వరాళి
చెల్లఁబో నీ చెప్పినట్టు సేయ నైతినా వోరి
కల్లతో నిజ మోపదు కల దింతే కాక. IIపల్లవిII
కోపగించుకొన నేల కోరి వేఁడుకొన నేల
యేపున నిట్టె రెండూ యెడ్డతనమే
పై పై చేఁదు దిన నేల పంచదార నంజ నేల
పూపవయసులవారి పుణ్య మింతే కాక. IIచెల్లఁబోII
అట్టె కల్ల లాడ నేల ఆనలు వెట్టుకో నేల
యెట్టివారి కైన యివి యెడ్డతనమే
మెట్టి చలిఁ బడ నేల మించి సీతు గాయ నేల
పట్టి వలచినవారి భాగ్యమింతే కాక. IIచెల్లఁబోII
చలము సాధించ నేల సారెకు వగవ నేల
యెలమితో నివి రెండు యెడ్డతనమే
పిలిచి శ్రీవేంకటేశ పెనఁగి నన్నుఁ గూడితి
పలుకుఁబంతాన నీ నా బలు వింతే కాక. IIచెల్లఁబోII ౧౧-౨౫౩
ప్రాచీనగాథలు ముందుమాట
13 hours ago
0 comments:
Post a Comment