వర్ణన రత్నాకరము -స్రీ ధర్మములు - భారతము - అరణ్య పర్వము - సత్యాద్రౌపదీ సంవాదము
క.
పతి మనసు నాఁ చికొనియెడు, చతురోపాయంబు నీకుఁ జపలాక్షి సుని
శ్చితమతిఁ జెప్పెద విను మూ,ర్జితమును ధర్మాన్వితము సుశీలంబును గాన్. 5.313
సత్యభామను ద్రౌపది చపలాక్షి అని సంబోధించటం చాలా బాగున్నది. సత్యభామ ఆమెతో అన్న పలుకులు ఆమెచేత అలా సంభోదింప చేసాయి. ఆచికొనియెడు = ఆకర్షించు
చ.
పతిఁ గడవంగ దైవతము భామల కెందును లేదు ప్రీతుఁ డై
పతి కరుణించెనేనిఁ గలభాషిణి భాసుర భూషణాంబ రా
న్వితధనధాన్య గౌరవము విశృత సంతతియున్ యశంబు స
ద్గతియును గల్గు నొండు మెయిఁ గల్గునె యిన్ని తెఱంగు లారయన్. 5.314
కడవంగన్= మించి, కలభాషిణి = మధురముగఁ పలుకుదానా
ఆ.
కరము దుఃఖపడినఁ గాని యొక్కింత సౌ, ఖ్యంబు ధర్మగతియుఁ గలుగ దెందుఁ
జూడు మబల భర్తృశుశ్రూష ఫలము సం, తతసుఖంబు నంద ధర్ము వొదవు. 5.315
అబల అనే సంబోధన కూడా సాభిప్రాయంగానే వాడింది ద్రౌపది.
క.
కావున నిత్యము సమ్య, గ్భావము ప్రేమంబు వెరవు భక్తియుఁ బ్రియముం
గావింపుము నీ ప్రియు నెడ, భావ మెఱిఁగి యతఁడు తాన పై బడి మరగున్. 5.316
మ.
వనజాక్షుండు కడంగి నీ దగు గృహద్వారంబు చేరంగ వ
చ్చె ననంగా విని లెమ్ము సంభ్రమముతోఁ జె న్నొందు నభ్యంతరం
బునకున్ వచ్చిన నాసనాదికరణంబుల్ దీర్ప ద త్తజ్జనం
బు నియోగించితి నంచు నుండక ప్రియంబుల్ చేయు మీవుఁ దగన్. 5.317
చ.
తివిరి మురారి నీకుఁ గడుఁ దీపుగఁ జెప్పిన పల్కు గల్గినం
గువలయనేత్ర నీ మనసుగూడినవారికి నైన నెప్డుఁ జె
ప్ప వలదు దాన నొండొక నెపంబు ఘటింతు రెఱింగి రేని నీ
సవతులు కృష్ణుబుద్ధి విరసం బగు నీ దెసఁ దత్ప్రయుక్తి చేన్. 5.318
తివిరి= ప్రియపడి
చ.
పతికి ననుంగు లై న తగుబంధుల మిత్రుల భోజనాది స
త్కృతముల నాదరించుచు నకృతిమ భక్తి విశేష సంతతో
త్థితమతి వై చరింపుము తదీయ హితేతర వృత్తు లైన వా
రతివ భవత్సుహృజ్జనంబు లైనను గైకొన కుండు మెప్పుడున్. 5.319,
క.
విను ప్రద్యుమ్నాది భవ, త్తనయులయెడ నైన నేకతంబున నేకా
సనమున నుండుట దూష్యం, బని యెఱుఁగుము సతుల చరిత లతి దుష్కరముల్. 5.320
క.
కులవతులును సతులును ని, ర్మల మతులును నయిన యట్టి మగువల తోడం
జెలిమి యొనరించునది దు, ర్విలసిత వనితాభియుక్తి విడువుము తరుణీ.5.321
దుర్విలసితవనితాభియుక్తిన్ = దుష్టస్త్రీల స్నేహము
పతివ్రతా ధర్మం అంటే అంత క్లిష్టమయిందన్న మాట.
0 comments:
Post a Comment