నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

Feb 1, 2014

వర్ణన రత్నాకరము-3(రసికజన మనోరంజనము)

వర్ణన రత్నాకరము - వనవిహారము - పుష్పాపచయము


సీ.
వడిఁ బొన్నఁ విరిబోణి విరిఁగోసి యొడిఁబెట్టె నొక్కతె, పొక్కిలితో సరి పోల్చుకరణి
వెసఁగోసి సంపంగి విరిని మూర్కొనె నోరు, ముక్కు తోడను సరిపోల్చుకరణి
చిగురుజొంపము ద్రుంచి చేతఁ దాల్చె నొకర్తు, పొరిఁ గేలితో సరి పోల్చుకరణి
మొగలిరేకులు గోట ముట్టిగిల్లె నొకర్తు, మొగి గోళ్ళతో సరిపోల్చుకరణి

గీ.
దొండపండును గొఱికె నాతుక యొకర్తు, పొసఁగఁ గెమ్మోవితో సరిపోల్చుకరణి
తీవ మెయినంటఁ జేయెత్తి తిగిచె నొకతె, పూని నెమ్మేనితో సరిపోల్చుకరణి.
                                                 రసికజన మనోరంజనము, అ 3, పద్య 26.

0 comments

వర్ణన రత్నాకరము-2 (కవిజన చకోర చంద్రోదయము)

వర్ణన రత్నాకరము- వన విహారము, పుష్పాపచయము
సీ.
ఒక కుందరదన చంపకమును వీక్షించి, మునుముక్కుననె కోపమును వహించె
నొక పద్మనేత్రి వేడుక కుందములు డాసి, పటపటపటమని పండ్లు గొఱిగె
నొక రాజనిభముఖి వికసితాంబుజముల, గనుఁగొని విసువక కాలు ద్రవ్వె
నొక మత్తగజయాన యుత్ఫుల్లసుమశాఖ, పాళిని దిలకించి బార సాఁచెఁ

సరసభాషిణి యొక్కతె చక్కనైన, తములపాకుల తీవ మొత్తంబుఁ జూచి
విడనిరోసంబుచే నొళ్ళు విఱువసాగె, సహజవైరంబుఁ బూని యచ్చటఁ గరంబు.
                                              కవిజన చకోరచంద్రోదయము, అ 3. - నారపరాజు కాంతకవి 


0 comments

Jan 30, 2014

వర్ణన రత్నాకరం -1 (ఒడయనంబి విలాసం నుండి)


స్త్రీ వర్ణనము
సీ.
మగువయానముఁజూడమత్తేభవిక్రీడ
సఖినాసమహిమంబుచంపకంబు
కలికికన్నులలీలతలపఁనుత్పలమాల
 పొలఁతి సత్కటి వృద్ధి వొసఁగఁ బృథ్వి
జలజాక్షి కర్ణముల్చెలఁగుశ్రీవృత్తముల్
కొమ్మ కంఠంబుమత్త కోకిలంబు
చాన నూఁగారు భుజంగ ప్రయాతంబు
వనిత యొప్పులకుప్పవనమయూర


మౌర యంగన సొంపుచే నలరు వృత్తి
పటిమఁ గాంచి మనోహర ప్రతిభమించె
సత్ప్రబంధముగతినిరాజ్యమునజెలఁగెఁ
జిత్త జునిధాటి పరమ నాచీవధూటి.                                                        ఒడయనంబి విలాసము (అజ్జరపు పేరయ కవి) 1వ అధ్యాయము 106 వ పద్యము

 

2 comments

Jan 29, 2014

వర్ణన రత్నాకరం

వర్ణన రత్నాకరము

ఈ పుస్తకం ఒక గొప్పపుస్తకం. సుమారు 3260 పైగా పద్యాలు ఇందులో ఉన్నాయి. ఎన్నో కావ్యాలనుండి వర్ణనలను ఏర్చికూర్చిన పుస్తకం. దాసరి లక్ష్మణస్వామిగారిచే సంకలనం చేయబడింది. పిఠాపుర సంస్థానంలో ఉన్న వేంకటరామకృష్ణకవుల సూచనపై ఈ గ్రంథం సంకలనం చేయబడింది. సుమారు 286 పైగా కావ్యాలనుండి ఈ పద్యాలు సంకలనం చేయబడ్డాయి. ఈ పుస్తకం నుండి కొన్ని కొన్ని పద్యాలను ఎత్తి వ్రాసి పద్యప్రియులను ఆనందింప చేయాలని ఓ చిన్న సంకల్పంతో మొదలు పెట్టాను.ఎంతవరకూ వరకూ పూర్తి చేయగలుగుతానో తెలియదు.            
                                                                                                                                              

0 comments

May 18, 2013

మరచిపోలేని మంచిరోజు

మరచిపోలేని  మంచిరోజు
ఈ రోజు మే నెల 17వ తారీఖు. నేనూ నా భార్యా అమెరికా వచ్చి అప్పుడే 11 రోజులయింది. మా అబ్బాయి చి.కృష్ణకిషోర్ ఈ రోజున అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా నుండి తన Executive M.B.A. Degree ని అందుకొనే Commencement రోజు( మన దేశంలో Convocation అని అంటారు దీన్ని). ఇందుకోసమనే మేమిద్దఱం ఇండియా నుండి బయలుదేరి అమెరికాలో వాడు నివసిస్తున్న Los Angels కు దగ్గఱగానున్న కరోనా కు ఈనెల 6వ తారీఖున వచ్చాము.

మా అబ్బాయి అమెరికా వచ్చి దాదాపు 14 సంవత్సరాల పైగా కాలం గడచినప్పటికీ మేం వాడిని చూడటానికి అమెరికా రావటం పడలేదు. చివరికి ఈ Commencement కి రావటానికై అప్లై చేస్తే వీసా వచ్చింది. అంతకు పూర్వం ఓసారి వీసా కోసం ప్రయత్నిస్తే అది సఫలం కాలేదు.


మా అబ్బాయి ఇండియాలో చదువుకున్నది B.B.M. వాడిని నేను వాడు చదువుకునే రోజుల్లో కొన్ని ప్రత్యేక పరిస్థితులవల్ల ఇంజనీరింగ్ చదివించలేక పోయాను. వాడు Peoples Soft పూర్తిచేసి అమెరికాకు ఉద్యోగం నిమిత్తం 1998లో వచ్చాడు. ఇంజనీరింగ్ చదవలేకపోయాననే బాధ వాడిని అధికంగా పీడిస్తూ ఉండేది. తరవాత్తఱవాత వాడు కొంచెం అమెరికాలో సెటిల్ అయ్యాక తన జాబ్ తాను చేసుకుంటూనే Executive M.B.A. Course ను తన స్వంత సంపాదనతో పూర్తి చేసాడు. ఇది మాకు చాలా ఆనందం కలిగించిన విషయం. పిల్లలు ప్రయోజకులైతే పెద్దవాళ్ళకి సహజంగా కలిగే ఆనందాన్ని ఈరోజు మేమిద్దఱం అనుభవించాం. కానీ ఓప్రక్క వాడిని చదువుకునే రోజుల్లో వాడి కోరిక మేరకు చదివించలేకపోయామనే బాధ  మమ్మల్ని పీడిస్తూనే ఉన్నది. ఈరోజు మేం అనుభవిస్తున్న ఈ సంతోషాన్ని నా బ్లాగు మిత్రులందరితో పంచుకోవాలనిపించి ఈ పోస్టును వ్రాయటం జరిగింది.

3 comments

Mar 12, 2013

నా అనువాద పద్యాలు(సంస్కృత శ్లోకాలకి)

ప్రసిద్ధమైన సంస్కృత శ్లోకాలకు నేను చేసిన తెలుగు పద్యానువాదాలు.పెద్దలు తప్పులున్న తెలియజేయ ప్రార్థితులు

శిశుర్వేత్తి పశుర్వేత్తి
వేత్తి గాన రసం ఫణిఃI
కోవేత్తి కవితా తత్త్వం
శివో జానాతి వా నవాII

శిశువులు పశువులు పాములు
వశులగుదురు గానమునకు వసుధను చూడన్
వశమా కవితా తత్త్వము 
శశిధరునకు నైనతెలియ? శక్తులె యితరుల్?

చితా చింతా ద్వయోర్మధ్యే
చింతా నామ గరీయసీI
చితా దహతి నిర్జీవం
చింతా ప్రాణయుతం వపుఃII

చితి చింతల రెంటి నడుమ
చితి కంటెను చింత యధిక చింతా కరమౌ
చితి కాల్చును నిర్జీవిని
చితి లేకయె కాల్చు చింత జీవముతోనే.

మితం దదాతి  హి పితా
మితం మాతా మితం సుతఃI
అమితస్య తు దాతారం
భర్తారం కాన పూజయేత్II

మితముగ నిచ్చును తండ్రీ
మితమును మించకయె యిత్రు మాతా సుతులున్
మితమును లేకయె యిచ్చును
పతి యెప్పుడు సతికి కాన ప్రణతులు సేయున్.

వృశ్చికస్య విషం పుచ్ఛం
మక్షికస్య విషం శిరః
తక్షకస్య విషం దంష్ట్రా 
సర్వాంగం దుర్జనే విషం.

విషముండు కొండి తేలుకు
విషముండును మక్షికముకు వెలయగ తలలోన్
విషముండు కోర పాముకు
విషముండును ఖలునకు నిలువెల్లను చూడన్.

రజనీకరః కిల శీతో
రజనీకరా చ్చందనో మహా శీతః
రజనీకరచ్ఛందనాభ్యాం
సజ్జనవచనాని శీతాని.

రజనీ కరుడగు చల్లన
రజనీకరు మించి చలువ వ్రాసిన గంధం
రజనీకర గంధములకు
సుజనుల వచనములు మిన్న శుభములు గూర్చున్.

జీవితం ధర్మ కామౌచ
ధనే యస్మాత్ప్రతిష్ఠితౌ
తస్మాత్సర్వ ప్రయత్నేన
ధనహింసాం వివర్జయేత్.

ధనమాధారము బ్రతుకుకు
ధనమే కావలయు కామ ధర్మములకునై 
ధనమును రక్షించవలయు
అనయము ధనహింసవిడచి అవనిలొ మనుజుల్.

సంతుష్టో భార్యయా భర్తా
భర్త్ర్రా భార్యా తథైవ చ
యస్మిన్నేవ కులే నిత్యం 
కల్యాణం తత్ర వై ధృవం.

సతి వలన సుఖము పతికిని 
పతి వలనను సుఖము సతికి పదపడి కలుగున్
పతి సతుల గేహమందున
సతతము కల్యాణమౌను సందియ మేలా?    

న జాతు కామః కామానాం
ఉపభోగేన శామ్యతి 
హవిషా కృష్ణ వర్త్మేవ 
భూయ ఏవా2భి వర్ధతే.

అనుభవించిన కోరిక లంత మగునె? 
ననలు సాగుచు నుండు నంతంబు లేక
ఘృతము వోసిన భగ్గను హుతము వోలె!
కోరికల ద్రుంచ మే లొనగూడు భువిని.

మతయో యత్ర గచ్ఛంతి 
తత్ర గచ్ఛంతి వానరాః
శాస్త్రాణి  యత్ర గచ్ఛంతి
తత్ర గచ్ఛంతి తే నరాః. 

మతులెటు నడపునొ తమ నా
గతులనె అవి పోవుచుండు కోతులు చూడన్
శృతులెటు నడపునొ తమ నా
గతులనె చనుచుంద్రు నరులు కాలములోనన్.

గీతే వాద్యే తథా నృత్యే 
సంగ్రామే రిపు సంకటే 
ఆహారే  వ్యవహారే చ
త్యక్త లజ్జః సుఖీ భవేత్.

సంగీత నృత్యములలో 
సంగ్రామములోన శతృ సంకట మపుడున్
ఓగిర వ్యవహారమ్ముల
మోమోటమి వదలువాడె మోదము నందున్.

గురు శుశ్రూషయా విద్యా
పుష్కలేన ధనేన వా
అథవా విద్యాయా విద్యా
చతుర్యా న్నోప లభ్యతే.

విద్యను గురు శుశ్రూషనె
విద్యను ధనమిచ్చి లేక విద్యను యొసగీ
విద్యను బడయగ వచ్చును 
విద్యను పొందను మరియొక విధమే లేదే.



1 comments

Jan 23, 2013

మా పాఠశాలలో జరిగిన మా పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం


చాలా కాలం తర్వాత ఈరోజు మీ ముందుకు వస్తున్నాను. కారణం ఏమిటంటే మొన్నను ఆదివారం నాడు (20 

జనవరి,2013 తేదీన) ఉండ్రాజవరం (మా స్వగ్రామం) లోని మల్లిన వెంకట నర్సమ్మ జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాల 

విద్యార్థులం (11 వ తరగతి 1963-1969 వరకు గల)  అందరం మా పాఠశాలలో చేరి ఒకరితో ఒకరం మా పాతకాలం 

నాటి తీపి గురుతులను నెమఱు వేసుకోవటం జరిగింది. కార్యక్రమం మొదటగా ఒక్కొక్కరు విడి విడిగా పాసుపోర్టు 

సైజు ఫొటో దిగటం(సావనీరు నిమిత్తం), అల్పాహారం పూర్తి చేసుకొని అందరూ అందరితో సరదాగా కబుర్లు

చెప్పుకోవటం, ప్రతి తరగతిలోని విద్యార్థులు అందరూ తరగతులవారీగా రంగస్థలం మీదకి వచ్చి తమ తమ

పరిచయాలను క్లుప్తంగా చెప్పటం, తరువాత మా పాఠశాల నిర్మాణానికి విరాళాలు అందజేసిన వారి వారసులను

సముచితంగా సత్కరించుకోవటం, మా పూర్వ ఉపాధ్యాయులను రంగస్థలం మీద అపురూపంగా సత్కరించు

కోవటం, గానా బజానా కార్యక్రమాలు, భరతనాట్య కార్యక్రమాలు (పిల్లలతో) చేయించటం, చివరగా మిమిక్రీ

కార్యక్రమం అంతా చాలా అట్టహాసంగా జరిగింది.


ఈ కార్యక్రమం జరిగిన విధానాన్ని సావనీరు రూపంలో అచ్చొత్తించే ప్రయత్నాలు కూడా మొదలుపెట్టాం. ఈ 

కార్యక్రమానికి కావలసిన నిధులను మా పూర్వ విద్యార్థులంతా కలసి సమకూర్చుకున్నారు.ఈ కార్యక్రమ 

నిర్వహణకు సహకరించిన సహ విద్యార్థులు ముఖ్యంగా మల్లిన శేషగిరి రావు, కుదప శివకేశవ రావు, గూడుపు 

సుబ్బారావు, చిట్టూరి సుబ్బారావు, బూరుగపల్లి చిన్నారావు, మొదలైన (అందరి పేర్లూ రాయనందుకు మీరంతా 

నన్ను క్షమించాలి) వారంతా ఎన్నో రోజులు కష్టపడి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసారు. ఈ సందర్భంగా 

మొగ్గతొడిగిన ఇంకో ఆలోచన ఏమిటంటే గత 50 సంవత్సరాలుగా మా పాఠశాలలో చదివిన విద్యార్థులమంతా తిరిగి 

మళ్ళీ కలసి మా పాఠశాల స్వర్ణోత్సవ సంబరాలను 50 గంటలపాటు నిరంతరాయంగా జరుపుకుంటే 

బాగుంటుందనేది. ఈ కార్యక్రమాన్నీ ఇదే ఇనుమడించిన ఉత్సాహంతో పూర్తి చేసుకోగలమని నమ్ముతున్నాను.

ఇంక ప్రస్తుతానికి శెలవు.  

2 comments

Dec 27, 2012

మా తెలుగు తల్లికీ మల్లెపూదండ -2

మా తెలుగు తల్లికీ మల్లెపూదండ

మా తెలుగు తల్లికీ మల్లెపూదండ
     మా కన్నతల్లికీ మంగళారతులు

కడుపులో బంగారు కనుచూపులో కరుణ
    చిఱునవ్వులో సిరులు దొరలించు మా తల్లి

గల గలా గోదారి కదలిపోతుంటేను
బిర బిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలే పండుతాయి
మురిపాల ముత్యాలు దొరలుతాయి.  IIమా తెలుగుII

అమరావతీ నగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములో తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలచి ఉండేదాక  IIమా తెలుగుII

అన్నమయ కీర్తనల అపురూప భావాల
నర్తించు అలమేలు మంగమ్మ నాట్యమ్ము
రామదాసు నిలదీయు శ్రీరామచంద్రుడి 
మొగమున చిప్పిల్లు చిఱునవ్వు మంత్రమ్ము IIమా తెలుగుII

కూచిపూడిని వెలయు భామాకలాపమ్ము
అందాల హరివిల్లు మన ఆంధ్రనాట్యమ్ము
నారాయణాచార్య నాట్య శివతాండవము
అలరించు మురిపించు మనసునే వెలిగించు IIమా తెలుగుII

రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి
తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయని కీర్తి
మా చెవుల రింగుమని మారుమ్రోగేదాక
నీ ఆటలే ఆడుతాం-- నీ పాటలే పాడుతాం.IIమా తెలుగుII

జై తెలుగు తల్లీ! జై తెలుగు తల్లీ!!

ఈ రోజు ఈనాడు పత్రికలో ప్రచురించబడిన "మా తెలుగు తల్లికీ మల్లె పూదండ" డదివిన తర్వాత నాకు తోచిన రెండు చరణాలను చేర్చుదామనిపించి పై విధంగా వ్రాసాను. పెద్దలు నేను చేసినది సరైన పని కాదని అనుకుంటే వారిని క్షమించమని కోరుచున్నాను. పుట్టపర్తి నారాయణాచార్యుల వారి శివతాండవం మఱియు నటరాజ రామకృష్ణ గారి ఆంధ్రనాట్యం కూడా వారి కాలానికి తరువాతివేమోనన్న శంక కూడా నాకు కలుగుతోంది. ఈ రెండూ వారి కాలంలోనివి కాకపోయినా కూడా వాటిని ఇక్కడ వ్రాయటం నాకు సమంజసం గా తోచి వ్రాసాను.తప్పైతే అంతా నన్ను క్షమించమని నా మనవి.

దీనితో పాటుగా ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్న ఈ తరుణంలో నేను ఎప్పుడో బ్లాగిన "మా తెలుగు తల్లికీ మల్లె పూదండ"ను కూడా క్రింది లింకులో వీక్షించగలరని తలుస్తున్నాను.

1 comments

Dec 15, 2012

శివమానస పూజా స్తోత్రం

శివమానసపూజా స్తోత్రం


రత్నైః కల్పిత మాసనం హిమజలైః - స్నానం చ దివ్యాంబరం

నానారత్న విభూషితం మృగమదా - మోదాంకితం చందనమ్

జాతీచంపకబిల్వపత్రరచితం - పుష్పం చ ధూపం తథా

దీపం దేవ దయానిధే పశుపతే - హృత్కల్పితం గృహ్యతామ్.

సౌవర్ణే నవరత్నఖండరచితే - పాత్రే ఘృతం పాయసం

భక్ష్యం పంచవిధం పయోదధియుతం - రంభాఫలం పానకమ్

శాకానా మయుతం జలం రుచికరం - కర్పూరఖండోజ్జ్వలం

తాంబూలం మనసా మయా విరచితం - భక్త్యాప్రభో స్వీకురు.


ఛత్రం చామరయో ర్యుగం వ్యంజనకం - చాదర్శకం నిర్మలం

వీణాభేరి మృదంగకాహళకలా - గీతం చ నృత్యం తథా

సాష్టాంగం ప్రణతిః స్తుతి ర్బహువిధా - హ్యేత త్సమస్తం మయా

సంకల్పేన సమర్పితం తవ విభో - పూజాం గృహాయ ప్రభో.


ఆత్మాత్వం గిరిజామతిః స్సహచరాః - ప్రాణా శ్శరీరం గృహం

పూజా తే విషయోపభోగరచనా - నిద్రా సమాధిస్థితిః

సంచారః పదయోః ప్రదక్షిణవిధిః - స్త్రోత్రాణి సర్వా గిరో

య ద్యత్కర్మ కరోమి తత్త దఖిలం - శంభో తవారాధనమ్.


కరచరణకృతం వా కర్మవాక్కాయజయం వా 

శ్రవణ నయనజం వా మానసం వా 2 పరాధం

విహిత మవిహితం వా సర్వ మేతత్ క్షమస్వ

శివ శివ కరుణాబ్దే శ్రీ మహాదేవ శంభో.


ఇతి శివమానస పూజా స్త్రోత్రం 

శివ మానస పూజా స్త్రోత్రం



0 comments

May 18, 2012

                              గౌళ


వీదు లవీదులనేఁగే విట్ట(ట్ఠ)లేశా ! వట్టి-

వేదలెల్లాఁ బాసె నిఁక విట్టలేశా !                        11పల్లవి11


వేడుకకాఁడవై తివి విట్టలేశా ! నీకు

వీడె మందుకోవోయి  విట్టలేశా !

వీడుజోడునగవుల విట్టలేశా ! నీ పై

వేడెవె ట్టె మావలపు విట్టలేశా !                        11వీదు 11


వెలసె నీమోవి గడువిట్టలేశా ! నీకు

వెలుపలే లోనయ్య విట్టలేశా

వెలలేని మహిమలవిట్టలేశా ! పూవు -

విలుతునిఁ గన్నతండ్రి విట్టలేశా !                        11వీదు11


వెన్నెలతేటమాఁటల విట్టలేశా ! నా -

విన్నపానకే కూడితి విట్టలేశా !

వెన్నతో శ్రీవేంకటాద్రి విట్టలేశా ! నీవు 
        
వెన్నుఁడవు వెయినామాల విట్టలేశా !                   11వీదు11


                                                                                             20 - 449




0 comments

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks