నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

Feb 3, 2014

వర్ణన రత్నాకరము (అమరేశ్వరుని విక్రమ సేనము)

వర్ణన రత్నాకరము  (అమరేశ్వరుని విక్రమ సేనము)

సీ.

ప్రత్యగ్ర రచనాతి భాసుర ప్రాసాద

             నిర్జిత గోత్రావనీ ధరంబు

ప్రాకార శిఖరాగ్ర బంధుర మణిగణ

             ద్విగుణిత తారకా విభ్రమంబు

పరిఖా జలాంతర ప్రతిబింబిత ద్రుమ

              స్మారిత పాతాళ భూరుహంబు

వర పుష్పసౌరభా వర్జిత మధు పశూ

              న్యీ కృ తాశా వారణేంద్ర గండ

తే.

మప్స్సృహణీయ లీలాతిశయ వి

లాసినీ జననేత్ర విలాస జనిత

కుసుమ శరబాణ వైహర్త్య మసదృశార్థ

నిర్జితాలక ముజ్జయినీ పురంబు.

                          చిమ్మపూడి  యమరేశ్వరుడు   విక్రమ సేనము 

0 comments

వర్ణన రత్నాకరము పుర వర్ణనము (నిర్వచనోత్తర రామాయణము)

వర్ణన రత్నాకరము - పుర వర్ణనము - (నిర్వచనోత్తర రామాయణము)

సీ.

అఖిల భోగములకు నాస్పదం బగుట భో

               గీంద్రు పట్టనమున కీడ యనియు

ధన సమృద్ధుల కెల్లఁ దల్లి యి ల్లగుటఁ గు

                బేరుని వీటికిఁ బెద్ద యనియు

వై భవంబులకు నావాసం బగుట నమ

                 రాధీశు పురమున కధిక మనియు

నిర్మల వృత్తికి నెల వగుటను భార

                 తీశ్వరు ప్రోలికి నెక్కు డనియు


ఆ.వె.

వినుతి సేయఁ జాలి వివిధోత్సవంబుల

నతిశయిల్లి సజ్జనా భిరామ

మై కరంబు వొలుచు నన్నగరంబు వి

స్ఫురిత సకల వస్తు పూర్ణ మగుచు.

                                           నిర్వచనోత్తర రామాయణము అ 1 పద్య 46

             అయోధ్యానగరం అనుకుంటాను ఆ నగరం.

0 comments

వర్ణన రత్నాకరము - పురవర్ణనము (అథర్వణ భారతము)

వర్ణన రత్నాకరము -పుర వర్ణనము (అథర్వణ భారతము)

రాజ మండల పూర్ణ రాజ మండల వీథి
                    రత్న గర్భామల రత్న గర్భ
గంధర్వ గంధర్వ గంధర్వ నగరంబు
                     నాగ పున్నాగ పున్నాగ వనము
మార్గణ మార్గణ మార్గణ పీఠ ము
                     త్తుంగ భుజంగ భుజంగ భూమి
కాంత కాంతారాతి కాంత కుంతస్థలి
                     వీర కుమార కుమార సరసి

ఆ.వె.

యనఁగఁ బొగడు కెక్కు నలకాపురంబు దే
వేంద్రుపురము దానవేంద్రు పురము
గ్రేణి సేయు లలిత శోణాంశు మణిబద్ధ
గోపురంబు హస్తినాపురంబు.

                              అథర్వణ భారతము
(ఈ పుస్తకము మనకు ఎక్కడైనా లభించేనా?)

0 comments

Feb 1, 2014

వర్ణన రత్నాకరము -4 (కాళిందీ పరిణయము)

వర్ణన రత్నాకరము - శాలిపాలికలు
సీ.
ఉవిదరో యెటులుండె నూరు దెల్పుమటన్న, ననఁటి తోఁటకు దగ్గఱనుచు బలుకు
మార్గంబుఁ జూపవే మదిరాక్షిరో యన, రెండుకొండలదండ నుండు ననును
నడబావిఁ జూపవే నలినాక్షిరో యన, సౌపానముల చెంత జరుగు మనును
లలన కొమ్మలచెంత నిలిచిపోయెదనన్న, నిచ్చఁ దీఱఁగ నుండ వచ్చు ననును
గీ.
ఇటుల రసగర్భ నిర్భర చటులవాక్య, గరిమఁ బాంథుల మనములఁ గరఁగ జేయఁ
జాలి యుద్యానసీమల నేలుచుండు, శాలిపాలిక లవ్వీటఁ జాలఁగలరు.

                                                                      కాళిందీ పరిణయము, అ-1, పద్య 66.




0 comments

వర్ణన రత్నాకరము-3(రసికజన మనోరంజనము)

వర్ణన రత్నాకరము - వనవిహారము - పుష్పాపచయము


సీ.
వడిఁ బొన్నఁ విరిబోణి విరిఁగోసి యొడిఁబెట్టె నొక్కతె, పొక్కిలితో సరి పోల్చుకరణి
వెసఁగోసి సంపంగి విరిని మూర్కొనె నోరు, ముక్కు తోడను సరిపోల్చుకరణి
చిగురుజొంపము ద్రుంచి చేతఁ దాల్చె నొకర్తు, పొరిఁ గేలితో సరి పోల్చుకరణి
మొగలిరేకులు గోట ముట్టిగిల్లె నొకర్తు, మొగి గోళ్ళతో సరిపోల్చుకరణి

గీ.
దొండపండును గొఱికె నాతుక యొకర్తు, పొసఁగఁ గెమ్మోవితో సరిపోల్చుకరణి
తీవ మెయినంటఁ జేయెత్తి తిగిచె నొకతె, పూని నెమ్మేనితో సరిపోల్చుకరణి.
                                                 రసికజన మనోరంజనము, అ 3, పద్య 26.

0 comments

వర్ణన రత్నాకరము-2 (కవిజన చకోర చంద్రోదయము)

వర్ణన రత్నాకరము- వన విహారము, పుష్పాపచయము
సీ.
ఒక కుందరదన చంపకమును వీక్షించి, మునుముక్కుననె కోపమును వహించె
నొక పద్మనేత్రి వేడుక కుందములు డాసి, పటపటపటమని పండ్లు గొఱిగె
నొక రాజనిభముఖి వికసితాంబుజముల, గనుఁగొని విసువక కాలు ద్రవ్వె
నొక మత్తగజయాన యుత్ఫుల్లసుమశాఖ, పాళిని దిలకించి బార సాఁచెఁ

సరసభాషిణి యొక్కతె చక్కనైన, తములపాకుల తీవ మొత్తంబుఁ జూచి
విడనిరోసంబుచే నొళ్ళు విఱువసాగె, సహజవైరంబుఁ బూని యచ్చటఁ గరంబు.
                                              కవిజన చకోరచంద్రోదయము, అ 3. - నారపరాజు కాంతకవి 


0 comments

Jan 30, 2014

వర్ణన రత్నాకరం -1 (ఒడయనంబి విలాసం నుండి)


స్త్రీ వర్ణనము
సీ.
మగువయానముఁజూడమత్తేభవిక్రీడ
సఖినాసమహిమంబుచంపకంబు
కలికికన్నులలీలతలపఁనుత్పలమాల
 పొలఁతి సత్కటి వృద్ధి వొసఁగఁ బృథ్వి
జలజాక్షి కర్ణముల్చెలఁగుశ్రీవృత్తముల్
కొమ్మ కంఠంబుమత్త కోకిలంబు
చాన నూఁగారు భుజంగ ప్రయాతంబు
వనిత యొప్పులకుప్పవనమయూర


మౌర యంగన సొంపుచే నలరు వృత్తి
పటిమఁ గాంచి మనోహర ప్రతిభమించె
సత్ప్రబంధముగతినిరాజ్యమునజెలఁగెఁ
జిత్త జునిధాటి పరమ నాచీవధూటి.                                                        ఒడయనంబి విలాసము (అజ్జరపు పేరయ కవి) 1వ అధ్యాయము 106 వ పద్యము

 

2 comments

Jan 29, 2014

వర్ణన రత్నాకరం

వర్ణన రత్నాకరము

ఈ పుస్తకం ఒక గొప్పపుస్తకం. సుమారు 3260 పైగా పద్యాలు ఇందులో ఉన్నాయి. ఎన్నో కావ్యాలనుండి వర్ణనలను ఏర్చికూర్చిన పుస్తకం. దాసరి లక్ష్మణస్వామిగారిచే సంకలనం చేయబడింది. పిఠాపుర సంస్థానంలో ఉన్న వేంకటరామకృష్ణకవుల సూచనపై ఈ గ్రంథం సంకలనం చేయబడింది. సుమారు 286 పైగా కావ్యాలనుండి ఈ పద్యాలు సంకలనం చేయబడ్డాయి. ఈ పుస్తకం నుండి కొన్ని కొన్ని పద్యాలను ఎత్తి వ్రాసి పద్యప్రియులను ఆనందింప చేయాలని ఓ చిన్న సంకల్పంతో మొదలు పెట్టాను.ఎంతవరకూ వరకూ పూర్తి చేయగలుగుతానో తెలియదు.            
                                                                                                                                              

0 comments

May 18, 2013

మరచిపోలేని మంచిరోజు

మరచిపోలేని  మంచిరోజు
ఈ రోజు మే నెల 17వ తారీఖు. నేనూ నా భార్యా అమెరికా వచ్చి అప్పుడే 11 రోజులయింది. మా అబ్బాయి చి.కృష్ణకిషోర్ ఈ రోజున అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా నుండి తన Executive M.B.A. Degree ని అందుకొనే Commencement రోజు( మన దేశంలో Convocation అని అంటారు దీన్ని). ఇందుకోసమనే మేమిద్దఱం ఇండియా నుండి బయలుదేరి అమెరికాలో వాడు నివసిస్తున్న Los Angels కు దగ్గఱగానున్న కరోనా కు ఈనెల 6వ తారీఖున వచ్చాము.

మా అబ్బాయి అమెరికా వచ్చి దాదాపు 14 సంవత్సరాల పైగా కాలం గడచినప్పటికీ మేం వాడిని చూడటానికి అమెరికా రావటం పడలేదు. చివరికి ఈ Commencement కి రావటానికై అప్లై చేస్తే వీసా వచ్చింది. అంతకు పూర్వం ఓసారి వీసా కోసం ప్రయత్నిస్తే అది సఫలం కాలేదు.


మా అబ్బాయి ఇండియాలో చదువుకున్నది B.B.M. వాడిని నేను వాడు చదువుకునే రోజుల్లో కొన్ని ప్రత్యేక పరిస్థితులవల్ల ఇంజనీరింగ్ చదివించలేక పోయాను. వాడు Peoples Soft పూర్తిచేసి అమెరికాకు ఉద్యోగం నిమిత్తం 1998లో వచ్చాడు. ఇంజనీరింగ్ చదవలేకపోయాననే బాధ వాడిని అధికంగా పీడిస్తూ ఉండేది. తరవాత్తఱవాత వాడు కొంచెం అమెరికాలో సెటిల్ అయ్యాక తన జాబ్ తాను చేసుకుంటూనే Executive M.B.A. Course ను తన స్వంత సంపాదనతో పూర్తి చేసాడు. ఇది మాకు చాలా ఆనందం కలిగించిన విషయం. పిల్లలు ప్రయోజకులైతే పెద్దవాళ్ళకి సహజంగా కలిగే ఆనందాన్ని ఈరోజు మేమిద్దఱం అనుభవించాం. కానీ ఓప్రక్క వాడిని చదువుకునే రోజుల్లో వాడి కోరిక మేరకు చదివించలేకపోయామనే బాధ  మమ్మల్ని పీడిస్తూనే ఉన్నది. ఈరోజు మేం అనుభవిస్తున్న ఈ సంతోషాన్ని నా బ్లాగు మిత్రులందరితో పంచుకోవాలనిపించి ఈ పోస్టును వ్రాయటం జరిగింది.

3 comments

Mar 12, 2013

నా అనువాద పద్యాలు(సంస్కృత శ్లోకాలకి)

ప్రసిద్ధమైన సంస్కృత శ్లోకాలకు నేను చేసిన తెలుగు పద్యానువాదాలు.పెద్దలు తప్పులున్న తెలియజేయ ప్రార్థితులు

శిశుర్వేత్తి పశుర్వేత్తి
వేత్తి గాన రసం ఫణిఃI
కోవేత్తి కవితా తత్త్వం
శివో జానాతి వా నవాII

శిశువులు పశువులు పాములు
వశులగుదురు గానమునకు వసుధను చూడన్
వశమా కవితా తత్త్వము 
శశిధరునకు నైనతెలియ? శక్తులె యితరుల్?

చితా చింతా ద్వయోర్మధ్యే
చింతా నామ గరీయసీI
చితా దహతి నిర్జీవం
చింతా ప్రాణయుతం వపుఃII

చితి చింతల రెంటి నడుమ
చితి కంటెను చింత యధిక చింతా కరమౌ
చితి కాల్చును నిర్జీవిని
చితి లేకయె కాల్చు చింత జీవముతోనే.

మితం దదాతి  హి పితా
మితం మాతా మితం సుతఃI
అమితస్య తు దాతారం
భర్తారం కాన పూజయేత్II

మితముగ నిచ్చును తండ్రీ
మితమును మించకయె యిత్రు మాతా సుతులున్
మితమును లేకయె యిచ్చును
పతి యెప్పుడు సతికి కాన ప్రణతులు సేయున్.

వృశ్చికస్య విషం పుచ్ఛం
మక్షికస్య విషం శిరః
తక్షకస్య విషం దంష్ట్రా 
సర్వాంగం దుర్జనే విషం.

విషముండు కొండి తేలుకు
విషముండును మక్షికముకు వెలయగ తలలోన్
విషముండు కోర పాముకు
విషముండును ఖలునకు నిలువెల్లను చూడన్.

రజనీకరః కిల శీతో
రజనీకరా చ్చందనో మహా శీతః
రజనీకరచ్ఛందనాభ్యాం
సజ్జనవచనాని శీతాని.

రజనీ కరుడగు చల్లన
రజనీకరు మించి చలువ వ్రాసిన గంధం
రజనీకర గంధములకు
సుజనుల వచనములు మిన్న శుభములు గూర్చున్.

జీవితం ధర్మ కామౌచ
ధనే యస్మాత్ప్రతిష్ఠితౌ
తస్మాత్సర్వ ప్రయత్నేన
ధనహింసాం వివర్జయేత్.

ధనమాధారము బ్రతుకుకు
ధనమే కావలయు కామ ధర్మములకునై 
ధనమును రక్షించవలయు
అనయము ధనహింసవిడచి అవనిలొ మనుజుల్.

సంతుష్టో భార్యయా భర్తా
భర్త్ర్రా భార్యా తథైవ చ
యస్మిన్నేవ కులే నిత్యం 
కల్యాణం తత్ర వై ధృవం.

సతి వలన సుఖము పతికిని 
పతి వలనను సుఖము సతికి పదపడి కలుగున్
పతి సతుల గేహమందున
సతతము కల్యాణమౌను సందియ మేలా?    

న జాతు కామః కామానాం
ఉపభోగేన శామ్యతి 
హవిషా కృష్ణ వర్త్మేవ 
భూయ ఏవా2భి వర్ధతే.

అనుభవించిన కోరిక లంత మగునె? 
ననలు సాగుచు నుండు నంతంబు లేక
ఘృతము వోసిన భగ్గను హుతము వోలె!
కోరికల ద్రుంచ మే లొనగూడు భువిని.

మతయో యత్ర గచ్ఛంతి 
తత్ర గచ్ఛంతి వానరాః
శాస్త్రాణి  యత్ర గచ్ఛంతి
తత్ర గచ్ఛంతి తే నరాః. 

మతులెటు నడపునొ తమ నా
గతులనె అవి పోవుచుండు కోతులు చూడన్
శృతులెటు నడపునొ తమ నా
గతులనె చనుచుంద్రు నరులు కాలములోనన్.

గీతే వాద్యే తథా నృత్యే 
సంగ్రామే రిపు సంకటే 
ఆహారే  వ్యవహారే చ
త్యక్త లజ్జః సుఖీ భవేత్.

సంగీత నృత్యములలో 
సంగ్రామములోన శతృ సంకట మపుడున్
ఓగిర వ్యవహారమ్ముల
మోమోటమి వదలువాడె మోదము నందున్.

గురు శుశ్రూషయా విద్యా
పుష్కలేన ధనేన వా
అథవా విద్యాయా విద్యా
చతుర్యా న్నోప లభ్యతే.

విద్యను గురు శుశ్రూషనె
విద్యను ధనమిచ్చి లేక విద్యను యొసగీ
విద్యను బడయగ వచ్చును 
విద్యను పొందను మరియొక విధమే లేదే.



1 comments

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks