ప్రసిద్ధమైన సంస్కృత శ్లోకాలకు నేను చేసిన తెలుగు పద్యానువాదాలు.పెద్దలు తప్పులున్న తెలియజేయ ప్రార్థితులు
వేత్తి గాన రసం ఫణిఃI
కోవేత్తి కవితా తత్త్వం
శివో జానాతి వా నవాII
శిశువులు పశువులు పాములు
వశులగుదురు గానమునకు వసుధను చూడన్
వశమా కవితా తత్త్వము
శశిధరునకు నైనతెలియ? శక్తులె యితరుల్?
చితా చింతా ద్వయోర్మధ్యే
చింతా నామ గరీయసీI
చితా దహతి నిర్జీవం
చింతా ప్రాణయుతం వపుఃII
చితి చింతల రెంటి నడుమ
చితి కంటెను చింత యధిక చింతా కరమౌ
చితి కాల్చును నిర్జీవిని
చితి లేకయె కాల్చు చింత జీవముతోనే.
మితం దదాతి హి పితా
మితం మాతా మితం సుతఃI
అమితస్య తు దాతారం
భర్తారం కాన పూజయేత్II
మితముగ నిచ్చును తండ్రీ
మితమును మించకయె యిత్రు మాతా సుతులున్
మితమును లేకయె యిచ్చును
పతి యెప్పుడు సతికి కాన ప్రణతులు సేయున్.
వృశ్చికస్య విషం పుచ్ఛం
మక్షికస్య విషం శిరః
తక్షకస్య విషం దంష్ట్రా
సర్వాంగం దుర్జనే విషం.
విషముండు కొండి తేలుకు
విషముండును మక్షికముకు వెలయగ తలలోన్
విషముండు కోర పాముకు
విషముండును ఖలునకు నిలువెల్లను చూడన్.
రజనీకరః కిల శీతో
రజనీకరా చ్చందనో మహా శీతః
రజనీకరచ్ఛందనాభ్యాం
సజ్జనవచనాని శీతాని.
రజనీ కరుడగు చల్లన
రజనీకరు మించి చలువ వ్రాసిన గంధం
రజనీకర గంధములకు
సుజనుల వచనములు మిన్న శుభములు గూర్చున్.
జీవితం ధర్మ కామౌచ
ధనే యస్మాత్ప్రతిష్ఠితౌ
తస్మాత్సర్వ ప్రయత్నేన
ధనహింసాం వివర్జయేత్.
ధనమాధారము బ్రతుకుకు
ధనమే కావలయు కామ ధర్మములకునై
ధనమును రక్షించవలయు
అనయము ధనహింసవిడచి అవనిలొ మనుజుల్.
సంతుష్టో భార్యయా భర్తా
భర్త్ర్రా భార్యా తథైవ చ
యస్మిన్నేవ కులే నిత్యం
కల్యాణం తత్ర వై ధృవం.
సతి వలన సుఖము పతికిని
పతి వలనను సుఖము సతికి పదపడి కలుగున్
పతి సతుల గేహమందున
సతతము కల్యాణమౌను సందియ మేలా?
న జాతు కామః కామానాం
ఉపభోగేన శామ్యతి
హవిషా కృష్ణ వర్త్మేవ
భూయ ఏవా2భి వర్ధతే.
అనుభవించిన కోరిక లంత మగునె?
ననలు సాగుచు నుండు నంతంబు లేక
ఘృతము వోసిన భగ్గను హుతము వోలె!
కోరికల ద్రుంచ మే లొనగూడు భువిని.
మతయో యత్ర గచ్ఛంతి
తత్ర గచ్ఛంతి వానరాః
శాస్త్రాణి యత్ర గచ్ఛంతి
తత్ర గచ్ఛంతి తే నరాః.
మతులెటు నడపునొ తమ నా
గతులనె అవి పోవుచుండు కోతులు చూడన్
శృతులెటు నడపునొ తమ నా
గతులనె చనుచుంద్రు నరులు కాలములోనన్.
గీతే వాద్యే తథా నృత్యే
సంగ్రామే రిపు సంకటే
ఆహారే వ్యవహారే చ
త్యక్త లజ్జః సుఖీ భవేత్.
సంగీత నృత్యములలో
సంగ్రామములోన శతృ సంకట మపుడున్
ఓగిర వ్యవహారమ్ముల
మోమోటమి వదలువాడె మోదము నందున్.
గురు శుశ్రూషయా విద్యా
పుష్కలేన ధనేన వా
అథవా విద్యాయా విద్యా
చతుర్యా న్నోప లభ్యతే.
విద్యను గురు శుశ్రూషనె
విద్యను ధనమిచ్చి లేక విద్యను యొసగీ
విద్యను బడయగ వచ్చును
విద్యను పొందను మరియొక విధమే లేదే.
1 comments:
ЗДОРОВО .. !!! ..
ВЫ МОЛОДЕЦ , СТОЛЬКО СТАРАНИЙ И ТВОРЧЕСКОГО ПОДХОДА .
Post a Comment