నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

Nov 12, 2009

నా వరకృత్యంబు లన్నింటి లెక్క గావింప నాకు శక్యమె , నాఁటివార-

అన్నమాచార్యుని చరిత్రము
అన్నమాచార్యుని మహిమలు

నా వరకృత్యంబు లన్నింటి లెక్క
గావింప నాకు శక్యమె , నాఁటివార-


లెఱుఁగుదు; రవి పెద్ద లెఱిఁగింప వినుచు-
నెఱిఁగిన కృతకృత్యు లిపుడును గలరు ;


ఐన నందొక కొన్ని యనఘమానసుల-
వీనులవిందుగా వినుతింతు నేను


మండెమురాయ నామక నరసింహ
దండనేత్రున కిష్టధనబలస్ఫూర్తి-


ననుపమంబుగ వేంకటాద్రి చెంగటను
తన యగ్రహారమై తనరుచునున్న 


మరులుంకు (?) నోక జీడిమామిడి దాన
సరసంబువోయిన చవిఁ బండ్లు పండు-


నెఱ్ఱనై గొప్పవై యేపారు పండ్ల
విఱ్ఱవీఁగుచుఁ దనవీథి నెన్నడిమి 


మినుకైన మంచిమామిడిరీతి నెదుటఁ
గనుపట్టు నా చెట్టుఁ గని యొక్కనాఁడు


కపటమానసుల యాకారంబు పోలె-
నపు డెంతొ దృష్టప్రియంబులై యున్న


శ్రీ మాధవునకు నర్పించి యాపండ్లు
తా మారగింప నత్తఱిఁ బండ్లు పులియ


నమృతంబుతోఁబుట్టువగు పద్మ మోవి-
నమృతంబు తనివోవ నాను వెన్నునికి-


నీయెడ నెఱుఁగక యీ జీడిపులుసు-
కాయ లెట్లొసఁగితిఁ గటకటా యనుచు-


నా చెట్టు ముట్టితి నప్పయ్య దీన-
నేచిన దుర్గుణంబెల్లఁ బోఁజేసి


మించైన తియ్యమామిడి సేయుమనినఁ
బంచదారలవంటి ఫలములదయ్యె ;-


నా సుద్ది విని యొకఁ డట పెండ్లియాడఁ
గాసువీసము నాకు గల్గ దీవింపు-


మన విని , యటువలె నౌఁగాక యనిన
వెనుకొని వాఁ డెన్ని వేఁడినఁగాని


కాసువీసంబునే కాని యొక్కరుఁడు
చేసేత నొకరూక చేతిలో నిడఁడు ;


అది విని యది యొట్టి(ట్ట?)దని గాయకుండు
తదనుజ్ఞ మహిమగాఁ దలఁచి యేతెంచి


ఓతండ్రి నా పెండ్లి కొదవెడు ధనము
చేతికి రా దయసేయవే ! యనుడు-


నటువలె నౌఁగాక ! యనిన , నా విప్రుఁ-
డట వీథి కేఁగెడునపుడు రా జొకఁడు-


నాదరంబునఁ బిల్చి యడిగిన ధనము
ద్వాదశీ కన్యకా దాన మిచ్చుటయు-


నా వార్త విని జను లరుదందికొనుచు
వావిరి నొడి వళావళికిఁగా బెగడి


చెలువొందు నా గురు శ్రీపాదరక్ష
తల నిడి తమయాపదల వీడికొనిరి ;

0 comments

Nov 9, 2009

నది గని ముదమంది యన్నయార్యుండు సదయుఁడై నృపతి నెంజలిఁ బ్రస్తుతించి

అన్నమాచార్య చరిత్రము
అన్నమాచార్యుడు రాజు ననుగ్రహించుట

నది గని ముదమంది యన్నయార్యుండు
సదయుఁడై నృపతి నెంజలిఁ బ్రస్తుతించి

మునుపటి నీచేయు మొక్కలంబునకు-
ననుతాపమును జెంది తది కారణమున

మునుకొన్న యపరాధమును తాళుకొనియె
దనుజారి ; యింక నింతటనుండి నీవు


నరహరి సంకీర్తనము సేయువారిఁ
బరసమానులుగాఁగఁ బరికింపవలదు


మురవైరి కృతయుగమున సర్వజనుల
నిరత నిజధ్యాననిష్ఠచే మెచ్చుఁ;


గ్రతువులఁ ద్రేతాయుగమున, నర్చనలఁ
బ్రతిలేనియట్టి ద్వాపరమున నలరు;


నా మూఁడు యుగముల ధ్యానాదివిధుల-
నేమేమి నరులకు నిచ్చు నన్నియును


జలజోదరుఁడు నిజసంకీర్తనమునఁ
గలియుగంబున నిచ్చుఁ గావున, నీవు

ప్రతిలేని వేంకటపతిమీఁద భక్తి-
నతని దాసులమీఁద నారీతి భక్తి

వదలక మనుమని వరదుఁడై పలికె;-
నది మొద లా రాజు నఱలేని కూర్మి


సభయుఁడై యన్నమాచార్యు శేషాద్రి-
విభునిఁగా నాత్మ భావింపుచునుండె;


సకలలోకములు నా చందాన గురుని
నకలంకగతిఁ గొనియాడంగఁదొడఁగె;-


నా రాజు వీడ్కొని యాదేశికుండు
నారాయణాచలనాథు సేవించి


శృంగారమంజరిఁ జేసి శేషాద్రి-
శృంగవాసునకు నర్పించి యిచ్చుటయు,


నాడుచుఁ బతకమాకన్నలజోల
పాడఁగ నాఁడెల్లఁ బసిబిడ్డ నైతి-


నా కృష్ణమాచార్యు నధ్యాత్మవినుతి-
రాకఁ గొన్నాళ్ళు విరక్తుండనైతి


జగతి నీ శృంగారసంకీర్తనముల-
కగపడి మంచిప్రాయపువాఁడ నయితి


నని వేంకటేశ్వరుఁ డన్నమాచార్యుఁ
గనుఁగొని వాక్రుచ్చి గౌరవించుటయు


వేదముల్ పొగడఁ గోవిదులు నుతింప
నా దేవతలు కొనియాడ గోవింద !


నే నిన్నుఁ గొనియాడ నెంతటివాఁడ
నా నేర్పు నీ నేరు పరసి చూచినను


పలికెడు వఈణలోపలి చక్కఁదనము
పలికించునతనిదై పరఁగిన రీతి-


నని వినుతించి , యయ్యంబుజోదరునిఁ
దనుఁ గన్నతండ్రి నెంతయు మెచ్చఁజేసి


ప్రతివత్సరంబు తప్పక వృషభాద్రి-
పతికిఁ గావించు నా బ్రహ్మోత్సవములు


సేవించుకొనుచు నా శ్రీశైలనాథు-
పావన వినుతి ప్రభావంబుచేత


జగతిపై సకల వాచాసుద్ధి కలిగి
నగుచునైనను దీవనల నిచ్చెనేని


లలిమీఱఁ గినిసి యొల్లమిఁ దిట్టెనేని
యల రెండు నెపుడు ప్రత్యక్షమై చూపు-

0 comments

Oct 22, 2009

తాళ్ళపాక కవుల సంకీర్తనలు- రాగములవివరములు

http://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BE%E0%B0%A1%E0%B1%81%E0%B0%95%E0%B0%B0%E0%B0%BF:%E0%B0%AE%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BF%E0%B0%A8_%E0%B0%A8%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BF%E0%B0%82%E0%B0%B9%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B5%E0%B1%81/%E0%B0%85%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%AE%E0%B0%AF%E0%B1%8D%E0%B0%AF_%E0%B0%95%E0%B1%80%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A4%E0%B0%A8%E0%B0%B2_%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B5%E0%B0%B0%E0%B0%AE%E0%B1%81%E0%B0%B2%E0%B1%81

0 comments

Oct 21, 2009

బరికించి భూపతి భయమంది యతని - చరణాబ్జములఁ జక్క సాఁగిలి మ్రొక్కి

అన్నమాచార్య చరిత్రము
రాయల పశ్చాత్తాపము

బరికించి భూపతి భయమంది యతని -
చరణాబ్జములఁ జక్క సాఁగిలి మ్రొక్కి

కన్నీరు గదుర గద్గదకంఠుఁడగుచు
పన్నిన దైన్య మేర్పడఁగ నిట్లనియె;-

నపరాధి నపరాధి నన్నమాచార్య !
కృపఁజూడు నను నీవు కృపణశరణ్య !

యెఱుఁగని పసిబిడ్డఁ డేమైనఁ జేయ-
నరుదైన తల్లికి నలుగంగఁదగునె ?

నను నీవు పిన్నటనాఁటనుండియును
బనుపడ బంటుగాఁ బనిగొంటి గనుక

మందెమేళమున నీ మహిమఁ జింతింప-
కిందఱవలె నేన యిట్టు చేసితిని -

వేంకటపతివి నీవే మాకు మనసు-
శంక లింకించి ప్రసన్నుండ వగుము

నీ వలిగిన నల్గు నీలవర్ణుండు
నీవు మెచ్చిన మెచ్చు నీరజోదరుఁడు-

నాయర్థ మంతయు నన్నమాచార్య
నీయందె కంటిమి నిక్కంబు గాఁగ ;

నని పట్టమహిషితో నతనిఁ గీర్తించి
పనిఁబూని పన్నీటఁ బాదముల్ కడిగి

బంగారు విరులజొంపములఁ బూజించి
పొంగారు వేడుక భూషణావళులఁ

జిత్రాంబరంబులఁ జిత్రవస్తువులఁ
జిత్రంబుగాఁగ భూషించి తోషించి

తనకుఁగా మును పాయితంబైన పసిఁడి-
యనుసుల చతురంతయాన మెక్కించి

భజియించి తనమూఁపు పల్లకికొమ్ము
నిజభుజంబున నిడి నెమ్మి గావింప ,-

0 comments

Oct 9, 2009

నిను నొల్ల నిటువంటి నీపొందు నొల్లఁ జనియెద వేంకటేశ్వరుఁ గొల్వ నేను

అన్నమాచార్య చరిత్రము
సంకెల వేయించుట
నిను నొల్ల నిటువంటి నీపొందు నొల్లఁ
జనియెద వేంకటేశ్వరుఁ గొల్వ నేను

అనుచు దిగ్గన లేచి యరిగెడు గురుని
పనిఁబూని భటులచేఁ బట్టి చెప్పించి

తన బాల్యసఖ్యంబుఁ దలఁచి సంపదలఁ
దనయంతవానిఁగాఁ దనరఁ జేసితిని

గబ్బిమై నొక మాట కావలెనన్న
గొబ్బునఁ గోపించుకొన నేలవచ్చె

నీ వేమి సేయుదు నిను నింత సేయు-
నావల్ల నేరము నను నింత సేసె-

నని కనుఁగవ యెఱ్ఱనై నిప్పు లురుల
ననుచరవర్గంబు నదలించి పిలిచి

లోఁగి నే నెంత దాళుచు వేఁడుకొనిన
లోఁగని పుడమివేలుపుదంట కోడె-

ఱంకెలు చన మూరురాయరగండ-
సంకెల నిడి మొగసాలలో నిడుఁడ

యన నూడిగెలవార లాచార్యుఁ దోడు
కొనిపోయి మొగసాలఁ గూర్చుండ నిలిపి

కొంకుచు రాజునకును భయంపడుచు
శంకలేమియు లేక సంకెల వేసి

కావలియై నలుగడ నుండి; రంతఁ
గోవిదుఁడైన యగ్గురువరేణ్యుండు

మునుపు ప్రహ్లాదుండు మురవైరిఁ దలఁచి
దనుజబాధలఁ గాలఁ దన్నిన కరణి

ఫణిరాజశైలేంద్రుఁ బ్రణతార్తిహరుని
గణుతించి హృదయపంకజవీథి నిలిపి

"సంకెల లిడువేళఁ జంపెడువేళ-
నంకిలి ఋణదాత లాఁగెడువేళ

వదలక వేంకటేశ్వరుని నామంబె
విదలింప గతిగాని వేఱొండు లేదు

వనమాలి యతఁడె నావగపెల్ల నుడుపు"-
నను నర్థములతోడ నలవడియుండ

సంకలితాత్ముఁడై సరగున నొక్క-
సంకీర్తనముఁ జెప్పి శరణుసొచ్చుటయు

ఘల్లునఁ వీడి శృంఖల లూడె ; గుండె
ఝల్లనఁ జూచి యచ్చటివారు బెగడి

యీవిధం బంతయు నా రాజుతోడ
వేవేగఁ బఱతెంచి విన్నవించుటయు,

నగి వడి సింహాసనము డిగ్గ నుఱికి
పగగొన్న బెబ్బులిపగిది నేతెంచి

అన్నయార్యునిఁ జూచి యయ్యరో ! వద్ద
నున్నవారల కెల్ల నొగి లించి మించి (లంచ మిచ్చి కావచ్చు )

వేయని సంకెళ్ళు వీడె నటంచు
మాయురె ! నీ వెంత మాయ వన్నినను

నే నేల పోనిత్తు నిది నిక్కమైన-
నే నుండి తిరుగ వేయించెద నిపుడు

కిదుకక నీదు సంకీర్తనంబునకు
నది వీడెనా నిజంబని యెన్నవచ్చు

నీ పాలిదైవంబు, నిన్ను, నీ మహిమ
బాపురె ! యని మెచ్చి పాటింపఁదగును-

ననుచు నొద్దనె యుండి యా నిగళంబు
తనికి చేనెత్తి యిద్దఱు దేర మగుడ

నెగసెక్కెమునకు వేయించిన గురుఁడు
నగి తొంటి సంకీర్తనము సేయుటయును

కాలిసంకెల చిటికన వ్రేలి పలుము-( చిటుకన వ్రీలి పలము- అయియుండవచ్చు )
చీలలు వీడి చెచ్చెర నూడిపడినఁ

0 comments

Oct 6, 2009

అరసి విశుద్ధ శబ్దములు, నర్థములున్, ధ్వనివైభవం, బలం కరణము, రీతివృత్తులును, గల్పన, పాకము, శయ్యయు,

శశాంక విజయము - శేషము వేంకటపతి
చంద్రుని బృహస్పతి సకల విద్యా పారంగతునిగా చేయుట.
చ.
అరసి విశుద్ధ శబ్దములు, నర్థములున్, ధ్వనివైభవం, బలం
కరణము, రీతివృత్తులును, గల్పన, పాకము, శయ్యయు, న్రస
స్ఫురణము, దోషదూరత, యచుంబిత భావము లొప్పఁ, జిత్ర వి
స్తర మధు రాశు లీలఁ గవితల్ రచియింపఁగ నేర్చె నంతటన్. 54
క.
అంగనల సొక్కు మందులు,
సంగీతము, భరతశాస్త్ర సరణియు విద్యా
సంగతు లగు గంధర్వుల
సంగతి న మ్మేటి నయ మెసంగఁగ నేర్చెన్. 55
క.
అఱువది నాలుగు విద్యల
నఱు పది, యఱ పది మొగంబు లయ్య నుతింపన్
సురగురుని కరుణఁ జిర భా
సుర గురు నియతిన్ , సుబుద్ధి సోముఁడు నేర్చెన్. 56
ఇన్ని విద్యలను సురగురుని కరుణతో చంద్రుడు నేర్చుకున్నాడట. తరవాత ఏం జరిగిందంటే -----------

0 comments

Oct 1, 2009

కవులు విద్వాంసులు గాయకుల్ భూమి- ధవులు సామంతులు దనుఁ జుట్టి కొలువ-

అన్నమాచార్య చరిత్రము
మరలఁ బాటలు పాడించుట

కవులు విద్వాంసులు గాయకుల్ భూమి-
ధవులు సామంతులు దనుఁ జుట్టి కొలువ-

నంగజగురుమీఁద నభినవంబైన-
శృంగారయుతపదశ్రేణిఁ బాడింప


"చెలులార ! వేంకటశిఖరనాయకుని-
కలికికిఁ గడగంటఁ గనుపట్టునెఱుపు


చెలువ మేగతి నుండెఁ జెప్పరే " యనిన
"నలువునఁ బ్రాణేశు నాఁటిన చూపు

నిలువునఁ బెఱుక నూనిన శోణితంబు
తలపోయఁ గాదుగదా " యన్న పదము

పలుమఱుఁ బాడించి పాడించి చొక్కి
తలయూఁచి "యిది ! కవిత్వం " బని మెచ్చి


యనుపమంబైన ద్రోణాచార్యుమహిమ
గనియుఁ ద్రౌపదితండ్రి గర్వించినటుల-

నన్నమాచార్యు మహత్త్వ మంతయును
గన్నారఁ గనియును గర్వాంధుఁడగుచు

పదరక వేంకటపతిమీఁద నుడువు-
పదముల రీతి నా పై నొక్కపదము

చెప్పుమా యనవుడుఁ జెవు లిరుగేల-
నప్పళింపుచు మూసి హరిహరీ ! యనుచుఁ

బరమపతివ్రతాభావంబుఁ బూని
హరి ముకుందునిఁ గొనియాడు నా జిహ్వ

నినుఁ గొనియాడంగనేర దెంతైన
నను నెట్లు పలికితి నైచ్యంపుఁబలుకు-
 

నాయచ్యుతునిఁ దక్క నన్యుల వినుతి-
సేయుట నా కన్న చెలియలి వావి



0 comments

Sep 28, 2009

ఆఱని దివ్వె, యక్షయమహానిధి చూపు నవాంజనంబు, నూ రూరికి వచ్చి తోడుపడ నోపిన బంధుఁడు,

శశాంక విజయము
అత్రి ముని గావించిన విద్యా ప్రశంస
చ.

చదువునఁ బ్రజ్ఞ, దాన సరసజ్ఞత, యందునఁ గార్యఖడ్గ కో
విదతయు, దానఁజేసి ప్రతివీర నృపాల జయంబు, వానిచే
పదనుగ మీఱు సంపదలు, నందునఁ ద్యాగము భోగ, మందుచేఁ
బదపడి కీర్తి, దాన ననపాయ పదంబును గల్గు నెంచగన్. 35
ఉ.
ఆఱని దివ్వె, యక్షయమహానిధి చూపు నవాంజనంబు, నూ
రూరికి వచ్చి తోడుపడ నోపిన బంధుఁడు, జ్ఞాతి వర్గము
ల్గోరని సొమ్ము, దేవ నర లోక వశీకర ణౌషదం, బసా
ధారణ మైన విద్య, వసుధ న్నుతియింప వశంబె యేరికిన్ ? 36
క.
చెఱకునకుఁ బండు, పసిఁడికిఁ
బరిమళమును జిత్తమునకుఁ బ్రాణంబును, దా
నరుదుగఁ గల్గిన రీతిని;
నరపతులకు విద్య గలిగిన న్నలు వెసఁగున్. 37
ఈ పద్యాలు చదువుతుంటే భర్తృహరి సుభాషితాలు గుర్తుకొస్తున్నాయి నాకు.
ముఖ్యంగా ఏనుగు లక్ష్మణ కవిగారి పద్యాలు
శ్లో!!
విద్యానామ నరస్య రూపమధికం ప్రచ్ఛన్నగుప్తం ధనం!
విద్యా భోగకరీ యశస్సుఖకరీ విద్యాగురూణాం గురుః!
విద్యా బంధుజనో విదేశగమనే విద్యా పరం లోచనం!
విద్యా రాజసుపూజ్యతే నహి ధనం విద్యావిహీనః పశుః!! భర్తృహరి.నీతి.16.

ఉ.
విద్య నిగూఢగుప్త మగు విత్తము రూపము పూరుషాళికిన్
విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశబంధుఁడున్
విద్య విశిష్టదైవతము విద్యకు సాటి ధనంబు లే దిలన్
విద్య నృపాలపూజితము విద్య నెఱుంగనివాఁజు మర్త్యుడే.
ఏనుగు లక్ష్మణ కవి

మానవులకు విద్యయే సౌందర్యము;అదియే గుప్త ధనము; చదువే కీర్తిని,సుఖమును,భోగమును కలిగించును; విద్యయే గురువులకు గురువైనది; విదేశములకు పోయినపుడు విద్యయే బంధువు; అదియే మరొక కన్నువంటిది; రాజసభలలో పూజార్హత విద్యకే గాని ధనమునకు గాదు. ఇంతటి శ్రేష్ఠమైన విద్య లేని నరుడు వింతపశువు మాత్రమే.
ఇదే కాకుండా ఇంకా
విద్య యొసగును వినయంబు,
వినయంబునను బడయు పాత్రత,
పాత్రత వలని ధనంబు, దాని వలన
ఐహికాముష్మిక సుఖంబు లందు నరుండు.

0 comments

Sep 27, 2009

కనకాంబరుని గుణగణముల్ శ్రుతులు గని చిక్కుగొనురీతిఁ గను కపోలములు

అన్నమాచార్య చరిత్రము
రాయఁ డన్నమాచార్యుని మరలఁ బిలిపించుట
కనకాంబరుని గుణగణముల్ శ్రుతులు
గని చిక్కుగొనురీతిఁ గను కపోలములు


నత్తఱి మదిలోని హరికీర్తి మొలక-
లొత్తినగతి నున్న యూర్ధ్వపుండ్రములు


లాలితాచ్యుతభక్తిలలన వరించు-
మాలికగతి తిరుమణివడంబులును

తలనిడు విష్ణుపాదపుఁ దమ్మిపువ్వు
మెలుపైన కెంబట్టు మేలుకుళ్ళాయి


అరవిందనయను కృపామృతధార-
కరణిఁ జూపట్టెడు కంఠమాలికయు


నరహరికై కంకణము గట్టియున్న-
సరణిఁ జూపట్టు పచ్చల కడియములు


ధవళనేత్రుని శారదావిలాసంబు
నివసించునట్లున్న నిలువు పేరణము


వాసుదేవునియాజ్ఞ వడిఁ జుట్టుకొన్న-
యా సత్త్వగుణమున నలరు దుప్పటము


నలవఁడ జతురంతయానంబు నెక్కి
బలసి సంకీర్తనపరుల సేవింప

ఘనతర ధవళ శంఖధ్వానమడరఁ
జనుదెంచి నృపతి యాస్థానంబు చెంతఁ

బల్లకి డిగి వెంటఁ బరఁగు వైష్ణవుని-
నల్లన చెయ్యూఁది యాలోని కరిగి


కూరిమిఁ దనరాక కోరి వీక్షించు-
నారాజుఁ గదిసి నెయ్యముతియ్య మెసఁగ


సొలవక " శ్రీనివాసో రక్ష " తనుచు
నెలమిఁ జే తిరుమణి నిచ్చె నిచ్చుటయు,


నెదురుగాఁ జనుదెంచి యెలమిఁ జేకొనుచు
ముదమునఁ గరపద్మములు సాఁగి మ్రొక్కి


యన్నమాచార్యుతో ననుఁగు దీపింపఁ
దిన్నని పసిఁడిగద్దియమీఁద నుండి




0 comments

Sep 22, 2009

కర్ణాట కామినీ కర్ణావతంసిత కర్ణి కార పరాగ గణము రాల్చి

ప్రతిష్ఠానపురం లోని పుష్పలావికలు
సీ.

కర్ణాట కామినీ కర్ణావతంసిత
కర్ణి కార పరాగ గణము రాల్చి
మధు రాధ రాచర ల్మధురాధరా పున
ర్మిధువ నోత్సాహము ల్నిగుడఁ జేసి,
కుంత లాంచ దరాళ కుంత లాగరుగంధి
కుంత లామోదము ల్కొల్ల లాడి,
లాట శుద్ధాంత లలాట ఘర్మాంబు లీ
లాటన క్రియలఁ బాయంగఁ ద్రోసి,
గీ.
నలిన కువలయ నవ లయ నటన పటిమ
చలిత లలితవ దళికుల కలకల కల
వితత గతి కృతి చతురత వెలసి సొలసి,
విసరు మరు దంకురంబు ల వ్వీట నెపుడు. 28

చ.
"కలువల కేమి ? నీ విపుడు కన్గొనినంతనె తెప్ప తెప్పలౌ,
నలినము లెన్ని రావు లలనామణి ! నీ విటు మోము ద్రిప్పినన్ ?
వలసిన సంపెగ ల్గలుగవా మఱి నీ మెయి చాయ దాయ ? " నం
చెలమి విటాళి పల్క , విరు లిత్తురు నప్పురిఁ బుష్పలావికల్. 29

0 comments

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks