అన్నమాచార్య చరిత్రము
అన్నమయ కొండపై దివ్యస్థలముల దర్శించుట
నానావిధావనోన్నతమైనయట్టి
కోనేఱు గడతెంచి గురుపుణ్యవారి-
కోనేఱు దా నేఱుకున్న మన్ననల-
నీ నేరుపరుదని యెల్లలోకములు
వినుతించు నా తీర్థవిభుని సేవించి
చనుదెంచి యట కృతస్నానుఁడై యతఁడు
సేవంతిపూనీటి సెలయేటి వఱుతఁ
దావితామరల నిద్దంపుఁ బుప్పొళ్ళ
ముగ్గుల పరుసల మురిపెంబుచేత
నగ్గలంబై పొంగు నంబుపూరములు
పెను సోబనాలు చూపెడు సోబనాలు
గనుపట్టు స్వామిపుష్కరిణి సోయగము
వెండియుఁ జూచె సవిస్మయుండగుచు
పుండరీకముల యొప్పులఁ గన్నులయ్యె;
నురగేంద్రు శిరసుపై నొక పాద మూఁది
చరణ మొక్కటి రసాస్థలి మోవఁ జాఁచి
డాకేలు పుడమిపడంతుక నలమి
యా కేలు కటినూఁది యనురక్తిఁ జక్కఁ
బంటవలంతి గుబ్బలతావి మోవి-
పంటితేనియ లొకపరి యాను తమిని
మోముదామరఁ జూఁచి మొగసిరి కేలి-
తామరలను శ్రుతిద్వయము నిక్కించి
సంకుచక్రముల హస్తమ్ముల రెంటఁ
బొంకించి కరుమ చూపుల జొబ్బిలంగ-
నాదరిఁ బెంపొందు నాదివరాహు-
నాదరంబునఁ గొనియాడి సేవించి,
వలచుట్టుకొని వచ్చి వచ్చి కుందనపుఁ
బొలుపుల పెద్దగోపురము సేవించి,
తరగని ఫలపుష్పతతితోడ నీడ-
తిరుగని చింత వర్తిల నమ్రుఁడగుచు
పరుసల కిష్టసంపద లిచ్చు పసిఁడి-
గరుడగంబము పేర్మిఁ గని సాగి మ్రొక్కి
కారుమించులకును గలరీతి ముద్దు-
గారు పువ్వులు నొత్తుగాఁబడి రాల
రమణ బ్రహ్మాండకరండ మంతయును
ఘుమఘుమతావులు గులికి వాసింపఁ
గనుపట్టు నా చంపకపుఁబ్రదక్షిణము
చనుదెంచి స్వామిపుష్కరిణిఁ బూజించి,
తిమ్మప్పనికి నివేదితమైన మీఁదఁ
బమ్మి యమ్మెడు పైఁడిపళ్లెరంబులును
వారక యమృతంపు వారలు వట్టు-
మారివారలకు నోరూరించు చవుల-
పరికరంబుల చేతపడిఁ గదంబించు-
పరిపరిరివిధముల భక్ష్యభోజ్యములు
వెన్నగాఁచిన నేతి వింతపచ్చళ్ళు
సన్నరాజనపుఁ బ్రసాదంబుతోడ
పెన్నెలగుజ్జు పర్వినవన్నె నున్న-
యున్నతంబైన దధ్యోజనంబులును
అతిరసంబగు వడ లప్పాలు పాలు
అతిరసంబులు మొదలగు ప్రసాదములు
పచ్చకప్రపుఁ గలపంబు కుంకుమము
పచ్చకస్తురి సరివాటుగాఁ జేసి
తిగిచి పన్నీట మేదించి కుందనపు-
బిగువు చూపుచునున్న భృంగారుకలును
కమ్మగా వాసనల్ క్రమ్మఁగాఁ జిత్త-
రమ్మగు నడగోపురమ్ము సొత్తెంచి
దందడి నవ్వేల్పుతళిఘల క్రింద
జిందఁగాఁ జేత నూర్చిన నంటివచ్చు-
నొకనాఁటినెయ్యి వేఱొక దేవళమున
నొకయేఁటనైనను నున్నదే యనుచు
తలయూఁచి మెచ్చుచుఁ దనలోనె తాను
పలుమాఱు నాశ్చర్యపడుచు నా పడుచు
శ్రీనివాసుని నమస్కృతిచేసి దండ-
గానుపించిన భాష్యకారులఁ బొగడి
శ్రీనరసింహుని సేవ గావించి
దానవాంతకు జనార్దను సన్నుతించి
అలమేలుమంగకు నభివందనములు
సలిపి చెంగటి యాగశాలఁ గీర్తించి
మెఱుఁగులు గప్పఁగ్రమ్మినభాతి రుచుల
నెఱయించు నానందనిలయంబు గాంచి,
మరుగురు కల్యాణమంటపమునకుఁ
గరములు మొగిచి చెంగటితేజి కెఱఁగి
బంగారు గరుడుని భజియించి చెంత
సింగారమైయున్న శేషునిఁ గొలిచి
వాసన నలుదెసల్ వలగొన రాశి-
పోసి యుండెడు గోవ పునుఁగు చట్టలును
గట్టి బంగరుసలాకలఁ గ్రుచ్చి కాఁచి
తట్టుపునుంగు లత్తఱి నొత్తువిధము
పసిఁడి పళ్ళెరమునఁ బసనిచక్కెరలు
గొసరి గోవింద ముకుంద తిమ్మప్ప
అని పరుసలవార లంతంతఁ జేరఁ
జనుదేర వేంకటశైలభర్తకును
గుట్టున మది మ్రొక్కికోరొ కానుకలు
పెట్టరో, దండముల్ పెట్టరో, యిపుడె
కోరినకోర్కె చేకూరు నటంచు
నేరుపు పంచవన్నియ చిలుకలును
కనకభూషణవస్త్ర ఘనవస్తుతతుల
మొనసిన బండారమును దేరకొనుచు
తడఁబడఁ జుట్టిన తన పంచెకొంగు-
కడనున్న దొక కానుక వెట్టి
Aug 19, 2009
నానావిధావనోన్నతమైనయట్టి కోనేఱు గడతెంచి గురుపుణ్యవారి-
Posted by
Unknown
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment