ఈ రోజు భాద్రపద శుద్ధ త్రయోదశి. అయితే ఏంటి? అంటారా? ఏమీలేదండీ బాబూ , నేను ఈరోజే పుట్టానట. అదీ సంగతి. పుట్టిన రోజు నాడు ఆనందంగా గడపాలిట కదా!
అందుకే
ఏమానందము భూమీతలమున-----
అని శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యుల వారి శివతాండవాన్ని ఓసారి తలచుకొంటే బాగుంటుందనిపిస్తున్నది. శివతాండవం - 1 అయింది. శివతాండవం - 2 నంది నాంది అనేది. ఇది పూర్తిగా సంస్కృతంలో ఉంది. అర్థం చేసుకున్న తఱువాత పోస్టు చేస్తే బాగుంటుంది. ఇక శివతాండవం - 3ను ఇక్కడ ఉంచుదామని ప్రయత్నం.
శివతాండవం -3
తలపైని చదలేటి యలలు దాండవమాడ
నలలఁ ద్రోపుడుల క్రొన్నెల పూవు గదలాడఁ
మొనసి ఫాలము పైన ముంగుఱులు చెఱలాడ
కనుబొమ్మలో మధుర గమనములు నడయాడ
కనుపాపలో గౌరి కసినవ్వు బింబింప
కనుచూపులను తరుణకౌతుకము చుంబింప
కడఁగి మూఁడవకంటఁ గటిక నిప్పులు రాల
కడుఁ బేర్చి పెదవి పైఁ గటిక నవ్వులు వ్రేల
ధిమి ధిమి ధ్వని సరిద్గిరి గర్భములు తూఁగ
అమిత సంరంభ హా హా కారములు రేగ
ఆడెనమ్మా ! శివుఁడు
పాడెనమ్మా ! భవుఁడు 1
కిసలయ జటాచ్ఛటలు ముసురుకొని వ్రేలాడ
బుసలుగొనిఁ దలచుట్టు భుజగములుఁ బారాడ
మకర కుండల చకాచకలు చెక్కులఁ బూయ
అకలంక కంఠహారాళి నృత్యము సేయ
ముకు జెఱమలో శ్వాసములు దందడింపంగఁ
బ్రకట భూతి ప్రభావ్రజ మావరింపంగ
నిటల తటమున చెమట నిండి వెల్లువ గట్ట
కటయుగమ్మున నాట్యకలనంబుఁ జూపట్ట
తకఝణుత ఝణుత యను తాళమానము తోడ
వికచ నేత్రస్యంది విమల దృష్టుల తోడ
ఆడెనమ్మా ! శివుఁడు
పాడెనమ్మా ! భవుఁడు 2
భుగ భుగ మటంచు నిప్పులు గ్రుమ్మ నూరువులు
ధగ ధగిత కాంతి తంద్రములుగాఁ గకుభములు
దంతకాంతులు దిశాంతములఁ బాఱలు వాఱ
కాంత వాసుకి హస్త కటకంబు డిగజాఱ
భావోన్నతికిని దాపటిమేను వలపూఱ
భావావృతంబు వల్పలిమేను గరుపాఱ
గజకృత్తి కడలొత్తి భుజముపై వ్రేలాడ
నజుఁడు గేల్గవ మోడ్చి "హర హరా" యని వేడ
ఝణుత తధిఝణుత తదిగిణతో యను మద్దెలల
రణనంబు మేఘ గర్భముల దూసుక పోవ
ఆడెనమ్మా ! శివుఁడు
పాడెనమ్మా ! భవుఁడు 3
ఎగుభుజమ్ములు దాచి నగుమొగమ్మున జూచి
వగ లురమ్మునఁ దూచి భావాభిరతి నేచి
తరళ తంద్రమ్ము మధ్యమ్ము కిట కిట లాడ
వరసాంధ్య కిమ్మీర ప్రభలుఁ దనువునఁ గూడ
కుణియునెడ వలయంపు మణులు చిందఱలాఁడ
కిణు కిణు మటంచుఁ బదకింకిణులు బిరుదాఁడ
శృంఖలారుండములు చెలఁగి తాండవమాఁడ
శంఖావదాత లోచనదీప్తి గుమి గూడ
వలగొన్న యెముకపేరులు మర్మరము సేయ
పులకింపఁగా నొడలు మురజంబులను మ్రోయ
ఆడెనమ్మా ! శివుఁడు
పాడెనమ్మా ! భవుఁడు 4
మొలక మీసపుఁ గట్టు, ముద్దు చందురు బొట్టు
పులితోలు హొంబట్టు, జిలుఁగు వెన్నెల పట్టు
నెన్నడుమునకు చుట్టు, క్రొన్నాగు మొలకట్టు
క్రొన్నాగు మొలకట్టు, గురియు మంటల రట్టు
సికపై ననల్ప కల్పక పుష్పజాతి, క
ల్పక పుష్పజాతిఁ జెర్లాడు మధుర వాసనలు
బింబారుణము కదంబించు దాంబూలంబు
తాంబూల వాసనలఁ దగులు భృంగ గణంబుఁ
గనుల పండువు సేయ, మనసు నిండుగఁ బూయ
ధణ ధణ ధ్వని దిశాతతి బిచ్చలింపంగ
ఆడెనమ్మా ! శివుఁడు
పాడెనమ్మా ! భవుఁడు 5
సకల భువనంబు లాంగికముగా శంకరుఁడు
సకల వాఙ్మయము వాచికంబు గాఁగ మృడుండు
సకల నక్షత్రంబులు కలాపములు గాఁగ
సకలంబు దనయెడద సాత్త్వికంబును గాఁగ
గణనఁ జతుర్విధా భినయాభిరతిఁ దేల్చి
తన నాట్య గరిమంబుఁ దనలోనె తా వలచి
నృత్యంబు వెలయించి నృత్తంబు ఝుళిపించి
నృత్త నృత్యములు శబలితముగాఁ జూపించి
లాస్య తాండవ భేది రచనాగతులు మీఱ
వశ్యులై సర్వ దిక్పాలకులు దరిఁ జేర
ఆడెనమ్మా ! శివుఁడు
అంగములు గదురఁ బ్రత్యంగములును చెదర
హంగునకు సరిగా నుపాంగములునుఁ గుదుర
తత సమత్వాదు లంతః ప్రాణ దశకంబు
అతి శస్తములగు బాహ్యప్రాణ సప్తకము
ఘంటాస దృక్కంఠ కర్పరము గానంబు,
కంఠగాన సమాన కరయుగాభినయమ్ము
కరయుగము కనువైన కనులలో భావమ్ము
చరణములు తాళమ్ము చక్షు స్సదృక్షమ్ము
ఒరవడిగ నిలువంగ నురవడిఁ దలిర్పంగ
పరవశత్వమున శ్రీపతియున్ జెమర్పంగ
ఆడెనమ్మా ! శివుఁడు
పాడెనమ్మా ! భవుఁడు 7
కరముద్రికల తోనె గనుల చూపులు దిరుగ
తిరుగు చూపులతోనె బరుగెత్తె హృదయమ్ము
హృదయమ్ము వెనువెంట కదిసికొన భావమ్ము
కుదిసి భావముతోనె కుదురుకోగ రసమ్ము
శిరము గ్రీవమ్ము పేరురము హస్తయుగమ్ము
సరిగాగ మలచి గండరువు నిల్పిన యట్లు
తారకలు జలియింప తారకలు నటియింప
కోరకములై గుబురు గొన్న జూటము నందు
సురగాలి నలిరేఁగి చొక్కి వీచినఁ యట్లు
పరపులై పడఁ గల్పపాదపంబులఁ బూవు
లాడెనమ్మా ! శివుఁడు
(ఇంకా వుంది)