నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

Feb 14, 2014

వర్ణన రత్నాకరము - స్త్రీ ధర్మములు - శ్రీమదాంధ్ర మహా భారతము - నన్నయ

వర్ణన రత్నాకరము - స్త్రీ ధర్మములు - శ్రీమదాంధ్ర మహా భారతము - నన్నయ

సీ.
ఇది యాదిగా సతు లెన్నండుఁ బరపురుషార్థినుల్ గాఁ జన దన్యపురుష
సంగమంబునఁ జేసి సకల పాతకములు నగుఁ బరిగ్రహభూతలయిన సతుల
కిట్టిద మర్యాద యిమ్మనుష్యుల కెల్లఁ, జేసితి లోక ప్రసిద్ధి గాఁగ
నని ధర్మ్య మైన మర్యాద మానవులకుఁ దద్దయు హితముగా ధర్మమూర్తి
ఆ.వె.
యబ్జభవ సమానుఁ డగు శ్వేతకేతుండు, నిలిపె నదియు ధారుణీ జనంబు
నందు లోకపూజ్యమై ప్రవర్తిల్లుచు , నుండె శిష్ట సం ప్రయుక్తిఁ జేసి.

పరిగ్రహభూతలు= వివాహితలు
మర్యాద=కట్టుపాటు 
వ.
మఱియుఁ దిర్యగ్యోనులయందును ను త్తరకురుదేశంబులయందును మొదలింటి ధర్మంబ యిప్పుడుం బ్రవర్తిల్లుచుండు నట్లు మనుష్యులయందు శ్వేతకేతుఁడు సేసిన ధర్మస్థితి కారణంబున నాటంగోలె.

తిర్యగ్యోనులయందు= పశుపక్ష్యాది గర్భములయందు 
క.
పురుషులచే ధర్మస్థితిఁ, బరిగ్రహింపంగఁ బడిన భార్యలకు నిరం
తరము నిజపురుష భక్తియుఁ, బరపురుష విసర్జనంబుఁ బరిచిత మయ్యెన్.
క.
భర్త చేత నియోగింపఁ బడక సతికి, నెద్దియును జేయఁ గాఁ దగ దెద్ది యైన
భర్త చేత నియోగింపఁ బడిన దానిఁ, జేయ కునికి దోషం బని చెప్పె మనువు.
                                                                                                        ఆది పర్వము పంచ. 85,86,87,88.

ఈ విషయం వ్యుషితాశ్వుం డనే రాజు చరిత్ర లోనిది. పాండురాజుకు శాపకారణముగా సంతానం కలగనప్పుడు కుంతికి పాండురాజుకు జరిగిన సంభాషణలో భాగంగా కుంతి పాండురాజుతో ఈ చరిత్రను చెబుతుంది. వ్యుషితాశ్వుడనే రాజు భద్ర అనే తన భార్యతో అనవరత కామాశక్తిం జేసి క్షయరోగాన్ని పొంది సంతాన హీనుడుగా మరణిస్తాడు. అప్పు డతని భార్య అతని శవాన్ని కౌగలించుకొని సంతానం లేదని దుఃఖిస్తుండగా ఆతని శరీరం నుండి అశరీరవాణి రూపంలో పుత్త్రులు కలుగుతారని వినిపిస్తుంది. ఋతుమతి యైన 8వ రోజున గాని 14వరోజునగాని శుచిగా శయనించి తనను తలిస్తే సంతానం (అశరీరవాణిగా )కలుగుతుందని చెప్తుంది. ఆ విధంగా ఆమె 7గురు సంతానాన్ని పొందుతుంది. అలా సంతానం పొందవచ్చని చెప్పిన కుంతికి పాండురాజు ధర్మ్యంబైన ఓ పురాణ కథనీ విధంగా చెప్తాడు. పూర్వం స్త్రీలు పురుషుల చేత రక్షణలేనివారై స్వతంత్ర వృత్తి నవలంబించి ఉన్నప్పుడు అఖిల ప్రాణి సాధారణమయిన ధర్మాన్ని పాటిస్తూ తమ తమ ఋతుకాలాల్లో నియతానియత పురుషలయి ప్రవర్తించే కాలంలో ఉద్దాలకు డనే మహాముని భార్య - అతిసాధ్వి - ఈమె శ్వేతకేతుని తల్లి - ఋతిమతి యైన దానిని ఒక వృధ్ధ బ్రాహ్మణుడు ఇంటికి అతిథిగా వచ్చి పుత్రార్థమై కామించగా - శ్వేతకేతుడు అది ధర్మ విరుధ్ధమని ఆక్రోశించి దానిని సహింపక పైన చెప్పిన విధంగా సతులందరికీ కట్టుబాటును విధిస్తాడు. ఆ కట్టుబాటు అప్పటినుండి అమలులోనికి వచ్చింది. ఇందులో ఉత్తర కురుదేశాలకి మాత్రం మొదటివిధానమే అమల్లో ఉంటుందట. అదీ విషయం. 
   

0 comments

Feb 13, 2014

వర్ణన రత్నాకరము - ధర్మములు - ఆంధ్రమహా భారతము -నన్నయ

వర్ణన రత్నాకరము - ధర్మములు - ఆంధ్రమహాభారతము -నన్నయ


క.
తగు నిది తగ దని యెదలో, వగవక సాధులకుఁ బేదవారల కెగ్గుల్
మొగిఁ జేయు దుర్వినీతుల, కగు ననిమిత్తాగమంబు లయిన భయంబుల్. ఆది.ప్రధమ.85

మహా భారతం ప్రారంభంలో సమర అనే దేవశుని(దేవతా సంబంధమైన కుక్క) కొడుకు సారమేయుడు అనే కుక్క కుమారుని జనమేజయుని తమ్ములు శ్రుతసేనుడు, భీమసేనుడు, ఉగ్రసేనుడు అనబడే ముగ్గురు కొట్టినప్పుడు ఆ కుక్క కుమారుడు సరమతో పిర్యాదు చేయగా ఆ సరమ జనమేజయుని వద్దకు వచ్చి అన్న మాటలు అవి.

0 comments

వర్ణన రత్నాకరము - భారతము - నన్నయ - ఆది పర్వము - స్త్రీ ధర్మములు

వర్ణన రత్నాకరము - భారతము - నన్నయ - ఆది పర్వము - స్త్రీ ధర్మములు

క.
ఎట్టి సాధ్వులకును బుట్టిన యిండ్లను, బెద్దకాల మునికి తగ్గ దగదు
పతుల కడన యునికి సతులకు ధర్మువు, సతుల కేడుగడయుఁ బతుల చూవె. ఆది. చతు. పద్య 66.

 కణ్వ మహర్షి శకుంతలను దుష్యంతుని వద్దకు పంప దలచి ఆమెతో అన్న మాటల సందర్భంలోనివి ఈ మాటలు.

క.
పతిహీన లయిన భామిను, లతి ధనవతు లయ్యుఁ గులజ లయ్యును ననలం
కృత లయ్యెడు మాంగల్య ర, హిత లయ్యెడుఁ గృపణవృత్తి నిదియు మొదలు గాన్.
                                                                                    ఆది పర్వము, చతు. పద్య 230

దీర్ఘతముడు అనే మునీశ్వరుడు సతు లందరికీ అప్పటినుండి అమలులోకొచ్చే విధంగా ఈ శాపాన్ని ఇస్తాడు. సందర్భం ఏమిటంటే --
దీర్ఘతముడు జాత్యంధుడుగా బృహస్పతి  శాపం వలన ఆతని తల్లికి జన్మిస్తాడు. బృహస్పతి అతనికి శాపం ఎందు కిచ్చాడంటే --
అచథ్యుడు అనే మునిపత్ని మమత అనే ఆవిడ గర్భం ధరించి ఉండగా వారి దగ్గఱకు అతిథిగా విచ్చేసిన బృహస్పతి ఆమెను దేవరన్యాయంగా అభిలషిస్తాడు. ఆ విషయాన్ని తెలుసుకొన్న గర్భస్థశిశువు అలా బృహస్పతి ఆమెను అభిలషించటం ధర్మవిరుద్ధం అని గర్భంలోంచే ఆక్రోశిస్తాడు. దానికి అలిగి బృహస్పతి సర్వభూతేప్సితంబైన ఈ కార్యమునందు నాకు ప్రతికూలుడవు అయ్యావు కాబట్టి దీర్ఘతమమును పొందమని శాపం ఇస్తాడు. ఆ కారణంగా దీర్ఘతముడు పుట్టుగుడ్డిగా మమతకు జన్మిస్తాడు. తరువాత దీర్ఘతముడు సకల వేదవేదాంగములు చదివి గొప్పవాడైన తఱువాత ప్రద్వేషిణి అనే బ్రాహ్మణ కాంతను పెళ్ళాడి ఆమె ద్వారా గౌతమాదులైన పెక్కుమంది సంతానాన్ని పొందుతాడు. అయినప్పటికీ భార్య అతనిని మెచ్చుకోకపోతే ఎందుకు మెచ్చవని భార్యని అడుగుతాడు. అప్పుడామె అతనితో ఇలా అంటుంది --
తే.
పతియు భరియించుఁ గావున భర్త యయ్యె
భామ భరియింపఁబడుఁ గాన భార్య యయ్యెఁ
బరఁగ నవి మనయందు వీడ్వడియె నిన్ను
నేన యెల్లకాలము భరియింతుఁ గాన.     228
వీడ్వడియెన్=మాఱుపడెను.
ఆ.
ఎంతకాల మయిన నిప్పాట భరియింప, నోప నింక నరుగు మొండుకడకు
ననిన నిర్దయాత్మ లని దీర్ఘతముఁ డల్గి, సతుల కెల్ల నపుడు శాపమిచ్చె. 229
 అలా ఆవిడ కారణంగా ఆడవారికంరికీ శాపం వచ్చిందన్నమాట. ఇందులోని ధర్మాధర్మములను మనం విచారించుకొందాం.


0 comments

Feb 12, 2014

వర్ణన రత్నాకరము - సపత్నీ భావము - రాధికా సాంత్వనము - ముద్దుపళని

వర్ణన రత్నాకరము - సపత్నీ భావము - రాధికా సాంత్వనము - ముద్దుపళని

ఆ.
సొమ్ము లియ్యవచ్చు సొమ్మందమీవచ్చు, నియ్యరాని ప్రాణ మి య్యవచ్చుఁ
దనదు విభుని వేఱె తరుణి చేతికి నిచ్చి, తాళవశమె యెట్టి దాని కైన.
సీ.
నాతి యింతకు మున్నె నాసామి యధరామృ, తమ్మును దాఁ జూఱ లాడ కున్నె
యతివ యింతకు మున్నె హరి నిప్పు టురముపై, ... కసి దీఱఁ గ్రుమ్మ కున్నె
రమణి యింతకు మున్నె రమణ కౌఁగిటఁ జేరి పారావత ధ్వనుల్ వలుక కున్నె
చాన యింతకు మున్నెశౌరి పైకొన నెడ, తియ్యక యెదు రొత్తు లియ్య కున్నె
గీ.
మున్నె యిది చాల సిగ్గుచే నున్నఁ గాని, విభుఁడు నగఁ జేసి చనవిడ వ్రీడరోసి
చేరఁగా దీసి యందంద చేయి వేసి, కొమ్మ నటమున్నె తా దిద్దుకొనక యున్నె.
శా.
ఏ మేమీ వెఱపింత లేకను నిళా హేలావ తిట్లాడె నే
యా మాట ల్విని మంచి దంచనియెనే యా ధూర్త గోపాలుఁడున్
రామా యట్లనెకాని మంచిదని మేలాయెన్ మ ఱేమాయె నా 
భామా రత్నము తాను గూడి సుఖమై వర్థిల్లినం జాలదే. 
సీ.
మఱచెనో నా చేత మణితంబు లన్నియుఁ, బలుకనేర్చిన నాఁటి పంజరింపు
తెలియదా నా చేతి దేశ్యంపు గుజరాతి, విత మెఱింగిన నాఁటి వేఁడుకోళ్ళు
యెగచెనో నా చేతి నిలయంత్రగాత్రంబు, లభ్యసించిన నాఁటి యణఁకు వెల్ల
వెడలెనో నా చేతి వెడవిల్తు శాస్త్రంబు, లెఱుఁగ బూనిన నాఁటి తిరుగు మఱుఁగు 
గీ.
గణన సేయఁడొ మరుసాము కవనములకుఁ, దాను నాచేత బడిన బెత్తంపుఁ బెట్లు
పరులు గని జేరి నవ్వ దబ్బర మురారి, లాలనకె పొంగి యిప్పు డిలా లతాంగి.
గీ.
నిన్న కుప్పయు నేఁ డాళ్లు నెలఁత తాను, గోరి నా మీదఁ జేసెనా కాఱు బారు
ముక్కు పచ్చలు మానక మునుపె బిరుదు, దెచ్చుట కెదిర్చి కాట్లాడ వచ్చి నటుల.
గీ.
వెనుకటికిఁ గొప్పు ముందఱ బిగుతు టురము ...ఁ, జేయు నావాఁడు నాచెంత చేయు వింత
తాను పెంచిన పొట్టేలు తనదు చెంత ,చన్నఁ బడు సామ్య మాయనో చిన్ని చిలుక.
గీ.
తనదు మట్టెంత తానెంత తానె యింత, చెయఁ జూచిన నే నెంత సేయరాదు
వ్రేలు వాచిన ఱోలంత విరవి యైన, ఱోలు వాచిన నది యెంత మేలుఁ గనునొ.
గీ.
వారిజాక్షుని నా పగ వారివెంట, ననుప గోరంత యైనను మనసు లేదు
నందుఁ డనుపగఁ గని మనమందు కట్టు, లొంటి తడసేయ రాదని యంటిఁ గాని.
ఆ.వె.
కుట్టఁ దేలు కుట్టకున్న కుమ్మరబూచి, తోసి రా జటంచుఁ ద్రోచెఁ జెలియ
దాని వ్రేలు దీసి దాని కన్ను పొడిచి, నటుల తనియకున్ననగునె చిలుక.
ఆ.వె.
తగరు కొండమీఁద దాఁకఁ గోరిన దారి, నెదిరిదన్నుఁ దెలియ కింతి పలికె
నెంత మీను వచ్చి యెంత మీనును మ్రింగెఁ, గాని త్రుళ్ళినెద్దె గంతమోచు,
సీ.
ఆశు కవిత్వంబు లల్లి తేనే సరా, చిత్ర ప్రబంధముల్ సేయవలదె
గోటి చేతను వీణె మీటి తేనే సరా, గొంచక రాల్ గరఁగించ వలదె
పదచాళి రాగముల్ పాడి తేనే సరా, హితవొప్ప వర్ణంబు లెత్త వలదె
అల నాట్య భేదమ్ము లాడి తేనే సరా, నవరసంబుల నంటి నడువ వలదె
గీ.
వింత వింతగఁ గలసిన యంత సరియె, యెమ్మెకాని మనో భావ మెఱుఁగ వలదె
యేమి నేరనినిన్నంటె యెంత మేటి, నన్ను విడనాడనా కోరె చిన్నిచిలుక.
గీ.
కాని వదరకు మిఁక మీఁద దాని మోము, గనఁగ వల్దని శౌరిని కట్టి పెట్టి
బింకములు కూల నఱకాలఁ బెట్టి నేల, రాచ కున్నను నా పేరు రాధ గాదు.

ద్రాక్షాపాకం అంటే ఇలానే ఉంటుందనుకుంటాను. ఎన్ని మృదుమధురమైన పద్యాలో ! వాహ్వా జన్మ ధన్యమైంది! 
 

  
    
 
 

0 comments

Feb 9, 2014

వర్ణన రత్నాకరము - విజయవిలాసము -చేమకూర వెంకటకవి

వర్ణన రత్నాకరము - విజయవిలాసము -చేమకూర వెంకటకవి

ఉ.
తీరిచినట్టు లున్నవిగదే కనుబొమ్మలు కన్ను లంటిమా
చేరలఁ గొల్వఁ గా వలయుఁ జేతుల యందము చెప్ప గిప్ప రా
దూరులు మల్చి వేసినటు లున్నవి బాపురె ఱొమ్ము లోని సిం
గారము శేషుఁడే పొగడఁ గావలె నీతని రూపు రేఖలన్.      అ.1, పద్య 131

అర్జునుని రూపు రేఖా విలాసాలు ఎలా ఉన్నదీ ఉన్న వర్ణన.

                                                                                      విజయ విలాసము చేమకూర వెంకటకవి.
                                                                                      విజయ విలాస వ్యాఖ్య - తాపీ ధర్మారావు గారు.
ఈ రెండు పుస్తకాలూ ఒకదాని దగ్గఱ ఇంకొకటి పెట్టుకొని చదివాను. అప్పటి నుండి విజయవిలాసము నాకు అభిమాన గ్రంథం. ఎంతగా అభిమానించిన పుస్తకం అంటే దానిలోని పేజీలు పుస్తకం నుండి ఊడి పోయి ఉన్నాయి ఇప్పుడు. తిరిగి బైండు చేయించుకోవాలి. తాపీ వారి హృదయోల్లాస వ్యాఖ్య మటుకు ఇప్పుడు నా దగ్గఱ లేదు.

0 comments

వర్ణన రత్నారము - నృసింహ పురాణము - ఎఱ్ఱాప్రెగడ

వర్ణన రత్నారము - నృసింహ పురాణము - ఎఱ్ఱాప్రెగడ

ఉ.
భాసుర భారతార్థముల భంగులు నిక్క మెఱుంగ నేరమిన్
గాసట బీసటే చదివి గాధలు ద్రవ్వు తెనుంగు వారికిన్ 
వ్యాస ముని ప్రణీత పరమార్థము తెల్లగఁ జేసినట్టి య
బ్జాసనకల్పులం దలఁతు నాద్యుల నన్నయ తిక్కనార్యులన్.
                                                                                     నృసింహ పురాణము  పీఠిక పద్య 9.

0 comments

Feb 8, 2014

వర్ణన రత్నాకరము - జలక్రీడ - రసికజన మనోరంజనము (కందుకూరి వీరేశలింగ కవి)

వర్ణన రత్నాకరము - జలక్రీడ - రసికజన మనోరంజనము (కందుకూరి వీరేశలింగ కవి)

సీ. 
కప్పు కొప్పుల నుండి కాఱు చుండెడు నీరు, చిఱుత మబ్బులవాన చినుకులట్లు
గబ్బి గుబ్బల నుండి కాఱు చుండెడు నీరు, బలితంపు మలల పెన్వాకలట్లు
కమ్మ మోముల నుండి కాఱు చుండెడు నీరు, సొగసు చందురు మంచు సోన యట్లు
కలికి కన్నుల నుండి కాఱు చుండెడు నీరు, నెత్తమ్మి పూవుఁ దేనియల యట్లు
గీ.
వాతెఱల నుండి తగ జాలు వాఱు నీరు, పలుచనగు దొండపండుల పాల యట్లు
వింతవింతలఁ దనరెఁ గన్విందు గాఁగ, లేమ లట నీటిలో మున్గి లేచు నపుడు

                                                     రసికజన మనోరంజనము - కందుకూరి వీరేశలింగ కవి.
బలితంపు =Thick, Strong, Mighty

0 comments

వర్ణన రత్నాకరము - సవతుల కయ్యము -కళాపూర్ణోదయము (పింగళి సూరన)

 వర్ణన రత్నాకరము - సవతుల కయ్యము -కళాపూర్ణోదయము (పింగళి సూరన)

సీ.
ఒట్టు సుమీ యన్న నొట్టు సుమీ యంచు, నేమేమి యనిని నేమేమి యనుచుఁ
గానీ గదే యన్న గానీ గదే యంచు, నింకేల యనిన నింకేల యనుచు
నోసి పోవే యన్న నోసి పోవే యంచు, నౌ నంటి ననిన నౌ నంటి ననుచు
మఱవకు మిది యన్న మఱవకు మిది యంచు, నీ వెంత యనిన నీ వెంత యనుచు
గీ.
నొకతె మగనికి నాసించు టొప్పదనిన, నొకతె మగనికి నాసించు టొప్పుదనుచున్
బట్టి యాడె నా రంభ తోఁ బ్రథమ రంభ, ప్రియుఁడు నిలుమన్న నిలువక పెద్ద రొదగ.
                                                     కళాపూర్ణోదయము - పింగళి సూరన -అధ్యా 4, పద్య 191
 
మంచి కథ, చదివి తీరాల్సిన పుస్తకం. దీనిని చదివాను.

0 comments

Feb 7, 2014

వర్ణన రత్నాకరము - ఆశీర్వచనము - హంసవింశతి

వర్ణన రత్నాకరము - ఆశీర్వచనము - హంసవింశతి

సీ.
శ్రీరస్తు శుభమస్తు ధీరస్తు విజయోస్తు, పుత్రరంజనమస్తు పుణ్యమస్తు
ధనమస్తు ధాన్యమస్త్వ నవద్య సుఖమస్తు, చిరతర సంకల్ప సిద్ధిరస్తు
సత్యమస్తు మహోస్తు శౌర్యమస్తు యశోస్తు, స్వస్త్వస్తు సుగుణోస్తు శక్తిరస్తు
సామ్రాజ్యమస్తు శాశ్వతధర్మ ఫలమస్తు, వృద్ధిరస్తు మహా ప్రసిద్ధిరస్తు
గీ.
జ్ఞానమస్తు శ్రీయఃపతి ధ్యానమస్తు, గురు చరణ భక్తి రస్తు సత్కుశలమస్తు
శాంతిరస్తు నిరంతరైశ్వర్యమస్తు, భాగ్యమస్తు మహా సౌర్వభౌమ నీకు.

హంసవింశతి -అయ్యలరాజు నారాయణామాత్యుడు -అ 1, పద్య 47.

0 comments

Feb 6, 2014

వర్ణన రత్నాకరము - స్త్రీ వర్ణనము - ఉత్తర రామాయణము

వర్ణన రత్నాకరము -  స్త్రీ వర్ణనము - ఉత్తర రామాయణము 

సీ.
మించి దృష్టికి మిఱుమిట్లు గొల్పెడు నిది, తెలియఁ గారు మెఱుంగుఁ దీగ  యే మొ
కార్మెఱుంగునకిట్టి కళ గలదే యిది, సొబగైన వెన్నెల సోగ యే మొ
వెన్నెల సోగకీ చిన్నె లున్నవె యిది, మరుని రాచిల్క సాంబ్రాణి యే మొ
చిలుక సాంబ్రాణి కిఁ జెలువంపు నడలుండు, నా యిది కలికి రాయంచ యే మొ
గీ.
కలికి రాయంచ కీ సోయగంబు గలదె,యె మ్మె గలదిది జాళువా బొమ్మ యే మొ
జాళువా బొమ్మ కీ విలాసములు గలవె, మెచ్చ నగు నచ్చరవెలంది మిన్న యే మొ.

ఉత్తర రామాయణము - అ.4, పద్య 189 (కంకంటి పాపరాజు)

  

0 comments

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks