వళి ప్రాసములు
క.
పాద ప్రధమాక్షర ము I త్పాదిత మగు వళి యనంగ ; బ్రాసం బనఁగాఁ
బాద ద్వితీయవర్ణము I పాదచతుష్కమున కివియ ప్రాణము లెపుడున్. 29
పద్యపాదములోని మొట్టమొదటి అక్షరమును యతి అంటారు. ప్రాస అంటే పాదములోని ద్వితీయాక్షరము . పద్యం యొక్క నాలుగు పాదాలకూ యెప్పడూ యతి ప్రాస లనేవి ప్రాణం లాంటివి.
వళి భేదములు
క.
స్వరజలు వర్గజ లిత రే I తరవర్గజ లనఁగ నేకతరజ లనంగాఁ
బరపారు వళ్ళు నాలుగు ; I వరుసఁ దెనుంగునకు వాని వలయుం దెలియన్. 30
స్వరజలు, వర్గజలు, ఇతరేతర వర్గజలు, ఏకతరజలు అని యతులు తెనుగులో వరుసగా నాలుగు విధాలుగా ఉంటాయి. వాటిని గుఱించి తెలిసికోవాలి. అంటున్నాడు పెద్దయ మహాకవి. కాని అనంతామాత్యుడు తన ఛందోదర్పణంలో యతులు ఐదు విధాలు అని వాటిని స్వర యతులు, వర్గయతులు, సరసయతులు, సంయుక్తయతులు, ప్రత్యేకయతులు అని విభాగం చేస్తాడు. అనంతుని సరసయతులు సంయుక్తయతులు రెండూ కలసి పెద్దయ గారి ఇతరేతరవర్గయతులు గా ఉంటాయన్నమాట.
క.
కోరి యకారము మొదలౌ I కారము తుద యైన యచ్చుగమి పండ్రెండున్
వారక యొండొంటికి నిం I పారఁగ వళ్ళయ్యె నాల్గు నైదును మూడున్. 31
అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, ఋ, ౠ, ఏ, ఐ, ఓ ఔ - ఈ పండ్రెండు అక్షరాలూ పరస్పరం ఈక్రిందివిధంగా యతి సామ్యం కలిగి ఉంటాయి.
అ, ఆ లకు ఐ, ఔ లు
ఇ, ఈ, ఋ,ౠ లకు ఏకారము
ఉ, ఊ లకు ఓకారము -- ఇవి స్వర యతులు. ఈ అచ్చులలో హ్రస్వాక్షరాన్ని చెపితే దీర్ఘాక్షరం కూడా దానిలో కలిసే ఉంటుంది. సంస్కృత భాషలోని సంధ్యాక్షరములలో హ్రస్వములు లేవు. అంటే ఎ ఒ లు లేవన్నమాట.
పై పద్యంలో నాల్గు నైదును మూడున్ అనేదాన్ని ఎలా అన్వయించుకోవాలో నాకు తెలియటం లేదు. పెద్దలెవరైనా వివరించగలరని నా ఆశ.
అజ్విరమము
క.
ఆ ఐ ఔ లత్వమునకు I నీ ఏలును ఋద్యయంబు నిత్వమునకుఁ దా
మూ ఓ లుత్వమునకు వళు I లాయచ్చుల దొరసి యుండ హల్లుల కెల్లన్. 32
అ కారానికి ఆ, ఐ, ఔ లు
ఇ కారానికి ఈ, ఏ, ఋ, ౠ లు
ఉ కారానికి ఊ, ఓ లు యతులుగా అవుతాయి.
ఇవేకాకుండా ఈ అచ్చులతో కూడిన అన్ని హల్లులకూ కూడా ఇది వర్తిస్తుంది.
అకారవళి నిరూపణము
తే.
అవని ధర్మజుఁబోలు నిత్యార్యచర్య,
నాదిరాజుల దొరయు నిత్త్యైంద్రభూతి
నరులఁ బ్రహరించు బహుదండౌగ్ర్యమునను,
విధుకులాగ్రణి చాళుక్య విశ్వవిభుఁడు. 33
ఇకారవళి నిరూపణము
ఆ.
ఇనజుఁ డీగి, భారతీశుండు చతురత, I నేకవీరుఁ డాజి ఋజుతయందు,
ౠజరిపుఁడు సిరి, నహీనుండు భూవహ I నమున విశ్వమనుజనాథవిభుఁడు. 34
ఉకార వళి నిరూపణము
క.
ధరణీవరాహలాంఛితుఁ I డురరీకృత సకలవిద్యుఁ డూరీకృత సం
గరజముఁడు విశ్వభూవరుఁ I డురుకీర్తుల నెగడు నా బిడౌజో నిభుఁ డై. 35
Jun 29, 2010
పాద ప్రధమాక్షర ము I త్పాదిత మగు వళి యనంగ
Posted by
Unknown
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment