IIఅబ్బుII 5-220

0 comments

Jun 6, 2009

చెలియకు విరహపు వేదన చేయని సింగారంబిది

నాదరామక్రియ
చెలియకు విరహపు వేదన చేయని సింగారంబిది
సొలవక వలపుల ముద్రల చొప్పులు మాపకుఁడీ. IIపల్లవిII

కిక్కిరిసిన చనుగుబ్బలు గీఁటిన పగిలెడి నయ్యో
పక్కనఁ గనుకలి దాఁకీ బయ్యెద దెరవకుఁడీ
వెక్కసమగు ముఖకాంతికి వెడవెడ మరుఁగై తోఁచెడి
చెక్కుల చెమటలు గందెడి చేతులు వెట్టకుఁడీ. IIచెలిII

అంగన మేనికిఁ బులకలు అడ్డము దోఁచెడి నయ్యో
బంగరు మొలకలవంటివి పై పైఁ దుడువకుఁడీ
తొంగలి రెప్పల కెలఁకుల తొరిగెడి కన్నుల మెరుఁగుల
ముంగిట వేసిన చూపుల మురిపెము మానుపుఁడీ(?) IIచెలిII

తిరువేంకటపతి నింతికిఁ దెచ్చెదమనఁగా నయ్యో
కరుణించిన వాఁడాతఁడె కళవళమందకుఁడీ
తరుణీమణి మా దేవునిఁ దగఁ గౌఁగిట సౌఖ్యంబుల
పరవశమందినదేమో పలుమరుఁ బిలువకుఁడీ. IIచెలిII 5-80

2 comments

Jun 4, 2009

రావే కోడల రట్టడి కోడల

Get this widget | Track details | eSnips Social DNA


పాడి
రావే కోడల రట్టడి కోడల
పోవే పోవే అత్తయ్యా, పొందులు నీతోఁ జాలును. IIపల్లవిII

రంకెలు వేయుచు రాజులెదుట నీవు
కొంకు గొసరు లేని కోడల
పంకజముఖి నీవు పలుదొడ్డవారిండ్ల
అంకెలఁ దిరిగేవు అత్తయ్యా. IIరావేII

ఈడాడ నలుగురు నేగురు మొగలతో
కూడి సిగ్గులేని కోడల
వాడకుఁ బదుగురి వలపించుకొని నీవు
ఆడాడఁ దిరిగేవు అత్తయ్యా. IIరావేII

బొడ్డునఁ బుట్టిన పూఁపనికే నిన్ను
గొడ్డేరు తెస్తినే కోడల
గుడ్డముపయినున్న కోనేటిరాయని-
నడ్డగించుకొంటి వత్తయ్యా. IIరావేII 5-313

0 comments

Jun 3, 2009

నల్లనిమేని నగవు చూపులవాఁడు

http://www.esnips.com/doc/32d3c7cd-f515-4a30-bc6d-6a6fbcebf950/NALLANI-MENI-NAGAVU-CHOOPULA-VAADU

నాట
నల్లనిమేని నగవు చూపులవాఁడు
తెల్లని కన్నుల దేవుఁడు. IIపల్లవిII

బిరుసైన దనుజుల పీచమణఁచినట్టి-

తిరుపుఁ గై దువతోడి దేవుఁడు
చరిఁబడ్డ జగమెల్లఁ జక్కఁ జాయకుఁ దెచ్చి

తెరువు చూపినట్టి దేవుఁడు IIనల్లనిII


నీటఁ గలసినట్టి నిండిన చదువులు
తేటపరచినట్టి దేవుఁడు
పాటి మాలినట్టి ప్రాణుల దురితపు-

తీఁట వాపినట్టి దేవుఁడు. IIనల్లనిII


గురుతు వెట్టఁగరాని గుణముల నెలకొన్న-

తిరువేంకటాద్రిపై దేవుఁడు

తిరముగ ధృవునికి దివ్యపదంబిచ్చి

తెరచి రాజన్నట్టి దేవుఁడు. IIనల్లనిII 5-244

3 comments

May 29, 2009

నాకుఁ జెప్పరె వలపు నలుపో తెలుపో

శంకరాభరణం
నాకుఁ జెప్పరె వలపు నలుపో తెలుపో
నూకి పోవఁగరాదు నుయ్యో కొండో. II పల్లవిII


పొలఁతి మరునికి వెరవ పులియో యెలువో
వులుకుఁ దుమ్మిదమోఁత వురుమో మెరుమో

తిలకింపఁ జందనము తేలో పామో

యెలమిఁ గోవిలకూఁత యేదో పోదో. IIనాకుII


పొదలిన చలిగాలి పొగయో వగయో

వదలిన కన్నీరు వాఁగో వంతో
వుదరమునఁ బన్నీరు వుడుకో మిడుకో

యెదుటఁ దలవంచుకొను టెగ్గో సిగ్గో. IIనాకుII


అసమసరుపై పరపు టదనో పదనో
పసగలవానిమోవి పంచదారో తేనో
అసమగతి వానిరాక ఆదో పాదో
రసికు వేంకటేశు పొందు రాజ్యమో లక్ష్మో. IIనాకుII 5-193

0 comments

May 20, 2009

మొదటి సంవత్సరం పూర్తి

ఈ బ్లాగు తన మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్నది.
దీనిలో ఎక్కువగా అన్నమయ్య సంకీర్తనలు, శ్రీమదాంధ్రభాగవతం లోని దశమ స్కంధం- కొన్ని ఘట్టాలు, కరుణశ్రీ గారి పద్యాలు కొన్ని, ముత్యాల సరాలు, నేను కొత్తగా బ్లాగ్ ముఖంగా నేర్చుకుని ఎన్నికల సందర్భంగా వ్రాసిన పద్యాలు కొన్ని, ఇతర తాళ్ళపాక కవుల సంకీర్తనలు , ఉత్పలమాలికలు ఒకటి రెండు ఇలా ఇలా పాఠకులకు నచ్చుతాయనుకున్నవి నాకు నచ్చినవి నేను మెచ్చినవి కలగలిపి పోస్టుచెయ్యటం జరిగింది. దాదాపు ౨౫౦ పోస్టులవరకూ పూర్తయినవి.
ఈ బ్లాగు మాత్రమే కాకుండా ఇంకో ౫ బ్లాగులు కూడా ఈ సంవత్సరంలో మొదలు పెట్టాను. వాటిలో కూడా ఒకోదానిలో సుమారు ౯౦ నుండి ౧౦౦ వరకూ పోస్టులు పోస్టు చెయ్యటం జరిగింది. ఈ మధ్యనే ప్రారంభించిన శ్రీమదాంధ్రమహాభారతం కూడా ౮౦ నుంచి ౯౦ పోస్టుల మధ్య నడుస్తూ బ్లాగరులను సంతోషపెడుతున్నట్లుగా తెలుస్తోంది. నా బ్లాగులను వ్రాతలను చదువుతూ అప్పుడప్పుడూ తమ తమ అభిప్రాయాలను తెలియపరుస్తూ నాకు ఉత్సాహాన్ని కలిగిస్తున్న బ్లాగ్మిత్రులందరికీ నా శత సహస్ర ధన్యవాదాలు ఈ బ్లాగ్ముఖంగా తెలియజేసుకుంటున్నాను.
ప్రేమతో ---- మీ మల్లిన నరసింహారావు

7 comments

మదము దొలఁకెడి యట్టి మంచివయసున మనకు

సామంతం
మదము దొలఁకెడి యట్టి మంచివయసున మనకు
తుదలేని వేడుకలు దొరకుటెన్నఁడురా IIపల్లవిII

ఉదుటుఁ జనుదోయి నీ వురముపైఁ దనివార-
నదిమి మోమును మోము నలమి యలమి
వదలై న నీవితో వాలుఁగన్నుల జంకె-
లొదవ నీ మీఁద నొరగుటెన్నఁడురా. IIమదముII

కలికితనమునఁ నాదు కప్పురపుఁ దమ్ములము
కులికి నీ వదనమునఁ గుమ్మరించి
పలచనగు గోళ్ళ నీ పగడవాతెర నొక్కి
చెలువమగు నునుగంటి సేయు టెన్నఁడురా. IIమదముII

గరగరని కురులతో కస్తూరివాసనలు
విరితావులతోడ విసరఁగాను
తిరువేంకటాచలాధిపుఁడ నినుఁ గూడి నే-
నరమరచి సదమదము లౌట యెన్నఁడురా. IIమదముII ౫-౫౪

0 comments

Apr 25, 2009

చెల్లఁబో నీ చెప్పినట్టు సేయ నైతినా వోరి

వరాళి
చెల్లఁబో నీ చెప్పినట్టు సేయ నైతినా వోరి
కల్లతో నిజ మోపదు కల దింతే కాక. IIపల్లవిII

కోపగించుకొన నేల కోరి వేఁడుకొన నేల
యేపున నిట్టె రెండూ యెడ్డతనమే
పై పై చేఁదు దిన నేల పంచదార నంజ నేల
పూపవయసులవారి పుణ్య మింతే కాక. IIచెల్లఁబోII

అట్టె కల్ల లాడ నేల ఆనలు వెట్టుకో నేల
యెట్టివారి కైన యివి యెడ్డతనమే
మెట్టి చలిఁ బడ నేల మించి సీతు గాయ నేల
పట్టి వలచినవారి భాగ్యమింతే కాక. IIచెల్లఁబోII

చలము సాధించ నేల సారెకు వగవ నేల
యెలమితో నివి రెండు యెడ్డతనమే
పిలిచి శ్రీవేంకటేశ పెనఁగి నన్నుఁ గూడితి
పలుకుఁబంతాన నీ నా బలు వింతే కాక. IIచెల్లఁబోII ౧౧-౨౫౩

0 comments

Apr 16, 2009

సవతైనా నాపె మేలు సరి నీకంటె

శుద్ధవసంతం
సవతైనా నాపె మేలు సరి నీకంటె
అవల నాపె చెప్పినఅట్టె సేయవయ్యా. IIపల్లవిII

యేపున నన్ను మన్నించి యేమిసేయవలసిన-
నాపెనే యేకతమున నడుగవయ్యా
దాపుగ నాఁడుజాతికి దయగల దెప్పుడును
మాపుదాఁకా మగవాఁడు మత్తుఁడే యెంచఁగను. IIసవII

నేరుపున నీవు నాతో నెత్తమాడవలసిన
కోరి యాపె నొద్దఁ బెట్టుకొనవయ్యా
ఆరితేరినాఁడువారి కాఁడువారే తోడునీడ
గారవపుమగవాఁడు కపటే యెపుడు. IIసవII

శ్రీవేంకటేశ్వర నన్నుఁ జేకొని కూడితి విట్టె
యేవేళ నలమేల్మంగ కియ్యకోలయ్యా
కైవశమై ఆఁడువారు కనిపించేయట్టివారు
వావులనే మగవారు వంతువా సెఱఁగరు. IIసవII ౨౦-౩౨౬

అడవారి కాడవారే నమ్మదగిన తోడూ నీడా -- కాని మగవాడు కాడెంతమాత్రం కాడు.--తోటి స్త్రీ తనకు సవితె అయినా కాని మగవాడైన తన పతికంటే కూడా ఆమే మంచి నమ్మకస్తురాలని చెప్పే అరుదైన సంకీర్తన యిది.

0 comments

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks