నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

Feb 21, 2014

వర్ణన రత్నాకరము - వేశ్యలు - పాండురంగ మహాత్మ్యము - తెనాలి రామలింగ కవి

వర్ణన రత్నాకరము - వేశ్యలు - పాండురంగ మహాత్మ్యము - తెనాలి రామలింగ కవి

సీ.
మొలక చీకటి జలజల రాల్పగా రాదె, నెఱులు మించిన వీరి కురులయందు
కెరలించి యద్భుతంబు గిలకొట్టఁ గా రాదె, ముద్దు చూపెడి వీరి మోవులందు
పచ్చ బంగారు కుప్పలు సేయఁగా రాదె, గబ్బి మీఱిన వీరి గుబ్బలందు
పండువెన్నెల తేటఁ బరిఢవింపఁగ రాదె, నగవు గుల్కెడి వీరి మొగములందు
గీ.
నౌర కరవాఁడి చూపుల యౌఘళంబు, బాపురే భూరి కటి తటీ భార మహిమ
చాగు మద మందగమనలక్షణములనఁగ, నేరుపులమింతు రప్పురి వారసతులు.
                                         
                                                     పాండురంగ మహాత్మ్యము - అ.1, పద్య 117
    
  

0 comments

వర్ణన రత్నాకరము - క్షత్రియులు - ఆముక్త మాల్యద - మొల్ల రామాయణము

వర్ణన రత్నాకరము - క్షత్రియులు - ఆముక్త మాల్యద - మొల్ల రామాయణము

చ.
ఉరువడిఁ బోరికై కవచ మొల్లరు మంత్రములందు దక్క సు
స్థిర నిజశక్తి నైదు పది సేయరు ద్గత్తినఁ దక్క మంటికై
పొదల రధీశుఁ డీ కమల బుద్ధి ఖళూరిక దక్క వజ్రదోః
పరిఖవశీకృతాన్య నరపాలకు లప్పురి రాకుమారకుల్.
                                ఆముక్తమాల్యద అ.2, పద్య 25.
కవచము=
1. Armour, a cover, a leather cover or case
 మంత్రకవచము an amulet, a prayer or phylactery for the safety of the body.




ఉ.
రాజులు కాంతి యందు రతి రాజులు రూపమునందు వాహినీ 
రాజులు దానమందు మృగరాజులు విక్రమకేళి యందు గో
రాజులు భోగమందు దినరాజులు సంతత తేజమందు రా
రాజులు మానమందు నగరమ్మున రాజకుమారు లందఱున్.
                                        మొల్లరామాయణము - బాల. పద్య 35.
ఎంతో ఇష్టమయిన పద్యాలలో ఇది ఒకటి.
 

 

 

0 comments

Feb 20, 2014

వర్ణన రత్నాకరము - సౌధ వర్ణనము - విజయ విలాసము - చేమకూర వెంకటకవి

వర్ణన రత్నాకరము - సౌధ వర్ణనము - విజయ విలాసము - చేమకూర వెంకటకవి 

 పున్నమరేలఁ దత్పురము పొంతనె పో శిఖరాళిఁ దాకి 
వి చ్చిన్నగతిన్ సుధారసము చింది పయిం దిగువాఱ నంత నుం
డి న్నెల సన్నగిల్లు నది నిక్కము గాదని రేని యా పదా 
ర్వన్నె పసిండి మేడలకు రాఁ బని యే మిల సౌధనామముల్.

ఆహా! ఎంత అందమైన ఊహ!!
పున్నమనాటి రాత్రులందు చందమామ ఆ పట్టణం  గుండా పోతున్నప్పుడు ఆ చెంతన ఉన్న ఎత్తైన శిఖరాల్నితాకడం వల్ల కాబోలు ఆ చందమామకు చిల్లుపడి అందలి సుధ ఆ మేడలపై దిగజాఱటం చేత అప్పటినుండి చందమామ క్షీణ చంద్రుడిగా మారి ఉండి ఉండవచ్చు. ఇదే కనక నిజం కాకపోయినట్లయితే  ఆ నగరం లోని మేడలకు "సౌధములు" అనే పేరు వచ్చి ఉండేది కాదు గదా!

చేమకూరవారి కవిత్వంలోని అందచందాలకు ఈ పద్యం ఓ మచ్చు తునక.

మరో బంగారు  మొలక.
ఉ.
ప్రాయపు గాయకుల్ వెల నెపాన నెగాదిగఁ జూడ, ' నేర్పు లౌ 
రా యివి ! దండ మీఁదఁ గొసరం దొర కొంటిరి ! మంచి సాము లే
పో ! యిటు లైనచో సరసముల్ గద మీ కిపుడం' చు నప్పురిన్
గాయజు తూపు లమ్ముదురు కందువ మాటల పుష్పలావికల్ . 
                                                                                             విజయ విలాసము అ. 1 పద్య 79

0 comments

Feb 18, 2014

వర్ణన రత్నాకరము - స్త్రీ వర్ణనము - అచ్చ తెలుఁగు రామాయణము -కూచిమంచి తిమ్మకవి

వర్ణన రత్నాకరము - స్త్రీ వర్ణనము - అచ్చ తెలుఁగు రామాయణము -కూచిమంచి తిమ్మకవి

సీ.
తలిరు లేమావి  క్రొత్త జవాది బలు క్రోవి, వలపుల దీవి చెంగలువ బావి
ముగుదల మేల్బంతి సొగసుల దొంతి క్రొం, బొగడ బూబంతి యబ్బురపు టింతి
మానికమ్ములమూట మరుని గెల్పుల కోట, పండు వెన్నెల తేట పసిఁడి వేఁట
కపురంపు దిమ్మ చొక్కపుఁ దళ్కు కీల్బొమ్మ, మొల్లంపు దానిమ్మ ముద్దుగుమ్మ
గీ.
తేజుల కొటారు వలుద ముత్తియపుఁ బేరు, కడిఁది జగరంగు తొలకరి కార్మెఱుంగు
మనుపికిలిచెండు పరువంపుఁ బనసపండు, నాఁగఁ దగు నెన్న యన్నాతి మిన్న.

తలిరు = చిగురు, పల్లవము
బలు= బలువురూపాంతరము, బాగుగా
 క్రోవి=ఆసుపోసెడు గొట్టము, మూస, బుడ్డి
కొటారు =ధాన్యపు రాసులు ఉంచెడి చోటు, కొట్ట కొన, చివర
వలుద= లావు, స్థూలము
కడిఁద=ఆపద, అధికము, ఆవశ్యకము, కఠినము
జగరంగు= ఇది జడ రంగు అని నా అనుమానం. నివృత్తి చేసుకోవాల్సి ఉంది
మను= జీవించు
పికిలి చెండు= పికిలి పక్షి యొక్క జుట్టు
వృత్యను ప్రాస ఎంత అందంగా కుదిరిందో!

0 comments

Feb 17, 2014

వర్ణన రత్నాకరము - స్త్రీ ధర్మములు

వర్ణన రత్నాకరము - స్త్రీ ధర్మములు - జైమిని భారతము - పిల్లలమఱ్ఱి పినవీరభద్ర కవి

గీ.
బాల్యమునఁ దల్లిదండ్రులు ప్రాయమున ధ,వుండు వార్ధకమున నందనుండుఁ జెప్పి
నట్లు చెయంగ దగుఁ గాని యరసి చూడఁ, దెఱవలకు నెందుఁ దమయిచ్చఁ దిరుగఁ జనదు. అ 2, పద్య 37


వసు చరిత్రము - రామరాజభూషణుడు

ఉ.
తమ్ములఁ బంపుదున్ మణిసతమ్ములఁ బంపుదు రాజహంస పో మై
తమ్ములఁ బంపుదున్ బరిచితమ్ములఁ గానన దేవతాళి జా
తమ్ముఁల బంపుదున్ ద్రుతగతమ్ముల నే నును సారణీప్రపా
తమ్ముల వత్తు విశ్వవిదితా ముదితా మది తాప మేటికిన్. అ.6, పద్య 60

తారాశశాంక విజయము - శేషము వేంకటపతి 

 చ. 
అలుకలు దువ్వరాదు సరసాన్నములన్ భుజియింపరాదు
కలప మలందరాదు తిలకంబు రకంబుగ దిద్దరాదు సొ
మ్ములు గయి సేయరాదు సుమముల్ ధరియింపఁగ రాదు సాధ్వి యౌ
నలినదళాయతాక్షికిని నాథుఁడు చెంగట లేకయుండినన్. అ-2, పద్య 158
 


0 comments

Feb 16, 2014

వర్ణన రత్నాకరము - భాగవతము - బమ్మెర పోతన - స్త్రీధర్మములు

వర్ణన రత్నాకరము - భాగవతము - బమ్మెర పోతన - స్త్రీధర్మములు

శరద్రాత్రి యందు గోపికలు గానము చేసెడి శ్రీకృష్ణుని సన్నిధికి వచ్చే ఘట్టంలో ఆ గోపికలతో కృష్ణుడు వారిని వారిస్తూ చెప్పిన పలుకులు.
సీ. 
ప్రాణేశుఁ డెఱిఁగినఁ బ్రాణంబునకుఁ దెగు దండించు నెఱిఁగిన ధరణి విభుఁడు
మామ యెఱింగిన మనువెల్లఁ జెడిపోవుఁ దలవరి యెఱిఁగినఁ గులు సేయు
దలిదండ్రు లెఱిఁగిన దలలెత్తకుండుదు రేరా లెఱింగిన నెత్తివొడుచు
నాత్మజు లెఱిఁగిన నాదరింపరు చూచి బంధువు లెఱిఁగిన బలిసి చెఱుతు
ఆ.
రితరు లెఱిఁగి రేని నెంతయుఁ జులుకఁగాఁ, జూతు రిందు నందు సుఖము లేదు
యశము లేదు నిర్భయానందమును లేదు , జారుఁ జేరఁ జనదు చారుముఖికి.  10 పూర్వ.977
 పోతన గారి శైలి దాని అందం వర్ణింప నలవి కానివి. కదా!
 క.
నడవడి గొఱగాకున్నను, బడుఁ గైనఁ గురూపియైనఁ బామరుఁ డైనన్
జడుఁ డైన రోగి యైనను, విడుచుట మరియాద గాదు విభు నంగనకున్. స్కంద 10 పూర్వ, పద్య 978



నారదుడు ధర్మరాజుకు వర్ణాశ్రమ ధర్మాల్ని చెప్తూ శూద్ర ధర్మాల్ని వివరించే ఘట్టంలోని పద్యాలు.
సీ. 
నిలయము వాటించి నిర్మల దేహి యై, శృంగార మే ప్రొద్దుఁ జేయవలయు
సత్యప్రియాలాప చతుర యై ప్రాణేశు, చిత్తంబు ప్రేమ రంజింప వలయు
దాక్షిణ్య సంతోష ధర్మ మేధావుల , దైవత  మని ప్రియుఁ దలఁప వలయు
నాథుఁ డేపద్ధతి నడచు నా పద్దతి, నడచి సద్బంధుల నడప వలయు
ఆ.
మార్దవమునఁ బతికి మజ్జన భోజన, శయనపాన రతులు జరప వలయు
విభుఁడు పతితుఁ డైన వెలఁది పాతివ్రత్య, మహిమఁ బుణ్యు జేసి మనుప వలయు. 7-416
క.
తరుణి దన ప్రాణ వ ల్లభు, హరిభావముగా భజించి యతఁడును దానున్
సిరి కైవడి వర్తించును, హరిలోకమునందు సంతతానందమునన్. 7-417
క.
ఉపవాసంబులు వ్రతములుఁ, దపములు వేయేల భర్త దైవత మని ని
ష్కపటతఁ గొల్చిన సాధ్వికి, నృపవర! దుర్లభము లేదు నిఖిల జగములన్.  7-418

0 comments

వర్ణన రత్నాకరము -స్త్రీ ధర్మములు -శ్రీమదాంధ్ర మహా భారతము -నన్నయ - ఆదిపర్వము

వర్ణన రత్నాకరము -స్త్రీ ధర్మములు -శ్రీమదాంధ్ర మహా భారతము -నన్నయ - ఆదిపర్వము

పాండవులు లాక్షాగృహదహనం వలని అపాయన్నుండి బయటపడిన తర్వాత అడవులలో పరిభ్రమిస్తూ ఏకచక్రపురంలో ఓ బ్రాహ్మణుని ఇంట ప్రచ్ఛంన్నంగా గడుపుతున్న సమయంలో ఆ రోజు వారుంటున్న ఇంటి యజమాని గృహంలోనుంచి ఏడుపులు వినవస్తాయి.
క.
కృత మెఱుఁగుట పుణ్యము స, త్కృతి దానికి సమము సేఁత మధ్యమము మఱి త
త్కృతమున కగ్గలముగ స, త్కృతి సేయుట యత్తమంబు కృతబుద్ధులకున్. 6-244
అని కుంతి భీమునితోఅనగా భీముడు ఆపద ఏదైనా నేను తీర్చగలను అని అంటాడు. సరే విషయం కనుక్కుని వస్తానని కుంతి వారింటికి వెళ్తుంది.
అప్పుడు బకాసురునికి ఆహారంగా వెళ్ళటానికి వారింటి వంతు రావటం చేత ఆ యింటి యజమాని భార్యనుగాని, కొడుకును గాని,కూతురును గానీ పంపటానికి ఇష్టపడక తానే ఆహారంగా వెళ్ళటానికి నిశ్చయించు కుంటాడు. ఆ ఘట్టంలోఅప్పుడు బ్రాహ్మణునితో ఆతని భార్య ఈ విధంగా అంటుంది.
క. 
మనుజులకు నెవ్విధంబున, ననతిక్రమణీయ మైన యాపద్విషయం
బున సంతాపింపగాఁ, జన దని యెఱిఁగియును దగునె సంతాపింపన్. 254
వ.
ఆ రక్కసున కే నశనం బయ్యెద మీరు వగవ కుండుఁడు భార్యయందుఁ బడయం బడు నపత్యంబు(సంతానము) నాయందు మున్న పడసితి రేనును ఋణవిముక్త నయితిం బ్రాణవియోగంబు సేసి యయినను భార్య పతికి హితంబు సేయవలయు మఱి యట్లుంగాక .
ఆ.
పురుషుకంటె మున్ను పరలోక మే గిన, సతియ నోఁచినదియు సతులలోనఁ
బురుషహీన యైనఁ బరమపతివ్రత, యయ్యు జగము చేతఁ బ్రయ్యఁబడదె. 256
ఆ.
పడిన యామిషంబు పక్షు లపేక్షించు, నట్లు పురుషహీన యయినయువతిఁ
జూచి యెల్లవారుఁ జులుక నపేక్షింతు, రిదియుఁ బాప మనక హీనమతులు. 257
ఆ. 
సతి విముక్త యయినఁ బతికిఁ బునర్దార, సంగ్రహము సేఁత శాస్త్రమతము
పతి విముక్త యయినసతి కన్యపురుషు సం, గ్రహము సేఁత లోక గర్హితంబు. 258
అందుచేత నేనే బకాసురునికి ఆహారంగా వెళ్తానని బ్రాహ్మణి అంటుంది.

   
 

0 comments

Feb 15, 2014

వర్ణన రత్నాకరము - శ్రీమాదాంధ్ర మహాభారతము - తిక్కన సోమయాజి - అనుశాసనిక పర్వము - స్త్రీ ధర్మములు

వర్ణన రత్నాకరము - శ్రీమదాంధ్రమహాభారతము - తిక్కన సోమయాజి - అనుశాసనిక పర్వము - స్త్రీధర్మములు

పార్వతి శివునకుఁ బతివ్రతాధర్మంబుల తెఱఁ గెఱింగించుట
క.
వనితలుఁ బురుషులుఁ బ్రియమునఁ, దను వినుతింపంగ శైలతనయ సమాక
ర్ణన కౌతుకి యగు నీ శా, నునితో మృదురీతి ని ట్లనుం గమలేశా. అను.5-284
సీ.
ఋతుమతి కాక శుద్ధతయుఁ గల్గిన యింతి, కన్య తత్పరిణయకరణమునకు
నొడయులు విను  తల్లియును దండ్రి, తోఁ బుట్టినతఁడు మాతులుఁడు సోద
రుండును యోగ్యవరునిఁ జూచి వారిలో, నెవ్వరైనను బ్రీతి ని చ్చువారు
పతి యంతనుండియుఁ బ్రభువు దానికి నట్లు, కావున నాతండ దైవ మనుచు
తే.
నతనిమతమూఁది దేవతాపితృసమర్చ, నములు నతిథి పూజనము సన్మతి సమాచ
రించుచును బతిహితము పాటించి నడపు, సతి పతివ్రత యిహపరసౌఖ్యమహిత. 283
వ .
ఏతద్విషయం బయిన యొక్క నిదర్శనం బవధరింపుము. 284
సీ.
బ్రాహ్మణుఁ డొకనికి భార్యలిద్దఱు కల రం దొకభామిని యతనిహితము
నడపెడునవధాన మెడలి యాతఁడు పంపకయుఁ దాన సురపితృ కార్యపరత
నడచుఁ దక్కటి యింతి నాథుఁ బాటించు చుఁ దన్మతంబునఁ జేయు ధర్మవిధులు
వారు మువ్వురు విధివశమున నొక్కట మృతిఁ బొంది రాపతివ్రత వరుండు
తే.
చనిన సుగతికిఁ జనెఁ బెరవనిత జముఁడు
నీకుఁ బో లేదు మరలుము నీశరీర
మునక యని యాఁగె నది శోకముల సబాష్ప
యైనఁ గన్గొని యతఁడు దయార్ద్రుఁ డగుచు. 287
క.
పతిమతముఁ గొనక ధర్మము, నతివ నడపు టొప్ప దింక నైనను బతికిన్
హితము లగువానిం జేసిన, నతనిఁ గలయు దనినఁ జనియె నదియును మరలన్. 288
 వ.
కావునం బతికి ననువ్రత యగుట గృహిణికి ధర్మం బని పలికి వెండియు. 289
క.
లలన యిలువాడి నాథుఁడు, వలచిన చవివంటకములు వండి యిడి తనుం
గలయఁ దలంచిన మెయికొని, యెలమిం గై సేసి హృదయ మీవలయు శివా. 290
ఇలువాడి=మంచినడత కలిగి 
తే.
పనులయెడ మాఱు పలుకక యనవధానుఁ, డైన పతిఁ దలఁపించి ధర్మార్థకలిత
కృతులు నడపుచు సవతి కల్గినను బోరి, తంబు లే కొక్కటై యున్కి తగవు సతికి. 290
అనవధానుడు = పరాకుగలవాడు
క.
సవతాలికిఁ బతి వలచిన, నవుఁ గా కని యతని యిచ్చ కను రూపముగాఁ
దివిరి నడచు సతి దైవము, శివయది తగు నెల్లజనముచే మ్రొక్కుకొనన్. 291
క.
తనచేతికి నిచ్చిన వ,స్తునికాయము నిల్లడమున చొప్పున మగుడం
గొని వచ్చి పతి తె, మ్మని నప్పుడ యిచ్చు టొప్పునకపటవృత్తిన్. 293
క.
పతి తనకు నేమి యిచ్చిన, నతిముదమునఁ బొంద వలయు నా త్మజుఁ డైనన్
మతిఁ గొంకక యేకాంత, స్థితి నేకాసనత నున్కి చెట్ట ప్రమదకున్. 294
క.
ధని యధనుఁడు రూపసి యొ,ప్పనివాఁ డవివేకి మూఢ భావుఁ డరోగుం
డనుగతరోగుఁ డనక యం,గన పతిఁ బాటింప వలయుఁ గామధ్వంసీ. 295
క.
బలి భిక్షము కడప  కిడ, న్వలయును దేవపితృపూజనంబులకాలం
బులఁ బతి శుభ మందుటఁ ద, త్ఫలంబు గాఁ గోరు టొప్పిదము సతికి శివా. 296
క.
గతి పతియ చువ్వె భార్యకు, నతనిఁ గడచినట్టి సత్పరాయణము కృపా
యుత కలదే కావునఁ దా, నతనికి భక్తి యగు టిచ్చు నఖిలశుభంబుల్.297 



అష్టావక్ర చరిత్రము నుండి.
తే.
బాల్యమునఁ దండ్రి యౌవనప్రాప్తి మగఁడు, వార్థకంబునఁ దనయుఁడు వామనయన
నరసి నడపన కా దెందు నంగనలకు, వలసినట్టులు చేయఁగా వచ్చునెట్లు. అను -2-22
          అష్టావక్రుని చరిత్రలో ఉత్తరదిశ స్త్రీ రూపంలో వచ్చి అష్టావక్రుని వశం చేసుకోవటానికి ప్రయత్నించే       ఘట్టంలో ఆమెను వారిస్తూ అష్టావక్రుడు పలికిన మాటలు.

శాంతి పర్వంలో ధర్మరాజు భీష్మపితామహుని "అంగనల సమాచారంబులు  వినంగ వలతు, చెప్పవే" అని అడుగుతాడు. అప్పు డతనికి భీష్ముడు కైకేయీ శాండిలీ సంవాదం గుఱించి వివరిస్తాడు. సుమన యనబడే కైకేయి అమరపురంలో ఉన్న శాండిలిని చూచి భవ్యమైన ఇంద్రలోక పదవి నీకు ఎలా లభించింది అని అడగ్గా ఆమె కైకేయికి ఈ క్రింది విధంగా జవాబు చెపుతుంది.

సీ.
మామకు నత్తకు మార్పల్క దేవపిత్ర తిథి పూజనములయందు సొలయ
నిలువడిఁ దలవాకి లెప్పుడు నెఱుఁగక పెలుచ నవ్వక శుద్ధి వెలయ విప్ర
భిక్ష యోపిక గల్గి పెట్టుచు వర్తింతు వలయు కార్యములకు వెలఁది మగుడఁ
బతి వచ్చునప్పుడు భక్తియు వేడ్కయుఁ బొదల నాసనపాద్యములను సుముఖ
ఆ.
భావమునను సేవ పాటింతు బిడ్డల, శిక్ష వదలఁ దిట్టఁ బెట్టఁ గనియు
నాకు వేఱ ప్రియ మనఁగ లేదు పతి మెచ్చు, వంటకములు చవిగ వండియిడుదు. అను-4-358
సొలయన్= వైముఖ్యము నొందను, నిలువడిన్= మంచి నడవడిచే.

చ.
వరుఁ డొకవెంట నెన్నఁడు ప్రవాసగతుం డగు నాఁటగోలె న
ప్పురుషుఁడు వచ్చునంతకును బూవులు పూఁతలు మేలిచీర లా
భరణము లెక్కుడుం జవులపాకవిశేషము లాదరింప నె
ప్పరుసునఁ గొల్చి కూడు గురు బంధులకుం దగ నెమ్మి చల్పుదున్. 359
క.
గోవులు మొద లగు తిర్య, గ్జీవుల సుఖవృత్తు లరసి చెల్లింతు గృహ
శ్రీవ  ర్తనంబునకుఁబతి, భావము సంకటపడంగఁ బలుక నొటియున్. 360
తే.
అగ్ని యోపి రక్షింతు రహస్య మైన
దాని వెలిపుచ్చ గర్భంబు దాల్చి యున్న
యపుడు వాచవు లెల్లను నవులఁ బెట్టి
దాని కెయ్యవి పథ్యముల్ వానిఁ గొందు. 361
క.
అని చెప్పి యట్టి చందం,బున నడచిన సతికి లోకములు రెండును సౌ
ఖ్యనిరూఢి యొసఁగుఁ బొగ డొం,దు నరుంధతివోలె నవ్వధూటి నరేంద్రా. 362
క.
నృప యీ యాఖ్యానము ప, ర్వపుదినమున భక్తిఁ జదువువారలు విను పు
ణ్యపురుషులును నాయుశ్శ్రీ, లపరిమితము లొంది యమరు లగుదురు పిదపన్. 363



0 comments

Feb 14, 2014

వర్ణన రత్నాకరము -స్రీ ధర్మములు - భారతము -అరణ్య పర్వము - సత్యాద్రౌపదీ సంవాదము

వర్ణన రత్నాకరము -స్రీ ధర్మములు - భారతము - అరణ్య పర్వము - సత్యాద్రౌపదీ సంవాదము

క.
పతి మనసు నాఁ చికొనియెడు, చతురోపాయంబు నీకుఁ జపలాక్షి సుని
శ్చితమతిఁ జెప్పెద విను మూ,ర్జితమును ధర్మాన్వితము సుశీలంబును గాన్. 5.313

సత్యభామను  ద్రౌపది చపలాక్షి అని సంబోధించటం చాలా బాగున్నది. సత్యభామ ఆమెతో అన్న పలుకులు ఆమెచేత అలా సంభోదింప చేసాయి. ఆచికొనియెడు = ఆకర్షించు
చ.
పతిఁ గడవంగ దైవతము భామల కెందును లేదు ప్రీతుఁ డై
పతి కరుణించెనేనిఁ గలభాషిణి భాసుర భూషణాంబ రా
న్వితధనధాన్య గౌరవము విశృత సంతతియున్ యశంబు స
ద్గతియును గల్గు నొండు మెయిఁ గల్గునె యిన్ని తెఱంగు లారయన్. 5.314
కడవంగన్= మించి, కలభాషిణి = మధురముగఁ పలుకుదానా 
ఆ.
కరము దుఃఖపడినఁ గాని యొక్కింత సౌ, ఖ్యంబు ధర్మగతియుఁ గలుగ దెందుఁ
జూడు మబల భర్తృశుశ్రూష ఫలము సం, తతసుఖంబు నంద ధర్ము వొదవు. 5.315
అబల అనే సంబోధన కూడా సాభిప్రాయంగానే వాడింది ద్రౌపది.
క.
కావున నిత్యము సమ్య, గ్భావము ప్రేమంబు వెరవు భక్తియుఁ బ్రియముం
గావింపుము నీ ప్రియు నెడ, భావ మెఱిఁగి  యతఁడు తాన పై బడి మరగున్. 5.316
మ.
వనజాక్షుండు కడంగి నీ దగు గృహద్వారంబు చేరంగ వ
చ్చె ననంగా విని లెమ్ము సంభ్రమముతోఁ జె న్నొందు నభ్యంతరం
బునకున్ వచ్చిన నాసనాదికరణంబుల్ దీర్ప ద త్తజ్జనం
బు నియోగించితి నంచు నుండక ప్రియంబుల్ చేయు మీవుఁ దగన్. 5.317
చ.
తివిరి మురారి నీకుఁ గడుఁ దీపుగఁ జెప్పిన పల్కు గల్గినం
గువలయనేత్ర నీ మనసుగూడినవారికి నైన నెప్డుఁ జె
ప్ప వలదు దాన నొండొక నెపంబు ఘటింతు రెఱింగి రేని నీ
సవతులు కృష్ణుబుద్ధి విరసం బగు నీ దెసఁ దత్ప్రయుక్తి చేన్. 5.318

తివిరి= ప్రియపడి
చ.
 పతికి ననుంగు లై న తగుబంధుల మిత్రుల భోజనాది స
త్కృతముల నాదరించుచు నకృతిమ భక్తి విశేష సంతతో
త్థితమతి వై చరింపుము తదీయ హితేతర వృత్తు లైన వా
రతివ భవత్సుహృజ్జనంబు లైనను గైకొన కుండు మెప్పుడున్. 5.319,
క.
విను ప్రద్యుమ్నాది భవ, త్తనయులయెడ నైన నేకతంబున నేకా
సనమున నుండుట దూష్యం, బని యెఱుఁగుము సతుల చరిత లతి దుష్కరముల్. 5.320
క.
కులవతులును సతులును ని, ర్మల మతులును నయిన యట్టి మగువల తోడం
జెలిమి యొనరించునది దు, ర్విలసిత వనితాభియుక్తి విడువుము తరుణీ.5.321

దుర్విలసితవనితాభియుక్తిన్ = దుష్టస్త్రీల స్నేహము

పతివ్రతా ధర్మం అంటే అంత క్లిష్టమయిందన్న మాట.
 

0 comments

వర్ణన రత్నాకరము - స్త్రీ ధర్మములు - శ్రీమదాంధ్ర మహా భారతము - నన్నయ

వర్ణన రత్నాకరము - స్త్రీ ధర్మములు - శ్రీమదాంధ్ర మహా భారతము - నన్నయ

సీ.
ఇది యాదిగా సతు లెన్నండుఁ బరపురుషార్థినుల్ గాఁ జన దన్యపురుష
సంగమంబునఁ జేసి సకల పాతకములు నగుఁ బరిగ్రహభూతలయిన సతుల
కిట్టిద మర్యాద యిమ్మనుష్యుల కెల్లఁ, జేసితి లోక ప్రసిద్ధి గాఁగ
నని ధర్మ్య మైన మర్యాద మానవులకుఁ దద్దయు హితముగా ధర్మమూర్తి
ఆ.వె.
యబ్జభవ సమానుఁ డగు శ్వేతకేతుండు, నిలిపె నదియు ధారుణీ జనంబు
నందు లోకపూజ్యమై ప్రవర్తిల్లుచు , నుండె శిష్ట సం ప్రయుక్తిఁ జేసి.

పరిగ్రహభూతలు= వివాహితలు
మర్యాద=కట్టుపాటు 
వ.
మఱియుఁ దిర్యగ్యోనులయందును ను త్తరకురుదేశంబులయందును మొదలింటి ధర్మంబ యిప్పుడుం బ్రవర్తిల్లుచుండు నట్లు మనుష్యులయందు శ్వేతకేతుఁడు సేసిన ధర్మస్థితి కారణంబున నాటంగోలె.

తిర్యగ్యోనులయందు= పశుపక్ష్యాది గర్భములయందు 
క.
పురుషులచే ధర్మస్థితిఁ, బరిగ్రహింపంగఁ బడిన భార్యలకు నిరం
తరము నిజపురుష భక్తియుఁ, బరపురుష విసర్జనంబుఁ బరిచిత మయ్యెన్.
క.
భర్త చేత నియోగింపఁ బడక సతికి, నెద్దియును జేయఁ గాఁ దగ దెద్ది యైన
భర్త చేత నియోగింపఁ బడిన దానిఁ, జేయ కునికి దోషం బని చెప్పె మనువు.
                                                                                                        ఆది పర్వము పంచ. 85,86,87,88.

ఈ విషయం వ్యుషితాశ్వుం డనే రాజు చరిత్ర లోనిది. పాండురాజుకు శాపకారణముగా సంతానం కలగనప్పుడు కుంతికి పాండురాజుకు జరిగిన సంభాషణలో భాగంగా కుంతి పాండురాజుతో ఈ చరిత్రను చెబుతుంది. వ్యుషితాశ్వుడనే రాజు భద్ర అనే తన భార్యతో అనవరత కామాశక్తిం జేసి క్షయరోగాన్ని పొంది సంతాన హీనుడుగా మరణిస్తాడు. అప్పు డతని భార్య అతని శవాన్ని కౌగలించుకొని సంతానం లేదని దుఃఖిస్తుండగా ఆతని శరీరం నుండి అశరీరవాణి రూపంలో పుత్త్రులు కలుగుతారని వినిపిస్తుంది. ఋతుమతి యైన 8వ రోజున గాని 14వరోజునగాని శుచిగా శయనించి తనను తలిస్తే సంతానం (అశరీరవాణిగా )కలుగుతుందని చెప్తుంది. ఆ విధంగా ఆమె 7గురు సంతానాన్ని పొందుతుంది. అలా సంతానం పొందవచ్చని చెప్పిన కుంతికి పాండురాజు ధర్మ్యంబైన ఓ పురాణ కథనీ విధంగా చెప్తాడు. పూర్వం స్త్రీలు పురుషుల చేత రక్షణలేనివారై స్వతంత్ర వృత్తి నవలంబించి ఉన్నప్పుడు అఖిల ప్రాణి సాధారణమయిన ధర్మాన్ని పాటిస్తూ తమ తమ ఋతుకాలాల్లో నియతానియత పురుషలయి ప్రవర్తించే కాలంలో ఉద్దాలకు డనే మహాముని భార్య - అతిసాధ్వి - ఈమె శ్వేతకేతుని తల్లి - ఋతిమతి యైన దానిని ఒక వృధ్ధ బ్రాహ్మణుడు ఇంటికి అతిథిగా వచ్చి పుత్రార్థమై కామించగా - శ్వేతకేతుడు అది ధర్మ విరుధ్ధమని ఆక్రోశించి దానిని సహింపక పైన చెప్పిన విధంగా సతులందరికీ కట్టుబాటును విధిస్తాడు. ఆ కట్టుబాటు అప్పటినుండి అమలులోనికి వచ్చింది. ఇందులో ఉత్తర కురుదేశాలకి మాత్రం మొదటివిధానమే అమల్లో ఉంటుందట. అదీ విషయం. 
   

0 comments

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks