వర్ణన రత్నాకరము - స్త్రీ ధర్మములు - శ్రీమదాంధ్ర మహా భారతము - నన్నయ
సీ.
ఇది యాదిగా సతు లెన్నండుఁ బరపురుషార్థినుల్ గాఁ జన దన్యపురుష
సంగమంబునఁ జేసి సకల పాతకములు నగుఁ బరిగ్రహభూతలయిన సతుల
కిట్టిద మర్యాద యిమ్మనుష్యుల కెల్లఁ, జేసితి లోక ప్రసిద్ధి గాఁగ
నని ధర్మ్య మైన మర్యాద మానవులకుఁ దద్దయు హితముగా ధర్మమూర్తి
ఆ.వె.
యబ్జభవ సమానుఁ డగు శ్వేతకేతుండు, నిలిపె నదియు ధారుణీ జనంబు
నందు లోకపూజ్యమై ప్రవర్తిల్లుచు , నుండె శిష్ట సం ప్రయుక్తిఁ జేసి.
పరిగ్రహభూతలు= వివాహితలు
మర్యాద=కట్టుపాటు
వ.
మఱియుఁ దిర్యగ్యోనులయందును ను త్తరకురుదేశంబులయందును మొదలింటి ధర్మంబ యిప్పుడుం బ్రవర్తిల్లుచుండు నట్లు మనుష్యులయందు శ్వేతకేతుఁడు సేసిన ధర్మస్థితి కారణంబున నాటంగోలె.
తిర్యగ్యోనులయందు= పశుపక్ష్యాది గర్భములయందు
క.
పురుషులచే ధర్మస్థితిఁ, బరిగ్రహింపంగఁ బడిన భార్యలకు నిరం
తరము నిజపురుష భక్తియుఁ, బరపురుష విసర్జనంబుఁ బరిచిత మయ్యెన్.
క.
భర్త చేత నియోగింపఁ బడక సతికి, నెద్దియును జేయఁ గాఁ దగ దెద్ది యైన
భర్త చేత నియోగింపఁ బడిన దానిఁ, జేయ కునికి దోషం బని చెప్పె మనువు.
ఆది పర్వము పంచ. 85,86,87,88.
ఈ విషయం వ్యుషితాశ్వుం డనే రాజు చరిత్ర లోనిది. పాండురాజుకు శాపకారణముగా సంతానం కలగనప్పుడు కుంతికి పాండురాజుకు జరిగిన సంభాషణలో భాగంగా కుంతి పాండురాజుతో ఈ చరిత్రను చెబుతుంది. వ్యుషితాశ్వుడనే రాజు భద్ర అనే తన భార్యతో అనవరత కామాశక్తిం జేసి క్షయరోగాన్ని పొంది సంతాన హీనుడుగా మరణిస్తాడు. అప్పు డతని భార్య అతని శవాన్ని కౌగలించుకొని సంతానం లేదని దుఃఖిస్తుండగా ఆతని శరీరం నుండి అశరీరవాణి రూపంలో పుత్త్రులు కలుగుతారని వినిపిస్తుంది. ఋతుమతి యైన 8వ రోజున గాని 14వరోజునగాని శుచిగా శయనించి తనను తలిస్తే సంతానం (అశరీరవాణిగా )కలుగుతుందని చెప్తుంది. ఆ విధంగా ఆమె 7గురు సంతానాన్ని పొందుతుంది. అలా సంతానం పొందవచ్చని చెప్పిన కుంతికి పాండురాజు ధర్మ్యంబైన ఓ పురాణ కథనీ విధంగా చెప్తాడు. పూర్వం స్త్రీలు పురుషుల చేత రక్షణలేనివారై స్వతంత్ర వృత్తి నవలంబించి ఉన్నప్పుడు అఖిల ప్రాణి సాధారణమయిన ధర్మాన్ని పాటిస్తూ తమ తమ ఋతుకాలాల్లో నియతానియత పురుషలయి ప్రవర్తించే కాలంలో ఉద్దాలకు డనే మహాముని భార్య - అతిసాధ్వి - ఈమె శ్వేతకేతుని తల్లి - ఋతిమతి యైన దానిని ఒక వృధ్ధ బ్రాహ్మణుడు ఇంటికి అతిథిగా వచ్చి పుత్రార్థమై కామించగా - శ్వేతకేతుడు అది ధర్మ విరుధ్ధమని ఆక్రోశించి దానిని సహింపక పైన చెప్పిన విధంగా సతులందరికీ కట్టుబాటును విధిస్తాడు. ఆ కట్టుబాటు అప్పటినుండి అమలులోనికి వచ్చింది. ఇందులో ఉత్తర కురుదేశాలకి మాత్రం మొదటివిధానమే అమల్లో ఉంటుందట. అదీ విషయం.