మొగసాలలు= నగరి తలవాకిట చావడి.
పొసఁగంగ=to bring to terms, to persuade
పగరాజు=చంద్రుడు
కాణాచులు = చిరకాలవాస స్థానములు, A hereditary right to enjoy a certain office or a piece of land.
ఇది అన్నమయ్య రసికుల కిచ్చిన సార్వకాలిక సందేశం ! రసికజీవన
నాట్యశిల్పానికిది మూల సూత్రం !! శృంగార సంకీర్తనల రసాస్వాదనానికిది
మహాద్వారం !!! ఆ ద్వారంవద్ద, చూత కిసలయాలు తోరణాలుగా కట్టిన ఆమహాద్వారం వద్ద అన్నమయ్యయే స్వయంగా నిలబడి రసికులకు స్వాగతం పలుకుతున్నాడు. రసిక హృదయులను తన సంగీత సాహిత్య రస విభావరీ చర్వణానికి సమాహ్వానిస్తున్నాడు.
అయ్యా! ఇది రసికరాజ్యము ! ఇక్కడ యికమీదట 'విరహ' మనే మాటకు తావులేదు.ఎందుకంటే, చెఱకు విలుకాని పంట యిప్పుడు పండినది. దంపతుల కిక్కడ ఎడబాటు లేదు. విరహ మంతకంటే లేదు. సరికదా - ఒకరి ప్రక్క నొకరు, ఒకరివెంట నొకరు ఆసుపోసినట్లుగా తిరగవలసిందే ! ఈ మన్మథుని రాజ్యంలో చిగురుకు చేవ వచ్చింది. 'అచట పుట్టిన చిగురు కొమ్మైన చేవ' అన్నమాట సార్థకమైంది.కోవిల కూతలు యిండ్ల ముంగిళ్ళలోనికి అంటే యౌవన ప్రాంగణంలోని ప్రేయసీ ప్రియుల హృదయాలకు తగిలి తగిలి యింపెక్కాయి. అందాకా వేడిగాలులు వీచిన పవనుడు కాస్తా చల్లని వాడయ్యాడు.
ఇటువంటి పరిస్థితుల్లో ప్రేయసీ ప్రియుల సమాగమం తప్పదు. ఈ వసంతకాలంలో పసిమొగ్గలు సైతం వాడి యెక్కాయి. అనగా పుష్పబాణుడైన మన్మథుడు తన పంచబాణాలను వాడిగా యెక్కుపెట్టాడు. అవ్యక్త మధురంగా ముసగసలాడే తుమ్మెదల మోతల సాధింపులకు కాలం చెల్లింది. చాల సులభంగానే, ఒకప్పుడు విరహకాలంలో పగబూనిని చంద్రుడు దగ్గరి చుట్టమయ్యాడు.
ప్రేయసీ ప్రియులైన దంపతుల కలయికయే యిప్పుడు కాణాచిగా గుర్తింపబడింది. పదారువేల గోపస్త్రీలకు తా నొక్కడే మగడై శ్రీ వేంకటపతి ఈ భూమిపై నిలచి సంపదతో వెలుగుతున్నాడు. ఇక రసికులకు వారి మనస్సనే చెలికాడు తోడైవున్నాడు. రసికులకు విరహవ్యధ యిక ముమ్మాటికీ లేదని అన్నమయ్య ఘంటాపథంగా చాటి చెప్పిన కీర్త యిది.
(ఇక్కడ వ్రాసిన వాక్యాలు పరిష్కర్త శ్రీ గౌరిపెద్ది రామసుబ్బశర్మ గారివి కాని ఈ సంపుటానికి పీఠిక వ్రాసిన వారివి కాని కావచ్చును.వారి పేరు గ్రంథంలో ఉదాహరింపబడలేదు. గమనించగలరు.)