నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

Showing posts with label తాళ్ళపాక పెద తిరుమలాచార్యులు-అధ్యాత్మ సంకీర్తనలు. Show all posts
Showing posts with label తాళ్ళపాక పెద తిరుమలాచార్యులు-అధ్యాత్మ సంకీర్తనలు. Show all posts

Nov 28, 2008

సురలకు నరులకు శుభమాయె

Get this widget | Track details | eSnips Social DNA

నాట
సురలకు నరులకు శుభమాయె
హరి నీ చేఁతలు ఆనందమాయె। IIపల్లవిII

కినిసి రావణుని గెలిచిన గెలుపులు
చెనకి బాణుని గెలిచిన గెలుపు
పొనిఁగి పేమకశిపుని గెలిచిన గెలుపు
వెనక ముందరికి వేదము లాయె। IIసురII

కలన కంసునటు గెలిచిన గెలుపులు
చెలఁగి బలిని గెలిచిన గెలుపు
అల శిశుపాలుని గెలిచిన గెలుపులు
బలు పుణ్యకథా భారతమాయె। IIసురII

కెరలి యసురులను గెలిచిన గెలుపులు
సిరుల నందరి గెలిచిన గెలుపు
యిరవగు శ్రీ వేంకటేశ నీ మహిమలు
సరవితోఁ బురాణము లాయె। IIసురII ౧౫-౨౧౮

0 comments

Nov 26, 2008

విచారించుకోని వారి వెఱ్ఱితన మింతె కాని

సాళంగనాట
విచారించుకోని వారి వెఱ్ఱితన మింతె కాని
పచారించి నీ కృపను బ్రతికితి నేను. IIపల్లవిII

శ్రీ మహాలక్ష్మి యుండఁ బొంచి దరిద్రమేలయుండు
కామధేను వున్నచోట కరవేల యుండు
కామించి నారాయణ నీ ఘననామ మున్నచోట
తామసాలుఁ బాతకాలు దగ్గరి యేల యుండు. IIవిచాII

చెంగట సూర్యుఁడున్నచో చీఁకట్లేల యుండు
భంగించి గురుఁడుడుండఁ బాము లేల యుండు
ముంగిట గోవిందుఁడ నీ ముద్రలు మేన నుండఁగా
అంగవికారములయిన అజ్ఞాన మేల యుండు. IIవిచాII

తానే నిజమై వున్న చెంతఁ జంచల మేల యుండు
కానఁబడి భక్తి యుండ కలఁక యేల యుండు
ఔ నవు శ్రీ వేంకటేశ అంతరాత్మ నీ వున్నచో
ఆనుక శుభము లుండ నల పేల యుండు. IIవిచాII ౧౫-౧౦౯

0 comments

Nov 25, 2008

వెదకెద నిను నే వేదము చెప్పగ (పాట తో)

Get this widget | Track details | eSnips Social DNA


మాళవిగౌళ
వెదకెద నిను నే వేదము చెప్పఁగ
హృదయములోననే యిరవు నీ కటా IIపల్లవిII

శ్రీనాథా పిలిచితిఁ బలుకఁగదే
పూని యన్నిటా నుందువటా
మానితముగ నామాట వినఁగదే
వీనుల సర్వము విందువటా IIవెదకెదII

పరమాత్మా తప్పక పొడచూపవే
తరుణవయసు మరుతండ్రివటా
పరగ మొక్కెదను పాదము చాఁచవే
సిరుల బ్రహ్మ పూజించినదే యటా IIవెదకెదII

గోవిందా నీ గుఱు తెఱిఁగించవే
వేవేలు మహిమల విభుఁడవటా
శ్రీ వేంకటేశా జిగి నలమేల్మంగ
కైవశమై మముఁ గాతువటా IIవెదకెదII ౧౫-౩౪౩

1 comments

Nov 24, 2008

తతిగొని ఏమఱక తలఁచఁగవలెఁ గాక

ధన్నాసి
తతిగొని ఏమరఱక తలఁచఁగవలెఁ గాక
హితవై నీ నామ మున్న దిఁక నేల చింతా IIపల్లవిII

దప్పిగొన్నవానికి శీతలోదకమువలె
కప్పి పతివ్రతకు మంగళసూత్రమువలె
ముప్పిరి దరిద్రునకు ముంగిటి ధనమువలె
నెప్పుడు నీ నామ మున్న దిఁక నేల చింతా. IIతతిII

నలిరేఁగి విషధగ్ధునకు నిర్విషమువలె
యిల నెండ దాఁకినదేహికి మంచి నీడవలె
చెలగి జాత్యంధునికి సిద్దాంజనమువలె
నెలమి నీ నామ మున్న దిఁక నేల చింతా। IIతతిII

పట్టభద్రునోరికిఁ గప్రపుఁ బలుకువలె
గుట్టునఁ దండ్రికి ముద్దుఁ గొడుకువలె
గట్టిగా శ్రీవేంకటేశ కడఁగి నా నాలికెకు
యిట్టే నీ నామ మున్న దిఁక నేల చింతా। IIతతిII ౧౫-౨౮౧

0 comments

Nov 23, 2008

కంబములో వెడలితివి కరిరాజుఁ గాచితివి

రామక్రియ
కంబములో వెడలితివి కరిరాజుఁ గాచితివి
పంబి యిన్నిటా నీకు పనియటే శ్రీహరీ. IIపల్లవిII

యెవ్వఁడూ మొఱవెట్టునో యిట్టె రక్షించే ననుచు
యెవ్వఁడూ ననుఁ బేర్కొనునో యింతటాఁ బలికేననుచు
యెవ్వఁడూ మదిఁ దలచునో యిక్కువఁ బొడచూపే ననుచు
వువ్విళ్ళూరఁ గాచుకొని వుందువటే శ్రీహరీ. IIకంబముII

ఆపన్నుఁడు శరణంటే నడ్డము వచ్చే ననుచు
యేపొద్దు ధ్యానించువానికి యెదుట నుండే ననుచు
పై పైఁ బూజించేవానికి పాదములు చాఁచే ననుచు
వోపి యెప్పుడు గాచుకొని వుందు వటే శ్రీహరీ. IIకంబముII

అడిగి బొగడే వానికి నప్పుడే నొసగే ననుచు
చిడిముడి నీ దాసునికి చెప్పినట్టు సేసే ననుచు
బడినే శ్రీవేంకటేశ భక్తి సేసే వానికిని
వుడివోక కాచుకొని వుందువటే శ్రీహరీ. IIకంబముII ౧౫-౩౫౯

0 comments

లేరా దేవతలూ లేరా లావరులూ

గౌళ
లేరా దేవతలూ లేరా లావరులూ
ఆరీతి నాఁ డెందు వోయి రధికులే కలిగితే IIపల్లవిII

మొదల సృష్టికి నెల్ల మూలమైన బ్రహ్మదేవుని
యిదె నాభిఁ బొడమించే నచ్యుతుఁడే
తుదఁ బ్రళయమునందు దొంతులుగా జగములు
వుదరమునందు నించె నొక్కఁడే నిలిచి. IIలేరాII

మోవలేక దేవతలు ములుగఁగ మందరము
తోవ మోచి తెచ్చినట్టి దొరవిష్ణువే
వేవేగ జలధిలోన వేసితే కుంగిన కొండ
ఆవల వీఁపున నెత్తె నాదికూర్మ మితఁడే.IIలేరాII

తనబంటు శేషుని తరితాడు గావించి
కొననాధారమై నిలిచె గోవిందుఁడే
దనుజులు దేవతలు తచ్చి తచ్చి యలసితె
వెనక నంతయుఁ దచ్చె విశ్వరూపుఁడితఁడే.IIలేరాII

కాలకూటమున కీశుఁ గంచముగాఁ జేసి మింగి
చాలి నీలవర్ణుఁ డాయె శశివర్ణుఁడే
కాలకంఠుఁ డాయెను శంకరుఁడు పాత్రయిన వంక
పోలింప ఋగ్వేద మిదె పొగడీ నితనిని.IIలేరాII

అమరఁ దనయిచ్చ నమృతము పంచిపెట్టె
నమరుల కెల్లా నారాయణుఁ డితఁడె
నెమకి తా ననువైన నిర్మల కౌస్తుభము
కమలముపై లక్ష్మిఁ గై కొనె నీ ఘనుఁడె.IIలేరాII

మూలమని నుడిగితే మోచివచ్చి కరిఁగాచె
కోలుముందై యిందరిలో గోవిందుఁడే
తూలిన శృతులు దెచ్చి తుంగిన(?) భూమియెత్తె
అలరి భస్మాసురుని నడఁచె నీ దేవుఁడే.IIలేరాII

యిందు మౌళిపై నేసి యింద్రియములఁ గట్టిన
కందర్పజనకుఁడైన కమలాక్షుఁడే
కందువ పాదతీర్థపు గంగ హరు శిర మెక్కె
యెందును దైవ మితఁడే యిందిరానాథుఁడు.IIలేరాII

మాయలెల్లా నితనివె మహిలో సంకల్పములు
యేయెడ 'శ్రీవిష్ణురాజ్ఞ' యీతనిదే
తోయరాని చక్రముచే దుర్వాసు వారఁగాను
దాయి దండై బ్రదికించె తనబంటు చేత.IIలేరాII

సంది నన్ని మతముల సన్యాసులకు గతియై
అందరి నోళ్ళకు నారాయణు నామమే
ముందు సంధ్యాజపముల మూలపు టాచమనము
అందుల కితని కేశవాది నామములె.IIలేరాII

వాదుల 'నదైవం కేశవాత్పర'మని తొల్లి
వేదవ్యాసు లనిన విభుఁ డీ హరి
సోదించి వశిష్టుఁడును శుకనారదాదులు
పోదితోడ దాసులైరి పురుషోత్తమునికి.IIలేరాII

బాణాసురుని నఱికి భంగపడఁగా విడిచె
వేణునాద ప్రియుఁడైన విఠ్ఠలుఁడే
బాణమై త్రిపురములు భస్మీకరము చేసె
ప్రాణుల రక్షించే నీ పరమాత్ముఁడే.IIలేరాII

ఆపదలందినవేళ యసురబాధలు మాన్ప
చేపట్టి లోకము గాచే శ్రీపతియే
పై పై నింద్రాదులకు పారిజాతాదిసిరులు
వైపుగాఁ గాయించిన వరదుఁడు నితఁడే.IIలేరాII

భూమి యీతనిసతి యంబుధు లితని పరపు
సోమ సూసౌదు లితని చూపుఁగన్నులు
వేమరు నూర్పులే గాలి విష్ణుపద మాకాశము
వాములైన హరి నీ వాసుదేవుఁడే.IIలేరాII

హరునిఁ బూజించవలె నంటె నర్జునునకు
సిరులఁ బాదము చాఁచె శ్రీకృష్ణుఁడే
అరిది మార్కండేయుఁ డతని మహిమ చూచి
వరదై నా మితఁ డని వాదించి కొలిచె.IIలేరాII

ధృవపట్ట మితఁ డిచ్చె దొరకొని శరణంటే
వివరింప నిదివో శ్రీవేంకటేశుఁడే
యివల నితనిఁ జెప్ప నెవ్వరి వశము లింక
భువిఁ బార్వతి హరినిఁ బొగడేటినాఁడు.IIలేరాII

0 comments

Nov 22, 2008

శరణు శరణు నీకు సర్వేశ్వరా నీ



రామక్రియ
శరణు శరణు నీకు సర్వేశ్వరా నీ
శరణాగతే దిక్కు సామజవరదా. IIపల్లవిII

వేయి శిరసులతోడి విశ్వరూపమా
బాయట నీ పరంజ్యోతి పరబ్రహ్మమా
మ్రోయుచున్న వేదముల మోహనాంగమా
చేయి చేత అనంతపు శ్రీమూరితి. IIశరణుII

ముగురు వేల్పులకు మూలకందమా
వొగి మునుల ఋషుల వోంకారమా
పగటు దేవతలకు ప్రాణబంధుఁడా
జగమెల్లాఁ గన్నులైన సాకారమా. IIశరణుII

వెలయు సచ్చిదానంద వినోదమా
అలరు పంచవింశతి యాత్మతత్వమా
కలిగిన దాసులకు కరుణానిధీ
చెలఁగి వరమిచ్చే శ్రీవేంకటేశుఁడా. IIశరణుII ౧౫-౨౧౯

0 comments

Nov 21, 2008

చిత్తజగురుఁడ నీకు శ్రీమంగళం నా

Get this widget | Track details | eSnips Social DNA


గానం - బాలకృష్ణప్రసాద్
లలిత
చిత్తజగురుఁడ నీకు శ్రీమంగళం నా
చిత్తములో హరి నీకు శ్రీమంగళం. IIపల్లవిII

బంగారుబొమ్మవంటి పణతి యురము మీద
సింగారించిన నీకు శ్రీమంగళం
రంగుమీఱఁ బీతాంబరము మొలఁ గట్టుకొని
చెంగలించే హరి నీకు శ్రీమంగళం. IIచిత్తజII

వింత నీలములవంటి వెలఁదిని నీపాదముల
చెంతఁ బుట్టించిన నీకు శ్రీమంగళం
కాంతుల కౌస్తుభమణిఁ గట్టుక భక్తులకెల్లఁ
చింతామణి వైన నీకు శ్రీమంగళం. IIచిత్తజII

అరిది పచ్చలవంటి అంగన శిరసు మీఁద
సిరుల దాల్చిన నీకు శ్రీమంగళం
గరిమ శ్రీవేంకటేశ ఘనసంపదతోడి
సిరివర నీకు నిదె శ్రీమంగళం. IIచిత్తజII ౧౫-౧౮౫

0 comments

వెట్టి వలపు చల్లకు విష్ణుమూరితి నాతో

Get this widget | Track details | eSnips Social DNA



శ్రీరాగం
వెట్టి వలపు చల్లకు విష్ణు మూరితి నాతో
వెట్టి దేర మాటాడు విష్ణు మూరితి. IIపల్లవిII

వినయము సేసేవు విష్ణు మూరితిఁ నీవు
వెనకటివాఁడవే కా విష్ణు మూరితి
వినవయ్య మా మాఁట విష్ణు మూరితి మమ్ము
వెనుకొని పట్టకుమీ విష్ణు మూరితి. IIవెట్టిII

వెరవు గలవాఁడవు విష్ణు మూరితి నేఁడు
వెరగైతి నిన్నుఁ జూచి విష్ణు మూరితి
విరివాయ నీ మాయలు విష్ణు మూరితి నాకు
విరు లిచ్చేవప్పటిని విష్ణు మూరితి. IIవెట్టిII

వెలసె నీ చేతలెల్లా విష్ణు మూరితి మా
వెలుపల లోన నీవె విష్ణు మూరితి
వెలలేని శ్రీవేంకట విష్ణు మూరితి కూడి
విలసిల్లితివి నాతో విష్ణు మూరితి. IIవెట్టిII ౧౫-౨౪౧

0 comments

అనుచు రావణుసేన లటు భ్రమయుచు వీఁగె

బౌళి
అనుచు రావణుసేన లటు భ్రమయుచు వీఁగె
యినకుల చంద్ర నేఁ డిదిగో నీమహిమ. IIపల్లవిII

దదదద దదదద దశరథ తనయా
కదిసితిఁ గకకక కావవె
అదె వచ్చె బాణాలు హా నాథ హా నాథ
పదపద పదపద పారరో పవుంజులూ. IIఅనుచుII

మమమమ్మ మమమమ్మ మన్నించుఁడు కపులార
సమరాన చచచచ్చ చావకుండా
మెమెమెమ్మె మెమెమెమ్మె మేము నీ వారమె
మొమొమొమ్మొ మొమొమొమ్మొ మొక్కేము మీకు.IIఅనుచుII

తెతెతెత్తె తెతెతెత్తె తెరు వేది లంకకు
తతతత్త తలమని దాఁగుదురూ
గతియైన శ్రీ వేంకటగిరి రఘునాథ
సతమై మమ్మింక నేలు జయ జయ నీకు. IIఅనుచుII ౧౫-౧౫౮

గమ్మత్తైన సంకీర్తన.

0 comments

Nov 20, 2008

వందేహం జగద్వల్లభం దుర్లభం

Get this widget | Track details | eSnips Social DNA

గానం-నేదునూరి కృష్ణమూర్తి

బౌళి
వందేహం జగద్వల్లభం దుర్లభం
మందరధరం గురుం మాధవం భూధనం. IIపల్లవిII

నరహరిం మురహరం నారాయణం పరం
హరి మచ్యుతం ఘనవిహంగవాహం
పురుషోత్తమం పరం పుండరీకేక్షణం
కరుణాభరణం కలయామి శరణం. IIవందేII

నందనిజనందనం నందకగదాధరం
యిందిరానాథ మరవిందనాభం
యిందురవిలోచనం హితదాసవరదం, ము
కుందం యదుకులం గోపగోవిందం. IIవందేII

రామనామం యజ్ఞరక్షణం లక్షణం
వామనం కామినం వాసుదేవం
శ్రీమదవాసినం శ్రీవేంకటేశ్వరం
శ్యాఁమలం కోమలం శాంతమూర్తిం. IIవందేII
౧౫-౨౩౫

0 comments

Nov 19, 2008

ఎక్కడి మానుషజన్మం బెత్తిన ఫలమే మున్నది

Get this widget | Track details | eSnips Social DNA

గానం-బాలకృష్ణప్రసాద్
బౌళి
ఎక్కడి మానుషజన్మం బెత్తిన ఫలమే మున్నది
నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తం బిఁకనూ. IIపల్లవిII

మఱవను ఆహారంబును మఱవను సంసారసుఖము
మఱవను ఇంద్రియభోగము మాధవ నీ మాయా
మఱచెద సుజ్ఞానంబును మఱచెద తత్త్వరహస్యము
మఱచెద గురువును దైవము మాధవ నీ మాయా. IIఎక్కడిII

విడువనుఁ బాపము పుణ్యము విడువను నా దుర్గుణములు
విడువను మిక్కిలి యాసలు విష్ణుఁడ నీ మాయా
విడిచెద షట్కర్మంబులు విడిచెద వైరాగ్యంబును
విడిచెద నాచారంబును విష్ణుఁడ నీ మాయా. IIఎక్కడిII

తగిలెద బహులంపటముల తగిలెద బహుబంధంబుల
తగులను మోక్షపు మార్గము తలఁపున యెంతైనా
అగపడి శ్రీవేంకటేశ్వర అంతర్యామివై
నగి నగి నను నీ వేలితి నాకా యీ మాయా. IIఎక్కడిII ౧౫-౩౮

తాళ్ళపాక పెద తిరుమలాచార్యుల అధ్యాత్మ సంకీర్తనల లోనిదీ సంకీర్తన.

అందమైన నడక.ఇంకా అందమైన పదాల అమరిక.అందమైన అనుప్రాస. విష్ణువు మీది అపరిమిత నమ్మకం.తను ఎన్ని బంధాలలో చిక్కుకున్నా అవి విష్ణుమాయ వలన తన్నేమీ చేయలేవనే గట్టి నమ్మకం.

0 comments

Jul 4, 2008

నన్ను నెంచుకొన నయ్యా నగుఁ బాట్ల నేను

మలహరి
నన్ను నెంచుకొన నయ్యా నగుఁ బాట్ల నేను
కన్నవారి విన్నవారిఁ గాకు సేసేనే IIపల్లవిII

మలసి నా గుణములు మంచివైనప్పుడు గదా
యెలమి నెదిరి నేరము లెంచేది
చెలఁ గి నే పాపములు సేయకుండె మరి గదా
తొలఁ గి పరుల నే దూషించేది IIనన్నుII

నడవడి నే లెస్స నడిచినప్పుడు గదా
పొడవై యన్యులకు నే బుద్ధి చెప్పేది
వెడఁ గై యితరుల నే వేఁ డనియప్పుడు గదా
కడవారి విరక్తి గాదనేది IIనన్నుII

కామినుల సంగమము కాదని నే మరి కదా
నేమమై యితరుల నే నిందించేది
నా మదిలో నన్ను నేను నవ్వుకొని సిగ్గుపడి
నీ మఱఁ గు చొచ్చితి నేఁ డు శ్రీ వేంకటేశIIనన్నుII १५-२०३

ఇది పెదతిరుమలాచార్యుల అధ్యాత్మ సంకీర్తన।
నేను ఎటువంటి వాడనో నన్ను నేను అసహనముతో ఎంచుకొననయ్యా।నన్ను చూసినవారిని విన్నవారిని కాకు(?)చేసేనే।
తిరిగి నా గుణములు మంచివైనపుడు కదా నేను విలాసముతో ఎదుటివారి నేరములెత్తి చూపేది।ఒప్పి నే పాపములు చేయనప్పుడు కదా మరి యితరుల పాపములు గురించి వారిని దూషించగలిగేది।నా నడవడి లెస్సగా నున్నపుడు కదా నేను పెద్దనై యితరులకు బుద్ధి చెప్పగలిగేది।అవివేకినై నేను యితరుల వేడనపుడు కదా నేను సమీపము నందలివారి విరక్తిని కాదనగలిగేది।నేను కామినీ స్త్రీల తో పొందును కాదనినపుడు కదా నియమంతో నేను యితరుల నిందించేది।నా మనసులో నేను నాగుఱించి నవ్వుకొని శ్రీ వేంకటేశా నీ చాటుకు వచ్చాను।--ఈ కీర్తన అందరికీ మార్గదర్శనము చేసేటటువంటిది।ఎవరికి వారు తనను గూర్చి ఇటువంటి విమర్శ చేసుకోవలసి వుంది.

0 comments

May 29, 2008

తమ సత్వ మెఱిఁగియు దాఁచిరి గాకా

సాళంగనాట

తమ సత్వ మెఱిఁగియు దాఁచిరి గాకా
తము నేలే రాము స్వతంత్రము చూపవలసి IIపల్లవిII

హనుమంతుని తోఁక నసురులందరుఁ గూడి
మును లంకలో నగ్ని ముట్టించే వేళను
అనలము శీతో భవ యన నేరిచిన సీత
పనివి రావణ హతో భవ యన నేరదా IIతమII

అంకెల జలధి దాఁటి యట రాముని ముద్రిక
సంకె లేక చేతఁ బట్టి సాహసమునా
లంకాధిదేవతయైన లంకిణిఁ గొట్టినవాఁడు
వుంకించి రావణుఁ జంప నోపఁడా వాయుజుఁడు IIతమII

శ్రీవేంకటేశుఁడైన శ్రీరాఘవుని పంపున
వావిరి నంగదముఖ్య వానరులెల్లా
ఆవేళ హేమపాత్ర లగ్నిలో వేసినవారు
రావణునందులో వేసి రా నోపరా IIతమII 15-263


ఈ కీర్తన 27 వ తారీఖున నేను శ్రీ అన్నమాచార్యుల శృంగార కీర్తనల లోనిదిగా పొరబడి
వ్రాయ మొదలు పెట్టా.నేను పడిన పొరపాటు సరిదిద్దటం కోసమేమో అన్నట్టుగా కరంటు
పోవటం, బ్లాగు పూర్తికాకపోవటం జరిగింది.
విహారి గారూ నన్ను క్షమించాలి.ఈ రోజు ఆలస్యంగా అయినా పూర్తి చేస్తున్నాను.
ఇది శ్రీ అన్నమయ్య కుమారుడైన పెద తిరుమలాచార్యుల నారి ఆధ్యాత్మిక సంకీర్తన.
నాకు అర్ధం తెలియని పదబంధాలు:
పనివి
అంకెల
సంకె
వావిరి

తరువాత ఈ బంగారు పాత్రలు అగ్నిలో వేసిన కధ రామాయణం లో ఎప్పుడు ఎక్కడ ఎలా జరిగిందో
నాకు తెలియదు.ఎవరైనా చెప్పి పుణ్యం కట్టుకోరూ---

దీనిలో సీత,హనుమంతుడు,అంగదుడు మొదలైనవారంతా రాముని గొప్పతనం లోకానికి తెలియాలని
ఉద్దేశించి మాత్రమే వారా పనులను చేయకుండా వదిలిపెట్టారట! కాని వాళ్ళంతా ఆ పనులు చేయగల సమర్ధత
గలనారేనట!తాళ్ళపాక కవుల సంకీర్తనలు ఒక్కోటీ ఒక్కో అణిముత్యమే.అవి చదవటానికి,వ్రాయటానికి,పాడుకోవటానికి అత్యంత
ఆనందదాయకాలు.

4 comments

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks