నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

Jun 28, 2010

కమనీయంబగు గద్యపద్యమయమై కావ్యంబు

మ.
కమనీయంబగు గద్యపద్యమయమై కావ్యంబు ; గద్యంబు నా
నమరుం బాదనియంత్రణానియమవిన్యస్తప్రశాస్తార్థ మై
రమణీయాంఘ్రిచతుష్టయ స్ఫుట వళిప్రా సాభిరామంబు ప
ద్యము ; తత్పద్యము వృత్తజాతు లన రెండై పర్వుఁ గావ్యంబులన్. 25



కావ్యమనేది గద్య పద్యాలతో కూడుకున్నదై కమనీయంగా ఉంటుంది. గద్యానికి పాదనియమం అనేది ఉండకుండా సాగిపోతుంటుంది. కాని పద్యం మటుకు రమణీయమైన నాలుగు పాదాలతో కూడుకొని వళి ప్రాసలతో స్ఫుటమైన రీతిలో సాగుతుంది. ఆ పద్యములు మళ్ళీ రెండు రకాలు గా ఉంటాయి కావ్యములలో - వృత్తపద్యాలని, జాతి పద్యాలనిన్నీ.( జాతులలో జాతులు ఉపజాతులని రెండు వర్గాలు )

క.
వృత్తం బనఁ జతురంఘ్రి సు
వృత్తం బై వళుల వ్రాల వెలయును ; మాత్రా
యత్తగణంబులచేతఁ బ్ర
వృత్తాకృతిఁ బరఁగు జాతివితతులు కృతులన్.



వృత్తమనేది నాలుగు పాదాలతో కూడి మంచినడకతో యతిప్రాసలతో అలరారుతుంది. జాతి పద్యాలు మాత్రం మాత్రాగణాలతో నిర్దేశింపబడిన గణాలతో ప్రకాశిస్తుంటాయి.

తే.
విరతి విశ్రామ విశ్రాంతి విరమ విరమ
ణాభిదాన విరామము లనెడి పేళ్ళు
యతికిఁ బర్యాయపదము లై యమరుఁ గృతిని ;
యుక్తి పదములఁ గృతియందు నునుపవలయు. 27


నిరతి, విశ్రామము, విశ్రాంతి, విరమము, విరమణము అనే పేర్లు యతికి పర్యాయపదాలు. ఉపాయంతో ఏయే పద్యాలకు ఎక్కడెక్కడ యతిని
ఉంచాలో ఆయా ప్రదేశాలలో ఆ యా నిర్దేశిత అక్షరాలను కృతులందు యతి రూపంలో నిలుపవలసి ఉంటుంది.

క.
కరి గిరి పుర నిధి శశి ది I క్పరిసంఖ్యానంబు గణితపరిభాషలచే
నరసి యతి నిలుపుచోటులు I పరికింపఁగవలయుఁ గావ్యబంధన వెలయన్.
28


ఈ పద్యంలో యతుల సంఖ్య వివరింపబడింది. కరి - అష్టదిగ్గజాలు 8, గిరి - నవగిరులు 9, పుర , నిధి - నవనిధులు 9, శశి - , దిక్ - అష్టదిక్కులు 8, వీని సంఖ్యానమును గణితపరిభాషలచే అరసి యతి నిలుపుచోటులు ఎన్ని వస్తాయో లెక్కతేల్చాలి అని నా భావన.నాకు ఈ లెక్క తెలియరాలేదు. పెద్దలు తెలియపరిస్తే ముందుగా వారికి నా కృతజ్ఞతలు .

0 comments:

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks