నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

May 29, 2008

తమ సత్వ మెఱిఁగియు దాఁచిరి గాకా

సాళంగనాట

తమ సత్వ మెఱిఁగియు దాఁచిరి గాకా
తము నేలే రాము స్వతంత్రము చూపవలసి IIపల్లవిII

హనుమంతుని తోఁక నసురులందరుఁ గూడి
మును లంకలో నగ్ని ముట్టించే వేళను
అనలము శీతో భవ యన నేరిచిన సీత
పనివి రావణ హతో భవ యన నేరదా IIతమII

అంకెల జలధి దాఁటి యట రాముని ముద్రిక
సంకె లేక చేతఁ బట్టి సాహసమునా
లంకాధిదేవతయైన లంకిణిఁ గొట్టినవాఁడు
వుంకించి రావణుఁ జంప నోపఁడా వాయుజుఁడు IIతమII

శ్రీవేంకటేశుఁడైన శ్రీరాఘవుని పంపున
వావిరి నంగదముఖ్య వానరులెల్లా
ఆవేళ హేమపాత్ర లగ్నిలో వేసినవారు
రావణునందులో వేసి రా నోపరా IIతమII 15-263


ఈ కీర్తన 27 వ తారీఖున నేను శ్రీ అన్నమాచార్యుల శృంగార కీర్తనల లోనిదిగా పొరబడి
వ్రాయ మొదలు పెట్టా.నేను పడిన పొరపాటు సరిదిద్దటం కోసమేమో అన్నట్టుగా కరంటు
పోవటం, బ్లాగు పూర్తికాకపోవటం జరిగింది.
విహారి గారూ నన్ను క్షమించాలి.ఈ రోజు ఆలస్యంగా అయినా పూర్తి చేస్తున్నాను.
ఇది శ్రీ అన్నమయ్య కుమారుడైన పెద తిరుమలాచార్యుల నారి ఆధ్యాత్మిక సంకీర్తన.
నాకు అర్ధం తెలియని పదబంధాలు:
పనివి
అంకెల
సంకె
వావిరి

తరువాత ఈ బంగారు పాత్రలు అగ్నిలో వేసిన కధ రామాయణం లో ఎప్పుడు ఎక్కడ ఎలా జరిగిందో
నాకు తెలియదు.ఎవరైనా చెప్పి పుణ్యం కట్టుకోరూ---

దీనిలో సీత,హనుమంతుడు,అంగదుడు మొదలైనవారంతా రాముని గొప్పతనం లోకానికి తెలియాలని
ఉద్దేశించి మాత్రమే వారా పనులను చేయకుండా వదిలిపెట్టారట! కాని వాళ్ళంతా ఆ పనులు చేయగల సమర్ధత
గలనారేనట!తాళ్ళపాక కవుల సంకీర్తనలు ఒక్కోటీ ఒక్కో అణిముత్యమే.అవి చదవటానికి,వ్రాయటానికి,పాడుకోవటానికి అత్యంత
ఆనందదాయకాలు.

4 comments:

ఓ బ్రమ్మీ said...

నరసింహారావుగారూ,

’అంకెల’ అనే పదాన్ని నేను .. ’విన్నపాలు వినవలే..’ అనే కీర్తనలో చివ్వరి లైన్లలో ఎక్కడో విన్నట్లుంది. ఒక్క సారి ఆ కీర్తన చూడగలరు

Unknown said...

చక్రవర్తి గారూ నెనరులు.
విన్నపాలు వినవలె కీర్తన కోసం ప్రయత్నం చేస్తున్నాను.

Bolloju Baba said...

మీ బ్లాగు ద్వారా చాలా కొత్త విషయాలు తెలుస్తూ ఉన్నాయి.
మీ బ్లాగు చాలా ఆశక్తికరంగా మారింది .
బొల్లోజు బాబా

Unknown said...

బాబా గారూ నెనరులు.బ్లాగులద్వారా చాలా విషయాలు తెలుసుకోగలుగుతున్నందుకు ఆనందంగా వుంది.

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks