నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

Jun 1, 2011

అరుదైన భవదూరుఁడగు నీతఁడు

నా బ్లాగు మిత్రులందరికీ నా బ్లాగుకి నా పునరాగమన సందర్భంలో శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఇంతకాలం బ్లాగుకు దూరంగా ఉన్నాను. కాని ఈ రోజెందుకో బ్లాగు ద్వారా మిమ్మల్నందఱినీ పలకరించా లనిపించింది. ఈ బ్లాగులో అన్నమాచార్యులవారి దశావతారాల సంకీర్తన నొకదానిని మీ అందరితో పంచుకోవాలనిపించి ఈ ప్రయత్నం.

20 రేకు లలిత(అవతారాలు)
అరుదైన భవదూరుఁడగు నీతఁడు
అరిది భవములందునతఁడు వో యితఁడు II పల్లవి II

కొడుకుటెక్కెమురూపు కోరి కైకొని పెద్ద
కొడుకు కొరకుఁగా గోరపడి
కొడుకువైరి భక్తిఁ గూడిన యాతని
నడవిలోఁ జంపిన యతఁడు వో యితఁడు IIఅరుII మత్స్యావతారము?

ఆలితమ్ముని రాకకలరి మెచ్చెడిచోట
ఆలుఁ దానును నుండి యందులోన
ఆలిచంటికింద నడ్డమువడుకున్న
ఆలవాలమువంటి అతఁడు వో యితఁడు IIఅరుII కూర్మావతారము?

సవతి తమ్ముఁడు గోవుఁ జంపఁ బట్టుక పోయి
సవతి తమ్మునియింట సడిఁబెట్టఁగా
సవతులేనిపంటఁ జప్పరించివేసి
ఆవల యివల సేసి నతఁడు వో యితఁడు IIఅరుII వరాహావతారము?

తొడ జనించిన యింతి దొరకొనాపద సేయ(?)
దొలఁ (డ?)గి తోలాడెడి దొడ్డవాని
తొడమీఁద నిడి వానికడుపులో తొడవులే
యడియాలమగు మేని యతఁడు వో యితఁడు IIఅరుII నరసింహావతారము?

పదము దానొసఁగుచుఁ బదమడుగగఁ బోయి
పదము వదము మోవఁ బరగఁ జేసి
పదముననె దివ్యపదమిచ్చి మనుమని
నదిమి కాచినయట్టి అతఁడు వో యితఁడు IIఅరుII వామనావతారము

అత్తకొడుకుపేరి యాతనిఁ దనకూర్మి
యత్తయింటిలోన నధికుఁ జేసి
మత్తిల్లు తనతోడ మలసిన యాతని
నత్తలిత్తల సేసినతఁడు వో యితఁడు. IIఅరుII పరశురామావతారము?

పాముతోడుతఁ బోరి పంతముగొనువాని
పాముకుఁ బ్రాణమై పరగువాని
ప్రేమపుఁ దనయుని బిరుదుగా నేలిన
ఆమాటనిజముల అతఁడు వో యితఁడు. IIఅరుII కృష్ణావతారము?

ఎత్తుక వురవడినేఁగెడి దనుజుని
యెత్తుకలుగు మద మిగుర మోఁది
మత్తిల్లు చదువుల మౌనిఁ జం..........
అత్తలేని యల్లుఁడతఁడు వో యితఁడు. IIఅరుII రామావతారము

బిగిసి మేఁకమెడ పిసికెడి మాటలు
పగలుగాఁగ రేయివగలు సేసి
జగములోన నెల్ల జాటుచుఁ బెద్దల
అగడుసేయఁ బుట్టినతఁడు వో యితఁడు. IIఅరుII బలరామావతారము?

మెట్టనిచోట్ల మెట్టుచుఁ బరువులు
పెట్టెడిరాయ....................
కట్టెడికాలము కడపట నదయుల(?)
నట్టులాడించిన అతఁడు వో యితఁడు. IIఅరుII కల్క్యావతారము

తలఁకకిన్నియు జేసి తనుఁగాని యాతని
వలెనె నేఁడు వచ్చి వసుధలోన
వెలుఁగొంది వేంకటవిభుఁడై వెలసిన
యలవిగాని విభుఁడతఁడు వో యితఁడు. IIఅరుII వేంటేశ్వరస్వామి 4-8 ( నిడురేకులలోని 77 సంకీర్తలలో 8వ సంకీర్తన యిది)
ఇది దశావతారాల కీర్తన. అందుచేత మనం వరుసగా మత్స్య, కూర్మ, వరాహ, వామన, నారసింహ, పరశురామ,బలరామ, రామ,కృష్ణ, కల్క్యావతారాలు గుర్తులో ఉంచుకుని ఈ కీర్తనని అర్థం చేసుకొనే ప్రయత్నం చేయాలి. అన్నమయ్య మన తెలివితేటలకి జ్ఞాపకశక్తికి పరీక్ష పెట్టినట్లుగా ఉన్నది ఈ సంకీర్తన. నాకు అర్థం పూర్తిగా తెలియటం లేదు. ఎవరైనా పెద్దలు గాని, పిన్నలుగానీ ఈ సమస్యను విపులీకరించి నాకు సుబోధకమయ్యేలా విడమరిచి చెప్తే వారికి నేను కృతజ్ఞుడనై ఉంటాను.
అత్తలేని అల్లుడు అంటే రామావతారము అనుకొన్నాను.సీతాదేవి అయోనిజ కాబట్టి. పదమడుగబోయి అంటే వామనావతారము బలిని దానమడిగిన విధానం మూడు అడుగులు( పదములు) కాబట్టి.కట్టెడి కాలము కడపట అంటే చివరలో వచ్చే కల్క్యావతార మనిపించింది.

0 comments:

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks