నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

Jun 1, 2008

"కవితా వైజయంతి"

ఈ రోజు మధ్యాహ్నం సంస్కృతి టి.వి. లో శ్రీ మేడసాని మోహన్ గారి -అతిథి దేవో భవ- కర్యక్రమంలో ఆయన కరుణశ్రీ గారి
"కవితా వైజయంతి" గానం చేసారు. దాన్నిక్కడ మన బ్లాగు మిత్రులందరి కోసం పొందు పరుస్తున్నాను.

కవితా వైజయంతి

ఉత్పల మాలిక
దోసెడు పారిజాతములతో హృదయేశ్వరి మెల్లమెల్లగా
డాసిన భంగి, మేలిమి కడాని వరాల కరాలు వచ్చి క
న్మూసిన భంగి, కన్నె నగుమోము పయిన్ నునుసిగ్గుమొగ్గ కై
సేసినభంగి, అందములు చిందెడి నందనవాటి వెన్నెలల్
కాసిన భంగి, జానపదకాంతలు రాట్నము మీద దారముల్
తీసిన భంగి, క్రొవ్వలపు లేఖ శకుంతల తామరాకుపై
వ్రాసిన భంగి, పెండ్లి తలఁబ్రాల్ జవరాలు రవంత నిక్కి పై
బోసిన భంగి, గుండె వడబోసిన భంగి, కళావిపంచికల్
మ్రోసిన భంగి, పొంగు వలపుల్ తలపుల్ సొలపుల్ ప్రసన్నతల్
భాసురతల్ మనోజ్ఞతలు ప్రౌఢిమముల్ రసభావముల్ గడున్
భాసిల తెల్గుకైత నవభంగుల సంగతమై, యొకింతయున్
దోసములేని శబ్దములతో, నటనం బొనరించు పాద వి
న్యాసముతో, సమంచిత గుణంబులతో, సహజమ్ములౌ యతి
ప్రాసలతో, మనోజ్ఞమగు పాకముతో, మృదుశయ్యతో, అనా
యాస సమాసయుక్తి కలశాంబుధి తీర పురోనిషణ్ణ దే
వాసుర మండలాంతర విహార వికస్వర విశ్వమోహినీ
హాసవిలాస విభ్రమకరాంచల చంచల హేమకుంభ సం
భాసి సుధాఝురీ మధురిమమ్ములు గ్రమ్ము కొనన్ వలెన్; శర
న్మాస శుచిప్రసన్న యమునాతట సైకత సాంద్రచంద్రికా
రాస కలా కలాప మధుర వ్రజ యౌవత మధ్య మాధవ
శ్రీసుషమా ప్రపూర్ణ తులసీదళ సౌరభ సారసంపదల్
రాసులు రాసులై పొరలి రావలె; పొంపిరి పోవలెన్ నవో
ల్లాస వసంత రాగ రస లాలిత బాలరసాల పల్లవ
గ్రాస కషాయకంఠ కలకంఠ వధూకల కాకలీధ్వనుల్!

నాకు అర్ధం కాని పదబంధాలు:


కడాని
కళావిపంచికల్
పురోనిషణ్ణ
కషాయకంఠ
కలకంఠ
వధూకల
కాకలీ
చివరలో వచ్చిన పెద్ద సమాసాలు

4 comments:

కొత్త పాళీ said...

విపంచి = వీణ
విపంచిక = చిన్న వీణ
కషాయ కంఠ = సవరించిన గొంతు
కలకంఠ వధూ = ఆడ కోయిల
కల = గొప్ప, శ్రావ్యమైన
కాకలి = సరిగమపదని లలో ని అనబడే నిషాద స్వరానికి ఒక రూపం. ఇంకో రూపాన్ని కైశికి నిషాదం అంటారు.

మొన్నీమధ్యన ఒక మంచి శృంగార పదం పోస్టుచేశారు, దాంట్లో నేనో వ్యాఖ్య కూడా రాశాను. ఇప్పుడూ చూస్తే పోస్టే కనబడటం లేదు - తీసేశారా?

Unknown said...

కొత్త పాళీ గారూ నెనరులు.మీరు వ్రాసిన అర్ధాలు చూసి చాలా ఆనందించాను.గురుభ్యోన్నమః.కామెంట్సు ఎనేబుల్ చేసే ప్రయత్నంలో ఇంకో పేజీలో కెక్కడికైనా పారిపోయుంటాయి.నా అంతట నేను తీసివెయ్యలేదు.

Unknown said...

కొత్తపాళీ గారూ
కీర్తన old post లోకి మారినట్టుంది. చూడగలరు.మీ పోస్టు మిస్సయినట్టుంది.నేను కూడా అది చూసినట్టు లేదు.వీలైతే మరోసారి పోస్టు చేయగలరు.

కామేశ్వరరావు said...

కడాని = బంగారం
నిషణ్ణ = ఉండిన
పురోనిషణ్ణ - "అక్కడ దగ్గరలో ఉన్న" అన్న అర్థం వస్తుందనుకుంటాను.
కషాయ కంఠ అంటే సవరించిన గొంతు అన్న అర్థం ఉందా? నేను మామిడి చిగురలను మేసి వగరెక్కిన గొంతు అని అనుకుంటున్నాను.
ఈ పద్యాలు కరుణశ్రీ పూర్వకవులకి నివాళిగా రాసినదిలా ఉంది. మొత్తం ఉత్పలమాలిక పెద్దన ఉత్పలమాలికని గుర్తుకు తెస్తుంది. "పల్లవగ్రాస కషాయకంఠ కలకంఠవధూకల కాకలీధ్వనుల్" అన్నది ముక్కుతిమ్మన పారిజాతాపహరణంలోని "ఈసునబుట్టి డెందమున..." అన్న పద్యంలో వచ్చే వాక్యం. ఇలాగే పూర్వకవుల సమాసాలూ, వాక్యాలూ ఇందులో కనిపిస్తున్నాయి.

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks