వర్ణన రత్నాకరము - శ్రీమదాంధ్రమహాభారతము - తిక్కన సోమయాజి - అనుశాసనిక పర్వము - స్త్రీధర్మములు
పార్వతి శివునకుఁ బతివ్రతాధర్మంబుల తెఱఁ గెఱింగించుట
క.
వనితలుఁ బురుషులుఁ బ్రియమునఁ, దను వినుతింపంగ శైలతనయ సమాక
ర్ణన కౌతుకి యగు నీ శా, నునితో మృదురీతి ని ట్లనుం గమలేశా. అను.5-284
సీ.
ఋతుమతి కాక శుద్ధతయుఁ గల్గిన యింతి, కన్య తత్పరిణయకరణమునకు
నొడయులు విను తల్లియును దండ్రి, తోఁ బుట్టినతఁడు మాతులుఁడు సోద
రుండును యోగ్యవరునిఁ జూచి వారిలో, నెవ్వరైనను బ్రీతి ని చ్చువారు
పతి యంతనుండియుఁ బ్రభువు దానికి నట్లు, కావున నాతండ దైవ మనుచు
తే.
నతనిమతమూఁది దేవతాపితృసమర్చ, నములు నతిథి పూజనము సన్మతి సమాచ
రించుచును బతిహితము పాటించి నడపు, సతి పతివ్రత యిహపరసౌఖ్యమహిత. 283
వ .
ఏతద్విషయం బయిన యొక్క నిదర్శనం బవధరింపుము. 284
సీ.
బ్రాహ్మణుఁ డొకనికి భార్యలిద్దఱు కల రం దొకభామిని యతనిహితము
నడపెడునవధాన మెడలి యాతఁడు పంపకయుఁ దాన సురపితృ కార్యపరత
నడచుఁ దక్కటి యింతి నాథుఁ బాటించు చుఁ దన్మతంబునఁ జేయు ధర్మవిధులు
వారు మువ్వురు విధివశమున నొక్కట మృతిఁ బొంది రాపతివ్రత వరుండు
తే.
చనిన సుగతికిఁ జనెఁ బెరవనిత జముఁడు
నీకుఁ బో లేదు మరలుము నీశరీర
మునక యని యాఁగె నది శోకముల సబాష్ప
యైనఁ గన్గొని యతఁడు దయార్ద్రుఁ డగుచు. 287
క.
పతిమతముఁ గొనక ధర్మము, నతివ నడపు టొప్ప దింక నైనను బతికిన్
హితము లగువానిం జేసిన, నతనిఁ గలయు దనినఁ జనియె నదియును మరలన్. 288
వ.
కావునం బతికి ననువ్రత యగుట గృహిణికి ధర్మం బని పలికి వెండియు. 289
క.
లలన యిలువాడి నాథుఁడు, వలచిన చవివంటకములు వండి యిడి తనుం
గలయఁ దలంచిన మెయికొని, యెలమిం గై సేసి హృదయ మీవలయు శివా. 290
ఇలువాడి=మంచినడత కలిగి
తే.
పనులయెడ మాఱు పలుకక యనవధానుఁ, డైన పతిఁ దలఁపించి ధర్మార్థకలిత
కృతులు నడపుచు సవతి కల్గినను బోరి, తంబు లే కొక్కటై యున్కి తగవు సతికి. 290
అనవధానుడు = పరాకుగలవాడు
క.
సవతాలికిఁ బతి వలచిన, నవుఁ గా కని యతని యిచ్చ కను రూపముగాఁ
దివిరి నడచు సతి దైవము, శివయది తగు నెల్లజనముచే మ్రొక్కుకొనన్. 291
క.
తనచేతికి నిచ్చిన వ,స్తునికాయము నిల్లడమున చొప్పున మగుడం
గొని వచ్చి పతి తె, మ్మని నప్పుడ యిచ్చు టొప్పునకపటవృత్తిన్. 293
క.
పతి తనకు నేమి యిచ్చిన, నతిముదమునఁ బొంద వలయు నా త్మజుఁ డైనన్
మతిఁ గొంకక యేకాంత, స్థితి నేకాసనత నున్కి చెట్ట ప్రమదకున్. 294
క.
ధని యధనుఁడు రూపసి యొ,ప్పనివాఁ డవివేకి మూఢ భావుఁ డరోగుం
డనుగతరోగుఁ డనక యం,గన పతిఁ బాటింప వలయుఁ గామధ్వంసీ. 295
క.
బలి భిక్షము కడప కిడ, న్వలయును దేవపితృపూజనంబులకాలం
బులఁ బతి శుభ మందుటఁ ద, త్ఫలంబు గాఁ గోరు టొప్పిదము సతికి శివా. 296
క.
గతి పతియ చువ్వె భార్యకు, నతనిఁ గడచినట్టి సత్పరాయణము కృపా
యుత కలదే కావునఁ దా, నతనికి భక్తి యగు టిచ్చు నఖిలశుభంబుల్.297
అష్టావక్ర చరిత్రము నుండి.
తే.
బాల్యమునఁ దండ్రి యౌవనప్రాప్తి మగఁడు, వార్థకంబునఁ దనయుఁడు వామనయన
నరసి నడపన కా దెందు నంగనలకు, వలసినట్టులు చేయఁగా వచ్చునెట్లు. అను -2-22
అష్టావక్రుని చరిత్రలో ఉత్తరదిశ స్త్రీ రూపంలో వచ్చి అష్టావక్రుని వశం చేసుకోవటానికి ప్రయత్నించే ఘట్టంలో ఆమెను వారిస్తూ అష్టావక్రుడు పలికిన మాటలు.
శాంతి పర్వంలో ధర్మరాజు భీష్మపితామహుని "అంగనల సమాచారంబులు వినంగ వలతు, చెప్పవే" అని అడుగుతాడు. అప్పు డతనికి భీష్ముడు కైకేయీ శాండిలీ సంవాదం గుఱించి వివరిస్తాడు. సుమన యనబడే కైకేయి అమరపురంలో ఉన్న శాండిలిని చూచి భవ్యమైన ఇంద్రలోక పదవి నీకు ఎలా లభించింది అని అడగ్గా ఆమె కైకేయికి ఈ క్రింది విధంగా జవాబు చెపుతుంది.
సీ.
మామకు నత్తకు మార్పల్క దేవపిత్ర తిథి పూజనములయందు సొలయ
నిలువడిఁ దలవాకి లెప్పుడు నెఱుఁగక పెలుచ నవ్వక శుద్ధి వెలయ విప్ర
భిక్ష యోపిక గల్గి పెట్టుచు వర్తింతు వలయు కార్యములకు వెలఁది మగుడఁ
బతి వచ్చునప్పుడు భక్తియు వేడ్కయుఁ బొదల నాసనపాద్యములను సుముఖ
ఆ.
భావమునను సేవ పాటింతు బిడ్డల, శిక్ష వదలఁ దిట్టఁ బెట్టఁ గనియు
నాకు వేఱ ప్రియ మనఁగ లేదు పతి మెచ్చు, వంటకములు చవిగ వండియిడుదు. అను-4-358
సొలయన్= వైముఖ్యము నొందను, నిలువడిన్= మంచి నడవడిచే.
చ.
వరుఁ డొకవెంట నెన్నఁడు ప్రవాసగతుం డగు నాఁటగోలె న
ప్పురుషుఁడు వచ్చునంతకును బూవులు పూఁతలు మేలిచీర లా
భరణము లెక్కుడుం జవులపాకవిశేషము లాదరింప నె
ప్పరుసునఁ గొల్చి కూడు గురు బంధులకుం దగ నెమ్మి చల్పుదున్. 359
క.
గోవులు మొద లగు తిర్య, గ్జీవుల సుఖవృత్తు లరసి చెల్లింతు గృహ
శ్రీవ ర్తనంబునకుఁబతి, భావము సంకటపడంగఁ బలుక నొటియున్. 360
తే.
అగ్ని యోపి రక్షింతు రహస్య మైన
దాని వెలిపుచ్చ గర్భంబు దాల్చి యున్న
యపుడు వాచవు లెల్లను నవులఁ బెట్టి
దాని కెయ్యవి పథ్యముల్ వానిఁ గొందు. 361
క.
అని చెప్పి యట్టి చందం,బున నడచిన సతికి లోకములు రెండును సౌ
ఖ్యనిరూఢి యొసఁగుఁ బొగ డొం,దు నరుంధతివోలె నవ్వధూటి నరేంద్రా. 362
క.
నృప యీ యాఖ్యానము ప, ర్వపుదినమున భక్తిఁ జదువువారలు విను పు
ణ్యపురుషులును నాయుశ్శ్రీ, లపరిమితము లొంది యమరు లగుదురు పిదపన్. 363
0 comments:
Post a Comment