అన్నమాచార్య చరిత్రము
సంకెల వేయించుట
నిను నొల్ల నిటువంటి నీపొందు నొల్లఁ
జనియెద వేంకటేశ్వరుఁ గొల్వ నేను
అనుచు దిగ్గన లేచి యరిగెడు గురుని
పనిఁబూని భటులచేఁ బట్టి చెప్పించి
తన బాల్యసఖ్యంబుఁ దలఁచి సంపదలఁ
దనయంతవానిఁగాఁ దనరఁ జేసితిని
గబ్బిమై నొక మాట కావలెనన్న
గొబ్బునఁ గోపించుకొన నేలవచ్చె
నీ వేమి సేయుదు నిను నింత సేయు-
నావల్ల నేరము నను నింత సేసె-
నని కనుఁగవ యెఱ్ఱనై నిప్పు లురుల
ననుచరవర్గంబు నదలించి పిలిచి
లోఁగి నే నెంత దాళుచు వేఁడుకొనిన
లోఁగని పుడమివేలుపుదంట కోడె-
ఱంకెలు చన మూరురాయరగండ-
సంకెల నిడి మొగసాలలో నిడుఁడ
యన నూడిగెలవార లాచార్యుఁ దోడు
కొనిపోయి మొగసాలఁ గూర్చుండ నిలిపి
కొంకుచు రాజునకును భయంపడుచు
శంకలేమియు లేక సంకెల వేసి
కావలియై నలుగడ నుండి; రంతఁ
గోవిదుఁడైన యగ్గురువరేణ్యుండు
మునుపు ప్రహ్లాదుండు మురవైరిఁ దలఁచి
దనుజబాధలఁ గాలఁ దన్నిన కరణి
ఫణిరాజశైలేంద్రుఁ బ్రణతార్తిహరుని
గణుతించి హృదయపంకజవీథి నిలిపి
"సంకెల లిడువేళఁ జంపెడువేళ-
నంకిలి ఋణదాత లాఁగెడువేళ
వదలక వేంకటేశ్వరుని నామంబె
విదలింప గతిగాని వేఱొండు లేదు
వనమాలి యతఁడె నావగపెల్ల నుడుపు"-
నను నర్థములతోడ నలవడియుండ
సంకలితాత్ముఁడై సరగున నొక్క-
సంకీర్తనముఁ జెప్పి శరణుసొచ్చుటయు
ఘల్లునఁ వీడి శృంఖల లూడె ; గుండె
ఝల్లనఁ జూచి యచ్చటివారు బెగడి
యీవిధం బంతయు నా రాజుతోడ
వేవేగఁ బఱతెంచి విన్నవించుటయు,
నగి వడి సింహాసనము డిగ్గ నుఱికి
పగగొన్న బెబ్బులిపగిది నేతెంచి
అన్నయార్యునిఁ జూచి యయ్యరో ! వద్ద
నున్నవారల కెల్ల నొగి లించి మించి (లంచ మిచ్చి కావచ్చు )
వేయని సంకెళ్ళు వీడె నటంచు
మాయురె ! నీ వెంత మాయ వన్నినను
నే నేల పోనిత్తు నిది నిక్కమైన-
నే నుండి తిరుగ వేయించెద నిపుడు
కిదుకక నీదు సంకీర్తనంబునకు
నది వీడెనా నిజంబని యెన్నవచ్చు
నీ పాలిదైవంబు, నిన్ను, నీ మహిమ
బాపురె ! యని మెచ్చి పాటింపఁదగును-
ననుచు నొద్దనె యుండి యా నిగళంబు
తనికి చేనెత్తి యిద్దఱు దేర మగుడ
నెగసెక్కెమునకు వేయించిన గురుఁడు
నగి తొంటి సంకీర్తనము సేయుటయును
కాలిసంకెల చిటికన వ్రేలి పలుము-( చిటుకన వ్రీలి పలము- అయియుండవచ్చు )
చీలలు వీడి చెచ్చెర నూడిపడినఁ
Oct 9, 2009
నిను నొల్ల నిటువంటి నీపొందు నొల్లఁ జనియెద వేంకటేశ్వరుఁ గొల్వ నేను
Posted by
Unknown
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment